Golden hour
-
సైబర్ మోసగాళ్ల బారిన పడ్డారా.. మీ డబ్బు తిరిగొచ్చే చాన్స్!
సైబర్ మోసగాళ్ల బారిన పడి తమ డబ్బును పోగొట్టుకున్న వారు తిరిగి పొందేందుకు అవకాశం ఉంది. అయితే ఇందుకు వారు చేయాల్సిందల్లా సకాలంలో పోలీసులకు ఫిర్యాదు చేయడం. ‘గోల్డెన్ అవర్’లో ఫిర్యాదు చేస్తే రికవరికీ అవకాశం ఉంటుందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాల్లో బాధితులు మోసపోవడం ఎంత తేలికో... నేరగాళ్లను పట్టుకోవడం అంత కష్టం. నగదు రికవరీ అనేది దాదాపు అసాధ్యమనే చెప్పవచ్చు. ‘గోల్డెన్ అవర్’లో ఫిర్యాదు చేసిన బాధితులకు మాత్రం చాలా వరకు న్యాయం జరుగుతోంది. క్రిమినల్స్‌కు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఫ్రీజ్ చేసిన వీరి నగదును రిటర్న్ చేయడానికి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు రూ.40 కోట్లు బాధితులకు తిరిగి ఇప్పించగలిగారు. ఆ సమయమే గోల్డెన్ అవర్.. బాధితులు ‘గోల్డెన్ అవర్’లో అప్రమత్తం కావడంతో పాటు తక్షణం ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. నేరం బారిన పడిన తర్వాత తొలి గంటనే గోల్డెన్ అవర్‌గా పరిగణిస్తారు. ఆ తర్వాత ఎంత ఆలస్యమైతే నగదు వెనక్కు వచ్చే అవకాశాలు అంత తగ్గిపోతుంటాయి. ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న సైబర్ నేరాల్లో బాధితులు తొలుత సైబర్ క్రైమ్ ఠాణాకు రావడంపై దృష్టి పెట్టకుండా తక్షణం 1930 నంబర్‌కు కాల్ చేసి లేదా (cybercrime.gov.in)కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.రెండు రకాలుగా నగదు ఫ్రీజ్.. ఉత్తదారిలోని వివిధ ప్రాంతాలు కేంద్రంగా దేశ వ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడే నిందితులు బాధితుల నుంచి నగదు డిపాజిట్/ట్రాన్స్ఫర్ చేయించడానికి సొంత బ్యాంకు ఖాతాలను వాడరు. పోలీసులకు ఎలాంటి ఆధారాలు చిక్కకూడదనే ఉద్దేశంలో మనీమ్యూల్స్‌గా పిలిచే దళారులకు చెందిన వాటితో పాటు బోగస్ వివరాలతో తెరిచిన బ్యాంకు ఖాతాలకు దీనికోసం వినియోగిస్తుంటారు.చదవండి: సైబర్ స్కామర్స్‌తో జాగ్రత్త.. మోసపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..ఓ నేరం కోసం ఒకే ఖాతాను కాకుండా వరుస పెట్టి బదిలీ చేసుకుపోవడానికి కొన్నింటిని వాడుతుంటారు. మోసపోయిన బాధితులు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసినప్పుడు ఆ అధికారులు ప్రాథమిక ఖాతాల్లోని నగదు ఫ్రీజ్ చేస్తారు. దీన్ని ఆన్లైన్ ఫ్రీజింగ్ అంటారు. సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో అప్పటికే కొంత నగదు మరో ఖాతాలోకి వెళ్లినట్లు తేలితే ఆయా బ్యాంకుల సహకారంతో దాన్నీ ఫ్రీజ్ చేస్తారు. దీన్ని ఆఫ్‌లైన్ ఫ్రీజింగ్‌గా వ్యవహరిస్తుంటారు. ఒక్కో టీమ్‌లో ఒక్కో కానిస్టేబుల్.. ఫిర్యాదు చేసినప్పుడు నగదు ఫ్రీజ్ అవుతోందనే విషయం చాలా మంది బాధితులకు తెలియట్లేదు. దీనికి సంబంధించి వస్తున్న ఎస్సెమ్మెస్‌లను వాళ్లు పట్టించుకోవట్లేదు. కొంత కాలానికి తెలిసినప్పటికీ కోర్టుకు వెళ్లి, అనుమతి పొందటం వీరికి పెద్ద ప్రహసనంగా మారుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న నగర సైబర్ క్రైమ్ పోలీసులు ప్రతి టీమ్‌కు ఓ కానిస్టేబుల్‌ను నియమించారు. సైబర్ నేరాల్లో ఫ్రీజ్ అయిన నగదు వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే ఈ అధికారి బాధితులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో పాటు వచ్చి నగదు తీసుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరతాడు. అలా ఠాణాకు వచ్చిన బాధితులను కోర్టుకు తీసుకువెళ్లి పిటిషన్ వేయడంతో పాటు నగదు విడుదలకు సంబంధించిన బ్యాంకు అధికారులకు ఆదేశాలు ఇచ్చేలా కానిస్టేబుల్ చేస్తున్నారు. గత ఏడాది మొత్తమ్మీద రిఫండ్ అయిన మొత్తం రూ.20.86 కోట్లుగా ఉండగా.. పోలీసుల చర్యల కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్ నాటికే ఇది రూ.32.49 కోట్లకు చేరింది. ఈ నెల్లో రిఫండ్‌తో కలిపితే ఇది దాదాపు రూ.40 కోట్ల వరకు ఉంది. -
TS: ‘గోల్డెన్ అవర్ వాట్సాప్ గ్రూప్స్’.. పోలీసుల వినూత్న కార్యక్రమం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. గతేడాది 19,456 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 6,746 మంది మరణించగా.. 18,413 మంది క్షతగాత్రులయ్యారు. మరణించిన వారిలో 50% మంది గోల్డెన్ అవర్‌లో ప్రథమ చికిత్స అందించకపోవటం వల్లే మృత్యువాత పడ్డారు. గోల్డెన్ అవర్‌లో క్షతగాత్రులకు వైద్య సహాయం అందించగలిగితే 90 శాతం వరకు ప్రాణాపాయం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో గోల్డెన్ అవర్‌కు ఉన్న ప్రాధాన్యత, ఆ సమయంలో ప్రథమ చికిత్స ఆవశ్యకతను తెలంగాణ ట్రాఫిక్ పోలీసు విభాగం విశ్లేషించింది. రోడ్డు ప్రమాదాలలో క్షతగాత్రుల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ‘గోల్డెన్ అవర్ వాట్సాప్ గ్రూప్‌ల’పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బాధితులకు అవసరమైన ప్రథమ చికిత్స అందించి, స్థానిక ఆసుపత్రికి తరలించడమే ఈ గ్రూప్‌ల లక్ష్యం. గోల్డెన్ అవర్ అంటే.. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత మొదటి గంటను ‘గోల్డెన్ అవర్’గా పిలుస్తారు. అంబులెన్స్ చేరుకొని, ఆసుపత్రికి తరలించే లోపు క్షతగాత్రులకు వైద్య సహాయం అందించినట్లయితే ప్రమాద తీవ్రతను బట్టి గాయాల తీవ్రత తగ్గేందుకు, ప్రాణాపాయం తప్పేందుకు అవకాశం ఉంటుంది. మన దేశంలో గోల్డెన్ అవర్‌కు మోటారు వాహన చట్టం–1988లోని సెక్షన్ 2 (12 ఏ) కింద చట్టపరమైన గుర్తింపు కూడా ఉంది. గుడ్ సామరిటన్స్కు శిక్షణ ఒంటరిగా వాహనంపై వెళ్తున్న వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై గాయపడితే.. తనంతట తానుగా లేచి ప్రథమ చికిత్స చేసుకొని, ఆసుపత్రికి వెళ్లలేని స్థితిలో ఉంటాడు. ఇలాంటి సమయంలో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా క్షతగాత్రుడికి సహాయం చేసేవాళ్లను ‘గుడ్ సామరిటన్స్’గా పిలుస్తారు. అయితే కొన్ని సందర్భాలలో ‘గుడ్ సామరిటన్స్ అందించే ప్రథమ చికిత్స వల్ల క్షతగాత్రుడికి మరింత ఇబ్బందులు, కొన్ని సందర్భాలలో ప్రాణాపాయం కూడా జరుగుతున్నాయి. దీనికి పరిష్కారంగా గుడ్ సామరిటన్స్కు రోడ్డు ప్రమాద బాధితులకు అందించాల్సిన ప్రథమ చికిత్సలపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు కొన్నిచోట్ల శిక్షణ ప్రారంభమైంది. అలాగే ఎస్పీలు, డీసీపీల ఆధ్వర్యంలో గోల్డెన్ అవర్ వాట్సాప్ గ్రూప్‌లు క్రియేట్ చేసి ఈ గుడ్ సామరిటన్స్ను సభ్యులుగా చేర్చుకుంటున్నారు. గ్రూప్‌లో ఎవరెవరుంటారు? రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సాధారణంగా ఆ చుట్టుపక్కలవారే స్పందిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే రోడ్ల వెంబడి దాబాలు, హోటళ్లు, పంక్చర్ షాపులు, మెడికల్ షాపులు, పెట్రోల్ బంక్‌లు, కిరాణా దుకాణాలు, టీ స్టాళ్ల నిర్వాహకులు, ఎన్జీవోలకు చెందిన వారిని గోల్డెన్ అవర్ వాట్సాప్ గ్రూప్‌లో సభ్యులుగా పరిగణనలోకి తీసుకుంటారు. స్థానిక ట్రాఫిక్ పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) వీరి ఎంపిక బాధ్యత తీసుకుంటారు. సైబరాబాద్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (టీటీఐ), సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సంయుక్తంగా ఇప్పటివరకు 800కు పైగా గుడ్ సమారిటన్స్కు శిక్షణ ఇచి్చనట్లు ఓ ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు, చట్టాలపై అవగాహన కలి్పంచడంతో పాటు బీఎల్ఎస్ (బేసిక్ లైఫ్ సపోర్ట్), సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) వంటి ప్రథమ చికిత్సలపై శిక్షణ ఇస్తున్నామని వివరించారు. వీరు ఏం చేస్తారంటే.. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి క్షతగాత్రులకు అధిక రక్తస్రావం కాకుండా కట్టుకట్టడం, సీపీఆర్ వంటి ప్రథమ చికిత్స అందిస్తారు. పోలీసులు, బాధితుల కుటుంబాలకు సమాచారం అందించి, క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో చేర్చుతారు. అలాగే ఏదైనా వాహనం అతివేగంగా వెళ్తున్నట్లు గుర్తిస్తే.. వెంటనే ఆ ప్రాంతం, వాహనం నంబరు వివరాలను గోల్డెన్ అవర్ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేస్తారు. స్థానిక పోలీసులు వెంటనే స్పందించి ఆ వాహనాన్ని నిలువరించేందుకు చర్యలు తీసుకుంటారు. ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్.. రాహుల్, ఖర్గే ఏం చెప్పారు? -
బ్లాక్ డ్రెస్‌లో సొగసులు ఒలకబోస్తున్న జాన్వీ కపూర్(ఫోటోలు)
-
ప్రమాదాల వేళ గోల్డెన్ అవర్‌లో స్పందించండి.. పోలీసుల సూచనలివీ
అమలాపురం టౌన్: రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటారు. కళ్లెదుటే ప్రమాదం జరిగినా రోడ్డుపై వెళ్లే ఎందరో అయ్యో పాపం! అంటూ నిట్టూర్చుతారు. ఆ కీలక సమయంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తే బతుకుతారనే చైతన్యం చూపేవారు అరుదుగా ఉంటారు. ప్రమాద స్థలం నుంచి ఆస్పత్రికి తరలిస్తే ఆ కేసులో తమనూ పెడతారేమో.. లేదా సాక్ష్యంగా నమోదు చేస్తారేమోననే భయాలే కారణం. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులు 108 అంబులెన్స్ వచ్చే వరకూ రోడ్డు పైనే విలవిలలాడుతున్నారు. అలా కాకుండా ప్రమాదం జరిగిన మరుక్షణమే ఎవరో ఒకరు స్పందించి, ఆస్పత్రికి తరలిస్తే సకాలంలో వైద్యం అంది వారు బతుకుతారు. ఇలా క్షతగాత్రులను కాపాడినవారిని ‘సమారిటన్’ అని అంటున్నారు. ప్రమాదాలు జరినప్పుడు క్షతగాత్రులను రక్షించడంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేలా రాష్ట్ర పోలీసు శాఖ అవగాహన పెంచే ప్రయత్నం చేస్తోంది. కీలక సమయాల్లో ప్రజలను కాపాడిన వారికి గౌరవ సూచకంగా రూ.5 వేల నజరానా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ప్రమాద సమయాల్లో ప్రజలను కాపాడేందుకు ప్రజలు ఎందుకు వెనకడుగు వేస్తున్నారో తెలియజేస్తూ.. ఆ ఆపద సమయంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడం వల్ల ప్రాణాలను ఎలా కాపాడవచ్చో వివరిస్తూ ఐదు అంశాలతో కూడిన సందేశాత్మక బోర్డులను ప్రతి పోలీసు స్టేషన్లు, ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేసి, ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని 25 పోలీసు స్టేషన్లు, ఏడు సర్కిల్ కార్యాలయాలు, డీఎస్పీ కార్యాలయాల వద్ద ఆ బోర్డులను జిల్లా పోలీసు శాఖ ఏర్పాటు చేసింది. పోలీసుల సూచనలివీ.. ప్రమాదాల్లో చిక్కుకున్న క్షతగాత్రులను కాపాడిన వారిని పోలీసులు విచారణ, దర్యాప్తులో చేర్చరు. చెప్పాలనుకుంటే స్వచ్ఛందంగా సాక్ష్యం చెప్పవచ్చు. పోలీసుల నుంచి ఎటువంటి ఒత్తిడీ ఉండదు. ఆస్పత్రిలో ప్రథమ చికిత్సకు డబ్బులు వసూలు చేయరు. చికిత్స చేయడానికి వైద్యులు నిరాకరించరు. కాపాడిన వారు తమ గుర్తింపును వెల్లడించాల్సిన అవసరం లేదు. కాపాడిన వ్యక్తిని పోలీసు శాఖ గుర్తించి, రూ.5 వేల నజరానాకు ఎంపిక చేస్తుంది. కలెక్టర్ ఆ బహుమతి మంజూరు చేస్తారు. ప్రమాదానికి కారణమైన వారు కూడా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించవచ్చు. అలా చేస్తే వారికి ప్రమాదం చేసి, తప్పించుకున్నారనే నేరం నుంచి మినహాయింపు లభిస్తుంది. పోలీసుల నుంచి పూర్తి సహకారం రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారిని కీలక సమయం(గోల్డెన్ అవర్)లో ఎవరైనా స్పందించి ఆస్పత్రికి తరలిస్తే వారి ప్రాణాలను కాపాడిన వారవుతారు. అలా చేసిన వారికి పోలీసు శాఖ నుంచి పూర్తి సహకారం ఉంటుంది. ప్రజల్లో ఈ చైతన్యం పెరగాలి. కేసులు, సాక్ష్యాలు అనే అపోహలు, భయాల నుంచి ప్రజలు బయటపడాలి. క్షతగాత్రుల ప్రాణాలను రక్షించడమే ప్రథమ కర్తవ్యం కావాలి. దీనిని సామాజిక బాద్యతగా భావించాలి. – సీహెచ్ సుధీర్‌కుమార్‌రెడ్డి, ఎస్పీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
మీరూ 'రక్షకుడు' కావొచ్చు
చింతూరు: ప్రతిరోజూ మనం నిత్యం వార్తల్లో ఎన్నో రోడ్డు ప్రమాదాల వార్తలు చూస్తుంటాం.. వింటుంటాం. ఆ సమయంలో తక్షణ వైద్యం అందక ప్రాణాలు పోతున్న సంఘటనలు కూడా మన చెవిన పడుతుంటాయి. మనం రహదారిలో ప్రయాణిస్తుంటే ఎన్నో ప్రమాదాలను కళ్లారా చూస్తుంటాం. అయితే ప్రమాదాల బారిన పడిన వారు ప్రాణాపాయ స్థితిలో సాయంకోసం కొట్టుమిట్టాడుతున్నా మనకెందుకెలే అంటూ చూసీచూడనట్లు వెళ్లిపోతాం. రేపు మనకూ ఇదే పరిస్థితి రావొచ్చని, అప్పుడు మనకు కూడా ఎవరూ సాయం చేయడానికి రాకపోతే మన పరిస్థితి ఏంటనే విషయాన్ని మర్చిపోతాం. పోనీ మానవతా ధృక్పథంతో సాయం చేసినా ఆ తరువాత పోలీసు కేసులు, సాక్ష్యాల కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందనే భయంతో వెనకడుగు వేస్తుంటాం. ఇలాంటి వారిలో భయం పోగొట్టడంతోపాటు ఆపదలో ఆదుకున్న ‘గుడ్ సమారిటన్’లకు రక్షణగా నిలిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. గుడ్ సమారిటన్ అంటే.. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఆ సంఘటనతో ఎలాంటి సంబంధం లేకపోయినా, ఏ ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేసే వ్యక్తిని గుడ్ సమారిటన్ (రక్షకుడు) అంటారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి మొదటి గంట ఎంతో క్లిష్టమైన సమయంగా చెప్పవచ్చు. దీనినే వైద్యభాషలో గోల్డెన్ అవర్ అంటారు. ప్రమాద సమయంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తులకు సకాలంలో వైద్యసాయం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుంటారు. వారికి గంటలోపు సరైన చికిత్స అందించగలిగితే వారి ప్రాణాలు కాపాడేందుకు ఎక్కువ అవకాశాలుంటాయి. ఈ సమయాల్లో గుడ్ సమారిటన్ల పాత్ర ఎంతో కీలకమైంది. అవగాహన కల్పించాలి ప్రమాదాల సమయంలో గాయపడిన వారిని కాపాడేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలి. అలాంటి వారు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం వారికి రక్షణగా నిలుస్తుంది. గుడ్ సమారిటన్ విధులపై అందరికీ అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – విఠల్, మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్, చింతూరు చట్టాల ద్వారా రక్షణ ప్రాణాపాయ స్థితిలో సాయం అందించే గుడ్ సమారిటన్లు ఆ తరువాత ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం వారికి చట్టాల ద్వారా రక్షణ కల్పిస్తోంది. ప్రమాదాల గురించి తెలిపినా, గాయపడిన వారిని ఆస్పత్రికి తీసుకొచ్చిన వారిని తమ వ్యక్తిగత సమాచారం తెలపమని పోలీసులు, ఆస్పత్రి సిబ్బంది వత్తిడి చేయరాదు. ఆస్పత్రిలో చేర్చుకునేందుకు అవసరమైన ఫారాలు నింపమని, గాయపడిన వారి వైద్య ఖర్చులు చెల్లించమని, ఆస్పత్రి నుంచి వెంటనే వెళ్లేందుకు వీలుకాదని ఒత్తిడి చేయకూడదు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సాయంచేసిన గుడ్ సమారిటన్‌ను సాక్షిగా ఉండమని పోలీసులు బలవంతం చేయకూడదు. అతను స్వయంగా అంగీకరిస్తేనే సాక్షిగా చేర్చే అవకాశం ఉంటుంది. నగదు బహుమతితో.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వెంటనే గంటలోపు ఆస్పత్రికి చేర్చిన గుడ్ సమారిటన్లకు ప్రభుత్వం రూ.5 వేలు నగదు బహుమతిగా అందచేస్తోంది. ఒక గుడ్ సమారిటన్ ఒకరు లేదా ఎక్కువ మంది గాయపడిన వారిని రక్షిస్తే అతనికి రూ.ఐదువేలు, ఒకరికంటే ఎక్కువ మంది రక్షిస్తే ఆ సొమ్మును వారికి సమానంగా పంచుతారు. దీనికోసం వైద్యాధికారి నుంచి ప్రమాద వివరాలను ధ్రువీకరించుకున్న పోలీసులు అనంతరం గుడ్ సమారిన్‌కు ఓ రసీదు అందజేస్తారు. ఆ కాపీని కలెక్టర్ అధ్యక్షతన గల కమిటీకి అందజేస్తారు. ఆ కమిటీ గుడ్ సమారిటన్ల జాబితాను నగదు చెల్లింపు కోసం రవాణాశాఖ కమిషనర్‌కు సిఫార్సు చేస్తుంది. రవాణాశాఖ కమిషనర్ ద్వారా నేరుగా ఆన్లైన్లో గుడ్ సమారిటన్ బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ అవుతుంది. జాతీయస్థాయిలో.. గుడ్ సమారిటన్లకు వారి సేవలను గుర్తిస్తూ జాతీయ స్థాయి అవార్డులు కూడా అందజేస్తారు. రాష్ట్రస్థాయి మానిటరింగ్ కమిటీ ఏటా ఈ అవార్డుకు ముగ్గురు ఉత్తమ గుడ్ సమారిటన్ పేర్లను నామినేట్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఏడాదిలో అత్యుత్తమ 10 మంది గుడ్ సమారిటన్లను ఎంపిక చేసి వారికి రూ.లక్ష నగదు బహుమతితో పాటు సర్టిఫికెట్, ట్రోఫీ అందజేస్తుంది. (చదవండి: పంట కాలువను కబ్జా చేసిన అయ్యన్న) -
Sai Dharam Tej: దాని వల్లే తేజ్‌కు ప్రాణాపాయం తప్పింది
సరైన సమయంలో చికిత్స అందడం వల్లే సాయి ధరమ్ తేజ్‌కు ప్రాణాపాయం తప్పిందంటున్నారు తేజ్‌కు మొదట ట్రీట్మెంట్ చేసిన మెడికవర్ వైద్యులు.. గోల్డెన్ అవర్‌లో అతన్ని ఆస్పత్రికి తీసుకురావడం, ఆ టైమ్‌లో ఇచ్చిన ట్రీట్మెంట్ వల్లే సాయి తేజ్ ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. 108 సిబ్బంది సమయానికి అతన్ని ఆస్పత్రికి తీసుకొచ్చారని చెప్పారు. ప్రమాదంలో తేజ్ కిందపడటంతో ఫిట్స్ వచ్చాయని, తమ ఆస్పతికి వచ్చేలోపే అపస్మారకస్థితిలో ఉన్నారని తెలిపారు. మరోసారి ఫిట్స్ రాకుండా ట్రీట్మెంట్ ఇచ్చామని తెలిపారు. ఆ తర్వాత బ్రెయిన్, స్పైనల్ కార్డ్, షోల్డర్, చెస్ట్ అబ్డామిన్ స్కానింగ్‌లు చేశామన్నారు. హెల్మెట్ పెట్టుకోవడంతో లక్కీగా అతని తలకు గాయాలు కాలేదన్నారు.. కాకపోతే శ్వాస తీసుకోవడానికి కొంత ఇబ్బంది పడ్డాడని.. దీంతో కృత్రిమ శ్వాస పెట్టాల్సి వచ్చిందన్నారు. (చదవండి: సాయిధరమ్ తేజ్ మా ఇంటి నుంచే బయలుదేరాడు: నరేశ్) కాగా, హీరో సాయి తేజ్ శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. స్పోర్ట్స్ బైక్ నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో తేజ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దాటి ఐకియా వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. నేడు కూడా ఐసీయూలోనే సాయి తేజ్‌కు చికిత్స అందిస్తామని వెల్లడించారు. రేపు మరోసారి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని వైద్యులు తెలిపారు. -
గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రిలో చేరిస్తే...
సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గోల్డెన్ అవర్‌లో (గంటలోపు) ఆస్పత్రిలో చేరిన బాధితులకు నగదు రహిత వైద్యం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలో ఓ పథకాన్ని అమలు చేయనున్నాయి. ఇందుకోసం సూచనలు, సలహాలు అందించాలని కేంద్రం.. రాష్ట్రాల రవాణా శాఖలకు గతేడాది డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పంపింది. రెండురోజుల కిందట ఢిల్లీలో జరిగిన ట్రాన్స్‌పోర్టు డెవలప్మెంట్ కౌన్సిల్ (టీడీసీ) సమావేశంలో కేంద్ర ప్రభుత్వ రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ ఈ పథకంపై రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది. రోడ్డు ప్రమాదం జరిగిన గంటలోపు బాధితులను ఆస్పత్రిలో చేరిస్తే ప్రాణాపాయం తప్పుతుంది. ఆస్పత్రిలో చేర్చడం ఆలస్యం కారణంగా ఏటా వేలాదిమంది ప్రాణాలు పోతున్నాయి. రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్‌లో నగదు రహిత వైద్యం అందించాలన్న మోటారు వాహన చట్టం సెక్షన్ 162 (2)ను కేంద్రం అమలు చేయనుంది. ఈ చట్టంలోని సెక్షన్ 164 బీ ప్రకారం యాక్సిడెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేయనుంది. హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులు ఈ పథకం ద్వారా సెక్షన్ 163 కింద లబ్ధి పొందవచ్చు. పరిహారనిధి ఏర్పాటు బీమా వాహనాలకు, బీమా లేని వాహనాలకు, హిట్ అండ్ రన్ యాక్సిడెంట్లకు పరిహారనిధి (కాంపన్సేషన్ ఫండ్) ఏర్పాటు చేస్తారు. బీమా వాహనాలు ప్రమాదానికి కారణమైతే నగదు రహిత వైద్యం అందించేందుకు అన్ని బీమా కంపెనీలు కనిష్టనిధి అందించాలి. బీమా లేని వాహనాలైతే నేషనల్ హైవే ఫీజు కింద కేంద్రం సెస్ వసూలు చేసిన సొమ్ములో కేటాయించాలి. హిట్ అండ్ రన్ పరిహారనిధిని సొలాషియం స్కీం కింద జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుంది. థర్డ్ పార్టీ ప్రీమియం వసూలు చేసే బీమా కంపెనీలు తమ వ్యాపారంలో 0.1 శాతం సొమ్ము కేటాయించాలి. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రిలో చేరితే రూ.1.50 లక్షల వరకు నగదు రహిత వైద్యం అందించవచ్చు. చికిత్స వ్యయం రూ.1.50 లక్షల కంటే ఎక్కువైతే రూ.5 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద కేంద్రం నగదు రహిత వైద్యం ఖర్చు భరిస్తుంది. ఈ పథకానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించే నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్హెచ్ఏ) దేశ వ్యాప్తంగా 22 వేల ఆస్పత్రులను రిఫరల్ ఆస్పత్రులుగా గుర్తించింది. ఈ పథకం కింద ఏ ఆస్పత్రి అయినా దరఖాస్తు చేసుకునేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి అందించే యాక్సిడెంట్ ఫండ్‌ను జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ నుంచి కొంత సమకూరుస్తుంది. స్టేట్ హెల్త్ ఏజెన్సీకి భాగస్వామ్యం మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండ్ హైవేస్ (మోర్త్)కు పలు సూచనలను గతంలోనే పంపినట్లు టీడీసీ సమావేశంలో ఏపీ రవాణా శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్టేట్ హెల్త్ ఏజెన్సీని కూడా భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో రోడ్ సేఫ్టీ కమిటీకి అనుబంధంగా రవాణా శాఖ, పోలీస్, వైద్యశాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: 7 సార్లు చక్కర్లు కొట్టి వెనుదిరిగిన విమానం 69 పట్టణాల్లో 54,056 ఇళ్లు.. రూ.392.23 కోట్లు ఆదా -
ప్రాణాపాయంలో యువతి.. ఇదేం పని
లక్నో: దాదాపు 20 ఏళ్లు ఉంటాయి ఆమెకు. సోమవారం సాయంత్రం కాలువ దగ్గర పడి ఉంది. ముఖం, గొంతు మీద పదునైన ఆయుధంతో దాడి చేశారు. విపరీతంగా రక్తం పోతుంది. సాయం చేసే వారి కోసం దీనంగా ఎదురు చూస్తోంది. ఇక్కడ దారుణమైన విషయం ఎంటంటే దాదాపు 10-20 మంది ఆమె చుట్టూ గుమికూడారు. చోద్యం చూస్తూ.. సెల్ఫోన్లలో వీడియో తీయడంలో మునిగపోయారు. ఒక్కరు కూడా బాధితురాలిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం మాత్రం చేయలేదు. మరి కొందరు మూర్ఖులు ఆమెను ప్రశ్నలతో మరింత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులు వచ్చి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కోలుకున్న తర్వాత ఆమె తన వివరాలు వెల్లడించింది. మీరట్‌కు చెందిన బాధిత యువతి తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుంది. దాంతో కుటుంబ సభ్యులు ఆమె మీద ఇంత దారుణంగా దాడి చేశారని తెలిపింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి.. బాధితురాలి సోదరుడితో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ సంఘనట జరిగిన నాడే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహిళలు, చిన్నారులపై నేరాలను తగ్గించడం కోసం ‘ఉమెన్ అండ్ చైల్డ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్’ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంకుకు చెందిన అధికారి ఈ విభాగానికి హెడ్‌గా ఉంటారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. (80 ఏళ్ల వృద్ధురాలిపై దాష్టీకం) ఇక మీరట్ సంఘటన గురించి పోలీసులు మాట్లాడుతూ.. స్థానికలు ఎవరైనా సరే ఇలా ప్రమాదంలో ఉన్న బాధితులను గుర్తించినప్పుడు వీడియోలు తీయడం మీద కాక వారిని ఆస్పత్రికి చేర్చే అంశంపైన దృష్టి పెడితే మంచిదని కోరారు. బాధితుల విషయంలో ‘గోల్డెన్ అవర్’ అనేది చాలా కీలకమైన సమయం అన్నారు. బాధితులను ఆస్పత్రికి చేర్చేవారిని ప్రశ్నించవద్దని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు పోలీసులు. కాబట్టి ఎవరైనా సరే బాధితులను గుర్తిస్తే.. తాము వచ్చే వరకు వేచి ఉండకుండా ఆస్పత్రికి తీసుకెళ్లాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. కొన్ని నెలలుగా యూపీలో మహిళలు, బాలికలపై నేరాలు విపపరీతంగా పెరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం ఇద్దరు మృగాళ్లు 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేయడమే కాక హత్య చేశారు. ఈ ఘటనలో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. -
లేటు.. అనే మాటే లేదు!
సాక్షి, హైదరాబాద్ : గోల్డెన్ అవర్.. 60 నిమిషాలు.. రోడ్డుపై తీవ్ర గాయాలపాలై ప్రాణాలతో పోరాడుతున్న క్షతగాత్రులకు అమూల్యమైన సమయం. ఆ వ్యక్తిని గంటలోపు ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తే బతికే అవకాశాలు చాలా ఎక్కువ. మెదడు భద్రంగా ఉండి.. శరీరంలో ఇతర అవయవాలకు తీవ్ర గాయాలైనా 60 నిమిషాల్లో చికిత్స చేస్తే ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంది. ఇలా ప్రమాదాల్లో గాయపడిన వారికి సత్వర చికిత్స కోసం ‘మోటారు వాహనాల చట్టం సవరణ బిల్లు–2016’ను కేంద్రం రూపొందించింది. బిల్లు చట్టమై అమల్లోకి వస్తే ప్రాణ నష్టం భారీగా తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లుపై ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఏటా 1.5 లక్షల మంది మృతి దేశంలో ఉగ్రవాదం, వ్యాధులు, ప్రకృతి వైపరీత్యాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. 2015లో కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో ఏటా 1.5 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. చాలా ప్రమాదాల్లో వైద్యం ఆలస్యం కావడం వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాద మృతుల్లో అత్యధికం యువతే కావడం ఆందోళనకరం. దేశానికి ఎంతో విలువైన మానవ వనరులు రోడ్డు ప్రమాదాల వల్ల అసువులు బాయడం దురదృష్టం. పెరుగుతున్న వాహనాలు దేశంలో ఏటేటా వాహనాలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో బైకులు, కార్లు, ఇతర వాహనాలు కలిపి ఇప్పటికే కోటి దాటాయి. మెరుగైన రహదారులు, ఆధునిక వాహనాలు పెరుగుతున్న దరిమిలా రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొత్త చట్టం అమలుతో రోడ్డు ప్రమాద మరణాల సంఖ్య తగ్గనుంది. 2004లోనే గుర్తించిన వైఎస్ 2004లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అత్యవసర వైద్య చికిత్స కోసం ప్రవేశపెట్టిన 108 పథకం విజయవంతమైంది. రాష్ట్రం, పార్టీలకు అతీతంగా దేశమంతటా దీన్ని అమలు చేయడం ప్రారంభించారు. వైఎస్ స్వతహాగా వైద్యుడు కావడంతో ‘గోల్డెన్ అవర్’ప్రాధాన్యం ఆనాడే గుర్తించగలిగారు. ఈ చట్టం అమల్లోకి వస్తే.. 108 అంబులెన్సుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కొత్త చట్టం ఏం చెబుతోంది? ‘మోటారు వాహన చట్టం సవరణ బిల్లు– 2016’49వ క్లాజులో ‘గోల్డెన్ అవర్’ను ప్రస్తావించారు. చట్టం ప్రకారం.. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఏ ఆస్పత్రిలోనైనా ఉచితంగా చికిత్స అందించాలి. రోడ్డు ప్రమాదాల్లో మరణిం చిన వారికి ప్రస్తుత మోటారు వాహన చట్టం ప్రకారం రూ.25 వేల నష్టపరిహారం ప్రభుత్వం చెల్లిస్తోంది. కొత్త చట్టంతో పరిహారాన్ని రూ.2 లక్షలకు పెంచనున్నారు. ‘గోల్డెన్ అవర్’పదం వినియోగం మనదేశంలో తక్కువేగానీ.. అమెరికా, యూరోప్ లాంటి పాశ్చాత్య దేశాల ప్రభుత్వాలు దీనికి ప్రాధాన్యం ఇస్తాయి. అక్కడ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని సత్వరం ఆస్పత్రికి తరలించేందుకు ఎయిర్ అంబులెన్సులు అందుబాటులో ఉంటాయి. మన వద్ద 108 సర్వీసులొచ్చాక రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య తగ్గింది. మరణాలు తగ్గుతాయి రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి విషయంలో గోల్డెన్ అవర్ ఎంతో కీలకం. మొదటి 60 నిమిషాల్లో క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకొస్తే రక్తస్రావం ఆపొచ్చు. బీపీని సాధారణ స్థితికి తీసుకురావొచ్చు. గాయాల వల్ల శరీరంలోకి ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. దీని ప్రాధాన్యాన్ని కేంద్రం గుర్తించడం హర్షణీయం. -డాక్టర్ శ్రీనివాస్, ఎంబీబీఎస్, ఎంఎస్ (ఆర్థో), హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రి -
గోల్డెన్ అవర్... ఉన్నది 60 నిమిషాలు.
గోల్డెన్ అవర్... ఉన్నది 60 నిమిషాలు. అంతకంటే ఒక నిమిషం లేట్ వెళ్లినా ఫెయిల్ అయినట్టే.ఇది ఎంసెట్ పరీక్ష కాదు. జీవితం పరీక్ష. పరుగు పరీక్ష కోసం కాదు. ప్రాణం కోసం. ఎప్పుడూ హార్ట్ ఎటాక్‌లు ఇతరులకే రావు.ఎదుర్కోడానికి మనం సంసిద్ధంగా ఉండాలి. బీ రెడీ. డోంట్ వర్రీ గుండెపోటు వస్తే యమపాశం తాకకుండా యమ అర్జెన్సీగా గుండెను కాపాడుకోవడం కోసం ఈ ప్రత్యేక కథనం. సాధారణంగా మరేదైనా సమస్య వస్తే... హాస్పిటల్‌కు తరలించే లోపు మన ప్రమేయం లేకుండానే కొంత జాప్యం జరిగినా పెద్దగా నష్టం లేదు. కానీ గుండెపోటు వస్తే గోల్డెన్ అవర్‌గా పరిగణించే ఆ బంగారు క్షణాల్లో రోగిని హాస్పిటల్‌కు తరలించలేకపోతే కష్టం. అయితే ఒక్కోసారి గుండెపోటును సత్వరం గుర్తించలేకపోవచ్చు. చాలా మంది దీన్ని గ్యాస్ సమస్యగా పరిగణించి రోగిని హాస్పిటల్‌ను తీసుకెళ్లడంలో ఆలస్యం చేస్తుంటాం. అందుకే గుండెపోటును స్పష్టంగా గుర్తించడం, దానికి గురైన వాళ్ళ ప్రాణాలు నిలడం ఎలాగో తెలుసుకోడానికి ఉపయోగపడేదే ఈ కథనం. గుండెపోటు లక్షణాలు! గుండెపోటు వచ్చిన సమయంలో గుండెనొప్పి వచ్చే అవకాశం కొంతమందిలో ఉంటుంది. మరికొంత మందిలో గుండెను నొక్కేసినట్లుగా, గుండెను పిండేసినట్లుగా నొప్పి రావచ్చు. ఇంకొంతమందిలో గుండెపోటు వచ్చినప్పుడు రోగుల్లో గుండె నొప్పి లేకుండా కేవలం ఛాతీలో బరువుగా మాత్రమే ఉండవచ్చు. కొన్నిసార్లు ఛాతీలో మంటగా ఉండవచ్చు. ఈ నొప్పిగానీ, మంటగానీ... ఛాతీ ముందుభాగం నుంచి ఎడమవైపునకు పాకుతున్నట్లుగా ఉండవచ్చు. కొన్నిసార్లు ఎడమ భుజం, ఎడమ చేయి నొప్పిగా ఉండటం కూడా జరుగుతుండవచ్చు. ఈ తరహా నొప్పి దాదాపు అరగంట మొదలుకొని, కొన్ని గంటలపాటు వస్తుండవచ్చు. ఈ నొప్పి తీవ్రత రకరకాలుగా ఉంటుంది. కొన్నిసార్లు భరించగలిగేంతగా ఉండవచ్చు. మరికొందరిలో ఇది చాలా తీవ్రంగా, ఏ మాత్రం భరించలేనంతగా కూడా ఉండవచ్చు. నొప్పి, మంట వచ్చినప్పుడు దానితో పాటు చెమటలు కూడా పట్టవచ్చు. ఇవన్నీ గుండెపోటు వచ్చినప్పుడు కనిపించే సాధారణ (క్లాసికల్) లక్షణాలు. కాకపోతే గుండెపోటు వచ్చిన ప్రతి ఒక్కరిలోనూ ఈ క్లాసికల్ లక్షణాలు కనిపించకపోవచ్చు. కొంతమందిలో కనిపించే అసాధారణ లక్షణాలు... కొంతమంది రోగుల్లో సాధారణ గుండెపోటు లక్షణాలు ఏవీ కనిపించకపోవచ్చు. ఉదాహరణకు మహిళల్లోనూ, షుగర్ ఉన్నవారిలోనూ, కొంతమంది మగవారిలోనూ గుండెపోటు లక్షణాలు కాస్తంత వేరుగా ఉండవచ్చు. డయాబెటిస్ ఉన్నవారిలో నొప్పి తెలియడం ఒకింత తక్కువ. కాబట్టి ఈ గుండెనొప్పి కూడా తెలియక ముందే జరగాల్సిన అనర్థం జరిగిపోవచ్చు. ఇక మరికొంతమందిలో గుండెపోటు వచ్చినప్పుడు ఛాతీలో నొప్పి లేకుండా కేవలం కింది దవడ భాగంలో నొప్పి ఉండవచ్చు. కడుపులోనూ నొప్పిగా ఉండవచ్చు. దవడ కింది భాగం (లోవర్ జా) మొదలుకొని బొడ్డు (అంబ్లికస్) వరకు ఎక్కడైనా నొప్పి కనిపించవచ్చు. అంటే... ఉదాహరణకు దవడ, మెడ, భుజం, చేతులు, పొట్ట... ఇలా నొప్పి రావచ్చు. ఇది ఛాతీ నొప్పితో పాటు, ఒక్కోసారి ఛాతీలో నొప్పి లేకుండా కూడా రావచ్చు. అందుకే కొందరిలో కడుపులో వచ్చే నొప్పిని సాధారణంగా గుండెపోటు వల్ల వచ్చే నొప్పిగా గాక... అసిడిటీ వల్ల వచ్చే నొప్పిగా అపోహ పడే అవకాశం ఎక్కువ. అయితే అందరిలోనూ గుండెపోటు లక్షణాలు ఒకే మాదిరిగా ఉండకపోవచ్చు. గుండెపోటుకు లక్షణాలుగా పరిగణించే అంశాలు ఒకటిగాని, రెండుగాని, లేదా అంతకు మించిగాని కలగలసి ఉండవచ్చు. అవి... కొద్దిపాటి శ్రమపడ్డా లేదా ఒక్కోసారి శ్రమపడకపోయినా ఊపిరి అందనంత ఆయాసం తలంతా తేలికైనట్లుగా అనిపించవచ్చు. ఒక్కోసారి స్పృహ కోల్పోవచ్చు ఇక ఏ చిన్నపాటి పని కూడా చేయలేనంత నిస్సత్తువ ఆవరించవచ్చు అకస్మాత్తుగా అజీర్ణం వికారం, వాంతులు పక్షవాతం లక్షణాలు. చాలామంది చికిత్సను ఎందుకు ఆలస్యం చేస్తుంటారు? చాలామంది తమకు కనిపించిన కొద్దిపాటి లక్షణాల్లో గుండెపోటు సాధారణ లక్షణాలు కనిపించకపోవడంతో దాన్ని గుర్తించలేక చికిత్సకు ఆలస్యం చేస్తుంటారు. ఉదాహరణకు కడుపు నొప్పి, కడుపులో మంట వస్తే దాన్ని అసిడిటీ తాలూకు లక్షణంగా భావించి సరిపెట్టుకుంటారు తప్ప... ఒకసారి ఈసీజీ తీయించి గుండెపోటు అయ్యేందుకు ఉన్న అవకాశాన్ని నిర్ధారణ చేసుకోరు. కొన్నిసార్లు అవి గుండెపోటు లక్షణాలని గుర్తిండానికి వీల్లేనంత తక్కువ తీవ్రతతో ఉండవచ్చు. అలాంటప్పుడు రోగి ఆ నొప్పిని నిర్లక్ష్యం చేసే అవకాశాలు చాలా ఎక్కువ. అయితే చాలా సందర్భాల్లో గుండెపోటుగా భావించిన లక్షణాలు... వైద్య పరీక్షల తర్వాత గుండెపోటు కాదని తేలడం కూడా మామూలే. అందుకే కొంతమంది అతిగా ఆందోళన చెంది గుండెపోటు అనే అనుమానంతో ఆసుపత్రికి వెళ్లాక, తీరా అది గుండెపోటు కాదని తెలిశాక తొలుత తమ తొందరపాటు వల్ల అందరికీ ఇబ్బంది కలిగిస్తామేమో అనే అభిప్రాయంతో మొహమాటపడి ఆసుపత్రికి వెళ్లరు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలో ఉంచుకుని... గుండెపోటును ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకూడదు. ఏమాత్రం ఇబ్బందిగా అనిపించినా తొలుత వైద్య పరీక్షలు చేయించుకుని, అది గుండెపోటు కాదని నిర్ధారణ చేసుకుని అప్పుడు మాత్రమే నిశ్చింతగా ఉండాలి. ఆసుపత్రిలో గుండెపోటు చికిత్స జరిగే తీరు... గుండెపోటు అని ఆసుపత్రికి వచ్చిన రోగికి ఇవ్వాల్సిన సాధారణ మందులతో పాటు... రోగి తాలూకు గుండె కండరానికి రక్తసరఫరా మామూలుగా అయ్యేందుకు వీలుగా చికిత్స చేస్తారు. ఈ చికిత్స రెండు విధాలుగా చేయవచ్చు. 1) తక్షణం యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ చేయడం. 2 ) రక్తనాళాల్లో గడ్డకట్టి ఉన్న రక్తాన్ని కరిగించే మందులివ్వడం (థ్రాంబోలైటిక్స్) క్యాథ్‌ల్యాబ్ సౌకర్యం ఉన్న ఆసుపత్రిలో అత్యవసర ప్రాతిపదికపై యాంజియోగ్రామ్ నిర్వహించి అవసరాన్ని బట్టి అడ్డంకి ఉన్న రక్తనాళంలోని అడ్డంకిని సత్వరం తొలగించడానికి బెలూన్ యాంజియోప్లాస్టీతో పాటు అవసరమైతే స్టెంట్ వేస్తారు. ఇది చాలామంది రోగులకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఒకవేళ క్యాథ్‌ల్యాబ్ సౌకర్యం లేని ఆసుపత్రికి రోగిని తీసుకెళ్లినట్లయితే తక్షణ చికిత్సగా రక్తనాళాల్లో గడ్డగట్టి ఉన్న రక్తపు గడ్డను కరిగించే మందులు (థ్రాంబోలైటిక్స్) ఇస్తారు. అయితే ఈ రెండింటిలోనూ యాంజియోప్లాస్టీ అన్న ప్రక్రియ ప్రభావపూర్వకమైనది. ఎందుకంటే థ్రాంబోలైటిక్స్ ఇచ్చాక అది పూర్తిస్థాయిలో పనిచేయడానికి 60 నుంచి 90 నిమిషాల వ్యవధి అవసరం. అందుకే పై రెండింటిలోనూ క్యాథ్‌ల్యాబ్ సౌకర్యం ఉన్నచోట వైద్యులు మొదటిదానికే ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే ఈ రెండు చికిత్సల్లో ఏది చేసినా గుండెపోటు వచ్చిన తర్వాత ఎంత త్వరగా ఈ చికిత్స జరిగిందనే దాన్ని బట్టి ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అందుకే రోగి ఎంత త్వరగా ఆసుపత్రికి చేరుకున్నాడు అనేది చాలా ప్రధానమైన విషయం. గుండెపోటు తర్వాత సత్వర చికిత్స ఎందుకు? దీనికి సమాధానం తెలుసుకోవాలంటే గుండెపోటు సమయంలో గుండెకు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. మనలోని ప్రతి అవయవానికి నిరంతరం రక్తం సరఫరా అయి తీరాలి. గుండెకు కూడా. గుండెకు రక్తం అందించే రక్తనాళాల్లో ఏదైనా అకస్మాత్తుగా మూసుకుపోతే గుండె కండరానికి రక్తసరఫరా నిలిచిపోయి రక్తం ద్వారా అందాల్సిన ఆక్సిజన్, పోషకాలు అందవు. దాంతో గుండె కండరం దెబ్బతినడం మొదలవుతుంది. అలాంటప్పుడు ఆరు నుంచి పన్నెండు గంటల్లో దానికి అందాల్సిన పాళ్లలో రక్తసరఫరాను పునరుద్ధరించలేకపోతే... ఇకపై మళ్లీ ఎప్పటికీ కోలుకోలేనంతగా శాశ్వతంగా గుండె కండరం చచ్చుబడిపోతుంది. ఒకసారి గుండెకండరం శాశ్వతంగా చచ్చుబడితే... దాని వల్ల శరీరంలోని మిగతా అన్ని అవయవాలకూ రక్తం అందకుండాపోయిన మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఎంత త్వరగా గుండెకు రక్తసరఫరాను పునరుద్ధరించగలిగితే అంత మంచిది. ఎంత త్వరగా గుండె కండరాన్ని చచ్చుబడకుండా చూస్తే అంత సమర్థంగా రోగికి మరణాన్ని తప్పించినట్లవుతుంది. గుండె పంపింగ్ దెబ్బతినకుండా ఉండేలా ఎంత త్వరగా చికిత్స అందిస్తే దీర్ఘకాలంలో వారు అంత నాణ్యమైన జీవితాన్ని (క్వాలిటీ లైఫ్)ను గడిపేందుకు అవకాశం ఉంది. అందుకే గుండెపోటు వచ్చినప్పుడు త్వరగా చికిత్స అందడానికి అంత ప్రాధాన్యం ఉందని అర్థం చేసుకోవాలి. అయితే ఒక్కోసారి గుండెపోటు లక్షణాల విషయంలో రోగికి ఉండే అపోహలతో ఒక్కోసారి దాన్ని సరిగా గుర్తించలేక ఆసుపత్రికి వెళ్లాల్సిన సమయంలో వెళ్లకపోతే... ఈలోపే జరగకూడని అనర్థం జరిగిపోవచ్చు. సెలైంట్ హార్ట్ ఎటాక్ గుండెపోటు లక్షణాలు ఏమీ లేకుండా కూడా గుండెపోటు (సెలైంట్ హార్ట్ ఎటాక్) రావచ్చు. ఇలాంటివారిలో రొటీన్ చెకప్‌లో భాగంగా పరీక్షలు చేసినప్పుడే వాళ్లకు గుండెపోటు వచ్చిందని తెలుస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో ఇలాంటి సెలైంట్ హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే షుగర్ ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. గుండెపోటు అని అనుమానిస్తున్నప్పుడు ఏం చేయాలి? గుండెపోటు వచ్చిందేమోనని రోగి అనుమానిస్తున్నప్పుడు వెంటనే హాస్పిటల్‌కు బయల్దేరాలి. చేస్తున్న పనిని ఆపేయాలి. నడవకూడదు.ఆ టైమ్‌లో డ్రైవింగ్ చేస్తుంటే, రోగి వాహనం నడపకూడదు. పక్కవారి సహాయంతో వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాలి.అంతకు ముందే తమకు గుండెజబ్బు ఉన్నవారైతే సార్బిట్రేట్ మాత్రలను తమ వద్ద ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే ఆ మాత్రను నాలుక కింద పెట్టుకోవాలి. అయితే సార్బిట్రేట్ టాబ్లెట్స్‌తో బ్లడ్‌ప్రెషర్ అమాంతం పడిపోయే ప్రమాదం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి.గుండెపోటు అని అనుమానించగానే వెంటనే ఆస్పిరిన్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. పై జాగ్రత్తలు తీసుకుంటూనే తక్షణం హాస్పిటల్‌కు వెళ్లాలి. - డాక్టర్ వి. సూర్యప్రకాశ్ రావు సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ - హెచ్ఓడి అపోలో హాస్పిటల్స్, హైదర్‌గూడ, హైదరాబాద్ -
రోడ్లమీద ప్రాణాల రవాణా
విశ్లేషణ గోల్డెన్ అవర్‌ను గుర్తించి క్షతగాత్రులను ఆస్పత్రి ప్రాంగణంలోకి చేరిస్తే ఫలితం ఉంటుందన్న మాట వాస్తవమే. కానీ మన దేశంలోను, కాకుంటే మన తెలుగు రాష్ట్రాలలోను ఉన్న ఆస్పత్రులన్నీ ఇలాంటి కేసులను స్వీకరించి బాగు చేయగలిగిన స్థితిలో ఉన్నాయా? దీనికి సమాధానం చెప్పడం కష్టం. ఇటీవల కాలంలో వైద్యరంగం బాగా వృద్ధి చెందింది. కానీ చాలా ఆస్పత్రులకు పరిమితులు ఉన్నాయి. క్షతగాత్రులకు సేవలు అందించడానికి కావలసిన సంసిద్ధత, మార్గదర్శకత్వం నగరాలలో ఉన్న చాలా ఆస్పత్రులలో కూడా లేదు. ఈ నెల 14వ తేదీన విజయవాడ నగర శివారు ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వైద్య విద్యార్థులు దుర్మరణం చెందడం మనందరినీ కలచివేసింది. ‘తాగిన మైకంలో’ ప్రైవేటు బస్సును నడుపుతున్న డ్రైవర్ కూడా మరణించాడు. ఘటన మనకు తెలిసిన ప్రాంతంలో జరగడం, మిగిలిన ప్రయాణికులు చెప్పిన హృదయ విదారక వివరాలు పత్రికలలో చదవడం వంటి కారణాలతో ఇలాంటి ప్రమాదంలోని పెను విషాదం మనకు కళ్లకు కట్టింది. అందులోని తీవ్రతను ఊహించడం సాధ్యమైంది. నిజానికి ఇలాంటి దురదృష్టకర దుర్ఘటనలు దేశంలో ఏదో ఒక మూల జరుగుతూనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రతి నిత్యం ఎక్కడో ఒకచోట, ఏదో ఒక స్థాయి రోడ్డు ప్రమాదం నమోదవుతూనే ఉంటుంది. ప్రపంచంలోని వాహనాలలో ఒక శాతం భారతదేశంలోనే ఉన్నాయని మనం ఘనంగా చెప్పుకుంటూ ఉంటాం. అదే సమయంలో ప్రపంచంలో జరుగుతున్న రోడ్డు రవాణా ప్రమాదాలు, వాటి మూలంగా సంభవిస్తున్న చావులలో మన వాటా ఆరు శాతమన్న చేదు వాస్తవాన్ని కూడా గుర్తించవలసి ఉంటుంది. 2009లో ఒకసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశంలో జరిగే రోడ్డు ప్రమాదాలు, విపరీత సంఖ్యలో ఉండే మరణాలను గురించి ఒక నివేదిక ఇచ్చింది. దాని ప్రకారం- భారతదేశంలో ప్రతి లక్ష జనాభాలో 16.8 శాతం రోడ్డు రవాణా ప్రమాదాల కారణంగా చనిపోతున్నారు. ఇక ఆ ప్రమాదాల కారణంగా క్షతగాత్రులుగా మిగిలినవారు ఇరవై లక్షలు. రోడ్డు ట్రాన్స్‌పోర్టు అథారిటీ లెక్కల ప్రకారం ప్రతి వేయి మందిలో 35 మంది వాహనాలు కలిగి ఉన్నారు. ఇది ప్రపంచంలోనే చెప్పుకోదగిన నిష్పత్తి. కానీ ప్రతి 10,000 వాహనాలలో 25.3 శాతం ప్రమాదాలకు కారణమవుతూ ప్రాణాలను హరిస్తున్నాయి. ఇది కూడా ప్రపంచంలో చెప్పుకోదగిన రికార్డే. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం 2030 సంవత్సరం నాటికి భూమ్మీద సంభవించే మానవ మారణాలకు కొన్ని కారణాలను చెప్పుకుంటే అందులో ఐదో స్థానం రోడ్డు ప్రమాదాలకు దక్కుతుంది. ఆ కాలానికి రోడ్డు ప్రమాదాల కారణంగా ఏటా 24 లక్షల మంది కన్నుమూస్తారని ఆరోగ్య సంస్థ వెల్లడించింది. గోల్డెన్ అవర్‌ను గుర్తించాలి రోడ్డు ప్రమాదాలను నివారించడం ప్రస్తుత తరుణంలో అత్యంతావశ్యకమైనదని అంతా గుర్తించాలి. ఇందుకు క్షేమకరమైన రవాణా, సురక్షితమైన రోడ్లు దోహదం చేస్తాయి. అంతేకాదు, సురక్షితమైన వాహనాలు, బాధ్యతతో వ్యవహరించే డ్రైవర్లు, ప్రజలలో ట్రాఫిక్ నిబంధనలను గౌరవించాలన్న భావన కూడా అవసరమే. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడితే వింతగా చూడవచ్చు. చర్వితచర్వణంగా చాలా మంది భావించవచ్చు కూడా. కానీ ఈ అంశాల అమలు మొదటి నుంచి పెద్ద సమస్యగా మారిందన్న వాస్తవాన్ని గమనిస్తే వాటిని పదే పదే గుర్తు చేసుకోవడం ఎందుకో అర్థమవుతుంది. ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థులను, డ్రైవర్‌ను బలిగొన్న ఈ తాజా ప్రమాదాన్ని విశ్లేషించుకున్నా ఈ సంగతే అవగతమవుతుంది. విజయవాడ శివార్లలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదం మళ్లీ కొన్ని పాత పాఠాలనే కొత్తగా నేర్పుతోంది. ఇలాంటి రోడ్డు దురంతాలు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్త పడడం ఎలా అన్న విషయాన్ని కూడా ఇది బోధపరచగలదు. డ్రైవర్ మద్యం సేవించి బస్సును నడపడం వల్లనే ఈ ఘోరం జరిగిందని ప్రత్యక్ష సాక్షులంతా ముక్త కంఠంతో చెప్పారు. ఇదే ప్రమాదానికి మొదటి కారణం. విరామం లేకుండా పనిచేసిన డ్రైవర్ అలసట కారణంగా సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం, మెదడు చురుకుగా పనిచేయలేక పోవడం ప్రమాదానికి రెండో కారణంగా భావించవచ్చు. ప్రమాదం జరిగిన తరువాత క్షతగాత్రులను వెనువెంటనే ఆస్పత్రులకు తరలించకపోవడం, వైద్యం అందించలేకపోవడం ప్రాణ నష్టానికి దారితీసింది. క్షతగాత్రులను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆస్పత్రికి చేర్చగలిగితే ఫలితం ఉంటుంది. అందుకే ప్రమాదం స్థలి నుంచి ఆస్పత్రిలో చేర్చే మధ్య కాలాన్ని గోల్డెన్ అవర్ అంటారు. ఆ కొద్ది సమయం అంత విలువైనది. అయితే జరిగినది గమనిస్తే గోల్డెన్ అవర్‌కు విలువ ఇవ్వలేదు. చాలా ప్రమాదాలలో మృతుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం ఇదే. ఊపిరి పరీక్షలు అవశ్యం మద్యం సేవించి వాహనం నడపడం సర్వసాధారణంగా జరిగిపోతూ ఉంటుంది. కానీ రోడ్డు ప్రమాదాలను పెంచుతున్న మహమ్మారి ఇదేనన్నది వాస్తవం. బెంగళూరుకు చెందిన ఒక ఆస్పత్రి నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు స్పష్టమైనాయి. మద్యం సేవించి వాహనం నడిపిన కారణంగా జరిగిన ప్రమాదాలలో 40 శాతం అప్పటికి గంట ముందే తాగి వాహనమెక్కిన వాళ్ల కారణంగా జరిగినవే. 33 శాతం ప్రమాదాలు రెండు గంటల ముందు తాగి వాహనం ఎక్కిన వారి కారణంగా జరిగినవి. భారతదేశంలోని పలు నగరాలలో జరిగిన అధ్యయనాలు కూడా దాదాపు ఇవే ఫలితాలను చూపిస్తున్నాయి. అసలు రోడ్డు ప్రమాదాలలో 15 నుంచి 20 శాతం తాగి ఉన్న డ్రైవర్ల కారణంగా జరుగుతున్నవేనని ఆ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్లు వాహనాలు నడపకుండా నిరోధించడం ఎలా అనేది తీవ్రంగా ఆలోచించవలసిన అంశం. కనీసం జాతీయ రహదారుల మీద నడిచే వాహనాల డ్రైవర్లనయినా దీని నుంచి నిరోధించడం ఎలా అన్నది కీలకమే. ఎందుకంటే ఘోర ప్రమాదాలు, సాధారణ ప్రమాదాలు కూడా జాతీయ రహదారుల మీద చాలా జరుగుతూ ఉంటాయి. పశ్చిమ దేశాలు ఈ విషయంలో తీసుకున్నంత స్థాయిలో జాగ్రత్తలు సాధ్యం కాకున్నా, కనీసం జాతీయ రహదారుల మీద నడిచే వాహనాల డ్రైవర్లకు ఊపిరి పరీక్షలు నిర్వహించాలి. జాతీయ రహదారుల మీదకు వాహనాలు ప్రవేశించే కీలక ప్రదేశాలలో అయినా టోత్ బూత్‌లు పెట్టి ఈ పరీక్షలు నిర్వహించాలి. ఈ పరీక్షలను జాతీయ రహదారుల మీద, మరీ ముఖ్యంగా రాత్రివేళ కచ్చితంగా నిర్వహించే విధానాన్ని కఠినంగా అమలు చేయాలి. విశ్రాంతి లేకుండా రాత్రంతా వాహనాలు నడపడం కూడా ప్రమాదాలకు ఇంకొక కారణంగా చెప్పుకోవచ్చు. దీనితో తీవ్రమైన బలహీనత ఏర్పడి, సామర్థ్యం తగ్గుతుంది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారు కాబోయే డాక్టర్లు కాబట్టి ఒక సంగతి ఇక్కడ ప్రస్తావించవచ్చు. డాక్టర్లకు తర్ఫీదు ఇచ్చినప్పుడు అమెరికాలో పని గంటలను తగ్గిస్తున్నారు. వారానికి ఎనభయ్ కంటే తక్కువ పని గంటలు ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. అలసట, నిద్రలేమి కారణంగా వైద్యసేవకు కూడా న్యాయం చేయలేరన్నది వాస్తవం. నిజానికి ప్రభుత్వ వాహనాల మాదిరిగానే, ప్రైవేటు వాహనాలలో కూడా దూర ప్రయాణాలలో ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. అయితే విజయవాడ దగ్గర ప్రమాదం జరిగిన రోజున ఆ బస్సులో ఒక్కడే డ్రైవర్ ఉండి ఉండాలి. మరణించిన ఆ డ్రైవర్ కూడా ఉదయం నుంచీ వాహనాన్ని నడిపి తీవ్రంగా అలసిపోయి ఉండాలి. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు సరైన మార్గాన్ని అన్వేషించక తప్పదు. ఆస్పత్రుల మాటా చెప్పుకోవాలి గోల్డెన్ అవర్‌ను గుర్తించి క్షతగాత్రులను ఆస్పత్రి ప్రాంగణంలోకి చేరిస్తే ఫలితం ఉంటుందన్న మాట వాస్తవమే. కానీ మన దేశంలోను, కాకుంటే మన తెలుగు రాష్ట్రాలలోను ఉన్న ఆస్పత్రులన్నీ ఇలాంటి కేసులను స్వీకరించి బాగు చేయగలిగిన స్థితిలో ఉన్నాయా? దీనికి సమాధానం చెప్పడం కష్టం. ఇటీవల కాలంలో వైద్యరంగం ఇతోధికంగా వృద్ధి చెందిన మాట వాస్తవం. కానీ చాలా ఆస్పత్రులకు పరిమితులు ఉన్నాయి. క్షతగాత్రులకు సేవలు అందించడానికి కావలసిన సంసిద్ధత, మార్గదర్శకత్వం నగరాలలో ఉన్న చాలా ఆస్పత్రులలో కూడా లేదన్నది ఒక చేదు నిజం. తీవ్ర గాయాలతో, చావుబతులకు మధ్య తీసుకు వచ్చిన ఒక రోడ్డు ప్రమాద బాధితుడిని ఆస్పత్రిలో చేరిస్తే అతడికి తగిన వైద్యం అందించే నైపుణ్యం అన్నిచోట్లా లేదు. అయితే ఈ సామర్థ్యం ఉన్న ఆస్పత్రుల జాబితాను అందుబాటులో ఉంచాలి. కాబట్టి క్షతగాత్రులను ఆస్పత్రులకు చేర్చడమనే వ్యవహారాన్ని మరింత సమర్థతతో నిర్వహించే విధంగా వాతావరణం తయారుకావాలి. విజయవాడ ప్రమాదాన్ని చూసి, ఆ ప్రాంతంలోనే రోడ్డు దుర్ఘటనలు ఎక్కువన్న నిర్ణయం సరికాదు. తెలంగాణ ప్రాంతంలో కూడా ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు, గాయపడటాలు విపరీతంగా పెరిగిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రుడిని ఆస్పత్రికి చేర్చడం ఎంత ముఖ్యమో, అతడికి ఇతర వ్యాధులు సంక్రమించకుండా జాగ్రత్త పడడం కూడా అంతే ముఖ్యం. వారిని ఏ ఆస్పత్రికి తీసుకువెళ్లాలో నిర్ణయించుకోవడం కూడా ప్రధానమైన అంశమే. ఈ వివరాలను ప్రభుత్వాలు ఇంకా అందుబాటులోకి తేవలసి ఉంది. రోడ్డు ప్రమాదంలో గాయపడినవారిని చేర్చే ఆస్పత్రులలో కనీసం ఈ సౌకర్యాలు ఉండాలి. న్యూరోసర్జన్ వెంటనే అందుబాటులోకి రావాలి. ఆర్థోపీడిక్ సర్జన్, అనస్థీటిస్ట్, జనరల్ సర్జన్ కూడా కావాలి. ఇంత వ్యవస్థ ఇవాళ కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులలోనే అందుబాటులో ఉంది. నివారణ సాధ్యమే నిపుణులు చెబుతున్నదాని ప్రకారం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో 85 శాతం నివారించడానికి అవకాశం ఉన్నవే. ప్రమాదాల వల్ల సంభవిస్తున్న మరణాలలో 75 శాతం వరకు నిరోధించగలిగినవే. జరిగే ప్రమాదాలలో అత్యధికం మానవ తప్పిదాల ఫలితమే. అంటే అతి వేగం, మద్యం సేవించి వాహనం నడపడం, సీటు బెల్టుల పట్ల, హెల్మెట్ల పట్ల అశ్రద్ధ, అలసి సొలసి ఉండి కూడా వాహనాలు నడపడం వంటి కారణాల వల్లనే ప్రమాదాలు సంభవిస్తున్నాయి. విజయవాడ దగ్గర జరిగిన బస్సు ప్రమాదం డ్రైవర్ మద్యం సేవించి నడిపినందువల్ల జరిగిందేనని విస్మరించరాదు. రోడ్ల లోపాలు, ఇంజన్ లోపాల కారణంగా కూడా కొన్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. లెసైన్సులు మంజూరు పద్ధతిలో కూడా కఠిన నిబంధనలు, వాటి అమలు అవసరం. ఆఖరికి నగరాలలో వాహనాలు నడిపేవారిలో చాలామంది దగ్గర లెసైన్సులు ఉండవు. సరైన చట్టం, కఠిన నిబంధనలు ఈ లోపాన్ని సరిదిద్దే అవకాశం ఉంది. చిత్రం ఏమిటంటే ఈ రోడ్డు మీద ఎంత వేగంతో వాహనం ప్రయాణించాలన్న అంశం మీద ఇప్పటి వరకు స్పష్టత లేదు. అంటే వేగ పరిమితిని గుర్తించలేదు. చివరిగా ఒకమాట- రోడ్ల నిర్మాణం అభివృద్ధికి అవసరం. అవి రక్తసిక్తం కాకుండా చూసుకుంటేనే అభివృద్ధి కుంటుపడకుండా సాగుతుంది. - డా.దేమె రాజారెడ్డి (వ్యాసకర్త ప్రముఖ వైద్యులు మొబైల్: 98480 18660) -
అత్యవసర వైద్యం...దైన్యం
=గాంధీ, ఉస్మానియాల్లో ఇదీ తీరు.. =ప్రాణాలు పోయని ధర్మాసుపత్రులు =జాడలేని అత్యవసర వైద్య విభాగాలు =దగాపడుతున్న రోగులు =వైద్యం అందక గాల్లో కలుస్తున్న ప్రాణాలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడే వారు ఆ ఆస్పత్రి మెట్లెక్కగలిగితే చాలు.. ప్రాణాలు దక్కినట్టేనని భావిస్తారు.. ఆ గాలి సోకితే పోతుందనుకున్న ప్రాణం నిలుస్తుందని నమ్ముతారు.. అనుకోని విపత్తులు, ఊహించని ప్రమాదాల బారినపడి క్షతగాత్రులైన వారు మొదట చూసేది వాటివైపే... ఆసియా ఖండంలోనే అతిపెద్ద ధర్మాసుపత్రులవి. రోగుల సేవలో దశాబ్దాల ఖ్యాతిని మూటగట్టుకున్నా ఏం లాభం? ఘనతంతా గతం.. వైద్యమందని దైన్యమే నిజం. ఆశలు ఆవిరవుతున్నాయి. నమ్మకం వమ్మవుతోంది. గుప్పెడు ప్రాణాన్ని కాపాడుకునేందుకు వస్తున్న రోగుల్ని ఈ దవాఖానాలు దగా చేస్తున్నాయి. అత్యవసర విభాగం.. కొన ప్రాణంతో వచ్చే వారికి ఆయుష్షు పోయాల్సిన విభాగమిది. అటు గాంధీ.. ఇటు ఉస్మానియా.. రెండుచోట్లా నయం కాని రీతిలో ఈ విభాగాలు నీరసించిపోయాయి. ‘గోల్డెన్ అవర్’గా పిలిచే చివరి క్షణాలు ఈ ఆసుపత్రుల ఆవరణలోనే అంతిమ గడియలుగా మారిపోతున్నాయి. ఇప్పుడక్కడ పేద రోగుల గుండెచప్పుడు వినేవారు లేరు. ఆదుకోవాల్సిన వైద్య నారాయణులే చేతులెత్తేస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: కరీంనగర్ జిల్లా పోతర్లపల్లికి చెందిన బోడం సతీష్ (24) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. రక్తమోడుతున్న అతనిని రెండ్రోజుల క్రితం ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. గంటల తరబడి వైద్యులెవరూ పట్టించుకోలేదు. చేసేది లేక మరో ఆస్పత్రికి వెళ్లిపోయాడు. నగరంలోని వారాసిగూడకు చెందిన చింటూ (22) ఎంఎంటీఎస్ రైలు నుంచి జారి కిందపడితే.. 108లో ఉస్మానియాకు తరలించారు. అత్యవసర విభాగంలో చేరిన అతనిని అరగంటైనా పట్టించుకున్న వైద్యుడే లేడు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రమ్య ఇంట్లో వంట చేస్తూ కాలిన గాయాలకు గురైంది. తీవ్ర విషమస్థితిలో చేరిన ఆమెకు దాదాపు రెండు గంటల వరకు కనీసం ప్రథమ చికిత్స కూడా అందించలేకపోయారు. పేదల దవాఖానాలు ప్రభుత్వ నిర్లక్ష్యంతో దగాపడటమే కాక.. తమనే నమ్ముకుని వస్తున్న రోగుల్ని ఉస్సూరనిపిస్తున్నాయి. ప్రాణాలు పోయాల్సిన ఈ ప్రాంగణాలు వైద్యానికి నోచుకోని రోగుల హాహాకారాలతో హోరెత్తుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు పొరుగునే ఉన్న న ల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్, మెదక్ జిల్లాల నుంచి వివిధ ప్రమాదాలు, విపత్తుల్లో గాయపడిన క్షతగాత్రులందరికీ ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులే పెద్దదిక్కు. ఇటువంటి కేసుల్లో అత్యవసర విభాగాలందించే సేవలే కీలకం. కానీ దురదృష్టవశాత్తూ ఁగోల్డెన్ అవర్రూ.గా పిలిచే సమయమంతా పడిగాపులతోనే హరించుకుపోతోంది. పేదల పెద్దదిక్కుగా చెప్పుకునే ఉస్మానియా ఆస్పత్రి అత్యవసర విభాగానికి రోజూ 250-300 మంది రోగులు వస్తుంటారు. సకాలంలో వైద్యం అందక నెలకు ఇద్దరు నుంచి ముగ్గురు మృత్యువాత పడుతున్నట్లు స్వయంగా ఆస్పత్రి వర్గాలే చెబుతున్నాయి. గాంధీ ఆస్పత్రిలోనూ అదే పరిస్థితి నెలకొంది. అనుకోని ప్రమాదాల్లో పదుల కొద్దీ క్షతగాత్రులు గాయాలపాలై ఇక్కడకు వస్తే.. ఆస్పత్రి సిబ్బంది కిందామీదా పడే దుస్థితి నెలకొంటోంది. నిబంధనలేం చెబుతున్నాయంటే.. అన్ని విభాగాల నిపుణులతో కూడిన అత్యవసర వైద్య విభాగం ఎప్పుడూ అందుబాటులో ఉండాలి జనరల్ ఫిజీషియన్, సర్జన్, ఆర్థోపెడిక్, కిడ్నీ, హృద్రోగ నిపుణుడు, అనెస్థీషియా నిపుణులతో పాటు సహాయకులుగా పీజీలు 24 గంటలూ దశల వారీగా విధుల్లో ఉండేలా చూడాలి ఆస్పత్రిలో విధిగా ట్రామా సెంటర్ ఉండాలి రోగుల నిష్పత్తికి తగినన్ని హైడ్రాలిక్ బెడ్స్‌తో పాటు పారామెడికల్ స్టాఫ్, వార్డ్బోయ్లను నియమించాలి రోగుల తరలింపునకు సరిపడే స్ట్రెచర్లు, ట్రాలీలను నిరంతరం అందుబాటులో ఉంచాలి వెంటిలేటర్లు, మొబైల్ ఆక్సిజన్ సిలిండర్లు వంటివి తప్పనిసరి హృద్రోగుల కోసం ఈసీజీ యంత్రం, క్షతగాత్రుల కోసం ప్రత్యేక ఎక్స్‌రే యంత్రాన్ని ఏర్పాటు చేయాలి సత్వర వైద్య పరీక్షల కోసం ప్రత్యేక ల్యాబ్‌తో పాటు రక్తనిధి కేంద్రం అవసరం ఇదీ ‘అత్యవసర వైద్యం’ తీరు నయం కాని రోగం ఉస్మానియా ఆస్పత్రి ఎమర్జెన్సీ విభాగంలో చేరుతున్న బాధితులకు ప్రాథమిక పరీక్షలు చేసి వెంటనే ఆయా విభాగాలకు తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది సమయానికి సూపర్ స్పెషాలిటీ నిపుణులు అందుబాటులో ఉండట్లేదు. వార్డు బోయ్‌లు, స్ట్రెచర్లు, ఇతర సౌకర్యాలు లే క.. బంధువులే రోగుల్ని భుజాన ఎత్తుకుని తీసుకెళ్తున్నారు శ్వాస సరిగా తీసుకోలేని వారికి వెంటనే వెంటిలేటర్ అమర్చాలి. కానీ అత్యవసర విభాగంలో ఒక్క వెంటిలేటరూ కన్పించడం లేదు హైడ్రాలిక్ బెడ్స్ ఏర్పాటు చేయాల్సిన చోట చిరిగిపోయిన పరుపులు, తుప్పుపట్టిన రేకు మంచాలే దిక్కవుతున్నాయి మొబైల్ ఆక్సిజన్ సిలిండర్లు, హృద్రోగులకు అమర్చే ఈసీజీ లీడ్స్, ఎక్సరే యంత్రాలు మచ్చుకైనా లేవు చూసేందుకే సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ సిష్టమ్.. పనితీరు మాత్రం పడకేస్తోంది బాంబు పేలుళ్లు, భారీ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు పెద్దసంఖ్యలో వచ్చే క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు అవసరమైన అత్యవసరమైన వైద్య విభాగం ఇప్పటికీ లేదు. హే రామ్.. సికింద్రాబాద్‌లోని గాంధీ జనరల్ ఆస్పత్రిలో నిత్యం 1565 మందికిపైగా రోగులు చికిత్స పొందుతుంటారు. అత్యవసర విభాగానికి రోజూ 200 మందికిపైగా రోగులు వస్తుంటారు ఇక్కడ కేవలం 24 పడకలు, ఒక వెంటిలేటర్, ఒక్కోటి చొప్పున ఈసీజీ, ఎక్స్‌రే యంత్రం ఉన్నాయి. వార్డులో సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ సిష్టమ్ ఉన్నా పని చేయట్లేదు క్షతగాత్రులకు సత్వర వైద్యం అందించేందుకు ఏడాది క్రితం ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ ల్యాబ్ మూలనపడింది. చిన్నచిన్న పరీక్షలకు సైతం బయటికి వెళ్లాల్సిందే అత్యవసర విభాగంలో హౌస్సర్జన్ల సేవలే కీలకం. వీరు 250 మంది ఉండగా, నిత్యం 50 మందికిపైగా విధులకు హాజరుకావడం లేదు. నిత్యం 7-8 మంది హౌస్ సర్జన్లు పని చేయాల్సిన చోట ఇద్దరు, ముగ్గురే కన్పిస్తున్నారు ఎమర్జెన్సీకి వచ్చిన క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్సలు చేసి అక్కడి నుంచి ఏఎంసీకి తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది అన్ని విభాగాల్లోని నిపుణులతో ఇటీవల ఎమర్జెన్సీ మెడికల్ విభాగాన్ని ఏర్పాటు చేసినా, నేటికీ అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య నిపుణులకు కొరత లేదు. కానీ, కార్పొరేట్ ఆస్పత్రులతో పోలిస్తే సుశిక్షిత పారామెడికల్ సిబ్బంది, వైద్య పరికరాల కొరత ఉంది. పేదల దవాఖానాల్లో రోగులకు వైద్యం అందకపోవడానికి ప్రభుత్వ వైఖరే కారణం. మందులు, ఆస్పత్రి నిర్వహణకు అవసరమైన బడ్జెట్ కేటాయించట్లేదు. మెడికల్ ల్యాబ్‌లు, సాంకేతిక సిబ్బంది, ఇతర యంత్ర పరికరాలు సమకూర్చడం లేదు. అత్యవసర విభాగాల్లో వైద్యులు అందుబాటులో లేకపోవడానికి అధికారుల ఉదాసీన వైఖరే కారణం. - డాక్టర్ నాగేందర్, తెలంగాణ వైద్యుల సంఘం, ఉస్మానియా శాఖ అధ్యక్షుడు -
‘గోల్డెన్ అవర్’ను వృథా చేయొద్దు!
పంజగుట్ట, న్యూస్‌లైన్: ప్రమాదం జరిగిన వెంటనే స్పందిస్తే రోగి ప్రాణాలు దక్కుతాయని, ఆ కీలక క్షణాలైన ‘గోల్డెన్ అవర్’ వృథా కాకుండా అంబులెన్స్‌కు దారి ఇవ్వాలని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు. 108, అంబులెన్స్‌లకు ట్రాఫిక్‌లో దారి ఇవ్వాలంటూ రికాన్ ఫేస్ సంస్థ నిర్వహించిన ప్రచార కార్యక్రమాన్ని లక్ష్మణ్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ రూపొందిన పోస్టర్, వాహనాలకు అంటించే స్టిక్కర్లను ఆయన ఆవిష్కరించారు. ‘అంబులెన్స్‌కు దారి ఇస్తే ఒక మనిషి ప్రాణాలు కాపాడినవారమవుతాము. మెట్రోరైల్ నిర్మాణ పనులతో పాటు ఇతరత్రా కారణాలతో ట్రాఫిక్ ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి స్థితిలో అందరూ సహకరించాలని’ అని వీవీఎస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ అదనపు కమిషనర్ అమిత్ గార్గ్ కూడా పాల్గొన్నారు. విదేశాల్లో అత్యవసర సేవల కోసం ప్రత్యేక రూట్లు ఉంటాయని, మన దగ్గర మాత్రం ట్రాఫిక్ కారణంగా అనేక మంది మృత్యువాత పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘ట్రాఫిక్‌లో అంబులెన్స్ ఆగితే ఒక్క నిమిషం లోపు పంపాలని మా సిబ్బందిని ఆదేశించాం. ప్రతి ఒక్కరూ మానవత్వంతో సహకరించాలి’ అని అమిత్ గార్గ్ కోరారు. ఈ సందర్భంగా రికాన్ ఫేస్ సంస్థ కృషిని ప్రశంసించిన ఈ ఇద్దరూ సంస్థ ప్రతినిధులు వివేక్వర్ధన్ రెడ్డి, డాక్టర్ రితేశ్, డాక్టర్ నవీన్‌లను అభినందించారు.