చింతూరు: ప్రతిరోజూ మనం నిత్యం వార్తల్లో ఎన్నో రోడ్డు ప్రమాదాల వార్తలు చూస్తుంటాం.. వింటుంటాం. ఆ సమయంలో తక్షణ వైద్యం అందక ప్రాణాలు పోతున్న సంఘటనలు కూడా మన చెవిన పడుతుంటాయి. మనం రహదారిలో ప్రయాణిస్తుంటే ఎన్నో ప్రమాదాలను కళ్లారా చూస్తుంటాం. అయితే ప్రమాదాల బారిన పడిన వారు ప్రాణాపాయ స్థితిలో సాయంకోసం కొట్టుమిట్టాడుతున్నా మనకెందుకెలే అంటూ చూసీచూడనట్లు వెళ్లిపోతాం.
రేపు మనకూ ఇదే పరిస్థితి రావొచ్చని, అప్పుడు మనకు కూడా ఎవరూ సాయం చేయడానికి రాకపోతే మన పరిస్థితి ఏంటనే విషయాన్ని మర్చిపోతాం. పోనీ మానవతా ధృక్పథంతో సాయం చేసినా ఆ తరువాత పోలీసు కేసులు, సాక్ష్యాల కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందనే భయంతో వెనకడుగు వేస్తుంటాం. ఇలాంటి వారిలో భయం పోగొట్టడంతోపాటు ఆపదలో ఆదుకున్న ‘గుడ్ సమారిటన్’లకు రక్షణగా నిలిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
గుడ్ సమారిటన్ అంటే..
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఆ సంఘటనతో ఎలాంటి సంబంధం లేకపోయినా, ఏ ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేసే వ్యక్తిని గుడ్ సమారిటన్ (రక్షకుడు) అంటారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి మొదటి గంట ఎంతో క్లిష్టమైన సమయంగా చెప్పవచ్చు. దీనినే వైద్యభాషలో గోల్డెన్ అవర్ అంటారు. ప్రమాద సమయంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తులకు సకాలంలో వైద్యసాయం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుంటారు. వారికి గంటలోపు సరైన చికిత్స అందించగలిగితే వారి ప్రాణాలు కాపాడేందుకు ఎక్కువ అవకాశాలుంటాయి. ఈ సమయాల్లో గుడ్ సమారిటన్‌ల పాత్ర ఎంతో కీలకమైంది.
అవగాహన కల్పించాలి
ప్రమాదాల సమయంలో గాయపడిన వారిని కాపాడేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలి. అలాంటి వారు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం వారికి రక్షణగా నిలుస్తుంది. గుడ్ సమారిటన్ విధులపై అందరికీ అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– విఠల్, మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్, చింతూరు
చట్టాల ద్వారా రక్షణ
ప్రాణాపాయ స్థితిలో సాయం అందించే గుడ్ సమారిటన్‌లు ఆ తరువాత ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం వారికి చట్టాల ద్వారా రక్షణ కల్పిస్తోంది. ప్రమాదాల గురించి తెలిపినా, గాయపడిన వారిని ఆస్పత్రికి తీసుకొచ్చిన వారిని తమ వ్యక్తిగత సమాచారం తెలపమని పోలీసులు, ఆస్పత్రి సిబ్బంది వత్తిడి చేయరాదు. ఆస్పత్రిలో చేర్చుకునేందుకు అవసరమైన ఫారాలు నింపమని, గాయపడిన వారి వైద్య ఖర్చులు చెల్లించమని, ఆస్పత్రి నుంచి వెంటనే వెళ్లేందుకు వీలుకాదని ఒత్తిడి చేయకూడదు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సాయంచేసిన గుడ్ సమారిటన్‌ను సాక్షిగా ఉండమని పోలీసులు బలవంతం చేయకూడదు. అతను స్వయంగా అంగీకరిస్తేనే సాక్షిగా చేర్చే అవకాశం ఉంటుంది.
నగదు బహుమతితో..
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వెంటనే గంటలోపు ఆస్పత్రికి చేర్చిన గుడ్ సమారిటన్‌లకు ప్రభుత్వం రూ.5 వేలు నగదు బహుమతిగా అందచేస్తోంది. ఒక గుడ్ సమారిటన్ ఒకరు లేదా ఎక్కువ మంది గాయపడిన వారిని రక్షిస్తే అతనికి రూ.ఐదువేలు, ఒకరికంటే ఎక్కువ మంది రక్షిస్తే ఆ సొమ్మును వారికి సమానంగా పంచుతారు. దీనికోసం వైద్యాధికారి నుంచి ప్రమాద వివరాలను ధ్రువీకరించుకున్న పోలీసులు అనంతరం గుడ్ సమారిన్‌కు ఓ రసీదు అందజేస్తారు. ఆ కాపీని కలెక్టర్ అధ్యక్షతన గల కమిటీకి అందజేస్తారు. ఆ కమిటీ గుడ్ సమారిటన్‌ల జాబితాను నగదు చెల్లింపు కోసం రవాణాశాఖ కమిషనర్‌కు సిఫార్సు చేస్తుంది. రవాణాశాఖ కమిషనర్ ద్వారా నేరుగా ఆన్‌లైన్‌లో గుడ్ సమారిటన్ బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ అవుతుంది.
జాతీయస్థాయిలో..
గుడ్ సమారిటన్‌లకు వారి సేవలను గుర్తిస్తూ జాతీయ స్థాయి అవార్డులు కూడా అందజేస్తారు. రాష్ట్రస్థాయి మానిటరింగ్ కమిటీ ఏటా ఈ అవార్డుకు ముగ్గురు ఉత్తమ గుడ్ సమారిటన్ పేర్లను నామినేట్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఏడాదిలో అత్యుత్తమ 10 మంది గుడ్ సమారిటన్లను ఎంపిక చేసి వారికి రూ.లక్ష నగదు బహుమతితో పాటు సర్టిఫికెట్, ట్రోఫీ అందజేస్తుంది.
(చదవండి: పంట కాలువను కబ్జా చేసిన అయ్యన్న)
Comments
Please login to add a commentAdd a comment