సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. గతేడాది 19,456 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 6,746 మంది మరణించగా.. 18,413 మంది క్షతగాత్రులయ్యారు. మరణించిన వారిలో 50% మంది గోల్డెన్ అవర్‌లో ప్రథమ చికిత్స అందించకపోవటం వల్లే మృత్యువాత పడ్డారు. గోల్డెన్ అవర్‌లో క్షతగాత్రులకు వైద్య సహాయం అందించగలిగితే 90 శాతం వరకు ప్రాణాపాయం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని అంచనా.
ఈ నేపథ్యంలో గోల్డెన్ అవర్‌కు ఉన్న ప్రాధాన్యత, ఆ సమయంలో ప్రథమ చికిత్స ఆవశ్యకతను తెలంగాణ ట్రాఫిక్ పోలీసు విభాగం విశ్లేషించింది. రోడ్డు ప్రమాదాలలో క్షతగాత్రుల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ‘గోల్డెన్ అవర్ వాట్సాప్ గ్రూప్‌ల’పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బాధితులకు అవసరమైన ప్రథమ చికిత్స అందించి, స్థానిక ఆసుపత్రికి తరలించడమే ఈ గ్రూప్‌ల లక్ష్యం.
గోల్డెన్ అవర్ అంటే..
ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత మొదటి గంటను ‘గోల్డెన్ అవర్’గా పిలుస్తారు. అంబులెన్స్ చేరుకొని, ఆసుపత్రికి తరలించే లోపు క్షతగాత్రులకు వైద్య సహాయం అందించినట్లయితే ప్రమాద తీవ్రతను బట్టి గాయాల తీవ్రత తగ్గేందుకు, ప్రాణాపాయం తప్పేందుకు అవకాశం ఉంటుంది. మన దేశంలో గోల్డెన్ అవర్‌కు మోటారు వాహన చట్టం–1988లోని సెక్షన్ 2 (12 ఏ) కింద చట్టపరమైన గుర్తింపు కూడా ఉంది.
గుడ్ సామరిటన్స్‌కు శిక్షణ
ఒంటరిగా వాహనంపై వెళ్తున్న వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై గాయపడితే.. తనంతట తానుగా లేచి ప్రథమ చికిత్స చేసుకొని, ఆసుపత్రికి వెళ్లలేని స్థితిలో ఉంటాడు. ఇలాంటి సమయంలో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా క్షతగాత్రుడికి సహాయం చేసేవాళ్లను ‘గుడ్ సామరిటన్స్’గా పిలుస్తారు. అయితే కొన్ని సందర్భాలలో ‘గుడ్ సామరిటన్స్ అందించే ప్రథమ చికిత్స వల్ల క్షతగాత్రుడికి మరింత ఇబ్బందులు, కొన్ని సందర్భాలలో ప్రాణాపాయం కూడా జరుగుతున్నాయి. దీనికి పరిష్కారంగా గుడ్ సామరిటన్స్‌కు రోడ్డు ప్రమాద బాధితులకు అందించాల్సిన ప్రథమ చికిత్సలపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు కొన్నిచోట్ల శిక్షణ ప్రారంభమైంది. అలాగే ఎస్పీలు, డీసీపీల ఆధ్వర్యంలో గోల్డెన్ అవర్ వాట్సాప్ గ్రూప్‌లు క్రియేట్ చేసి ఈ గుడ్ సామరిటన్స్‌ను సభ్యులుగా చేర్చుకుంటున్నారు.
గ్రూప్‌లో ఎవరెవరుంటారు?
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సాధారణంగా ఆ చుట్టుపక్కలవారే స్పందిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే రోడ్ల వెంబడి దాబాలు, హోటళ్లు, పంక్చర్ షాపులు, మెడికల్ షాపులు, పెట్రోల్ బంక్‌లు, కిరాణా దుకాణాలు, టీ స్టాళ్ల నిర్వాహకులు, ఎన్‌జీవోలకు చెందిన వారిని గోల్డెన్ అవర్ వాట్సాప్ గ్రూప్‌లో సభ్యులుగా పరిగణనలోకి తీసుకుంటారు. స్థానిక ట్రాఫిక్ పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) వీరి ఎంపిక బాధ్యత తీసుకుంటారు. సైబరాబాద్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (టీటీఐ), సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) సంయుక్తంగా ఇప్పటివరకు 800కు పైగా గుడ్ సమారిటన్స్‌కు శిక్షణ ఇచి్చనట్లు ఓ ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు, చట్టాలపై అవగాహన కలి్పంచడంతో పాటు బీఎల్‌ఎస్ (బేసిక్ లైఫ్ సపోర్ట్), సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) వంటి ప్రథమ చికిత్సలపై శిక్షణ ఇస్తున్నామని వివరించారు.
వీరు ఏం చేస్తారంటే..
రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి క్షతగాత్రులకు అధిక రక్తస్రావం కాకుండా కట్టుకట్టడం, సీపీఆర్ వంటి ప్రథమ చికిత్స అందిస్తారు. పోలీసులు, బాధితుల కుటుంబాలకు సమాచారం అందించి, క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో చేర్చుతారు. అలాగే ఏదైనా వాహనం అతివేగంగా వెళ్తున్నట్లు గుర్తిస్తే.. వెంటనే ఆ ప్రాంతం, వాహనం నంబరు వివరాలను గోల్డెన్ అవర్ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేస్తారు. స్థానిక పోలీసులు వెంటనే స్పందించి ఆ వాహనాన్ని నిలువరించేందుకు చర్యలు తీసుకుంటారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్.. రాహుల్, ఖర్గే ఏం చెప్పారు?
Comments
Please login to add a commentAdd a comment