injured public
-
మీరూ 'రక్షకుడు' కావొచ్చు
చింతూరు: ప్రతిరోజూ మనం నిత్యం వార్తల్లో ఎన్నో రోడ్డు ప్రమాదాల వార్తలు చూస్తుంటాం.. వింటుంటాం. ఆ సమయంలో తక్షణ వైద్యం అందక ప్రాణాలు పోతున్న సంఘటనలు కూడా మన చెవిన పడుతుంటాయి. మనం రహదారిలో ప్రయాణిస్తుంటే ఎన్నో ప్రమాదాలను కళ్లారా చూస్తుంటాం. అయితే ప్రమాదాల బారిన పడిన వారు ప్రాణాపాయ స్థితిలో సాయంకోసం కొట్టుమిట్టాడుతున్నా మనకెందుకెలే అంటూ చూసీచూడనట్లు వెళ్లిపోతాం. రేపు మనకూ ఇదే పరిస్థితి రావొచ్చని, అప్పుడు మనకు కూడా ఎవరూ సాయం చేయడానికి రాకపోతే మన పరిస్థితి ఏంటనే విషయాన్ని మర్చిపోతాం. పోనీ మానవతా ధృక్పథంతో సాయం చేసినా ఆ తరువాత పోలీసు కేసులు, సాక్ష్యాల కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందనే భయంతో వెనకడుగు వేస్తుంటాం. ఇలాంటి వారిలో భయం పోగొట్టడంతోపాటు ఆపదలో ఆదుకున్న ‘గుడ్ సమారిటన్’లకు రక్షణగా నిలిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. గుడ్ సమారిటన్ అంటే.. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఆ సంఘటనతో ఎలాంటి సంబంధం లేకపోయినా, ఏ ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేసే వ్యక్తిని గుడ్ సమారిటన్ (రక్షకుడు) అంటారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి మొదటి గంట ఎంతో క్లిష్టమైన సమయంగా చెప్పవచ్చు. దీనినే వైద్యభాషలో గోల్డెన్ అవర్ అంటారు. ప్రమాద సమయంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తులకు సకాలంలో వైద్యసాయం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుంటారు. వారికి గంటలోపు సరైన చికిత్స అందించగలిగితే వారి ప్రాణాలు కాపాడేందుకు ఎక్కువ అవకాశాలుంటాయి. ఈ సమయాల్లో గుడ్ సమారిటన్ల పాత్ర ఎంతో కీలకమైంది. అవగాహన కల్పించాలి ప్రమాదాల సమయంలో గాయపడిన వారిని కాపాడేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలి. అలాంటి వారు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం వారికి రక్షణగా నిలుస్తుంది. గుడ్ సమారిటన్ విధులపై అందరికీ అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – విఠల్, మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్, చింతూరు చట్టాల ద్వారా రక్షణ ప్రాణాపాయ స్థితిలో సాయం అందించే గుడ్ సమారిటన్లు ఆ తరువాత ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం వారికి చట్టాల ద్వారా రక్షణ కల్పిస్తోంది. ప్రమాదాల గురించి తెలిపినా, గాయపడిన వారిని ఆస్పత్రికి తీసుకొచ్చిన వారిని తమ వ్యక్తిగత సమాచారం తెలపమని పోలీసులు, ఆస్పత్రి సిబ్బంది వత్తిడి చేయరాదు. ఆస్పత్రిలో చేర్చుకునేందుకు అవసరమైన ఫారాలు నింపమని, గాయపడిన వారి వైద్య ఖర్చులు చెల్లించమని, ఆస్పత్రి నుంచి వెంటనే వెళ్లేందుకు వీలుకాదని ఒత్తిడి చేయకూడదు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సాయంచేసిన గుడ్ సమారిటన్‌ను సాక్షిగా ఉండమని పోలీసులు బలవంతం చేయకూడదు. అతను స్వయంగా అంగీకరిస్తేనే సాక్షిగా చేర్చే అవకాశం ఉంటుంది. నగదు బహుమతితో.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వెంటనే గంటలోపు ఆస్పత్రికి చేర్చిన గుడ్ సమారిటన్లకు ప్రభుత్వం రూ.5 వేలు నగదు బహుమతిగా అందచేస్తోంది. ఒక గుడ్ సమారిటన్ ఒకరు లేదా ఎక్కువ మంది గాయపడిన వారిని రక్షిస్తే అతనికి రూ.ఐదువేలు, ఒకరికంటే ఎక్కువ మంది రక్షిస్తే ఆ సొమ్మును వారికి సమానంగా పంచుతారు. దీనికోసం వైద్యాధికారి నుంచి ప్రమాద వివరాలను ధ్రువీకరించుకున్న పోలీసులు అనంతరం గుడ్ సమారిన్‌కు ఓ రసీదు అందజేస్తారు. ఆ కాపీని కలెక్టర్ అధ్యక్షతన గల కమిటీకి అందజేస్తారు. ఆ కమిటీ గుడ్ సమారిటన్ల జాబితాను నగదు చెల్లింపు కోసం రవాణాశాఖ కమిషనర్‌కు సిఫార్సు చేస్తుంది. రవాణాశాఖ కమిషనర్ ద్వారా నేరుగా ఆన్లైన్లో గుడ్ సమారిటన్ బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ అవుతుంది. జాతీయస్థాయిలో.. గుడ్ సమారిటన్లకు వారి సేవలను గుర్తిస్తూ జాతీయ స్థాయి అవార్డులు కూడా అందజేస్తారు. రాష్ట్రస్థాయి మానిటరింగ్ కమిటీ ఏటా ఈ అవార్డుకు ముగ్గురు ఉత్తమ గుడ్ సమారిటన్ పేర్లను నామినేట్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఏడాదిలో అత్యుత్తమ 10 మంది గుడ్ సమారిటన్లను ఎంపిక చేసి వారికి రూ.లక్ష నగదు బహుమతితో పాటు సర్టిఫికెట్, ట్రోఫీ అందజేస్తుంది. (చదవండి: పంట కాలువను కబ్జా చేసిన అయ్యన్న) -
గొర్రెల కాపరిపై లిక్విడ్‌తో గుర్తు తెలియని వ్యక్తుల దాడి
రఘునాథపల్లి : గొర్రెలు మేపుతున్న ఓ కాపరిపై గుర్తు తెలియని వ్యక్తులు లిక్విడ్ చల్లి హత్యాయత్నం చేసిన సంఘటన మండలంలోని అశ్వరావుపల్లి శివారులో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. అశ్వరావుపల్లి శివారులోని వ్యవసాయ పొలాల వద్ద గ్రామానికి చెందిన గాజుల రాజు అనే గొర్రెల కాపరి గొర్రెలు మేపుతున్నాడు. మధ్యాహ్నం 2.30 నిమిషాల సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తమ వెంట ప్లాస్టిక్ బాటిల్లో తెచ్చుకున్న లిక్విడ్ (ద్రావకం) చల్లారు. నెత్తికి రుమాలు చుట్టుకోవడంతో లిక్విడ్ మొఖంపై ఎక్కువగా పడలేదు. కళ్లలో పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. దీంతో పాటు రాజు గొంతు నులిమేందుకు ఆ వ్యక్తులు ప్రయత్నించగా కొద్ది దూరంలో ఉన్న వేరొక గొర్ల కాపరి గుర్తించి అరవడంతో ఆగంతకులు పారిపోయారు. గాయాలతో రోదిస్తున్న రాజును స్థానికులు జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎస్సై రంజిత్‌రావు ఆసుపత్రికి చేరుకొని బాధితుడి నుంచి వివరాలు సేకరించి విచారణ కొనసాగిస్తున్నారు. పట్టపగలే అఘాయిత్యం.. గొర్రెలు మేపుతున్న రాజుపై పట్టపగలే అఘాయిత్యానికి పాల్పడటం గ్రామంలో కలకలం రేపింది. కొద్ది దూరంలో ద్విచక్రవాహనం నిలిపిన దుండగులు కాలినడకన రాజు వద్దకు చేరుకున్నారు. దుండగులు వెంట తెచ్చుకున్న లిక్విడ్ యాసిడ్‌గా బావించారా ..? చల్లిన వెంటనే ఒంటిపై గాయాలు కాకపోవడంతో గొంతు నులిపి హత్యచేసేందుకు యత్నించడం వెనుక బలమైన కారణం ఉన్నట్లు గ్రామస్తులు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. రాజుకు తొమ్మిది సంవత్సరాల క్రితం అలేరు మండలానికి చెందిన ఓ మహిళతో వివాహం జరిగింది. భార్యభర్తల మధ్య ఏర్పడిన వివాదాలు, పలు కారణాలతో రెండేళ్ల క్రితం దూరమయ్యారు. ఆరు నెలల క్రితం అదే మండలంలోని కొలనుపాకకు చెందిన జ్యోతితో వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో కుటుంబ కలహాలతో దాడి జరిగిందా..? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. బాధితుడిపై చల్లింది యాసిడా ..? ఇతర ఏ లిక్విడ్ అన్నది ఆరా తీస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై రంజిత్‌రావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. జనగామ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజును ఎంపీపీ దాసరి అనిత పరామర్శించారు. -
లాఠీ..చార్జ్
పంపాదిపేటవాసులపై విరుచుకుపడిన పోలీసులు ‘దివీస్’ పనులను అడ్డుకున్నవారి అరెస్టుకు యత్నం దొరికినవారిని దొరికినట్టు చితకబాదిన వైనం ప్రతిఘటించిన బాధిత ప్రజలు పలువురికి తీవ్ర గాయాలు సామాన్యులకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు పాలకుల ఒత్తిడితో కర్కశత్వాన్ని ప్రదర్శించారు. తొండంగి మండలంలో ఏర్పాటు చేస్తున్న దివీస్ ల్యాబొరేటరీస్ రసాయన పరిశ్రమకు వ్యతిరేకంగా ఉద్యమించిన పంపాదిపేట వాసులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీనిని ప్రతిఘటించిన గ్రామస్తులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. దొరికినవారిని దొరికినట్టు చితకబాదారు. ఈ లాఠీచార్జిలో సుమారు పదిమంది గాయపడ్డారు. వారిలో ముగ్గురు తుని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధిత ప్రజలకు తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మద్దతు తెలిపారు. తుని/తొండంగి : ప్రజల మనోగతానికి భిన్నంగా ప్రభుత్వం మొండి పట్టుదలతో దివీస్ ల్యాబొరేటరీస్ పరిశ్రమ ఏర్పాటుకు చేస్తున్న యత్నాలు.. తొండంగి మండలం కోన ప్రాంతంలో ఆరని చిచ్చు రగిలిస్తున్నాయి. పంపాదిపేట సమీపాన దివీస్ లేబ్స్ చేపట్టిన జంగిల్ క్లియరెన్స్ పనులను ఆ గ్రామంతో పాటు తాటియాకులపాలెం, కొత్తపాకలు గ్రామస్తులు ఆదివారం ప్రతిఘటించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వైఎస్సార్ సీపీకి చెందిన ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతోపాటు మరో 23 మందిపై అక్రమంగా కేసులు నమోదు చేశారు. పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా పంపాదిపేటలో ఉద్యమిస్తున్న వారిలో ప్రధానమైనవారిని లక్ష్యంగా చేసుకుని అరెస్టులు చేసేందుకు పోలీసులు సోమవారం ప్రయత్నించడం మరోమారు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో పోలీసులు చేసిన లాఠీచార్జిలో పలువురు గాయపడ్డారు. తొలుత తుని పట్టణ సీఐ అప్పారావు, రూరల్ సీఐ చెన్న కేశవరావు, తొండంగి, కోటనందూరు, తుని రూరల్ ఎస్సైలతోపాటు అధిక సంఖ్యలో పోలీసులు హఠాత్తుగా పంపాదిపేట చేరుకున్నారు. గ్రామంలో దొరికినవారిని దొరికినట్టు లాక్కొచ్చి జీపులు, వ్యానుల్లో ఎక్కించారు. దీనిని ప్రతిఘటించినవారిపై విచక్షణారహితంగా లాఠీచార్జి చేశారు. మహిళలని కూడా చూడకుండా చితకబాదడంతో పలువురు గాయపడ్డారు. ఈ క్రమంలో నేమాల లోవరాజు, మట్ల రామకృష్ణ, కుమ్మరి లక్ష్మి, తలపంటి మణితల్లి, మరికొందరిని పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి జీపులో ఎక్కించారు. దీంతో గ్రామస్తులంతా ఏకమై పోలీసు వాహనానికి అడ్డుపడ్డారు. రోడ్డుపై బైఠాయించారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీనికి ససేమిరా అన్న గ్రాస్తులు జీపులో ఎక్కించినవారిని తక్షణం విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్ధితి నెలకొంది. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. పంపాదిపేట ప్రజలతో చర్చించారు. సమస్యను పక్కతోవ పట్టించేం దుకు పోలీసుల ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందని, సంయమనం పాటించాలని చెప్పారు. తమకు వివాదం పోలీసులతో కాదని, పరిశ్రమ యాజమాన్యానికి, పేద రైతులకు మధ్య వచ్చిన భూముల తగాదాను శాంతిభద్రతల సమస్యగా సృష్టించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందీ తలెత్తకుండా సమస్యలపై పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ప్రజలు శాంతించారు. దివీస్ పరిశ్రమకు సంబంధించి ఎటువంటి పనులు జరిగినా ప్రతిఘటిస్తామని, పరిశ్రమ తరలిపోయేవరకూ ఊరుకునేది లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలని కూడా చూడకుండా లాఠీలతో కొట్టించడం అన్యాయమని బాధితులు ఎమ్మెల్యే వద్ద వాపోయారు. గాయపడినవారిని ఎమ్మెల్యే తన వాహనంలో తుని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వారిని పరామర్శించి, ధైర్యం చెప్పారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చెయ్యొద్దు అమాయకులపై కేసులు పెట్టడం అన్యాయమని, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దని పెద్దాపురం డీఎస్పీ రాజేశ్వరరావుకు ఎమ్మెల్యే రాజా సూచించారు. అక్రమ అరెస్టులకు పాల్పడితే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని, అది ప్రజలకు, ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుందని అన్నారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్సీపీ తొండంగి మండల నాయకులు పేకేటి సూరిబాబు, మద్దుకూరి వెంకటరామయ్య చౌదరి, మేరుగు ఆనందహరి, యనమల వరహాలు, జిల్లా కమిటీ సభ్యుడు పేకేటి రాజేష్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బీఎన్ రాజు, యూత్ కన్వీనర్ ఆరుమిల్లి ఏసుబాబు, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ శివకోటి ప్రకాష్ తదితరులున్నారు. దళితులపై దాడులను సహించేది లేదు దివీస్ పరిశ్రమను వ్యతిరేకిస్తున్న ప్రజలపై పోలీసులు దాడి చేయడం అన్యాయమని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు బీఎన్ రాజు అన్నారు. భయభ్రాంతులకు గురి చేస్తూ, ప్రజల హక్కులను కాలరాయాలని చూస్తే జిల్లావ్యాప్తంగా దళితులంతా ఏకమై ఉద్యమిస్తామని హెచ్చరించారు. లాఠీలతో కొట్టి లాక్కెళ్లారు పోలీసులు ఒక్కసారిగా గ్రామంలోకి వచ్చి దొరికినవారిని దొరికినట్టు లాక్కెళ్లారు. నా వీపుపై తీవ్ర గాయాలయ్యేలా కొట్టారు. మహిళలని కూడా చూడకుండా పోలీసులు కొట్టడం అన్యాయం. మమ్మల్ని ఏం చేసినా సరే పరిశ్రమను పెట్టనిచ్చేదిలేదు. – మచ్చర్ల మాణిక్యం, పంపాదిపేట దారుణం గ్రామంలో ఎప్పుడూ ఇంత దారుణం జరగలేదు. అంతమంది పోలీసులు వచ్చి గ్రామస్తులను లాక్కెళ్లారు. నన్ను కొట్టి లాక్కెళ్తుండగా మెడలో బంగారు వస్తువులు కూడా పోయాయి. ఏం నేరం చేశామని మమ్మల్ని ఇన్ని బాధలు పెడుతున్నారు? – మచ్చర్ల వెంకటలక్ష్మి, పంపాదిపేట