గోల్డెన్ అవర్... ఉన్నది 60 నిమిషాలు. | Golden Hour ... is 60 minutes. | Sakshi
Sakshi News home page

గోల్డెన్ అవర్... ఉన్నది 60 నిమిషాలు.

Published Wed, Dec 7 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 10:09 PM

గోల్డెన్ అవర్... ఉన్నది 60 నిమిషాలు.

గోల్డెన్ అవర్... ఉన్నది 60 నిమిషాలు.

గోల్డెన్ అవర్... ఉన్నది 60 నిమిషాలు. అంతకంటే ఒక నిమిషం లేట్ వెళ్లినా ఫెయిల్ అయినట్టే.ఇది ఎంసెట్ పరీక్ష కాదు. జీవితం పరీక్ష. పరుగు పరీక్ష కోసం కాదు. ప్రాణం కోసం. ఎప్పుడూ హార్ట్ ఎటాక్‌లు ఇతరులకే రావు.ఎదుర్కోడానికి మనం సంసిద్ధంగా ఉండాలి. బీ రెడీ. డోంట్ వర్రీ  గుండెపోటు వస్తే యమపాశం తాకకుండా  యమ అర్జెన్సీగా గుండెను కాపాడుకోవడం కోసం ఈ ప్రత్యేక కథనం.
 

సాధారణంగా మరేదైనా సమస్య వస్తే... హాస్పిటల్‌కు తరలించే లోపు మన ప్రమేయం లేకుండానే కొంత జాప్యం జరిగినా పెద్దగా నష్టం లేదు. కానీ గుండెపోటు వస్తే గోల్డెన్ అవర్‌గా పరిగణించే ఆ బంగారు క్షణాల్లో రోగిని హాస్పిటల్‌కు తరలించలేకపోతే కష్టం. అయితే ఒక్కోసారి గుండెపోటును సత్వరం గుర్తించలేకపోవచ్చు. చాలా మంది దీన్ని గ్యాస్ సమస్యగా పరిగణించి రోగిని హాస్పిటల్‌ను తీసుకెళ్లడంలో ఆలస్యం చేస్తుంటాం. అందుకే గుండెపోటును స్పష్టంగా గుర్తించడం, దానికి గురైన వాళ్ళ ప్రాణాలు నిలడం ఎలాగో తెలుసుకోడానికి ఉపయోగపడేదే ఈ కథనం.

గుండెపోటు లక్షణాలు!
గుండెపోటు వచ్చిన సమయంలో గుండెనొప్పి వచ్చే అవకాశం కొంతమందిలో ఉంటుంది. మరికొంత మందిలో గుండెను నొక్కేసినట్లుగా, గుండెను పిండేసినట్లుగా నొప్పి రావచ్చు. ఇంకొంతమందిలో గుండెపోటు వచ్చినప్పుడు రోగుల్లో గుండె నొప్పి లేకుండా కేవలం ఛాతీలో బరువుగా మాత్రమే ఉండవచ్చు. కొన్నిసార్లు ఛాతీలో మంటగా ఉండవచ్చు. ఈ నొప్పిగానీ, మంటగానీ... ఛాతీ ముందుభాగం నుంచి ఎడమవైపునకు పాకుతున్నట్లుగా ఉండవచ్చు.

కొన్నిసార్లు ఎడమ భుజం, ఎడమ చేయి నొప్పిగా ఉండటం కూడా జరుగుతుండవచ్చు. ఈ తరహా నొప్పి దాదాపు అరగంట మొదలుకొని, కొన్ని గంటలపాటు వస్తుండవచ్చు. ఈ నొప్పి తీవ్రత రకరకాలుగా ఉంటుంది. కొన్నిసార్లు భరించగలిగేంతగా ఉండవచ్చు. మరికొందరిలో ఇది చాలా తీవ్రంగా, ఏ మాత్రం భరించలేనంతగా కూడా ఉండవచ్చు. నొప్పి, మంట వచ్చినప్పుడు దానితో పాటు చెమటలు కూడా పట్టవచ్చు. ఇవన్నీ గుండెపోటు వచ్చినప్పుడు కనిపించే సాధారణ (క్లాసికల్) లక్షణాలు. కాకపోతే గుండెపోటు వచ్చిన ప్రతి ఒక్కరిలోనూ ఈ క్లాసికల్ లక్షణాలు కనిపించకపోవచ్చు.

కొంతమందిలో కనిపించే అసాధారణ లక్షణాలు...
కొంతమంది రోగుల్లో సాధారణ గుండెపోటు లక్షణాలు ఏవీ కనిపించకపోవచ్చు. ఉదాహరణకు మహిళల్లోనూ, షుగర్ ఉన్నవారిలోనూ, కొంతమంది మగవారిలోనూ గుండెపోటు లక్షణాలు కాస్తంత వేరుగా ఉండవచ్చు. డయాబెటిస్ ఉన్నవారిలో నొప్పి తెలియడం ఒకింత తక్కువ. కాబట్టి ఈ గుండెనొప్పి కూడా తెలియక ముందే జరగాల్సిన అనర్థం జరిగిపోవచ్చు.

ఇక మరికొంతమందిలో గుండెపోటు వచ్చినప్పుడు  ఛాతీలో నొప్పి లేకుండా కేవలం కింది దవడ భాగంలో నొప్పి ఉండవచ్చు. కడుపులోనూ నొప్పిగా ఉండవచ్చు. దవడ కింది భాగం (లోవర్ జా) మొదలుకొని బొడ్డు (అంబ్లికస్) వరకు ఎక్కడైనా నొప్పి కనిపించవచ్చు. అంటే... ఉదాహరణకు దవడ, మెడ, భుజం, చేతులు, పొట్ట... ఇలా నొప్పి రావచ్చు. ఇది ఛాతీ నొప్పితో పాటు, ఒక్కోసారి ఛాతీలో నొప్పి లేకుండా కూడా రావచ్చు. అందుకే కొందరిలో కడుపులో వచ్చే నొప్పిని సాధారణంగా గుండెపోటు వల్ల వచ్చే నొప్పిగా గాక... అసిడిటీ వల్ల వచ్చే నొప్పిగా అపోహ పడే అవకాశం ఎక్కువ.

అయితే అందరిలోనూ గుండెపోటు లక్షణాలు ఒకే మాదిరిగా ఉండకపోవచ్చు. గుండెపోటుకు లక్షణాలుగా పరిగణించే అంశాలు ఒకటిగాని, రెండుగాని, లేదా అంతకు మించిగాని కలగలసి ఉండవచ్చు. అవి...  కొద్దిపాటి శ్రమపడ్డా లేదా ఒక్కోసారి శ్రమపడకపోయినా ఊపిరి అందనంత ఆయాసం  తలంతా తేలికైనట్లుగా అనిపించవచ్చు. ఒక్కోసారి స్పృహ కోల్పోవచ్చు  ఇక ఏ చిన్నపాటి పని కూడా చేయలేనంత నిస్సత్తువ ఆవరించవచ్చు  అకస్మాత్తుగా అజీర్ణం వికారం, వాంతులు  పక్షవాతం లక్షణాలు.

చాలామంది చికిత్సను ఎందుకు ఆలస్యం చేస్తుంటారు?
చాలామంది తమకు కనిపించిన కొద్దిపాటి లక్షణాల్లో గుండెపోటు సాధారణ లక్షణాలు కనిపించకపోవడంతో దాన్ని గుర్తించలేక చికిత్సకు ఆలస్యం చేస్తుంటారు. ఉదాహరణకు కడుపు నొప్పి, కడుపులో మంట వస్తే దాన్ని అసిడిటీ తాలూకు లక్షణంగా భావించి సరిపెట్టుకుంటారు తప్ప... ఒకసారి ఈసీజీ తీయించి గుండెపోటు అయ్యేందుకు ఉన్న అవకాశాన్ని నిర్ధారణ చేసుకోరు. కొన్నిసార్లు అవి గుండెపోటు లక్షణాలని గుర్తిండానికి వీల్లేనంత తక్కువ తీవ్రతతో ఉండవచ్చు. అలాంటప్పుడు రోగి ఆ నొప్పిని నిర్లక్ష్యం చేసే అవకాశాలు చాలా ఎక్కువ. అయితే చాలా సందర్భాల్లో  గుండెపోటుగా భావించిన లక్షణాలు... వైద్య పరీక్షల తర్వాత  గుండెపోటు కాదని తేలడం కూడా మామూలే.

అందుకే కొంతమంది అతిగా ఆందోళన చెంది గుండెపోటు అనే అనుమానంతో ఆసుపత్రికి వెళ్లాక, తీరా అది గుండెపోటు కాదని తెలిశాక తొలుత తమ తొందరపాటు వల్ల అందరికీ ఇబ్బంది కలిగిస్తామేమో అనే అభిప్రాయంతో మొహమాటపడి ఆసుపత్రికి వెళ్లరు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలో ఉంచుకుని... గుండెపోటును ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకూడదు. ఏమాత్రం ఇబ్బందిగా అనిపించినా తొలుత వైద్య పరీక్షలు చేయించుకుని, అది గుండెపోటు కాదని నిర్ధారణ చేసుకుని అప్పుడు మాత్రమే నిశ్చింతగా ఉండాలి.

ఆసుపత్రిలో గుండెపోటు చికిత్స జరిగే తీరు...
గుండెపోటు అని ఆసుపత్రికి వచ్చిన రోగికి ఇవ్వాల్సిన సాధారణ మందులతో పాటు... రోగి తాలూకు గుండె కండరానికి రక్తసరఫరా మామూలుగా అయ్యేందుకు వీలుగా చికిత్స చేస్తారు. ఈ చికిత్స రెండు విధాలుగా చేయవచ్చు.
 
1)  తక్షణం యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ చేయడం.
2 ) రక్తనాళాల్లో గడ్డకట్టి ఉన్న రక్తాన్ని కరిగించే మందులివ్వడం (థ్రాంబోలైటిక్స్)

క్యాథ్‌ల్యాబ్ సౌకర్యం ఉన్న ఆసుపత్రిలో అత్యవసర ప్రాతిపదికపై యాంజియోగ్రామ్ నిర్వహించి అవసరాన్ని బట్టి అడ్డంకి ఉన్న రక్తనాళంలోని అడ్డంకిని సత్వరం  తొలగించడానికి బెలూన్ యాంజియోప్లాస్టీతో పాటు అవసరమైతే స్టెంట్ వేస్తారు. ఇది చాలామంది రోగులకు మంచి ఫలితాలను ఇస్తుంది.

ఒకవేళ క్యాథ్‌ల్యాబ్ సౌకర్యం లేని ఆసుపత్రికి రోగిని తీసుకెళ్లినట్లయితే తక్షణ చికిత్సగా రక్తనాళాల్లో గడ్డగట్టి ఉన్న రక్తపు గడ్డను కరిగించే మందులు (థ్రాంబోలైటిక్స్) ఇస్తారు. అయితే ఈ రెండింటిలోనూ యాంజియోప్లాస్టీ అన్న ప్రక్రియ ప్రభావపూర్వకమైనది. ఎందుకంటే థ్రాంబోలైటిక్స్ ఇచ్చాక అది పూర్తిస్థాయిలో పనిచేయడానికి 60 నుంచి 90 నిమిషాల వ్యవధి అవసరం. అందుకే పై రెండింటిలోనూ క్యాథ్‌ల్యాబ్ సౌకర్యం ఉన్నచోట వైద్యులు  మొదటిదానికే ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే ఈ రెండు చికిత్సల్లో ఏది చేసినా గుండెపోటు వచ్చిన తర్వాత ఎంత త్వరగా ఈ చికిత్స జరిగిందనే దాన్ని బట్టి ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అందుకే రోగి ఎంత త్వరగా ఆసుపత్రికి చేరుకున్నాడు అనేది చాలా ప్రధానమైన విషయం.

గుండెపోటు తర్వాత సత్వర చికిత్స ఎందుకు?
దీనికి సమాధానం తెలుసుకోవాలంటే గుండెపోటు సమయంలో గుండెకు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. మనలోని ప్రతి అవయవానికి నిరంతరం రక్తం సరఫరా అయి తీరాలి. గుండెకు కూడా. గుండెకు రక్తం అందించే రక్తనాళాల్లో ఏదైనా అకస్మాత్తుగా మూసుకుపోతే గుండె కండరానికి రక్తసరఫరా నిలిచిపోయి రక్తం ద్వారా అందాల్సిన ఆక్సిజన్, పోషకాలు అందవు. దాంతో గుండె కండరం దెబ్బతినడం మొదలవుతుంది. అలాంటప్పుడు ఆరు నుంచి పన్నెండు గంటల్లో దానికి అందాల్సిన పాళ్లలో రక్తసరఫరాను పునరుద్ధరించలేకపోతే... ఇకపై మళ్లీ ఎప్పటికీ కోలుకోలేనంతగా శాశ్వతంగా గుండె కండరం చచ్చుబడిపోతుంది. ఒకసారి గుండెకండరం శాశ్వతంగా చచ్చుబడితే... దాని వల్ల శరీరంలోని మిగతా అన్ని అవయవాలకూ రక్తం అందకుండాపోయిన మనిషి చనిపోయే ప్రమాదం ఉంది.

అందుకే ఎంత త్వరగా గుండెకు రక్తసరఫరాను పునరుద్ధరించగలిగితే అంత మంచిది. ఎంత త్వరగా గుండె కండరాన్ని చచ్చుబడకుండా చూస్తే అంత సమర్థంగా రోగికి  మరణాన్ని తప్పించినట్లవుతుంది. గుండె పంపింగ్ దెబ్బతినకుండా ఉండేలా ఎంత త్వరగా చికిత్స అందిస్తే దీర్ఘకాలంలో వారు అంత నాణ్యమైన జీవితాన్ని (క్వాలిటీ లైఫ్)ను గడిపేందుకు అవకాశం ఉంది. అందుకే గుండెపోటు వచ్చినప్పుడు త్వరగా చికిత్స అందడానికి అంత ప్రాధాన్యం ఉందని అర్థం చేసుకోవాలి. అయితే ఒక్కోసారి గుండెపోటు లక్షణాల విషయంలో రోగికి ఉండే అపోహలతో ఒక్కోసారి దాన్ని సరిగా గుర్తించలేక ఆసుపత్రికి వెళ్లాల్సిన సమయంలో వెళ్లకపోతే... ఈలోపే జరగకూడని అనర్థం జరిగిపోవచ్చు.
 
సెలైంట్ హార్ట్ ఎటాక్
గుండెపోటు లక్షణాలు ఏమీ లేకుండా కూడా గుండెపోటు (సెలైంట్ హార్ట్ ఎటాక్) రావచ్చు. ఇలాంటివారిలో రొటీన్ చెకప్‌లో భాగంగా పరీక్షలు చేసినప్పుడే వాళ్లకు గుండెపోటు వచ్చిందని తెలుస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో ఇలాంటి సెలైంట్ హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే షుగర్ ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం.
 
 
గుండెపోటు అని అనుమానిస్తున్నప్పుడు ఏం చేయాలి?
గుండెపోటు వచ్చిందేమోనని రోగి అనుమానిస్తున్నప్పుడు వెంటనే హాస్పిటల్‌కు బయల్దేరాలి. చేస్తున్న పనిని ఆపేయాలి. నడవకూడదు.ఆ టైమ్‌లో డ్రైవింగ్ చేస్తుంటే, రోగి వాహనం నడపకూడదు. పక్కవారి సహాయంతో వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాలి.అంతకు ముందే తమకు గుండెజబ్బు ఉన్నవారైతే సార్బిట్రేట్ మాత్రలను తమ వద్ద ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే ఆ మాత్రను నాలుక కింద పెట్టుకోవాలి. అయితే సార్బిట్రేట్ టాబ్లెట్స్‌తో బ్లడ్‌ప్రెషర్ అమాంతం పడిపోయే ప్రమాదం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి.గుండెపోటు అని అనుమానించగానే వెంటనే ఆస్పిరిన్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. పై జాగ్రత్తలు తీసుకుంటూనే తక్షణం హాస్పిటల్‌కు వెళ్లాలి.

- డాక్టర్ వి. సూర్యప్రకాశ్ రావు 
సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ - హెచ్‌ఓడి  అపోలో హాస్పిటల్స్,
హైదర్‌గూడ, హైదరాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement