కోవిడ్ మహమ్మారి అనంతరం యువజనులు, పిల్లల్లోనూ హార్ట్‌ఎటాక్‌లు
పరీక్షలపై నిర్లక్ష్యం.. జబ్బు ముదిరాకే బయటపడుతున్న కేసులు
సీటీ స్కాన్, కార్డియాక్ ఎవాల్యూవేషన్ లేకనే ఇబ్బందులు...
ఆరోగ్యకరమైన గుండె కోసం రెగ్యులర్ చెకప్‌లు, హార్ట్‌కేర్‌లో టెక్నాలజీని ఉపయోగించుకోవడం ముఖ్యమంటున్న నిపుణులు
సాక్షి, హైదరాబాద్: ఈ మధ్యకాలంలో గుండెపోటుతో హఠాత్ మరణాలు పెరిగిపోతున్నాయి. చిన్నా–పెద్దా, పురుషులు–మహిళలు, ధనవంతుడు–పేదవాడు అనే తారతమ్యాలు, వయసు తేడాలు లేకుండా ఏడెనిమిదేళ్ల లోపు చిన్న పిల్లలు మొదలు 18–25 ఏళ్ల మధ్య యువజనులు, శారీరకంగా ధృడంగా ఉండే రాజకీయవేత్తలు, కసరత్తులు చేసి ఫిట్‌గా ఉండే క్రీడాకారులు, అప్పటిదాకా ఎలాంటి గుండెజబ్బు ఆనవాళ్లు లేనివారు కూడా అకస్మాత్తుగా వచ్చే హార్ట్ ఎటాక్, కార్డియక్ ఫెయిల్యూర్లతో నేలకొరుగుతున్నారు.
ఇటీవలే కొన్నిరోజుల క్రితం...గుజరాత్‌లో ఓ ఎనిమిదేళ్ల బాలిక తరగతి గది కారిడార్‌లో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో విగతజీవిలా కిందకు వాలిపోవడం స్కూల్ సీసీటీవీలో రికార్డయింది. ఈ వీడియో వివిధ సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రచారం పొందడంతో...దీనిని చూసిన వారంతా కూడా ఎంతో ఆవేదనకు గురయ్యారు.
ఇటీవల చిన్నపిల్లల్లో గుండెజబ్బుల ముప్పు పెరుగుతున్నట్లుగా గత మూడు, నాలుగు నెలల్లో చోటుచేసుకున్న వివిధ సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. వీరే కాకుండా కొన్ని రోజుల వ్యవధిలోనే వయసుతో తేడా లేకుండా కొందరు హఠాత్తుగా వస్తున్న గుండెపోటుతో మరణించారు.
ముందే గుర్తించవచ్చు...
లోకం తెలియని చిన్నవయసులోనే గుండెపోటుతో మరణించడం తల్లిదండ్రులు, బంధువులకు తీరని శోకాన్ని మిగిలిస్తోంది. అయితే హఠాత్తుగా గుండె జబ్బుతో చనిపోవడం అంటూ ఉండదని, పుట్టినప్పటి నుంచే అంటే.. గర్భస్త స్థితి నుంచే గుండెజబ్బులకు సంబంధించిన లక్షణాలతో ఈ ప్రాణాంతక ముప్పును గుర్తించవచ్చునని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
చిన్నపిల్లల్లో గుండెజబ్బుకు సంబంధించి కొన్ని లక్షణాలను ముందునుంచే గుర్తించవచ్చునని, వారి శరీరరంగు ముఖ్యంగా పెదాలు, చేతులు నీలం రంగులోకి మారడం వంటివి గమనించాలని చెబుతున్నారు. సాధారణంగా పసిపిల్లలుగా చిన్నవయసులో ఉన్నప్పుడే 3, 4 పర్యాయాలు శ్వాససంబంధిత ఇన్ఫెక్షన్లు సోకుతాయని, అంతకు మించిన సంఖ్యలో, తరచూ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయంటే తల్లిదండ్రులు అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు.
వారి వయసుకు తగ్గట్టుగా తగినంతగా బరువు పెరగకపోవడం, నాలుగు మాసాల వయసప్పుడు మందహాసం (నార్మల్ స్మైల్), ఏడాది వయసు పూర్తయ్యేలోగా తొలి అడుగు వేయకపోవడం వంటివి బాగా ఆలస్యమైతే ఏదైనా సమస్య ఉండొచ్చునని, ముందస్తుగా జాగ్రత్త పడాలని చెబుతున్నారు.
చిన్నపిల్లలు పుట్టినప్పటి నుంచే వారి గుండె పనితీరుకు సంబంధించి ఏవైనా లోపాలుంటే ‘2 డీ ఎకో’, ఈసీజీ ఇతర రూపాల్లోని పరీక్షల ద్వారా సమస్యలను గుర్తించి తగిన చికిత్స అందిస్తే. సడన్ హార్ట్‌అటాక్ వంటి వాటిని చాలా మటుకు నివారించవచ్చునని సూచిస్తున్నారు.
ఇక పెద్ద వయసులోని (యువకులతో సహా) వారి విషయానికొస్తే...
గుండెనొప్పా లేక ఎసిడిటీనా అని సొంతంగా తేల్చుకునే ప్రయత్నంతోనే ప్రాణాపాయ పరిస్థితి పెరుగుతోందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. రాత్రి సమయాల్లో ఎవరికైనా గుండెలో నొప్పిగా అనిపిస్తే దానిని ఎసిడిటీగా కొట్టిపారేసి నిర్లక్ష్యం చేయడం అధికశాతం మందిలో పెరిగిందని వైద్యులు చెబుతున్నారు.
ఇలా గుండెనొప్పికి, అసౌకర్యానికి గురయ్యాక వెంటనే సమీపంలోని ఆసుపత్రిలో ఈసీజీ, రక్తపరీక్షలు, సీటీ స్కాన్ చేయించుకుంటే ప్రమాదం నుంచి బయటపడొచ్చునని సూచిస్తున్నారు. గుండెపోటు వచ్చాక 4 నుంచి 6 గంటలు గోల్డెన్ పీరియడ్ వంటివని, ఈ సమయంలోగా ఆసుపత్రికి చేరుకుంటే ప్రమాదంనుంచి తప్పించుకోవచ్చునని చెబుతున్నారు. అదే ఆరుగంటల తర్వాత ఆస్పత్రికి వెళితే లక్షలాది రూపాయలు వెచ్చిoచినా ఒకసారి గాయపడిన గుండె మళ్లీ పూర్తిస్థాయిలో కోలుకోవడం అరుదేనని హెచ్చరిస్తున్నారు.
నిద్రించే సమయాల్లోనే అధికంగా హార్ట్‌అటాక్‌లకు అవకాశం ఉందని, ఆరోగ్యమైన గుండె కలవారు హఠాత్ గుండెపోటుతో మరణించడం అనేది అత్యంత అరుదని చెబుతున్నారు. అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించే ప్రమాదాన్ని అరికట్టేందుకు రెగ్యులర్ పరీక్షలతో పాటు, హెల్త్‌కేర్ విషయంలో అందుబాటులోకి వచి్చన నూతన సాంకేతికను అధికంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.
40, 50 ఏళ్ల వయసుల్లోని వారిలో వేలాది మంది గుండెజబ్బు ఉన్న వారిని డయాగ్నైజ్ చేసిన దాఖలాలు లేవంటున్నారు. మధ్యవయసు్కల్లోనూ శారీరకంగా దృఢంగా ఉన్న వారు, ఫిట్‌గా కనిపించేవారు, కసరత్తులు చేసేవారు సైతం హార్ట్ అటాక్‌కు గురి కావడం పట్ల ఆశ్యర్యం వ్యక్తమవుతోంది.
అయితే అధికశాతం కేసుల్లో వీరికి గతం నుంచే గుండెజబ్బులు ఉండి అవి తీవ్రస్థాయికి చేరుకోవడం వల్లనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని చెబుతున్నారు. ఆరోగ్యవంతులైనా సరే ఒక్కసారైనా సీటీ స్కాన్, కార్డియక్ ఎవాల్యువేషన్ చేయించుకుంటే ముందుగానే ఆరోగ్య సమస్య బయటపడి మరణానికి గురయ్యే ప్రమాదం ఉండదని అంటున్నారు.
ఆరోగ్యమైన గుండెకు పంచసూత్రాలు... వైద్యనిపుణుల సూచనల ప్రకారం...
రెగ్యులర్ చెకప్‌లు...
రక్తపరీక్షలు, ఈసీజీ, ఎకో కార్డియోగ్రామ్, సీటీ యాంజియో, అ్రల్టాసౌండ్. మహిళలకు మామ్మొగ్రామ్స్ ఇంకా పాప్ స్మియర్ టెస్ట్‌లు
ఎక్సర్‌సైజ్...
ప్రతీరోజు రెగ్యులర్ కసరత్తులు, స్వల్ప ఎక్సర్‌సైజులు, వేగంగా నడక (బ్రిస్క్ వాకింగ్), యోగా వంటివి ఎంతో ఉపయోగం
డైట్...
బియ్యం, చపాతీ, చక్కెర వంటి కార్బోహైడ్రేట్లను పరిమితంగా తీసుకోవాలి. రెడ్ మీట్‌ను దూరం పెట్టాలి
స్లీప్‌ఎర్లీ...
రాత్రి సమయాల్లో త్వరగా నిద్రపోవడం, ఉదయం త్వరగా నిద్రలేవడం వంటి అలవాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది
స్పిరిచ్యువాలిటీ...
ఆధ్యాతి్మకతను అలవరుచుకోవడం ద్వారా ఒత్తిళ్లను తగ్గించుకుని గుండె ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment