సైబర్ నేరాల్లో ఫ్రీజ్ చేసిన నగదు రిఫండ్‌పై సైబర్ కాప్స్ దృష్టి
ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు రూ.40 కోట్లు రిఫండ్
సైబర్ మోసగాళ్ల బారిన పడి తమ డబ్బును పోగొట్టుకున్న వారు తిరిగి పొందేందుకు అవకాశం ఉంది. అయితే ఇందుకు వారు చేయాల్సిందల్లా సకాలంలో పోలీసులకు ఫిర్యాదు చేయడం. ‘గోల్డెన్ అవర్’లో ఫిర్యాదు చేస్తే రికవరికీ అవకాశం ఉంటుందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాల్లో బాధితులు మోసపోవడం ఎంత తేలికో... నేరగాళ్లను పట్టుకోవడం అంత కష్టం. నగదు రికవరీ అనేది దాదాపు అసాధ్యమనే చెప్పవచ్చు. ‘గోల్డెన్ అవర్’లో ఫిర్యాదు చేసిన బాధితులకు మాత్రం చాలా వరకు న్యాయం జరుగుతోంది. క్రిమినల్స్‌కు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఫ్రీజ్ చేసిన వీరి నగదును రిటర్న్ చేయడానికి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు రూ.40 కోట్లు బాధితులకు తిరిగి ఇప్పించగలిగారు.
ఆ సమయమే గోల్డెన్ అవర్..
బాధితులు ‘గోల్డెన్ అవర్’లో అప్రమత్తం కావడంతో పాటు తక్షణం ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. నేరం బారిన పడిన తర్వాత తొలి గంటనే గోల్డెన్ అవర్‌గా పరిగణిస్తారు. ఆ తర్వాత ఎంత ఆలస్యమైతే నగదు వెనక్కు వచ్చే అవకాశాలు అంత తగ్గిపోతుంటాయి. ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న సైబర్ నేరాల్లో బాధితులు తొలుత సైబర్ క్రైమ్ ఠాణాకు రావడంపై దృష్టి పెట్టకుండా తక్షణం 1930 నంబర్‌కు కాల్ చేసి లేదా (cybercrime.gov.in)కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.
రెండు రకాలుగా నగదు ఫ్రీజ్..
ఉత్తదారిలోని వివిధ ప్రాంతాలు కేంద్రంగా దేశ వ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడే నిందితులు బాధితుల నుంచి నగదు డిపాజిట్/ట్రాన్స్‌ఫర్ చేయించడానికి సొంత బ్యాంకు ఖాతాలను వాడరు. పోలీసులకు ఎలాంటి ఆధారాలు చిక్కకూడదనే ఉద్దేశంలో మనీమ్యూల్స్‌గా పిలిచే దళారులకు చెందిన వాటితో పాటు బోగస్ వివరాలతో తెరిచిన బ్యాంకు ఖాతాలకు దీనికోసం వినియోగిస్తుంటారు.
చదవండి: సైబర్ స్కామర్స్‌తో జాగ్రత్త.. మోసపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..
ఓ నేరం కోసం ఒకే ఖాతాను కాకుండా వరుస పెట్టి బదిలీ చేసుకుపోవడానికి కొన్నింటిని వాడుతుంటారు. మోసపోయిన బాధితులు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసినప్పుడు ఆ అధికారులు ప్రాథమిక ఖాతాల్లోని నగదు ఫ్రీజ్ చేస్తారు. దీన్ని ఆన్‌లైన్ ఫ్రీజింగ్ అంటారు. సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో అప్పటికే కొంత నగదు మరో ఖాతాలోకి వెళ్లినట్లు తేలితే ఆయా బ్యాంకుల సహకారంతో దాన్నీ ఫ్రీజ్ చేస్తారు. దీన్ని ఆఫ్‌లైన్ ఫ్రీజింగ్‌గా వ్యవహరిస్తుంటారు.
ఒక్కో టీమ్‌లో ఒక్కో కానిస్టేబుల్..
ఫిర్యాదు చేసినప్పుడు నగదు ఫ్రీజ్ అవుతోందనే విషయం చాలా మంది బాధితులకు తెలియట్లేదు. దీనికి సంబంధించి వస్తున్న ఎస్సెమ్మెస్‌లను వాళ్లు పట్టించుకోవట్లేదు. కొంత కాలానికి తెలిసినప్పటికీ కోర్టుకు వెళ్లి, అనుమతి పొందటం వీరికి పెద్ద ప్రహసనంగా మారుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న నగర సైబర్ క్రైమ్ పోలీసులు ప్రతి టీమ్‌కు ఓ కానిస్టేబుల్‌ను నియమించారు.
సైబర్ నేరాల్లో ఫ్రీజ్ అయిన నగదు వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే ఈ అధికారి బాధితులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో పాటు వచ్చి నగదు తీసుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరతాడు. అలా ఠాణాకు వచ్చిన బాధితులను కోర్టుకు తీసుకువెళ్లి పిటిషన్ వేయడంతో పాటు నగదు విడుదలకు సంబంధించిన బ్యాంకు అధికారులకు ఆదేశాలు ఇచ్చేలా కానిస్టేబుల్ చేస్తున్నారు. గత ఏడాది మొత్తమ్మీద రిఫండ్ అయిన మొత్తం రూ.20.86 కోట్లుగా ఉండగా.. పోలీసుల చర్యల కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్ నాటికే ఇది రూ.32.49 కోట్లకు చేరింది. ఈ నెల్లో రిఫండ్‌తో కలిపితే ఇది దాదాపు రూ.40 కోట్ల వరకు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment