Cyber Crime Cops
-
సైబర్ మోసగాళ్ల బారిన పడ్డారా.. మీ డబ్బు తిరిగొచ్చే చాన్స్!
సైబర్ మోసగాళ్ల బారిన పడి తమ డబ్బును పోగొట్టుకున్న వారు తిరిగి పొందేందుకు అవకాశం ఉంది. అయితే ఇందుకు వారు చేయాల్సిందల్లా సకాలంలో పోలీసులకు ఫిర్యాదు చేయడం. ‘గోల్డెన్ అవర్’లో ఫిర్యాదు చేస్తే రికవరికీ అవకాశం ఉంటుందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాల్లో బాధితులు మోసపోవడం ఎంత తేలికో... నేరగాళ్లను పట్టుకోవడం అంత కష్టం. నగదు రికవరీ అనేది దాదాపు అసాధ్యమనే చెప్పవచ్చు. ‘గోల్డెన్ అవర్’లో ఫిర్యాదు చేసిన బాధితులకు మాత్రం చాలా వరకు న్యాయం జరుగుతోంది. క్రిమినల్స్‌కు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఫ్రీజ్ చేసిన వీరి నగదును రిటర్న్ చేయడానికి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు రూ.40 కోట్లు బాధితులకు తిరిగి ఇప్పించగలిగారు. ఆ సమయమే గోల్డెన్ అవర్.. బాధితులు ‘గోల్డెన్ అవర్’లో అప్రమత్తం కావడంతో పాటు తక్షణం ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. నేరం బారిన పడిన తర్వాత తొలి గంటనే గోల్డెన్ అవర్‌గా పరిగణిస్తారు. ఆ తర్వాత ఎంత ఆలస్యమైతే నగదు వెనక్కు వచ్చే అవకాశాలు అంత తగ్గిపోతుంటాయి. ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న సైబర్ నేరాల్లో బాధితులు తొలుత సైబర్ క్రైమ్ ఠాణాకు రావడంపై దృష్టి పెట్టకుండా తక్షణం 1930 నంబర్‌కు కాల్ చేసి లేదా (cybercrime.gov.in)కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.రెండు రకాలుగా నగదు ఫ్రీజ్.. ఉత్తదారిలోని వివిధ ప్రాంతాలు కేంద్రంగా దేశ వ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడే నిందితులు బాధితుల నుంచి నగదు డిపాజిట్/ట్రాన్స్ఫర్ చేయించడానికి సొంత బ్యాంకు ఖాతాలను వాడరు. పోలీసులకు ఎలాంటి ఆధారాలు చిక్కకూడదనే ఉద్దేశంలో మనీమ్యూల్స్‌గా పిలిచే దళారులకు చెందిన వాటితో పాటు బోగస్ వివరాలతో తెరిచిన బ్యాంకు ఖాతాలకు దీనికోసం వినియోగిస్తుంటారు.చదవండి: సైబర్ స్కామర్స్‌తో జాగ్రత్త.. మోసపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..ఓ నేరం కోసం ఒకే ఖాతాను కాకుండా వరుస పెట్టి బదిలీ చేసుకుపోవడానికి కొన్నింటిని వాడుతుంటారు. మోసపోయిన బాధితులు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసినప్పుడు ఆ అధికారులు ప్రాథమిక ఖాతాల్లోని నగదు ఫ్రీజ్ చేస్తారు. దీన్ని ఆన్లైన్ ఫ్రీజింగ్ అంటారు. సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో అప్పటికే కొంత నగదు మరో ఖాతాలోకి వెళ్లినట్లు తేలితే ఆయా బ్యాంకుల సహకారంతో దాన్నీ ఫ్రీజ్ చేస్తారు. దీన్ని ఆఫ్‌లైన్ ఫ్రీజింగ్‌గా వ్యవహరిస్తుంటారు. ఒక్కో టీమ్‌లో ఒక్కో కానిస్టేబుల్.. ఫిర్యాదు చేసినప్పుడు నగదు ఫ్రీజ్ అవుతోందనే విషయం చాలా మంది బాధితులకు తెలియట్లేదు. దీనికి సంబంధించి వస్తున్న ఎస్సెమ్మెస్‌లను వాళ్లు పట్టించుకోవట్లేదు. కొంత కాలానికి తెలిసినప్పటికీ కోర్టుకు వెళ్లి, అనుమతి పొందటం వీరికి పెద్ద ప్రహసనంగా మారుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న నగర సైబర్ క్రైమ్ పోలీసులు ప్రతి టీమ్‌కు ఓ కానిస్టేబుల్‌ను నియమించారు. సైబర్ నేరాల్లో ఫ్రీజ్ అయిన నగదు వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే ఈ అధికారి బాధితులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో పాటు వచ్చి నగదు తీసుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరతాడు. అలా ఠాణాకు వచ్చిన బాధితులను కోర్టుకు తీసుకువెళ్లి పిటిషన్ వేయడంతో పాటు నగదు విడుదలకు సంబంధించిన బ్యాంకు అధికారులకు ఆదేశాలు ఇచ్చేలా కానిస్టేబుల్ చేస్తున్నారు. గత ఏడాది మొత్తమ్మీద రిఫండ్ అయిన మొత్తం రూ.20.86 కోట్లుగా ఉండగా.. పోలీసుల చర్యల కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్ నాటికే ఇది రూ.32.49 కోట్లకు చేరింది. ఈ నెల్లో రిఫండ్‌తో కలిపితే ఇది దాదాపు రూ.40 కోట్ల వరకు ఉంది. -
‘బ్రెయిన్లో చిప్స్.. కళ్లల్లో కెమెరా అంటూ ’
‘నా ఫొటోలు ఎక్కడో ఉన్నాయని ఎందరో చెబుతున్నారు. అవి ఎక్కడో ఏంటో మీరే తెలుసుకుని తీసేయండి’ , ‘నేను ఫలానా హీరోకు ఆన్లైన్లో డబ్బులిచ్చా. వెంటనే కేసు పెట్టి అవి వసూలు చేయండి’, ‘కెనడా ప్రభుత్వం నా మీద సాంకేతిక నిఘా పెట్టింది. వాళ్లు నా బ్రెయిన్లో పెట్టిన చిప్స్ తీసేయండి’ , ‘ఆస్తి కోసం నా కళ్లల్లో కెమెరా పెట్టిన వాళ్లను పట్టుకోండి. ఎలాగైనా సరే ఆ కెమెరాలు బయటపడేయండి..’ సాక్షి, హైదరాబాద్: ఇవన్నీ ఏంటనుకుంటున్నారా? గడచిన కొన్నాళ్లుగా సైబర్ క్రైమ్ పోలీసులకు షాక్ ఇస్తున్న పలువురి ఫిర్యాదులు. వీరిలో కొందరైతే కమిషనర్ కార్యాలయం, మంత్రుల వరకు వెళ్లి చుక్కలు చూపించారు. ఈ తరహాకు చెందిన నలుగురు ‘బాధితులు’ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను చిత్రంగా ‘వేధించారు’. ఆయా ఫిర్యాదులు చందమామ కథల్ని తలపించేరీతిలో ఉండటం గమనార్హం. ఆ కథలు.. పోలీసుల వ్యథలు ఇలా ఉన్నాయి.. ఆ మాత్రం తెలుసుకోలేరా.. ► కొన్ని రోజుల క్రితం సిటీ సైబర్ పోలీసులను ఓ మహిళ ఆశ్రయించింది. తాను సిద్దిపేట జిల్లా నుంచి వచ్చినట్లు పరిచయం చేసుకుంది. తనకు తెలిసిన వాళ్లు, తెలియని వాళ్లు ఇటీవల ఫోన్లు చేస్తున్నారని, ‘నీ ఫొటోలు ఇంటర్నెట్లో ఉన్నాయి’ అంటూ చెబుతున్నారని మౌఖికంగా ఫిర్యాదు చేసింది. మీ అనుమతి లేకుండా పొందుపర్చారా? ఏయే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఉన్నాయి? లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తారా? అంటూ అధికారులు ఆమెను ప్రశ్నించారు. ‘కంప్లైంట్ ఇవ్వను... ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉందని చెబుతున్నారు? ఆ మాత్రం తెలుసుకోలేరా?’ అంటూ సమాధానం ఇచ్చింది. ► దీంతో పోలీసులు ఆమెకు నచ్చజెప్పి పంపారు. అంతటితో ఆగని ఆమె నేరుగా కమిషనరేట్‌లో ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది. అక్కడి అధికారులు ఓ మహిళా కానిస్టేబుల్‌ను తోడుగా ఇచ్చి సైబర్ ఠాణాకు పంపారు. రెండోసారి వచ్చినప్పుడు ‘నా ఫొటోలు ఎక్కడో ఉన్నాయి. అది ఎక్కడో తెలుసుకుని మీరే తొలగించండి’ అంటూ చెప్పింది. దీంతో తోడుగా వచ్చిన మహిళా కానిస్టేబుల్ అసలు విషయం తెలుసుకుని ఉన్నతాధికారులకు చెప్పారు. ఈ ‘బాధిత మహిళ’ను పంపడానికి సైబర్ క్రైమ్ పోలీసులు నానా పాట్లు పడ్డారు. బ్రెయిన్లో చిప్స్.. కళ్లల్లో కెమెరా అంటూ.. ► గడచిన కొన్ని నెలల్లో ఈ రెండింటితో పాటు మరికొందరు విచిత్ర ఫిర్యాదుదారులూ సైబర్ క్రైమ్ పోలీసులకు చుక్కలు చూపించారు. హఠాత్తుగా ఠాణాకు వచ్చిన ఓ వ్యక్తి తాను కెనడాలో చదువుకుని, ఉద్యోగం చేసి వచ్చానని అధికారులకు చెప్పాడు. తన మేధస్సు ఇతర దేశాలకు ఉపయోగపడకూడదని ఆ ప్రభుత్వం నిఘా వేసిందని వివరించాడు. దీనికోసం బ్రెయిన్లో చిప్స్ ఏర్పాటు చేసిందని, అవి తీసేందుకు చర్యలు తీసుకోవాలని కోరడంతో అధికారులకు అవాక్కయ్యారు. ► మరో విద్యాధికుడైన యువకుడు తన బంధువుల పైనే ఫిర్యాదు చేశాడు. ఆస్తి వివాదాల నేపథ్యంలో తన కళ్లల్లో కెమెరాలు పెట్టిన వాళ్లు ఎక్కడికి వెళ్తున్నానో కంప్యూటర్ ద్వారా తెలుసుకుంటున్నారని చెప్పాడు. తక్షణం కేసు నమోదు చేసి ఆ కెమెరాలు తీయించడంతో పాటు బంధువును జైలుకు పంపాలన్నాడు. అనునిత్యం చిన్న చిన్న చిత్రమైన ఫిర్యాదులూ తమకు వస్తుంటాయని, ఓర్పుతో వారిని వెనక్కు పంపుతున్నామని ఓ అధికారి తెలిపారు. ముందు హీరో పేరు.. ఆపై పోలీసులే అంటూ.. ► సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ షాక్ తగలడానికి కొన్నాళ్ల ముందు మరో చిత్రమైన ఫిర్యాదుదారు ముప్పతిప్పలు పెట్టారు. నగరానికి చెందిన ఓ మహిళ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌కు వరుసగా కొన్నాళ్లు వచ్చారు. తొలుత కొన్ని రోజుల పాటు ఏమీ మాట్లాడకుండా వచ్చి, కూర్చుని వెళ్లిపోయేవారు. ఆమెకు ఎదురైన ఇబ్బంది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ అధికారులు ఆమెను అడిగారు. ► ఓ పెద్ద హీరోకు తాను ఆన్లైన్లో డబ్బు చెల్లించానని, ఆ మొత్తం తిరిగి ఇప్పించాలంటూ ఆమె చెప్పడంతో పోలీసులు ఆలోచనలో పడ్డారు. ఎందుకు ఇచ్చారు? ఆధారాలు ఏమున్నాయని? పోలీసులు కోరడంతో ‘బాధితురాలి’కి చిర్రెత్తుకొచ్చింది. మరుసటి రోజు నేరుగా ఓ మంత్రి కార్యాలయానికి వెళ్లింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడానికి పోలీసులే డబ్బు అడిగారని ఫిర్యాదు చేసింది. ఆ కార్యాలయం ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. ఈమెను ఠాణాకు రాకుండా చేయడానికి పోలీసులు చాలా ప్రయాసపడాల్సి వచ్చింది. -
ఆన్లైన్లో పరిచయం.. యువతికి పెళ్లి ఆఫర్.. కట్‌చేస్తే
సాక్షి, హిమాయత్‌నగర్ (హైదరాబాద్): ఆన్లైన్లో పరిచయమై పెళ్లి కూడా చేసుకుందామని నమ్మించి వ్యాపారం పేరుతో పెట్టుబడి పెట్టించి యువతిని మోసం చేసాడో కేటుగాడు. వివరాల్లోకి వెళితే... నగరానికి చెందిన ఓ యువతికి ఆన్లైన్లో దుబాయికి చెందిన వ్యక్తి పరిచయమయ్యాడు. దుబాయిలో మంచి వ్యాపారినని నమ్మించి తన వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఇస్తానన్నాడు. త్వరలో ఇద్దరం పెళ్లి చేసుకొని కలసి వ్యాపారం కొనసాగించొచ్చని కూడా నమ్మబలికాడు. నిజమని నమ్మిన యువతి 2017లో రూ.7లక్షలు అతడికి చెల్లించింది. అప్పటి నుంచి పెట్టుబడికి సంబంధించిన లాభాలు ఇవ్వకపోగా.. ఇచ్చిన డబ్బును సైతం తిరిగి ఇవ్వలేదు. ఫోన్లు చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన బాధితురాలు శనివారం సిటీ సైబర్ క్రైం ఏసీపీ కేవీఎన్ ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. -
చావునుంచి తప్పించుకోవచ్చేమో, కామాక్షి నుంచి తప్పించుకోలేరు?!
ఆన్లైన్లో మోసం చేద్దాం, అమ్మాయిలను వేధించడం వంటి పనులు చేద్దాం అనుకునేవారు ఇక నుంచి జాగ్రత్తగా ఉండక తప్పదు. ఎందుకంటే కామాక్షి శర్మ మీ మోసాన్ని ఇట్టే కనుక్కొని, జైలు ఊచలను లెక్కపెట్టించగలదు. సైబర్ క్రైమ్ నివారణలో భాగంగా ప్రజలకు మాత్రమే కాదు 50,000 మంది పోలీసు సిబ్బందికి శిక్షణ ఇచ్చారు ఘజియాబాద్ వాసి పాతికేళ్ల కామాక్షి శర్మ. తను సాధించిన ఈ ఘనతకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో కామాక్షి శర్మ పేరు నమోదు అయ్యింది. డిజిటల్ యుగంలోకి అడుగుపెట్టామని ఆనందించేలోపే అనర్థాలకు అడ్డూ ఆపూ లేకుండాపోయిందని నిత్యం బాధపడాల్సిన పరిస్థితులను చూస్తున్నాం. ఈ రోజుల్లో ప్రతిది ఆన్లైన్ వేదికగా మారిపోయాక మోసపూరిత అంశాలెన్నింటికో తెరతీసినట్టు అయ్యింది. డబ్బు, అమ్మాయిలను లైంగిక వేధింపులే లక్ష్యంగా చేసుకొని వేల కొద్ది మోసాలు జరుగుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయడానికి నిపుణులు ఎంతో కృషి చేస్తున్నారు. అయినప్పటికీ సైబర్ నేరాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో ఉంటున్న కామాక్షి శర్మ ఎందుకు సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయలేం అని పంతంతో కృషి చేస్తోంది. దీంట్లో భాగంగానే పోలీసు సిబ్బందితో కలిసి పని చేస్తోంది. అభిరుచి వృత్తిగా మార్పు కాలేజీలో రోజుల్లో సరదాగా నేర్చుకున్న హ్యాకింగ్ హాబీ కామాక్షిని సైబర్‌క్రైమ్ ప్రపంచంలో ప్రసిద్ధి చెందేలా చేసింది. హ్యాకర్లు హ్యాకింగ్ చేయడం ద్వారా మోసం చేయగలిగినప్పుడు పోలీసులు వారిని ఏ విధంగా పట్టుకోలేరో, ఎలా చేస్తే వారిని సులువుగా పట్టేయవచ్చో తెలియజెబుతారు కామాక్షి. ‘2017లో నేను బీటెక్ చేస్తున్నప్పుడు హ్యాకింగ్‌ని హాబీగా నేర్చుకున్నాను. నా ఫ్రెండ్సే వారి సొంత ఐడీలను ఇచ్చి, హ్యాక్ చేయమని చెప్పేవారు. ఆ విధంగా కాలేజీ అంతా నేను హ్యాక్ చేస్తానని గుర్తించేవారు. దీంతో హ్యాకింగ్‌లో మరిన్ని నైపుణ్యాలు నేర్చుకోవడానికి, ఆ తర్వాత రోజుల్లో అదే నన్ను ఈ వృత్తివైపుగా మరల్చడానికి దోహదం చేసింది. సైబర్ నేరాలు ఏ ఏవిధంగా పెరుగుతున్నాయి. వాటికి అడ్డుకట్ట వేయచ్చు అనే అంశాల మీద చాలా సాధన చేశాను. ఈ ఆలోచన ను దృష్టిలో పెట్టుకొనే పోలీసు అధికారులతో కలిసి పనిచేయడం ప్రారంభించాను. ఎన్నో నేరాలకు అడ్డుకట్టవేయగలిగాను’ అంటారామె. 35 రోజుల మిషన్ కరోనా మహమ్మారి సమయంలో చాలా మంది ప్రజలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ పేరుతో తమ ఇళ్ల నుండే పనులు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సైబర్ బెదిరింపు చాలా వేగంగా పెరిగింది. నేరగాళ్లు అమ్మాయిలను వేధించి తీసుకున్న ఫొటోలు, లక్షలాది రూపాయలు ప్రజల ఖాతాల నుండి దొంగలిస్తున్నారు. కామాక్షి 2019లో జమ్మూ నుండి కన్యాకుమారి వరకు 35 రోజుల సైబర్ క్రైమ్ మిషన్‌ను పూర్తి చేసింది. ఇందులో సైబర్ నేరాలను ఎలా ఎదుర్కోవాలో పోలీసు సిబ్బందితో కలిసి పర్యవేక్షించింది. ఈ పరీక్షలో ఐపీఎస్ అధికారులు కూడా పాల్గొన్నారు. కామాక్షి ఈ విషయం గురించి మరింతగా ప్రస్తావిస్తూ –‘హ్యాకింగ్ ద్వారా హాకర్లు మోసం చేయగలిగినప్పుడు పోలీసులు వారిని ఎందుకు పట్టుకోలేరని కామాక్షి అభిప్రాయపడ్డారు. దీనిని దృష్టిలో ఉంచుకునే నా హ్యాకింగ్ దర్యాప్తు వైపుగా మార్చాను. అప్పుడే పోలీసు అధికారులతో కలిసి పనిచేయడం ప్రారంభించాను’ అని తెలియజేస్తారు కామాక్షి. ఇక నుంచి సైబర్ నేరానికి పాల్పడాలనుకునేవాళ్లు కామాక్షి చేతికి చిక్కిపోతామని భయపడక తప్పదు లేదంటే నేరానికి శిక్ష అనుభవించక తప్పదు. -
ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో టోకరా.. రూ.1.2కోట్లు స్వాహా
సాక్షి, సిటీబ్యూరో: ఫేస్బుక్ ద్వారా ఎర వేసి, ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో పెట్టుబడి పెట్టించి, భారీ లాభమంటూ నమ్మబలికి నగర మహిళ నుంచి రూ.1.2 కోట్లు కాజేసిన ముఠాలో ఇద్దరు నిందితుల్ని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశా రు. ఇరువురినీ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో పట్టుకున్నామని, పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నామ ని సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. నగరానికి చెందిన ఓ మహిళ వివరాలు తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు ఫేస్బుక్ ద్వారా రిక్వెస్ట్ పంపారు. సాక్షి మెహతా పేరుతో వచ్చి దాన్ని ఈమె యాక్సెప్ట్ చేయడంతో ఇరువురి మధ్యా చాటింగ్స్ నడిచాయి. తాను ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లో ఉన్న కంపెనీ సెంట్రల్ ట్రేడ్ రీసెర్చ్‌లో షేర్ ట్రేడింగ్ విభాగంలో కన్సల్టెంట్ అంటూ సాక్షి నమ్మబలికింది. ఆపై బాధితురాలి ఫోన్ నంబర్ తీసుకుని పలుమార్లు మాట్లాడింది. ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా భారీ లాభా లు పొందవచ్చని చెప్పిన సాక్షి నగర మహిళతో డీమాట్ ఖాతాలు తెరిపించింది. ఆపై ప్రాథమికంగా రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టమని చెప్పిన సాక్షి ఆ మొత్తాన్ని తమ ఖాతాల్లో డిపాజిట్ చేయించుకుంది. కొన్ని రోజుల పాటు అందులో, ఇందులో ట్రేడింగ్ చేస్తున్నామని, భారీ లాభాలు వచ్చాయంటూ మాటలు చెప్పింది. ఓ రోజు కాల్ చేసిన ఆ కి‘లేడీ’ తమ వద్ద ఉన్న ట్రేడింగ్ ఖాతాలో ఉన్న మొత్తం రూ.4 కోట్లకు చేరిందని చెప్పింది. అది మీకు బదిలీ చేయాలంటే కంపెనీ నిబంధనల ప్రకారం ముందుగా తమకు రావాల్సిన బ్రోకరేజ్ చెల్లించాలని షరతు పెట్టింది. ఈ పేరుతో దాదాపు రూ.1.2 కోట్లు బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయించుకుని మోసం చేసింది. ఈ మేరకు బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ హరిభూషణ్ రావు నేతృత్వంలోని బృందం బ్యాంకు ఖాతాల వివరాలు, ఫోన్ నంబర్లను బట్టి ముందుకు వెళ్లింది. ఇలా భోపాల్‌కు చెందిన రాహుల్, మహేష్‌లు నిందితులని గుర్తించింది. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం ఇద్దరినీ అరెస్టు చేసి తీసుకువచ్చింది. ఈ ముఠాపై నగరంతో పాటు ఛత్తీస్‌గఢ్‌లో కలిపి మొత్తం మూడు కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించారు. చదవండి: మైనర్లకు ‘ప్రేమ’ పాఠాలు.. ఆపై వీడియోలతో బెదిరింపులు -
‘యాప్’తో ట్రాప్!.. ఓటీపీ చెప్పకపోయినా ఖాతా ఖాళీ..
సాక్షి, సిటీబ్యూరో: కవాడిగూడలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న చింతల్ వాసి మంగళవారం మధ్యాహ్నం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించాడు. తనకు ఎవరూ కాల్ చేయలేదని, తాను ఓటీపీ కూడా చెప్పలేదని అయినా తన ఖాతా నుంచి రూ.1.8 లక్షలు పోయాయని పేర్కొన్నాడు. ఆయన ఫోన్‌ను పరిశీలించిన సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ అందులో ‘క్విక్ వ్యూ’ అనే యాప్ ఉండటాన్ని గమనించారు. దీని ద్వారానే సైబర్ నేరగాళ్ళు ఖాతా ఖాళీ చేసినట్లు తేల్చారు. ఈ తరహా ఫిర్యాదులు ఇటీవల కాలంలో దాదాపు 30 వరకు వచ్చాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. జమ్‌తార కేంద్రంగా మోసాలు... జార్ఖండ్‌లో రాష్ట్రంలో ఉన్న జమ్‌తార జిల్లాలోని ఏడు గ్రామాల్లోని యువతకు సైబర్ నేరాలు చేయడమే తమ ప్రధాన వృత్తిగా మార్చుకున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్లి, అక్కడి కాల్ సెంటర్లలో పని చేసిన వచ్చిన జమ్‌తార యువత తామే ప్రస్తుతం సొంతంగా కాల్ సెంటర్లను ఏర్పాటు చేసుకుని ఈ సైబర్ నేరాలకు పాల్పడుతోంది. ఆయా బ్యాంకుల్లో కింది స్థాయి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు వాటి కాల్ సెంటర్లు తదితర మార్గాల్లో డెబిట్ కార్డుల డేటా ఈ సైబర్ నేరగాళ్ళకు చేరుతోంది. బోగస్ పేర్లు, చిరునామాలతో సిమ్కార్డ్స్ తీసుకునే జమ్‌తార యువకులు వీటిని వినియోగించడానికి ఎప్పటికప్పుడు కొత్త సెల్ఫోన్లు వాడుతుంటారు. వీటితో తమ డేటాలోని బ్యాంకు కస్టమర్ల ఫోన్ నెంబర్లకు కాల్ చేస్తుంటారు. ఇటీవల కాలంలో అందరి ఫోన్లలోనూ ‘ట్రూకాలర్’ తరహా యాప్స్ ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బోగస్ సిమ్‌కార్డుల్ని వినియోగిస్తున్న జమ్‌తార యువత ముందుగానే ఆ నెంబర్లను సదరు యాప్‌లో ‘బ్యాంక్ హెడ్–ఆఫీస్’ పేరుతో రిజిస్టర్ చేయించేస్తున్నారు. ఫలితంగా ఈ నెంబర్ నుంచి వచ్చిన కాల్‌ను రిసీవ్ చేసుకున్న వ్యక్తులకు అవి బ్యాంకుల నుంచి వస్తున్న భావన కలుగి తేలిగ్గా బుట్టలో పడతారు. ఇలా ఓ వ్యక్తి నుంచి డబ్బు కాజేసిన వెంటనే జమ్‌తార సైబర్ నేరగాళ్లు అందుకు వినియోగించిన సెల్‌ఫోన్, సిమ్‌కార్డు ధ్వంసం చేస్తున్నారు. యాప్స్ డౌన్లోడ్ చేయించి... ఓ ఖాతాదారుడి నుంచి సేకరించిన వివరాలను అతడు బ్యాంకు ద్వారా మార్చుకునే లోపు ఎన్నిసార్లు అయినా వాడవచ్చు. అయితే ప్రతి లావాదేవీకీ ఒక ఓటీపీ మాత్రం కచ్చితంగా ఉండాలి. దీన్ని పదేపదే వినియోగదారుడిని అడిగితే డబ్బు కట్ కావడాన్ని గమనించి చెప్పకపోవచ్చు అని జామ్‌తార నేరగాళ్ళు కొత్త పంథా మొదలెట్టారు. తాము టార్గెట్ చేసిన వారిలో స్పార్ట్‌ఫోన్ వినియోగదారులు ఉంటే ప్లే స్టోర్స్ లేదా లింకులు పంపడం ద్వారా కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకోమంటున్నారు. టీమ్ వ్యూవర్ తరహాకు చెందిన వీటికి సంబంధించి ఓ పాస్వర్డ్ చెప్తున్న నేరగాళ్లు దాని యాక్టివ్ చేసుకునేలా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో బ్యాంకునకు సంబంధించిన ఏ సమాచారమైనా నేరుగా అందుతుందని, ఈ తరహా అప్డేట్స్, లింకేజ్లు ఆటోమేటిక్‌గా జరుగుతాయని చెప్పి నమ్మిస్తున్నారు. బాధితుడు ఈ యాప్‌ను ఇన్‌స్టల్ చేసుకుని యాక్టివ్ చేసిన వెంటనే ఇతగాడి ఫోన్ స్క్రీన్ సైబర్ నేరగాడి ఫోన్/ల్యాప్‌టాప్‌లో కనిపిస్తుంటుంది. ఫలితంగా వచ్చిన ప్రతి ఓటీపీను అడగాల్సిన పని లేకుండా చేసేస్తూ వీలున్నంత వరకు ఖాతా ఖాళీ చేయడానికి ఆస్కారం ఏర్పడుతోంది. అసలు విషయం తెలుసుకునేలోపు బాధితులు పూర్తిగా నష్టపోతున్నారు. కొన్ని సందర్భాల్లో అసలు బాధితులకు విషయం తెలియకుండానే వివిధ లింకుల ద్వారా యాప్స్ డౌన్లోడ్ చేయిస్తున్నారు. ఈ నేరగాళ్లు ఒక్కో నేరానికి ఒక సిమ్‌కార్డు మాత్రమే వాడి దాన్ని ధ్వంసం చేసేస్తుంటారు. ఇవి కూడా తప్పుడు వివరాలతో తీసుకున్నవే ఉంటున్నాయి. మరోపక్క వీరు వినియోగిస్తున్న బ్యాంకు ఖాతాలలు, వాలెట్స్ బోగస్ పేర్లు, చిరునామాలతో ఉంటున్నాయని సైబర్ క్రైమ్ అధికారులు చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఢిల్లీతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతకు కమీషన్ల ఎర వేసి వారి బ్యాంకు ఖాతాలను వాడుకుంటున్నారు. మనీమ్యూల్స్‌గా పిలిచే వీరి నుంచి సైబర్ నేరగాళ్లు నేరుగా డబ్బే తీసుకుంటున్నారు. దీంతో పాత్రధారుల్ని తప్ప సూత్రధారుల్ని పట్టుకోవడం కష్టసాధ్యంగా మారుతోంది. ఈ తరహా సైబర్ నేరాల్లో మోసపోవడం ఎంత తేలికో... కేసుల్ని కొలిక్కి తీసుకురావడం, రికవరీలు చేయడం అంత కష్టమని అధికారులు వివరిస్తున్నారు. ఇప్పటికి 11 యాప్స్ గుర్తించాం ఎవరికి వారు అప్రమత్తంగా ఉంటేనే ఈ తరహా సైబర్ నేరగాళ్లకు చెక్ చెప్పవచ్చు. ఆధార్ లింకేజ్ లేదా అప్‌గ్రేడ్ కోసం ఓ బ్యాంకు ఫోన్లు చేయదని గుర్తుంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనే ఎదుటి వ్యక్తులకు ఓటీపీలు చెప్పకూడదు. అపరిచులు సూచించే ఎలాంటి యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోవడం, లింకులు క్లిక్ చేయడం కూడదు. ఇప్పటి వరకు ఈ తరహాకు చెందిన యాప్స్ 11 గుర్తించాం. ప్రతి వీటిని అసవసరంగా ఎవరూ డౌన్లోడ్ చేసుకోవదు. ఇప్పటికే ఫోన్లలో ఉన్నాయా? అనే అంశాన్నీ ఓసారి పరిశీలించుకోవాలి. యాడ్సన్, క్విక్ వ్యూవర్, ఎనీ డెస్క్, టీమ్ వ్యూవర్, యూనిఫైడ్ రిమోట్, ఎయిర్ మిర్రర్, వీఎన్‌సీ వ్యూవర్, రిమోట్ సపోర్ట్, పీసీ రిమోట్, ఎయిర్ డ్రైడ్, రిమోట్ వ్యూ... ఈ తరహ యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. – కేవీఎం ప్రసాద్, హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ -
20 రోజులు.. 2 సార్లు.. రూ.2.2 లక్షలు!
సాక్షి, సిటీబ్యూరో: సాధారణంగా ఓ సైబర్ నేరం బారినపడిన బాధితులు ఏం చేస్తారు? అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ మరోసారి ‘ఈ– కేటుగాళ్ల‘కు అవకాశం ఇవ్వరు. కానీ.. నగరానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ మాత్రం కేవలం 20 రోజుల వ్యవధిలో రెండుసార్లు టార్గెట్‌గా మారి రూ.2.2 లక్షలు పోగొట్టుకున్నాడు. తన ఖాతా నుంచి రూ.70 వేలు మాయంపై గత నెల్లో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే ఖాతా నుంచి మరో రూ.1.5 లక్షలు పోయాయంటూ మంగళవారం సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు మరో ఫిర్యాదు ఇచ్చారు. ఈ రెండింటికీ సంబంధించి కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన బాధితుడు తన నెట్ బ్యాంకింగ్‌లోకి సైబర్ నేరగాళ్ళు జోరబడిన విషయాన్ని గుర్తించకపోవడంతోనే ఇలా జరిగింది. సికింద్రాబాద్‌లో నివసించే సాప్ట్వేర్ ఇంజినీర్‌కు హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో ఖాతా ఉంది. 20 రోజుల క్రితం ఇతని నెట్ బ్యాంకింగ్‌లోకి ఇతడి ప్రమేయం లేకుండానే ఓ కొత్త బెనిఫిషియరీ వచ్చి చేరాడు. ఈ విషయాన్ని ఆ సమయంలో బాధితుడు గుర్తించలేకపోయాడు. తన నెట్ బ్యాంకింగ్‌కు సంబంధించిన యూజర్ ఐడీ, పాస్వర్డ్ తదితరాలు ఎలా అతడికి చేరాయో తెలుసుకునే ప్రయత్నం చేయడం సాధ్యం కాలేదు. దీంతో సైబర్ నేరగాళ్లు ఈ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఖాతా నుంచి రూ.70 వేలు కాజేశాడు. దీంతో అవాక్కైన బాధితుడు బ్యాంకునకు ఫిర్యాదు చేయడంతో నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డుల లావాదేవీల్ని బ్లాక్ చేశామంటూ ఆ అధికారులు మౌఖికంగా చెప్పారు. దీనిపై బాధితుడు ఫిర్యాదు చేయడంతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గత నెల్లో ఓ కేసు నమోదు చేశారు. ఇది దర్యాప్తులో ఉండగానే అదే బాధితుడు మరోసారి సైబర్ నేరగాళ్ళ బారినపడ్డాడు. బ్యాంకు అధికారులు చెప్పినట్లు తన నెట్ బ్యాంకింగ్ బ్లాక్ అయినందని భావించిన అతగాడు దాని పాస్వర్డ్ మార్చడం, యాడ్ అయిన బెనిఫిషియరీని డిలీట్ వంటివి చేయలేదు. తాను తీసుకున్న రుణాలకు సంబంధించిన నెల వారీ వాయిదాలు చెల్లించాల్సిన సమయం సమీపించడంతో, రూ.1.7 లక్షలకు తాను జారీ చేసిన చెక్కులు క్లియర్ అవ్వాల్సి ఉండటంతో రెండు రోజుల క్రితం తన ఖాతాలో బ్యాంకు నుంచి ఆ మొత్తం డిపాజిట్ చేశాడు. కొన్ని గంటల్లోనే ఆ మొత్తం నుంచి రూ.1.5 లక్షలు మాయం అయినట్లు గుర్తించాడు. దీంతో షాక్‌కు గురైన బాధితుడు బ్యాంకు అధికారుల్ని ఆశ్రయించగా సంతృప్తికరమైన సమాధానం రాలేదు. దీంతో మంగళవారం మరోసారి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదైంది. -
గిఫ్ట్ వచ్చింది పట్టుకెళ్లండి
పంజగుట్ట: ‘మీకు గిఫ్ట్ వచ్చింది. మా కార్యాలయానికి కుటుంబ సమేతంగా వచ్చి తీసుకెళ్లండి’ అంటూ మోసం చేస్తున్న పలువురిని పంజగుట్ట పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పుగూడకు చెందిన శ్రీకాంత్, ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన అబ్దుల్ రషీద్‌ఖాన్ తదితరులు పంజగుట్ట నాగార్జున సర్కిల్లో డెస్టినీ ఇన్ఫా సర్వీసెస్ పేరుతో సంస్థను స్థాపించారు. దీనికి శ్రీకాంత్ సీఈఓగా, రషీద్‌ఖాన్ ఎండీగా వ్యవహరిస్తున్నారు. సంస్థకు చెందిన ఉద్యోగులు బిగ్‌బజార్, మెట్రో, డీమార్ట్ తదితర షాపింగ్ మాల్స్ వద్ద ఉంటారు. షాపింగ్ చేసేందుకు వచ్చిన వారికి ఒక కూపన్ ఇస్తారు. అందులో పేరు, ఫోన్ నంబర్ రాస్తే మీకు గిప్ట్ వస్తుందని వివరాలు తీసుకుంటారు. ఒక వారం తర్వాత వారికి ఫోన్ చేసి లక్కీడ్రాలో మీ పేరు వచ్చింది. మీ భార్యను తీసుకుని మా సంస్థకు వచ్చి గిఫ్ట్ తీసుకువెళ్లండని చెబుతారు. వెళ్లినవారికి సమోసా తినిపించి, టీ తాగిస్తారు, కప్పులు, సాసర్లు ఉన్న ఒక గిఫ్ట్ ఇస్తారు. ఆ తర్వాత అసలు కథ మొదలుపెడతారు. తాము తక్కువ రేటులో విదేశాలకు పంపిస్తాం. పాస్‌పోర్టు, వీసా అన్నీ తామే చూసుకుంటామని నమ్మబలుకుతారు. దానికి ఒప్పుకోకపోతే అతితక్కువ రేటుకు ఫ్లాట్స్ ఇస్తామని నమ్మిస్తారు. రూ.50 వేలు లేదా రూ.30 వేలు కట్టినా ఫ్లాట్ మీ సొంతం అవుతుందంటారు. కట్టిన తర్వాత నేడు రేపు అని తిప్పించుకుంటారు. మోసం వెలుగుచూసిందిలా.. ఇదే తరహాలో జియాగూడకు చెందిన సారిక 15 రోజుల క్రితం అత్తాపూర్‌లోని డీమార్ట్‌కు వెళ్లగా అక్కడ ఆమె వివరాలు తీసుకున్నారు. గిఫ్ట్ వచ్చిందని సంస్థకు పిలిపించారు. సారిక ఆమె భర్త ప్రమోద్‌తో కలిసి వెళ్లగా షాద్‌నగర్‌లో 121 గజాల ఫ్లాట్ ఇస్తామని నమ్మబలికి రూ.30వేలు తీసుకున్నారు. అసలు వెంచర్ చూపించకుండా మాటల్లో పెట్టి రూ.30 వేలు తీసుకోవడంతో అనుమానం వచ్చిన వారు బుధవారం పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి సంస్థ కార్యాలయంపై ఆకస్మిక తనిఖీలు చేసి శ్రీకాంత్, అబ్బుల్ రషీద్‌ఖాన్ సహా సీనియర్ సేల్స్ ఏజెంట్ మీర్జా అజీజ్‌బేగ్, సేల్స్ విభాగానికికి చెందిన సయ్యద్ సుభాన్, దండు నవీన్‌కుమార్, రాహుల్, సయ్యద్ ఫజల్‌లను అరెస్టు చేశారు. వీరి బాధితులు ఎవరైనా ఉంటే పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. -
పదిలోనే బరితెగింపు.. అసభ్యకర సందేశాలు
సాక్షి, సిటీబ్యూరో: మైనర్ల చేతికి తమ స్మార్ట్ఫోన్లు అందేలా చేస్తున్న తల్లిదండ్రులు వారి వ్యవహారాలను, కార్యకలాపాలను అసలు పట్టించుకోవట్లేదు. ఫలితంగా అనేక సోషల్‌మీడియా యాప్స్‌ను విరివిగా వినియోగిస్తున్న బాలబాలికలు ఒక్కోసారి బరితెగిస్తున్నారు. తెలిసీ తెలియని వయసులో అభ్యంతరకరమైన పనులు చేస్తూ సైబర్ క్రైమ్ ఠాణాల వరకు వస్తున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో ఈ తరహా ఉదంతం ఒకటి సోమవారం వెలుగు చూసింది. తన క్లాస్మేట్ పేరుతో నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతా సృష్టించి, తమ సహ విద్యార్థినికి అసభ్య సందేశాలు పంపిస్తూ ఓ టెన్త్‌క్లాస్ విద్యార్థి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ విషయం సైబర్ క్రైమ్ పోలీసుల వరకు చేరడంతో అధికారులు నిందితుడికి, అతడి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి, నోటీసులు జారీ చేసి పంపారు. నగరంలోని రామ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ బాలుడు స్థానికంగా ఉన్న పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. నిత్యం తన తల్లిదండ్రులకు చెందిన స్మార్ట్ఫోన్లు ఇతడికి అందుబాటులో ఉండేవి. దీంతో తన క్లాస్మేట్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో తల్లి ఫోన్, తండ్రి ఫోన్లలో వేర్వేరుగా నకిలీ ఖాతాలు తెరిచాడు. అంతటితో ఆగకుండా వీటి ద్వారానే తన సహ విద్యార్థిని ఇన్‌స్ట్రాగామ్ ఖాతాకు అభ్యంతరకర సందేశాలు పంపడం మొదలెట్టాడు. ఈ విషయాన్ని ఆ విద్యార్థిని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు తొలుత ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతాలు ఎవరి పేరున ఉన్నాయో ఆ విద్యార్థిని నిలదీశారు. అతడి తల్లిదండ్రులకూ విషయం చెప్పారు. తాను ఆ పని చేయలేదని, తన పేరుతో తెరిచిన ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలు వినియోగించి ఎవరో ఇలా చేస్తున్నారని చెప్పాడు. దీంతో బాధిత బాలిక తల్లిదండ్రులు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతికంగా దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతాలు రెండు ఫోన్నంబర్ల ఆధారంగా పని చేస్తున్నట్లు తేలింది. అవి ఎవరివని ఆరా తీయగా దంపతులకు చెందినవిగా వెలుగులోకి వచ్చింది. వారి కుమారుడు ఈ బాలికతోనే విద్యనభ్యసిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు తల్లిదండ్రులతో సహా సదరు మైనర్‌నూ సోమవారం ఠాణాకు పిలిచిపించారు. పోలీసుల సమక్షంతో అతడి తల్లిదండ్రులు మందలించడంతో అది తన పనేనంటూ అంగీకరించాడు. ఆ బాలుడితో పాటు అతడి తల్లిదండ్రులకూ సైబర్ క్రైమ్ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆపై సదరు మైనర్‌కు నోటీసులు జారీ చేసిన అధికారులు ఇలాంటివి పునరావృతం కానీయొద్దంటూ అవగాహన కల్పించి పంపారు. స్మార్ట్ఫోన్లు చిన్నారులకు అందేలా ఉంచడం లేదా వారికోసమే ప్రత్యేకంగా ఖరీదు చేసి ఇవ్వడం ఇటీవల కాలంలో పెరిగిందని, ఆ ఫోన్ల ద్వారా పిల్లల కార్యకలాపాలను తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదని పోలీసులు చెబుతున్నారు. వీరంతా తమ పిల్లలు ఆ ఫోన్లలో గేమ్స్ ఆడుకుంటున్నట్లు భావిస్తున్నారని, అయితే కొందరు దీన్నే అలుసుగా తీసుకుని పెడదారి పడుతున్నారని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు. -
మాజీ స్నేహితురాలిని వేధించిన కేసులో నిందితుడి అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: మాజీ స్నేహితురాలిని ఆన్లైన్లో వేధించిన కేసులో నిందితుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ప్రస్తుతం ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో మేల్ నర్సుగా పని చేస్తున్న గణేష్ గతంలో కాచిగూడలోని ఆస్పత్రిలో పని చేశాడు. అప్పట్లో పరిచయమైన సహోద్యోగినితో స్నేహం చేశాడు. ఆ సందర్భంలో కొన్ని ఫొటోలు సేకరించి భద్రపరుచుకున్నాడు. ఆపై ఇద్దరూ వేర్వేరు చోట్ల స్థిరపడిన తర్వాత ఆమెను సోషల్‌మీడియా ద్వారా సంప్రదించిన అతను తనను ప్రేమించాలని వెంటపడ్డాడు. ఆమె తిరస్కరించడంతో అభ్యంతరకరమైన ఫొటోలు పంపి వేధిస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. -
టర్కీ తీసుకెళ్లి తస్కరించారు
సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ కేసులో రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు మరో నిందితుడిని పట్టుకున్నారు. ఈ ముఠా సృష్టించిన నకిలీ సర్టిఫికెట్లపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఈఏ) నుంచి స్టాంపింగ్ చేయించిన ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ వాసి సందీప్‌కుమార్‌ను అరెస్టు చేసినట్లు కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ గురువారం వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అధికారులు ముగ్గురిని కటకటాల్లోకి పంపిన విషయం విదితమే. ఢిల్లీలో స్థిరపడిన భోపాల్ వాసి అమ్రిష్ మెడికల్ టూరిజం ఏజెంట్‌గా పని చేసేవాడు. మొదట్లో చట్ట వ్యతిరేకమైన ‘అద్దెకు తల్లులు’ సరోగసీ నుంచి మొదలెట్టి ఆ తరవాత మానవ అవయవాల మార్పిడి వ్యాపారం వైపు మళ్లాడు. పలువురు డాక్టర్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ప్రభుత్వ అధికారులు, ఏజెంట్లు, బ్రోకర్లతో కుమ్మక్కై దందాకు పాల్పడుతున్నాడు. డబ్బు అవసరమున్న వారిని గుర్తించి వారి అవయవాలు మార్పిడి చేసి డబ్బు ఇవ్వకుండా మోసం చేసేవాడు. ఈ క్రమంలోనే ఇతడికి మరో ఇద్దరితో పరిచయం ఏర్పడింది. ముగ్గురూ ముఠాగా ఏర్పడి కిడ్నీల మార్పిడి దందా మొదలెట్టారు. ఒక్కో కిడ్నీ మార్పిడికి రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు రోగుల నుంచి వసూలు చేసేవారు. రోగులు, దాతలను శ్రీలంక రాజధాని కొలంబో, ఈజిప్ట్‌లోని కైరో, టర్కీలోని ఇజ్మిర్ ప్రాంతాల్లోని వివిధ ఆస్పత్రులకు తీసుకెళ్లి 40 కిడ్నీల క్రయవిక్రయాలు చేపట్టారు. వీటిలో అత్యధికంగా బోగస్ పత్రాలతో అక్రమంగా జరిగినవే. వీరిలో ఓ నిందితుడు ఫేస్బుక్లో రోహన్ మాలిక్ పేరుతో ఖాతా తెరిచి, కిడ్నీ అవసరముంటూ పోస్టు చేశాడు. దీనిని చూసిన రాచకొండ కమిషనరేట్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అతడిని సంప్రదించాడు. అనంతరం ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక ముఠా సభ్యుడు వాట్సాప్ ద్వారా ఇతడితో సంప్రదింపులు జరిపి కిడ్నీకి రూ.20 లక్షల వెలకట్టాడు. అతడు అంగీకరించడంతో ఢిల్లీకి తీసుకువెళ్లాడు. అక్కడికి వెళ్లిన బాధితుడిని నోయిడాలోని ఓ హోటల్లో ఉంచి వైద్య పరీక్షలు చేయించారు. బాధితుడు రోగి బంధువుగా నకిలీ సర్టిఫికెట్ సృష్టించారు. ఈ నకిలీ పత్రాల ఆధారంగా కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖకు స్టాంపింగ్ నిమిత్తం దాఖలు చేశారు. ఈ వ్యవహారాన్ని న్యూ ఢిల్లీలోని రోఖాదియా ఓవర్సీస్ కంపెనీకి చెందిన సందీ‹ప్ కుమార్ పర్యవేక్షించాడు. పత్రాలు నకిలీవని తెలిసీ స్టాంపింగ్ పూర్తి చేయించాడు. ఇలా పొందిన మెడికల్ వీసాపై బాధితుడిని టర్కీకి తీసుకెళ్లారు. అక్కడే అతడిని మోసం చేసి, బెదిరించి ఆపరేషన్ ద్వారా కిడ్నీ ‘తస్కరించారు’. అతికష్టమ్మీద నగరానికి తిరిగి వచ్చిన బాధితుడు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ హరినాథ్ నేతృత్వంలో ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు అమ్రిష్ సహా ఇద్దరిని గత నెలలో అరెస్టు చేశారు. ఎంఈఏలో తమ నకిలీ పత్రాలకు స్టాంపింగ్ పూర్తి చేయించడానికి తాము సందీప్ కుమార్‌కు రూ.10 వేల చొప్పున ఇచ్చే వారిమని బయటపెట్టారు. దీంతో అతడి కోసం గాలించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఉత్తరప్రదేశ్‌లో పట్టుకున్నారు. అక్కడి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై సిటీకి తీసుకువచ్చారు. ఈ గ్యాంగ్ దుబాయ్, వియత్నాం, చైనా, సింగపూర్, ఫిలీప్పిన్స్, బ్యాంకాక్, ఇండోనేషియా, మెక్సికోలకూ వెళ్లి వచ్చినట్లు తేలింది. దీంతో అక్కడా ఇలాంటి దందాలే చేశారా? అనే కోణంలో ఆరా తీçస్తున్నారు. -
కౌన్ బనేగా కరోడ్‌పతి లాటరీ తగిలిందని..
సాక్షి,సిటీబ్యూరో: ఉత్తరాదికి చెందిన సైబర్ నేరగాళ్లు ‘వజ్రాలు’ పేరు చెప్పి నగరానికి చెందిన ఇద్దరికి టోకరా వేశారు. వజ్రాలు పార్శిల్ చేస్తున్నామని ఒకరికి, కౌన్ బనేగా కరోడ్‌పతి(కేబీసీ) లాటరీ తగిలిందని మరొకరికి ఎర వేశారు. వీరి నుంచి ఏకంగా రూ.25.54 లక్షలు స్వాహా చేశారు. ఈ సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మెహిదీపట్నం వాసి రోజీ వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. గత ఏడాది నవంబర్‌లో ఆమెకు ఫేస్బుక్ ద్వారా మార్క్ స్కాట్ అని చెప్పుకున్న వ్యక్తి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దీన్ని ఆమె యాక్సెప్ట్ చేయడంతో ఇద్దరూ ఫేస్బుక్ఫ్రెండ్స్గా మారారు. కొన్నాళ్లు చాటింగ్ చేసిన ఇరువురూ ఒకరి వివరాలు మరొకరు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాను జర్మనీ దేశస్తుడినంటూ స్కాట్ ఆమెను నమ్మించాడు. కొన్నాళ్లకు ఫోన్ నెంబర్లు మార్చుకున్న ఇరువురూ మాట్లాడుకున్నారు కూడా. ఫోన్ నెంబర్ చేతికి చిక్కిన వెంటనే స్కాట్ తన ఫేస్‌బక్ ఖాతాను తొలగించాడు. అప్పటి నుంచి ఇరువురూ వాట్సప్ ద్వారా చాటింగ్, ఫోన్లు కొనసాగించారు. ఆమె తనను పూర్తిగా నమ్మిందని భావించిన తర్వాత స్కాట్ గత ఏడాది డిసెంబర్లో అసలు అంకానికి తెరలేపాడు. బహుమతిగా కొన్ని విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలు, ల్యాప్‌టాప్, హ్యాండ్ బ్యాగ్, ఐఫోన్, 35 వేల పౌండ్లు పార్శిల్ చేసి పంపుతున్నానంటూ సందేశం ఇచ్చాడు. డిసెంబర్ 14న బాధితురాలికి ఓ మహిళ నుంచి ఫోన్ వచ్చింది. తాను కస్టమ్స్ అధికారినంటూ పరిచయం చేసుకున్న ఆమె మీ పేరుతో పార్శిల్ వచ్చిందని, దాన్ని క్లియర్ చేయాలంటే రూ.38 వేలు చెల్లించాలని చెప్పింది. ఆపై వివిధ పేర్లు చెబుతూ బాధితురాలి నుంచి మొత్తం రూ.14.71 లక్షలు కాజేసింది. మోసపోయానని గుర్తించిన ఆమె సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించింది. బండ్లగూడ వాసికి ‘కేబీసీ’ పేరుతో.. మరోపక్క చంద్రాయణగుట్ట పరిధిలోని బండ్లగూడకు చెందిన సాహిమ్ సుల్తానాకు ఐదు నెలల క్రితం మమతాదేవి అనే మహిళ నుంచి ఫోన్ వచ్చింది. ‘కేబీసీ’ లాటరీలో ప్రైజ్ మనీ రూ.8 కోట్లు గెలుచుకున్నారని, ఆ డబ్బు మీకు చెందాంటే కొంత ప్రాసెసింగ్ ఫీజు చేయాలని ఎర వేసింది. ఇతర వివరాలు ముంబై ఆఫీస్ వాళ్లు చెప్తారంటూ చెప్పింది. కొన్నాళ్లకు ముంబైలోని కేబీసీ కార్యాలయం నుంచి ఠాకూర్ ప్రతాబ్సింగ్ను మాట్లాడుతున్నానంటూ మరో వ్యక్తి కాల్ చేశాడు. డబ్బు అందుకోవడానికి ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ, ఆర్బీఐ ఫీజు తదితరాలు చెల్లించాలంటూ దఫదఫాలుగా రూ.14.83 లక్షలు వివిధ బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకున్నాడు. అనంతరం ఎలాంటి సమాచారం గాని, ఫోన్ నంబర్లు కానీ పనిచేయలేదు. దీంతో మోసపోయాని గుర్తించిన ఆమె కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. -
సైబర్ మాయలో పడొద్దు
నాగోలు: టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా యువత, ఉద్యోగులు ఫోన్ ద్వారానే బ్యాంకు లావాదేవీలు, క్రెడిట్, డెబిట్ కార్డులు చెల్లింపులు చేయడంతో ఇదే అదునుగా భావించిన సైబర్ నేరగాళ్లు, క్రెడిట్, డెబిట్ కార్డుల నెంబర్లను సులువుగా సంపాదిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాలు జరగకుండా సైబర్ సెల్ పోలీసులు నిరంతరం అవగాహన కల్పిస్తూ పలు ప్రాంతాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు ప్రజలు మోస పోకుండా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలసుకోవాలని సూచిస్తున్నారు. సైబర్ మాయగాళ్ల గురించి తెలిపేందుకు వాల్‌పోస్టర్లు, బ్యానర్లు, వాట్సప్ గ్రూప్స్‌లలో వివరాలు తెలియజేస్తూ అవి మరో ముగ్గురికి పంపేలా అవగాహన కల్పిస్తున్నారు. ఆధార్ సిమ్ కార్డు లింక్ అంటూ చాలా మంది యువతులతో ఫోన్ చేయించి బ్యాంకు ఖాతా వివరాలు లూఠీ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిసున్నారు. పోలీసుల సూచనలు... ♦ బ్యాంకు అధికారులమని అపరిచిత వ్యక్తులు ఫోన్ చేస్తే నమ్మవద్దని, మీ బ్యాంకు వివరాలు కావాలంటే స్వయంగా బ్యాంకుకు వెళ్లి తెలుసుకోవాలి. ♦ గుర్తు తెలియని వ్యక్తులకు ఖాతా, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు లియజేయవద్దు. బ్యాంకు ఖాతా, పిన్ నంబర్ అడిగితే మోసంగా భావించి సమాధానాలు చెప్పవద్దు. ♦ కంప్యూటర్లకు, ల్యాప్‌టాప్‌లకు పాస్వర్డ్ పెట్టుకోవాలి. వ్యక్తిగత వివరాలు ఫోన్లో ఇతరులకు చెప్పకూడదు. ♦ అనుమానాస్పద ఈ మెయిల్స్, ఫోన్స్, మెసేజ్‌లు వస్తే స్పందిచరాదు. – అనుమానాస్పద ఫ్రెండ్ రిక్వెస్ట్, చాటింగ్ మెయిల్స్ తెరవవద్దు. సోషల్ మీడియాలో బ్యాంకు ఖాతాలు, డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు షేర్ చేయొద్దు. ♦ మొబైల్స్‌కు వచ్చే ఓటీ పీ నెంబర్లను ఇతరులకు ఎవరికీ చెప్పవద్దు. తెలియని ఖాతాలకు నగదు బదిలీ చేయవద్దు. ♦ వ్యక్తిగత సమాచారం ఫొటోలు, వీడియోలు, ఉద్యోగం చేసే చిరునామా, ఇంటి చిరునామా, ఇతర విషయాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయరాదు. నిరంతరం మెసేజెస్ పంపినట్లు అనుమా నం వస్తే వెంటనే సైబర్ పోలీసులకు తెలపాలి. సైబర్ నేరాలు జరగకుండా అవగాహన అన్ని ప్రాంతాల్లో సూచిక బోర్డుల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు రాచకొండ సైబర్ సెల్ ఏసీపీ హరినాథ్ తెలిపారు. ప్రజలను బురిడీ కొట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. వివరాలకు 9490617111, 18004256235 నెంబర్లకు ఫోన్ చేయాలన్నారు.–రాచకొండ సైబర్ సెల్ ఏసీపీ హరినాథ్ -
బావ కోసం వచ్చి... బందిపోట్లకు దొరికాడు!
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసులు సైబర్ క్రైమ్‌లో అరెస్టు చేసిన బావను కలవడానికి మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ చర్లపల్లి జైలుకు వచ్చాడు... మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు మర్డర్ కేసులో అరెస్టు చేసిన స్నేహితులను కలిసేందుకు నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అదే సమయంలో జైలుకు వెళ్లారు. ములాఖత్ సందర్భంగా వారికి పరిచయం ఏర్పడింది. మధ్యప్రదేశ్ వ్యక్తిని టార్గెట్ చేసుకున్న వారు శంషాబాద్ వరకు లిఫ్ట్ ఇస్తామంటూ పాతబస్తీకి తీసుకువెళ్లి మరికొందరితో కలిసి బందిపోటు దొంగతనానికి పాల్పడ్డారు... ఈ కేసు ఛాలెంజ్‌గా తీసుకున్న సౌత్‌జోన్ పోలీసులు 40 గంటల్లో ఛేదించి ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. గురువారం నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ డీసీపీ అంబర్ కిషోర్ ఝా, అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్, ఏసీపీ బి.అంజయ్యలతో కలిసి వివరాలు వెల్లడించారు. ఆ గంటే వారికి కలిసొచ్చింది... మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ప్రాంతానికి చెందిన సంపిల్ ప్రజాపతిని ఓ సైబర్ నేరంలో సైబరాబాద్ పోలీసులు ఈ నెల 4న అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చారు. చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అతడిని చూసేందుకు అతడి బావమరిది దీపాంజయ్ బుందేలా గత శుక్రవారం నగరానికి వచ్చాడు. మంగళవారం వరకు కూకట్‌పల్లిలోని ఓ హోటల్లో ఉన్న అతను అదేరోజు సాయంత్రం తిరిగి వెళ్లాల్సి ఉండటంతో ములాఖత్‌లో తన బావను కలిసేందుకు చర్లపల్లి జైలు వద్దకు వెళ్లాడు. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు ఓ హత్య కేసులో అరెస్టు చేసిన అఫ్రోజ్ ఖాన్, మహ్మద్ నవాజ్‌లను కలిసేందుకు అదే రోజు కాలాపత్తర్‌కు చెందిన సయ్యద్ యూసుఫ్, సయ్యద్ జైనుల్ అబిదిన్ అక్కడికి వచ్చారు. దీపాంజయ్ బుందేలా ములాఖత్ నం.68 కాగా... వీరిది 69. భోజనవిరామ సమయం కావడంతో దాదాపు గంటపాటు అక్కడే వేచి ఉండాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే దీపాంజయ్‌తో యూసుఫ్, అబిదిన్ పరిచయం పెంచుకున్నారు. ములాఖత్ అనవంతరం బయటకు వచ్చిన దీపాంజయ్ శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లాలని భావించాడు. క్యాబ్ పేరు చెప్పి సమాచారం... అదే సమయంలో అక్కడికి వచ్చిన యూసుఫ్, అబిదిన్ తామూ అటు వైపే వెళ్తున్నామని, శంషాబాద్ వరకు విడిచిపెడతామని చెప్పారు. ఇందుకుగాను రూ.200 చెల్లించాలని ఒప్పందం చేసుకుని ముందే ఇవ్వాలని కోరారు. దీంతో దీపాంజయ్ డబ్బులు చెల్లించేందుకు తన జేబులో ఉన్న రూ.18 వేలు బయటకు తీశాడు. ఆ నగదు చూసిన వెంటనే దోచుకోవాలని పథకం వేసిన ఇద్దరూ... తమకు పరిచయస్తుడైన ఓ క్యాబ్ డ్రైవర్ ఉన్నాడని, విమానాశ్రయంలో దింపడానికి శంషాబాద్‌కు రమ్మంటామంటూ దీపాంజయ్‌తో చెప్పారు. పథకం ప్రకారం తమ స్నేహితులైన మహ్మద్ నదీమ్ ఖురేషీ, మీర్ మౌజమ్ అలీ, మహ్మద్ ఖలీలుద్దీన్, మహ్మద్ ఇబ్రహీం, మహ్మద్ అలీ ఖురేషీలకు తమ పథకంపై సమాచారం ఇచ్చారు. క్యాబ్ డ్రైవర్‌తో మాట్లాడుతున్నామంటూ బాధితుడికి చెబుతూనే వారందరినీ కాలాపత్తర్‌లోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో కాపుకాయమని చెప్పారు. దీపాంజయ్‌ని అక్కడికి తీసుకువెళ్లాక ఏడుగురూ కలిసి బందిపోటు దొంగతనానికి పాల్పడ్డారు. అతడి వద్ద ఉన్న నగదు, చెవులకు ఉన్న బంగారు కమ్మలు తదితరాలను లాక్కున్నారు. ఈ సందర్భంలో బాధితుడిని బెదిరిస్తూ తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. ములాఖత్ రిజిస్టర్ ఆధారంగా... దీపాంజయ్‌ను సమీపంలోని ఏటీఎంకు తీసుకువెళ్లిన దుండగులు డబ్బు తీసివ్వాలని బలవంతం చేశారు. అయితే తెలివిగా వ్యవహరించిన అతను తప్పు పిన్ నెంబర్ ఎంటర్ చేసి లావాదేవీ పూర్తి కాకుండా చేశాడు. ఏటీఎం సెంటర్ సమీపంలో రద్దీ ఉన్న రోడ్డు కనిపించడంతో వారిని విదిలించుకున్న బాధితుడు ఆటో ఎక్కి కాలాపత్తర్ ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీనిపై సమాచారం అందడంతో కొత్వాల్ సహా ఉన్నతాధికారులంతా పోలీసు స్టేషన్‌కు వచ్చి బాధితుడితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. నిందితులు ఇతడిని ములాఖత్ సమయంలో కలిసినట్లు తేలడంతో జైళ్ల శాఖను సంప్రదించి ములాఖత్ రిజిస్టర్‌లోని వివరాలను సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్, చార్మినార్ ఏసీపీ బి.అంజయ్య నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఫిర్యాదు చేస్తాడనుకోలేదు... మంగళవారం రాత్రి నుంచి ముమ్మరంగా గాలించిన ఈ బృందాలు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల ఫొటోలు సేకరించాయి. తొలుత యూసుస్, అబిదీన్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిచ్చిన సమాచారంతో మిగిలిన ఐదుగురినీ పట్టుకుని సొత్తు, కారు రికవరీ చేశా యి. విచారణ నేపథ్యంలో నిందితులు తాము చిక్కుతామని అనుకోలేదంటూ చెప్పుకొచ్చారు. ములాఖత్ సమయంలో తమకు దీపాంజయ్ సాయంత్రం 6 గంటలకు విమానం ఎక్కాలంటూ టిక్కెట్లు చూపించాడని, దోచుకున్నప్పటికీ అతడు భయంతో వెళ్లిపోతాడనుకున్నామని చెప్పుకొచ్చా రు. నిందితుల్లో యూనుస్, ఖలీల్, ఇబ్రహీంలపై 2015లో పీడీ యాక్ట్ ప్రయోగించినట్లు కొత్వాల్ తెలిపారు. నేరగాళ్లు మారితే వారికి అన్ని రకాలుగానూ సహకరిస్తామన్న ఆయన నేరాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తన కేసుకు కీలక ప్రాధాన్యం ఇచ్చిన హైదరాబాద్ పోలీసులు బెస్ట్ అని, తమ ప్రాంతంలోనూ ఇంత సత్వర స్పందన ఉండదని బాధితుడు దీపాంజయ్ సీపీకి కృతజ్ఞతలు తెలిపారు. -
వాట్సాప్‌లో మహిళకు వేధింపులు
బనశంకరి : సామాజిక మాధ్యమాల్లో మహిళ అర్ధనగ్న ఫొటో పెట్టి ఆమెను వేధించిన సంఘటనపై సై బర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మహిళ అర్దనగ్న ఫొటోను ఆమె భర్తకు పంపించడంతో వారి సం సారంలో మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో మహిళ సోదరుడు సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. మహిళ భర్తకు వాట్సాప్‌లో ఫొటో పంపించారు. అదే విధంగా పలువురుకి వాట్సాప్‌ల ద్వారా ఫొటో పంపించడంతో దంపతుల మధ్య గొడవలు వచ్చి విడాకుల వరకు వెళ్లింది. మహిళ భర్త ఇంటిని వదిలిపెట్టి వెళ్లిపోయాడు ఈ నేపద్యంలో మహిళ సోదరుడు సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేయడంతో, పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. -
ఫేస్.. బుక్..!
ఫేస్బుక్ ద్వారా తప్పుడు పనులు చేస్తున్నారా..? ‘గుర్తించలేరు.. పట్టుకోలేరు..’ అనుకుంటున్నారా..? సైబర్ ల్యాబ్ టీం.. మీపై ఓ కన్నేసి ఉంచింది...! ఏ క్షణాన్నయినా మీ ‘ఫేస్’ను ‘బుక్’ చేస్తుంది..!! నమ్మలేకపోతున్నారా..? అసాధ్యమనుకుంటున్నారా...? అయితే, మీరు తప్పకుండా ఇది చదవాల్సిందే... ఖమ్మంక్రైం: ఫేస్బుక్ నకిలీ అకౌంట్లతో అమ్మాయిలను మోసగిస్తున్న ఇద్దరిని ఖమ్మం సైబర్ ల్యాబ్ బృందం ‘బుక్’ చేసింది. ఈ సైబర్ ల్యాబ్ బృందాన్ని పోలీస్ కమిషనర్(సీపీ) తఫ్సీర్ ఇక్బా ల్ అభినందించారు. నగరంలో గురువారం విలేకరుల సమావేశంలో సీపీ వెల్లడించిన వివరాలు... ప్రేమ.. పెళ్లి.. ప్రమాదం.. లక్షలు.. స్వాహా ఖమ్మం నగరానికి చెందిన కృష్ణ (అసలు పేరు కాదు) ఫేస్బుక్ అకంట్ను ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ జులాయి హ్యాక్ చేశాడు. అందులోగల కృష్ణ, ఫోటోలు, వివరాలతో నకిలీ ఖాతా తెరిచాడు. తాను డాక్టర్‌నని పరిచయం చేసుకుంటూ ఎన్ఆర్ఐలు, డాక్టర్లయిన యువతులతో చాటింగ్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. వాట్సాప్ వాయిస్ కాల్స్, వాట్సాప్ చాటింగ్, ఫోన్ కాల్స్ ద్వారా వారికి దగ్గరయ్యాడు. ప్రేమ.. పెళ్లి పేరుతో వల విసిరాడు. పెళ్లి వరకు తీసుకొచ్చాడు. అప్పుడు, తనకు హార్ట్ ఎటాక్ వచ్చిందనో.. రోడ్డు ప్రమాదం జరిగిందనో అబద్ధాలు చెప్పేవాడు. అత్యవసర చికిత్స కోసం డబ్బు కావాలనేవాడు. ఇదంతా నిజమేనని అవతలి వారు నమ్మేవారు. ‘‘నువ్వు నా కాబోయే భార్యవే కదా..! నీ డబ్బొకటి.. నా డబ్బొకటా..?!’’ అనేవాడు. అవతలి వారు పూర్తిగా పడిపోయి, అతడి అకౌంట్లో డబ్బులు వేసేవారు. ఇలా కొందరిని నుంచి లక్షల రూపాయలు గుంజాడు. తన అకౌంట్ హ్యాక్ చేశారన్న విషయం ఖమ్మంలోని కృష్ణకు తెలియలేదు. దీనిని, విదేశాలలో సైకాలజిస్ట్‌గా పనిచేస్తున్న అతడి మిత్రురాలైన ఓ యువతి ముందుగా గమనించింది. వెంటనే కృష్ణను అప్రమత్తం చేసింది. అతడు నేరుగా పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్‌కు ఫిర్యాదు చేశాడు. కమిషనర్ ఆదేశాలతో కేసు నమోదైంది. ఖమ్మం సైబర్ ల్యాబ్ బృందం రంగంలోకి దిగింది. నిందితుడు కేవలం ఫేస్బుక్ లో చాటింగ్ చేస్తున్నాడు. వీడియో కాల్ మాట్లాడేవాడు కాదు. అయినప్పటికీ, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆ మోసగాడిది ఆదిలాబాద్ జిల్లాగా సైబర్ ల్యాబ్ బృందం కనిపెట్టింది. ఖాతా హ్యాక్.. ఫొటోల తస్కరణ... ఖమ్మం నగరానికి చెందిన ఓ యువతి ఫేస్బుక్ ఖాతాను ఒకడు హ్యాక్ చేశాడు. ఆమె పేరుతో అసభ్యకరమైన ఫొటోలను అందులో నుంచి అందరికీ పంపుతున్నాడు. ఒకసారి ఆమె ఫేస్బుక్ ఖాతాలో ఈ ఫోటోలను ఆమె సోదరుడు చూశాడు. ఆమెను నిలదీశాడు. తనకు ఏ పాపం తెలియదని, ఎవరో కావాలనే ఇలా చేస్తున్నారని ఆమె నెత్తీనోరు బాదుకుంది. తన సోదరుడితో కలిసి పోలీసులను ఆమె ఆశ్రయించింది. కేసు నమోదైంది. ఖమ్మం సైబర్ ల్యాబ్ కేంద్రం రంగంలోకి దిగింది. ఆ మోసగాడిని, ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉన్నట్టుగా కనుగొంది. మోసగాడి గుర్తింపు కారేపల్లికి చెందిన వాడి పేరు నవీన్ కుమార్. అదే ప్రాంతానికి చెందిన బాలికను ప్రేమపేరుతో నమ్మించాడు. ఆమెను తీసుకుని ఎటో వెళ్లిపోయా డు. తన సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. ఆ బాలిక తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సైబర్ ల్యాబ్ బృందం రంగంలోకి దిగింది. ‘సోషల్ మీడియా అనాలిసిస్ టూల్స్’ ద్వారా వారిద్దరూ తిరువూరు వద్ద ఉన్నట్టుగా కనిపెట్టారు. అతడిని వెంటనే అరెస్ట్ చేశారు. ఇప్పటికి 43 కేసులు కొలిక్కి.. జిల్లాలోని సైబర్ ల్యాబ్ బృందం గణనీయ ఫలితాలు సాధిస్తోంది. ఇది ఇప్పటివరకు 43 కేసులను ఛేదించింది. ఈ సైబర్ ల్యాబ్ బృందం ఎస్ఐ చంద్రమోహన్, సిబ్బంది శ్రీనివాస్, సురేష్, ప్రసాద్, వైవి.కృష్ణారావు, రాధాకృష్ణను పోలీస్ కమిషనర్(సీపీ) తఫ్సీల్ ఇక్బాల్ ప్రత్యేకంగా అభినందించారు. ‘‘సోషల్ మీడియా ద్వారా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దిగితే... సోషల్ అనాలసిస్ టూల్స్ ద్వారా మొత్తం సమాచారం మాకు కొన్ని క్షణాల్లోనే తెలిసిపోతుంది, కాబట్టి.. అనవసరమైన విషయాలు, సంఘ వ్యతిరేకమైన పోస్టింగులతో ఇబ్బందులుపాలు కావద్దు’’ అని సీపీ హెచ్చరించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ సురేష్‌కుమార్ పాల్గొన్నారు. -
ఫేస్‘బుక్కైపోయింది’!
సాక్షి, సిటీబ్యూరో: ఫేస్బుక్లో పరిచయమయ్యాడు... తిరుపతిలో ఉంటున్నానని చెప్పాడు... ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఎర వేశాడు... ఏడాదిన్నర పాటు ఏమార్చి రూ.14.5 లక్షలు కాజేశాడు... మోసపోయినట్లు తెలుసుకుని వేడుకోగా రూ.64 వేలు తిరిగి చెల్లించాడు... మిగిలిన మొత్తం ఇవ్వమంటే చేతనైంది చేసుకోమన్నాడు... దీంతో బాధితురాలు బుధవారం సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్ తివారీ దర్యాప్తు ప్రారంభించారు. పౌర సరఫరాల శాఖ పేరు చెప్పి... బాగ్ అంబర్‌పేటకు చెందిన ఓ వివాహిత ఆధ్యాత్మిక సంస్థలో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తోంది. ఈమెకు 2017లో ఫేస్బుక్ ద్వారా షేక్ ఇల్వాజ్ అహ్మద్‌గా చెప్పుకున్న వ్యక్తి పరిచయమయ్యాడు. కొన్నాళ్లకు తాను తిరుపతిలో పౌర సరఫరాల శాఖలో పని చేస్తున్నానని, తెలంగాణలోని సదరు విభాగంలో హైదరాబాద్ కేంద్రంగా పని చేసేందుకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఎర వేశాడు. ఆమె నమ్మడంతో తన ఫోన్ నంబర్ ఇచ్చాడు. కచ్చితంగా ఉద్యోగం ఇప్పిస్తానంటూ చెప్పిన ఇల్వాజ్ అందుకు కొంత ఖర్చవుతుందని పేర్కొంటూ తిరుపతికి చెందిన ఎస్బీఐ బ్యాంకు ఖాతా నంబర్ ఇచ్చాడు. ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు, డిపాజిట్లు వద్దని చెప్పిన అతను కేవలం క్యాష్ డిపాజిట్ మెషిన్స్ (సీడీఎం) ద్వారానే చెల్లించాలని సూచించాడు. రూ.వేలు కోరుతూ.. లక్షలు స్వాహా... 2017 మార్చిలో వివాహిత నుంచి డబ్బు గుంజడాన్ని ప్రారంభించిన ఇల్వాజ్ గత నెల 23 వరకు కొనసాగించాడు. ప్రతి సందర్భంలోనూ రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకు సీడీఎం ద్వారా డిపాజిట్ చేయించుకుంటూ రూ.14.5 లక్షలు స్వాహా చేశాడు. భర్తకు తెలియకుండా తన వద్ద ఉన్న డబ్బుతో పాటు బంగారు ఆభరణాలు విక్రయించి, పరిచయస్తులు, స్నేహితుల వద్ద అప్పు చేసి ఈ మొత్తం చెల్లించింది. లావాదేవీలకు సంబంధించిన స్లిప్స్ ఆధారంగా అనుమానించిన కుటుంబ సభ్యులు నిలదీయడంతో అసలు విషయం బయటపెట్టింది. దీంతో ఆమెతో పాటు కుటుంబీకులు ఇల్వాజ్ ఇచ్చిన నంబర్లను సంప్రదించారు. కొన్ని రోజులు వేడుకోగా రూ.63,800 తిరిగి చెల్లించాడు. ఆపై బెదిరింపులకు దిగడంతో పాటు డబ్బు ఇవ్వనని, చేతనైంది చేసుకోమంటూ హెచ్చరించాడు. దీంతో బాధితురాలు బుధవారం సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. పెళ్లి పేరుతో రూ.4.69 లక్షలు కేవలం 24 గంటల వ్యవధిలో మరో మ్యాట్రిమోనియల్ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో బాధితురాలిని కలవడానికి వస్తున్నానంటూ చెప్పిన ‘విదేశీ పెళ్లి కొడుకు’ కస్టమ్స్ విభాగం పేరు చెప్పి, వివిధ పేర్లతో ఫోన్లు చేయించి రూ.4.69 లక్షలు కాజేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బెంగళూరుకు చెందిన ఓ యువతి నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో మార్కెటింగ్ మేనేజర్‌గా పని చేస్తోంది. ఈమె తన ప్రొఫైల్‌ను రెండు నెలల క్రితం భారత్ మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకున్నారు. జూన్ 17న ఈమెకు విజయ్‌కుమార్ అనే వ్యక్తి నుంచి ఫ్రొఫైల్ వచ్చింది. పెట్రోకెమికల్ ఇంజినీరైన తాను ప్రస్తుతం బేనిన్లో ఉన్న సౌత్ అట్లాంటిక్ పెట్రోలియం లిమిటెడ్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు అందులో పొందుపరిచాడు. తన మెయిల్ ఐడీతో పాటు ఫోన్ నంబర్ కూడా పంపడంతో ఇద్దరూ చాటింగ్ చేసుకున్నారు. తాను భారత్‌కు వస్తున్నట్లు జూలై 18న విజయ్‌కుమార్ సందేశం ఇచ్చాడు. ఆ మరుసటి రోజే ఖతర్ కస్టమ్స్ కార్యాలయం నుంచి అంటూ బాధితురాలికి ఫోన్ వచ్చింది. విజయ్‌కుమార్ మీకు తెలుసా అంటూ వారు అడగడంతో ఔనని సమాధానం చెప్పింది. ఆ తర్వాత పలు మార్లు ఫోన్లు చేసిన సైబర్ నేరగాళ్లు సాంకేతిక కారణాలతో విజయ్‌కుమార్ ప్రయాణాన్ని అంగీకరించమని, అతడు భారత్‌కు రాలేడని చెప్పారు. ఓ దశలో ఆమెతో మాట్లాడిన విజయ్‌కుమార్ వారు చెప్పిన మొత్తాలు చెల్లించాలని, తాను వచ్చాక తిరిగి ఇస్తానంటూ చెప్పాడు. ఇలా వివిధ దఫాలుగా ఆమె నుంచి రూ.4.69 లక్షలు కాజేయడంతో బాధితురాలు బుధవారం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. నేరుగా చూడనిదే నమ్మవద్దు ఉద్యోగం పేరు చెప్పినా, వివాహమంటూ ప్రతిపాదించినా నేరుగా చూడనిదే ఎవరినీ నమ్మవద్దు. ఇలాంటి మోసగాళ్లు ఏ దశలోనూ తమ నిజమైన పేర్లు, వివరాలు చెప్పరు. వీరు వినియోగించే సెల్ఫోన్లు, బ్యాంకు ఖాతాలు కూడా బోగస్‌వే. బాధితుల అమాయకత్వం, అత్యాశే వీరికి పెట్టుబడి. కేవలం ఫోన్‌కాల్స్, ఫేస్బుక్, మ్యాట్రిమోనియల్ ప్రొఫైల్స్ చూసి వివాహమంటూ ఆశలు పెట్టుకోవద్దు. ఇక ఉద్యోగాల విషయానికి వస్తే ప్రభుత్వ రంగంలో అడ్డదారిలో పొందటం అసాధ్యం.ఇలాంటి మోసగాళ్ల వల్లో పడకుండా ఎర వే సిన వారి వివరాలు పోలీసులకు అందించాలి.– విజయ్ ప్రకాష్తివారీ, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ -
నాది ముంబై.. చికెన్ బిర్యానీ కావాలి!
సాక్షి, హైదరాబాద్: ముంబైకి చెందిన మన్సూర్ షేక్ అమెరికాలో ఉంటూ అక్కడ హైదరాబాద్‌కు చెందిన యువతిని వేధించాడు... దీంతో బాధితురాలు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇండియాకు డిపోర్ట్ అయ్యాడు... ముంబై కేంద్రంగా ఆమె కుటుంబీకులకూ నరకం చూపడం ప్రారంభించాడు.. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు... న్యాయస్థానం అనుమతితో బుధవారం కస్టడీలోకి తీసుకున్న తర్వాత పోలీసులకు ‘కష్టాలు’ మొదలయ్యాయి... భోజనంతో పాటు ఇతర అంశాల్లో మన్సూర్ కోరికలు చూసిన అధికారులు ఆశ్చర్యపోతున్నారు. ముంబైకి చెందిన మన్సూర్ షేక్ కొన్నేళ్ళుగా అమెరికాలో ట్రాన్స్‌పోర్టు కంపెనీ నిర్వహిస్తున్నాడు. నగరంలోని నాంపల్లికి చెందిన ఓ యువతి విద్యాభ్యాసం నిమిత్తం కొన్నేళ్ళ క్రితం అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తోంది. ఆమెతో మన్సూర్‌కు పరిచయం ఏర్పడటంతో ఇద్దరూ సన్నిహితంగా మెలిగారు. వ్యసనపరుడైన మన్సూర్‌కు పలువురు యువతులతో సంబంధాలు ఉన్నట్లు తెలుసుకున్న ఆమె అతడిని దూరంగా ఉంచింది. అయినా తన పంథా మార్చుకోని మన్సూర్ పెళ్లి పేరుతో ఆమెను వేధించడం మొదలెట్టాడు. వేధింపులు తారా స్థాయికి చేరడంతో బాధితురాలు అమెరికా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన అక్కడి అధికారులు మన్సూర్‌ను డిపోర్టేషన్ (బలవంతంగా తిప్పిపంపడం) ద్వారా ముంబైకి పంపించారు. అయినా తన వైఖరి మార్చుకోని అతను ఎలాగైనా అమెరికాలో ఉన్న ఆ యువతినే వివాహం చేసుకోవాలని భావించాడు. హైదరాబాద్‌లో ఉంటున్న యువతి కుటుంబీకులను సంప్రదించి పెళ్లి విషయం మాట్లాడాడు. తమ కుమార్తెకు అభ్యంతరం లేకపోతే తమకు అభ్యంతరం లేదన్నారు. ఈ విషయాన్ని వారు అమెరికాలో ఉన్న యువతికి చెప్పగా.. ఆమె వివాహానికి ససేమిరా అందింది. దీంతో ఆమె కుటుంబీకులు మన్సూర్‌తో ఈ విషయం అక్కడితో వదిలేయాలని సూచించారు. దీంతో కక్షకట్టిన మన్సూర్ అమెరికాలోనే ఉంటున్న యువతి సోదరి, లండన్‌లో ఉంటున్న మరో సోదరిలతో మాట్లాడాడు. వీరికి సంబంధించిన కొన్ని ఫొటోలను బయటపెట్టి సంసారాలు పాడు చేస్తానంటూ బెదిరించాడు. ‘మీ కుమార్తె నాతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు ఉన్నాయి. వాటిని సోషల్‌మీడియాలో పెడతా’ అంటూ ఆమె కుటుంబసభ్యులను బెదిరిస్తున్నాడు. వారి ఫిర్యాదుతో సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మన్సూర్‌ను అరెస్టు చేసి సిటీకి తీసుకువచ్చి కోర్టు ద్వారా రిమాండ్‌కు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. సాధారణ నిందితులకు ఇస్తున్న మాదిరిగానే పప్పు భోజనం పెట్టాలనే ఉద్దేశంతో పోలీసులు వాటినే తెప్పించారు. అయితే తనది ముంబై అంటూ ఘీంకరిస్తున్న మన్సూర్ తాను పప్పు అన్నం తిననని, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, కోడిగుడ్లు కావాలంటూ డిమాండ్ చేస్తున్నా డు. ఇతడి నుంచి వివరాలు సేకరించడం పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. -
అక్రమ మ్యుటేషన్లు 2 వేలు...
⇒జీహెచ్ఎంసీలో వెలుగుచూసిన వైనం.. ⇒అత్యధికం ‘స్వలాభం’ కోసం చేసుకున్నవే ⇒ముగ్గురిని అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ కాప్స్ ⇒ఓ కేసులో తప్పించుకున్నా మరో కేసులో జైలుకు సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో ఏడాదిన్నరగా ఓ ముఠా అక్రమ మ్యుటేషన్లకు పాల్పడింది. ఆన్లైన్ రికార్డుల్లో ఒకరి నివాసాన్ని మరొకరి పేరిట మార్చేసింది. ఈ రకంగా దాదాపు రెండు వేల మ్యుటేషన్ల మార్పిడిలకు పాల్పడిన ముగ్గురు నిందితుల్ని సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేసినట్లు డీసీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. వీటిలో అత్యధికం ‘స్వలాభం’ కోసం యజమానులు చేయించుకున్నవే అని తేలింది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న సీసీఎస్ పోలీసులు ఇలా జరిగిన మ్యుటేషన్లు రద్దు చేయాల్సిందిగా జీహెచ్ఎంసీకి లేఖ రాయాలని నిర్ణయించారు. చిక్కడపల్లికి చెందిన బి.పోలయ్య జీహెచ్ఎంసీ మ్యుటేషన్ విభాగంలో డేటాఎంట్రీ ఆపరేటర్‌గా పని చేశారు. చీఫ్ వాల్యుయేషన్ అధికారి ఆదేశాల ప్రకారం ఆస్తులకు సంబంధించి వాటి యజమానుల పేర్లలో మార్పు చేర్పులు చేయడం ఇతడి విధి. గతంలో కొన్ని అవకతవకలకు పాల్పడిన నేపథ్యంలో పోలయ్యను ఫైర్ ప్రివెన్షన్ విభాగానికి బదిలీ చేశారు. ముటేషన్ విభాగంలో పని చేస్తున్నప్పుడు ఇతడికి కేటాయించిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్స్‌ను ఆన్లైన్లో రద్దు చేశారు. జీహెచ్ఎంసీకి ఆన్లైన్ సేవలు అందిస్తున్న సీజీజీ సంస్థలో గతంలో పని చేసి, ప్రస్తుతం జీహెచ్ఎంసీలో ఐటీ ప్రోగ్రామర్‌గా పని చేస్తున్న జగదీష్‌కు కొత్త యూజర్ ఐడీలు, పాస్వర్డ్స్ క్రియేట్ చేయడంలో సర్వర్ యాక్సస్ ఉంది. దీంతో పోలయ్యతో జతకట్టిన ఇతగాడు గతంలో రద్దు చేసిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్స్‌ను పునరుద్ధరించాడు. జీహెచ్ఎంసీలోనే డేటాఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్న ఎం.లఖన్సింగ్ సైతం పోలయ్యతో జతకట్టాడు. అక్రమ మ్యుటేషన్లు అవసరమైన పార్టీలను ఇతడు పోలయ్య వద్దకు తీసుకువచ్చేవాడు. ఒక్కో అక్రమ మ్యుటేషన్‌కు రూ.12 వేల వరకు తీసుకుంటున్న ఈ ముఠా ఆపై పంచుకుంటోంది. తన సెల్‌ఫోన్ ద్వారా పోలయ్య యూజర్ ఐడీ, పాస్వర్డ్స్ వినియోగించి జీహెచ్ఎంసీ సర్వర్లోకి ప్రవేశిస్తూ ఆన్లైన్లో ఉన్న యజమానుల పేర్లు అక్రమంగా మారుస్తున్నాడు. ఈ రకంగా గడిచిన ఏడాదిన్నర కాలంలో దాదాపు రెండు వేల అక్రమ మ్యుటేషన్లకు పాల్పడ్డాడు. ఇందులో అత్యధికం ఆస్తుల యజమానులు వారి స్వలాభం కోసం చేసుకున్నవే అని తేలింది. నిబంధనల ప్రకారం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని మ్యుటేషన్ చేసుకోవాలంటే సేల్‌డీడ్ సహా మరికొన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అయితే కొందరు స్థిరాస్తుల్ని కేవలం నోటరీ ద్వారా ఖరీదు చేస్తున్న నేపథ్యంలో సక్రమ మ్యుటేషన్లు సాధ్యం కావు. దీంతో వీరు లఖన్సింగ్ సహా మరికొందరు దళారుల సాయంతో పోలయ్యను ఆశ్రయించి పని పూర్తి చేయించుకున్నారు. ఈ అక్రమ మ్యుటేషన్ల వ్యవహారం ఈ ఏడాది ఫిబ్రవరిలో బంజారాహిల్స్ ఠాణా పరిధిలో వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్‌లో ఉన్న ఓ భవనాన్ని 2015 జూలైలో కె.కోటేశ్వరరావు నుంచి దొంగరి రమాబాయి ఖరీదు చేశారు. అప్పటి నుంచి రమాబాయి తన భవనానికి సంబంధించిన ఆస్తిపన్నును క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సైతం చెల్లించిన రమాబాయి వచ్చే ఏడాదికి సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడానికి ప్రయత్నించగా... ఆ భవనం గత ఏడాది డిసెంబర్ 13న కోటేశ్వరరావు పేరు మీదికి మారిపోయినట్లు అధికారులు చెప్పారు. దీనిపై బంజారాహిల్స్ ఠాణాలో నమోదైన కేసు సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ ఠాణాకు బదిలీ అయింది. ఏసీపీ కేసీఎస్ రఘువీర్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ పి.రవికిరణ్, ఎస్సై ఎస్.నరేష్ దర్యాప్తు చేశారు. ఈ కేసులో పోలయ్య, ఖన్సింగ్ తదితరులకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో అరెస్టును తప్పించుకున్నారు. ఆపై సోమాజిగూడకు చెందిన మహ్మద్ అబ్బాస్ నుంచి సైబర్ క్రైమ్ పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. తనకున్న 370 చదరపు గజాల్లో 220 చదరపు గజాల్ని పొరుగున ఉండే ఖాజా ఖుతుబుద్దీన్‌కు 2001లో విక్రయించారు. ఈ నెల 15న ఆస్తిపన్ను చెల్లించడం కోసం జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్ళిన అబ్బాస్ తన పేరిట ఉండాల్సిన మిగిలిన 150 చదరపు గజాల స్థలంలోని ఇల్లు సైతం ఖుతుబుద్దీన్ పేరుతో ఉన్నట్లు తెలుసుకుని కంగుతిన్నారు. దీంతో ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ పి.రవికిరణ్ జీహెచ్ఎంసీకి ఆన్లైన్ సేవలు అందిస్తున్న సీజీజీ సంస్థ నుంచి వివరాలు సేకరించారు. జీహెచ్ఎంసీ ఐపీ అడ్రస్‌ను అక్రమంగా మొబైల్ ఫోన్ నుంచి వినియోగించి ఈ మ్యుటేషన్ చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో పోలయ్య, లఖన్సింగ్, ఖుతుబుద్దీన్లను బుధవారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న జగదీష్ సహా మరికొందరి కోసం గాలిస్తున్నారు. ఈ అక్రమ మ్యుటేషన్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు వీళ్ళు చేసిన రెండు వేల మ్యుటేషన్ల జాబితా రూపొందిస్తున్నారు. నగరంలోని స్థిరాస్తుల యజమానులంతా మరోసారి జీహెచ్ఎంసీ ఆన్లైన్లో యాజమాన్యాన్ని సరిచూసుకోవాలని, అక్రమాలు జరిగినట్లు గుర్తిస్తే సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించాలని డీసీపీ అవినాష్ మహంతి సూచించారు. -
మాయ లేడీ
► మాట్రిమోనియల్ పేరుతో మోసం ► అందమైన యువతి ఫొటోతో ప్రొఫైల్ ► పెళ్లి పేరుతో సిటీకి చెందిన ఇద్దరికి టోకరా ► అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ కాప్స్ సాక్షి, సిటీబ్యూరో: అందమైన ఫొటోలు పెట్టడం... లేని విద్యార్హతలు, ఆస్తుల్ని ఆపాదించుకోవడం... వీటి ఆధారంగా మాట్రిమోనియల్ సైట్లలో ప్రొఫైల్స్ క్రియేట్ చెయ్యడం... ఆకర్షితులైన యువతుల్ని నిలువునా ముంచడం... ఇలాంటి మోసాలకు పాల్పడిన అరెస్టైన యువకుల కేసుల్ని ఇప్పటి వరకు చూశాం. అయితే ఇక్కడ సీన్ రివర్సయ్యింది. బెంగళూరుకు చెందిన ఓ యువతి ఇదే పంథాను అనుసరిస్తూ దేశ వ్యాప్తంగా 2600 మందికి గాలం వేసింది. ఈమె చేతిలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులూ మోసపోయారు. దీంతో రంగంలోకి దిగిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు సదరు యువతిని బుధవారం బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..బెంగళూరుకు చెందిన శ్రీలత అనే యువతి మాట్రిమోనియల్ సైట్ ఆధారంగా భారీ మోసానికి తెరలేపింది. తన పేరును సుస్మితగా పేర్కొంటూ ఇంటర్నెట్ నుంచి అందమైన యువతి ఫొటో డౌన్లోడ్ చేసుకుంది. వీటిని వినియోగించి ఓ మాట్రిమోనియల్ సైట్లో రిజిస్టర్ చేసుకుంది. 2600 మందికి టోకరా ఆ ప్రొఫైల్‌లో తనను హైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల యువతిగా పేర్కొన్న శ్రీలత సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నానని, నెలకు రూ.1.5 లక్షల జీతం వస్తోందని పేర్కొంది. దీంతో ఆమె ప్రొఫైల్‌లో దేశ వ్యాప్తంగా 2600 మంది లైక్ చేయడంతో పాటు వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చారు. అలా ఆకర్షితులైన వారిలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులూ ఉన్నారు. సిటీకి చెందిన ఓ యువకుడితో కొన్ని రోజుల పాటు ఫోన్లో మాట్లాడిన ‘సుస్మిత’ తనపై నమ్మకం పెంచుకుంది. హఠాత్తుగా ఓ రోజు తన పర్సు పోగొట్టుకున్నానంటూ రూ.40 వేలు అడిగింది. అప్పటికే ఆమెను పూర్తిగా నమ్మిన సదరు యువకుడు నగదు బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేశాడు. కొన్ని రోజులకు మళ్లీ డబ్బు అడగటంతో అనుమానం వచ్చిన అతను సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న అధికారులు డబ్బు డిపాజిట్ అయిన బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేశారు. సోదరుడి ఖాతాతో డబ్బు వసూలు ‘సుస్మిత’ డబ్బు డిపాజిట్ చేయించుకోవడానికి తన సోదరుడి ఖాతాను వాడింది. దీన్ని పోలీసులు ఫ్రీజ్ చేయించడంతో కంగుతిన్న అతడు సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించి డీ–ఫ్రీజ్ చేయాల్సిందిగా కోరాడు. నగర యువకుడితో సంభాషించడానికి సుస్మిత వాడిన ఫోన్ నెంబర్‌ను ఇతడికి చూపించిన అధికారులు ఆరా తీయగా... తన సోదరికి చెందినదిగా పేర్కొంటూ శ్రీలత ఫోటో చూపించాడు. దీన్ని చూసిన బాధితుడు ఒకింత షాక్‌కు లోనయ్యాడు. ఈ దర్యాప్తు సాగుతుండగానే నగరానికి చెందిన మరో ‘సుస్మిత’ బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించాడు. కొంతకాలం మాట్లాడిన ఆమె తన సమీప బంధువు చనిపోయాడంటూ రూ.2 లక్షలు బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయించుకున్నట్లు ఫిర్యాదు చేశాడు. ఈ రెండు కేసుల్ని నమోదు చేసుకున్న పోలీసులు బెంగళూరుకు ప్రత్యేక బృందాన్ని పంపారు. బుధవారం శ్రీలతను అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈమె మా ట్రిమోనియల్ ప్రొఫైల్‌పై 2600 మంది ఆకర్షితులు కావడంతో వారిలో ఎందరు బాధితులుగా మారారనేదానిపై ఆరా తీస్తున్నారు. -
‘ల్యాప్స్ పాలసీ’ల ఆధారంగా లూటీ
* బీమా మొత్తం ఇప్పిస్తామంటూ మోసాలు * ఢిల్లీ కేంద్రంగా కథ నడిపిన గ్యాంగ్ * పది మందిని అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ కాప్స్ * రూ.7.3 లక్షలు స్వాధీనం. రూ.1.5 కోట్ల ఫ్రీజ్ సాక్షి, హైదరాబాద్: ల్యాప్స్ అయిన ఇన్సూరెన్స్ పాలసీ డేటానే ఆధారం... ఢిల్లీలోని మీట్నగర్లోని కాల్‌సెంటర్ కేంద్రం... ఆరుగురు సూత్రధారులు... సీన్ కట్ చేస్తే దేశవ్యాప్తంగా కోట్ల రూపాయలు కోల్పోయిన బాధితులు... ఈ ఘరానా గ్యాంగ్ గుట్టును రట్టు చేసిన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు పది మంది నిందితుల్ని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.7.3 లక్షలు స్వాధీనం చేసుకున్నామని, వివిధ బ్యాంక్ ఖాతాల్లోని ఉన్న రూ.1.54 కోట్లు ఫ్రీజ్ చేశామని సంయుక్త పోలీసు కమిషనర్ టి.ప్రభాకరరావు వెల్లడించారు. సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్ఎంకే ఇస్మాయిల్‌తో కలసి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సేల్స్ ప్రమోషన్‌తో షురూ: ఢిల్లీలోని మీట్నగర్ ప్రాంతానికి చెందిన ఆరుగురు సూత్రధారులు రెండు నెలల క్రితం ఎమరిక్ కన్జూమర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, యునిక్ యాంబిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వివిధ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఖాతాదారులను వెతికే సేల్స్ ప్రమోషన్ ఈ కాల్‌సెంటర్ల ఉద్దేశం. ఇందుకు 200 మంది టెలీకాలర్స్‌ను నియమించారు. ఈ వ్యాపారం లాభసాటిగా లేకపోవడంతో మోసాలకు తెరలేపారు. గతంలో వివిధ ఇన్సూరెన్స్ కంపెనీల్లో పనిచేసి, వాటి కస్టమర్స్ డేటాను సంపాదించగలిగే ఏడుగుర్ని పాత్రధారులుగా చేశారు. వీరి ద్వారా ఆయా కంపెనీల్లో ‘ల్యాప్స్ పాలసీదారుల’ వివరాలు సేకరించారు. వివిధ ‘పేర్ల’తో టోకరా... ఈ డేటాబేస్ ఆధారంగా టెలీకాలర్స్ ల్యాప్స్ అయిన పాలసీ వివరాలు చెప్తూ ఖాతాదారులకు ఫోన్ చేసి నమ్మకం కలిగిస్తారు. బీమా మెచ్యూరిటీ మొత్తాన్ని ఇప్పిస్తామంటూ వల వేస్తారు. ఆకర్షితులైన వారికి దాని నిమిత్తం తమ సంస్థల్లో కొంత మొత్తం పెట్టుబడి పెట్టాలని షరతు విధిస్తారు. ఇండియా వాల్యూ కార్డ్ సహా 14 స్కీములు, సంస్థల పేరు చెప్పి డబ్బు డిపాజిట్ చేయించుకుంటారు. ఇలా నగదు డిపాజిట్ చేయడానికి అవసరమైన 45 బ్యాంకు ఖాతాలను లక్నోకు చెందిన ముగ్గురు నిందితులు తెరిచారు. డబ్బు డిపాజిట్ అయిన తరువాత వారి నెంబర్లు బ్లాక్ చేసేస్తారు. ఈ పంథాలో హైదరాబాద్‌కు చెందిన మాజీ పోలీసు అధికారి మహ్మద్ లియాఖత్ అలీఖాన్‌కు కూడా టోకరా వేశారు. రూ.8.15 లక్షలు మోసపోయిన ఆయన గత నెల 24న సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పది మంది అరెస్టు: సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేశారు. బ్యాంకు ఖాతాలతో సాంకేతిక ఆధారాలను బట్టి ముందుకు వెళ్లిన ప్రత్యేక బృందం ఢిల్లీలో ఏడుగురు పాత్రధారులు, లక్నోలో ముగ్గురు బ్యాంకు ఖాతాలు సమకూర్చిన వారిని అరెస్టు చేసింది. వీరి నుంచి పోలీసులు రూ.7.3 లక్షలు, మూడు ల్యాప్‌టాప్‌లు, 11 హార్డ్‌డిస్క్‌లు, 37 సెల్ఫోన్లు, 11 రిజిస్టర్లు స్వాధీనం చేసుకున్నారు. సూత్రధారులు ఢిల్లీకి చెందిన ప్రశాంత్ అరోరా, దీపక్ అరోరా, రాహుల్ విర్మానీ, జ్ఞానేశ్వర్, సమ్రత్ గుప్తా, పియూష్‌లు పరారీలో ఉన్నారు. దేశ వ్యాప్తంగా మోసపోయిన వారి వివరాలు హార్డ్‌డిస్క్‌లు విశ్లేషించడం ద్వారా తెలుస్తాయని ప్రభాకరరావు తెలిపారు. బాధితులు ఎవరైనా ఉంటే స్థానిక పోలీసు స్టేషన్లు లేదంటే సైబర్ క్రైమ్ పోలీసులకు 9490616648 (ఇన్స్పెక్టర్ ప్రసాద్), 9490616622 (ఏసీపీ ఇస్మాయిల్)కు ఫిర్యాదు చేయాలని కోరారు. చిక్కింది వీరే:ఢిల్లీకి చెందిన రాకేష్ కుమార్ మిశ్రా, ఉదయ్ మహాజన్, సర్దుల్ సిద్ధు, రాజీవ్‌సింగ్, రాజీవ్ వర్మ, దిల్బార్ కైంతురా, సరోజ్ కుమార్, లక్నో వాసులు అలోక్ శుక్లా, రమేష్ యాదవ్, ఇఫ్తెకారుద్దీన్. ఈ కంపెనీల పేర్లతోనే మోసాలు: ఇండియన్ వాల్యూ కార్డ్స్, ఇండియన్ సొల్యూషన్స్, యునిక్ సొల్యూషన్స్, స్టార్ క్లబ్, క్యాపిటల్ వాల్యూ, సిటీ వాల్యూ కార్డ్స్, స్టాండర్డ్ వాల్యూ, స్టాండర్డ్ సొల్యూషన్స్, ద అవెన్యూ, ఆమ్రో సొల్యూషన్స్, ఫ్యూచర్ సొల్యూషన్స్, యునిక్ యాంబిష్ ప్రైవేట్ లిమిటెడ్, సావరిన్ ఇన్సూరెన్స్ కంపెనీ, నాలెడ్జ్ యాంబిషన్స్.