ఆన్‌లైన్‌లో మోసం చేద్దాం, అమ్మాయిలను వేధించడం వంటి పనులు చేద్దాం అనుకునేవారు ఇక నుంచి జాగ్రత్తగా ఉండక తప్పదు. ఎందుకంటే కామాక్షి శర్మ మీ మోసాన్ని ఇట్టే కనుక్కొని, జైలు ఊచలను లెక్కపెట్టించగలదు. సైబర్ క్రైమ్ నివారణలో భాగంగా ప్రజలకు మాత్రమే కాదు 50,000 మంది పోలీసు సిబ్బందికి శిక్షణ ఇచ్చారు ఘజియాబాద్ వాసి పాతికేళ్ల కామాక్షి శర్మ. తను సాధించిన ఈ ఘనతకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో కామాక్షి శర్మ పేరు నమోదు అయ్యింది.
డిజిటల్ యుగంలోకి అడుగుపెట్టామని ఆనందించేలోపే అనర్థాలకు అడ్డూ ఆపూ లేకుండాపోయిందని నిత్యం బాధపడాల్సిన పరిస్థితులను చూస్తున్నాం. ఈ రోజుల్లో ప్రతిది ఆన్‌లైన్ వేదికగా మారిపోయాక మోసపూరిత అంశాలెన్నింటికో తెరతీసినట్టు అయ్యింది. డబ్బు, అమ్మాయిలను లైంగిక వేధింపులే లక్ష్యంగా చేసుకొని వేల కొద్ది మోసాలు జరుగుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయడానికి నిపుణులు ఎంతో కృషి చేస్తున్నారు. అయినప్పటికీ సైబర్ నేరాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో ఉంటున్న కామాక్షి శర్మ ఎందుకు సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయలేం అని పంతంతో కృషి చేస్తోంది. దీంట్లో భాగంగానే పోలీసు సిబ్బందితో కలిసి పని చేస్తోంది.
అభిరుచి వృత్తిగా మార్పు
కాలేజీలో రోజుల్లో సరదాగా నేర్చుకున్న హ్యాకింగ్ హాబీ కామాక్షిని సైబర్‌క్రైమ్ ప్రపంచంలో ప్రసిద్ధి చెందేలా చేసింది. హ్యాకర్లు హ్యాకింగ్ చేయడం ద్వారా మోసం చేయగలిగినప్పుడు పోలీసులు వారిని ఏ విధంగా పట్టుకోలేరో, ఎలా చేస్తే వారిని సులువుగా పట్టేయవచ్చో తెలియజెబుతారు కామాక్షి. ‘2017లో నేను బీటెక్ చేస్తున్నప్పుడు హ్యాకింగ్‌ని హాబీగా నేర్చుకున్నాను. నా ఫ్రెండ్సే వారి సొంత ఐడీలను ఇచ్చి, హ్యాక్ చేయమని చెప్పేవారు. ఆ విధంగా కాలేజీ అంతా నేను హ్యాక్ చేస్తానని గుర్తించేవారు. దీంతో హ్యాకింగ్‌లో మరిన్ని నైపుణ్యాలు నేర్చుకోవడానికి, ఆ తర్వాత రోజుల్లో అదే నన్ను ఈ వృత్తివైపుగా మరల్చడానికి దోహదం చేసింది. సైబర్ నేరాలు ఏ ఏవిధంగా పెరుగుతున్నాయి. వాటికి అడ్డుకట్ట వేయచ్చు అనే అంశాల మీద చాలా సాధన చేశాను. ఈ ఆలోచన ను దృష్టిలో పెట్టుకొనే పోలీసు అధికారులతో కలిసి పనిచేయడం ప్రారంభించాను. ఎన్నో నేరాలకు అడ్డుకట్టవేయగలిగాను’ అంటారామె.
35 రోజుల మిషన్
కరోనా మహమ్మారి సమయంలో చాలా మంది ప్రజలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ పేరుతో తమ ఇళ్ల నుండే పనులు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సైబర్ బెదిరింపు చాలా వేగంగా పెరిగింది. నేరగాళ్లు అమ్మాయిలను వేధించి తీసుకున్న ఫొటోలు, లక్షలాది రూపాయలు ప్రజల ఖాతాల నుండి దొంగలిస్తున్నారు. కామాక్షి 2019లో జమ్మూ నుండి కన్యాకుమారి వరకు 35 రోజుల సైబర్ క్రైమ్ మిషన్‌ను పూర్తి చేసింది. ఇందులో సైబర్ నేరాలను ఎలా ఎదుర్కోవాలో పోలీసు సిబ్బందితో కలిసి పర్యవేక్షించింది. ఈ పరీక్షలో ఐపీఎస్ అధికారులు కూడా పాల్గొన్నారు. కామాక్షి ఈ విషయం గురించి మరింతగా ప్రస్తావిస్తూ –‘హ్యాకింగ్ ద్వారా హాకర్లు మోసం చేయగలిగినప్పుడు పోలీసులు వారిని ఎందుకు పట్టుకోలేరని కామాక్షి అభిప్రాయపడ్డారు. దీనిని దృష్టిలో ఉంచుకునే నా హ్యాకింగ్ దర్యాప్తు వైపుగా మార్చాను. అప్పుడే పోలీసు అధికారులతో కలిసి పనిచేయడం ప్రారంభించాను’ అని తెలియజేస్తారు కామాక్షి. ఇక నుంచి సైబర్ నేరానికి పాల్పడాలనుకునేవాళ్లు కామాక్షి చేతికి చిక్కిపోతామని భయపడక తప్పదు లేదంటే నేరానికి శిక్ష అనుభవించక తప్పదు.
Comments
Please login to add a commentAdd a comment