సాక్షి, సిటీబ్యూరో: కవాడిగూడలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న చింతల్ వాసి మంగళవారం మధ్యాహ్నం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించాడు. తనకు ఎవరూ కాల్ చేయలేదని, తాను ఓటీపీ కూడా చెప్పలేదని అయినా తన ఖాతా నుంచి రూ.1.8 లక్షలు పోయాయని పేర్కొన్నాడు. ఆయన ఫోన్‌ను పరిశీలించిన సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ అందులో ‘క్విక్ వ్యూ’ అనే యాప్ ఉండటాన్ని గమనించారు. దీని ద్వారానే సైబర్ నేరగాళ్ళు ఖాతా ఖాళీ చేసినట్లు తేల్చారు. ఈ తరహా ఫిర్యాదులు ఇటీవల కాలంలో దాదాపు 30 వరకు వచ్చాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.
జమ్‌తార కేంద్రంగా మోసాలు...
జార్ఖండ్‌లో రాష్ట్రంలో ఉన్న జమ్‌తార జిల్లాలోని ఏడు గ్రామాల్లోని యువతకు సైబర్ నేరాలు చేయడమే తమ ప్రధాన వృత్తిగా మార్చుకున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్లి, అక్కడి కాల్ సెంటర్లలో పని చేసిన వచ్చిన జమ్‌తార యువత తామే ప్రస్తుతం సొంతంగా కాల్ సెంటర్లను ఏర్పాటు చేసుకుని ఈ సైబర్ నేరాలకు పాల్పడుతోంది. ఆయా బ్యాంకుల్లో కింది స్థాయి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు వాటి కాల్ సెంటర్లు తదితర మార్గాల్లో డెబిట్ కార్డుల డేటా ఈ సైబర్ నేరగాళ్ళకు చేరుతోంది. బోగస్ పేర్లు, చిరునామాలతో సిమ్‌కార్డ్స్ తీసుకునే జమ్‌తార యువకులు వీటిని వినియోగించడానికి ఎప్పటికప్పుడు కొత్త సెల్‌ఫోన్లు వాడుతుంటారు. వీటితో తమ డేటాలోని బ్యాంకు కస్టమర్ల ఫోన్ నెంబర్లకు కాల్ చేస్తుంటారు. ఇటీవల కాలంలో అందరి ఫోన్లలోనూ ‘ట్రూకాలర్’ తరహా యాప్స్ ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బోగస్ సిమ్‌కార్డుల్ని వినియోగిస్తున్న జమ్‌తార యువత ముందుగానే ఆ నెంబర్లను సదరు యాప్‌లో ‘బ్యాంక్ హెడ్–ఆఫీస్’ పేరుతో రిజిస్టర్ చేయించేస్తున్నారు. ఫలితంగా ఈ నెంబర్ నుంచి వచ్చిన కాల్‌ను రిసీవ్ చేసుకున్న వ్యక్తులకు అవి బ్యాంకుల నుంచి వస్తున్న భావన కలుగి తేలిగ్గా బుట్టలో పడతారు. ఇలా ఓ వ్యక్తి నుంచి డబ్బు కాజేసిన వెంటనే జమ్‌తార సైబర్ నేరగాళ్లు అందుకు వినియోగించిన సెల్‌ఫోన్, సిమ్‌కార్డు ధ్వంసం చేస్తున్నారు.
యాప్స్ డౌన్‌లోడ్ చేయించి...
ఓ ఖాతాదారుడి నుంచి సేకరించిన వివరాలను అతడు బ్యాంకు ద్వారా మార్చుకునే లోపు ఎన్నిసార్లు అయినా వాడవచ్చు. అయితే ప్రతి లావాదేవీకీ ఒక ఓటీపీ మాత్రం కచ్చితంగా ఉండాలి. దీన్ని పదేపదే వినియోగదారుడిని అడిగితే డబ్బు కట్ కావడాన్ని గమనించి చెప్పకపోవచ్చు అని జామ్‌తార నేరగాళ్ళు కొత్త పంథా మొదలెట్టారు. తాము టార్గెట్ చేసిన వారిలో స్పార్ట్‌ఫోన్ వినియోగదారులు ఉంటే ప్లే స్టోర్స్ లేదా లింకులు పంపడం ద్వారా కొన్ని యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోమంటున్నారు. టీమ్ వ్యూవర్ తరహాకు చెందిన వీటికి సంబంధించి ఓ పాస్‌వర్డ్ చెప్తున్న నేరగాళ్లు దాని యాక్టివ్ చేసుకునేలా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో బ్యాంకునకు సంబంధించిన ఏ సమాచారమైనా నేరుగా అందుతుందని, ఈ తరహా అప్‌డేట్స్, లింకేజ్‌లు ఆటోమేటిక్‌గా జరుగుతాయని చెప్పి నమ్మిస్తున్నారు.
బాధితుడు ఈ యాప్‌ను ఇన్‌స్టల్ చేసుకుని యాక్టివ్ చేసిన వెంటనే ఇతగాడి ఫోన్ స్క్రీన్ సైబర్ నేరగాడి ఫోన్/ల్యాప్‌టాప్‌లో కనిపిస్తుంటుంది. ఫలితంగా వచ్చిన ప్రతి ఓటీపీను అడగాల్సిన పని లేకుండా చేసేస్తూ వీలున్నంత వరకు ఖాతా ఖాళీ చేయడానికి ఆస్కారం ఏర్పడుతోంది. అసలు విషయం తెలుసుకునేలోపు బాధితులు పూర్తిగా నష్టపోతున్నారు. కొన్ని సందర్భాల్లో అసలు బాధితులకు విషయం తెలియకుండానే వివిధ లింకుల ద్వారా యాప్స్ డౌన్‌లోడ్ చేయిస్తున్నారు. ఈ నేరగాళ్లు ఒక్కో నేరానికి ఒక సిమ్‌కార్డు మాత్రమే వాడి దాన్ని ధ్వంసం చేసేస్తుంటారు. ఇవి కూడా తప్పుడు వివరాలతో తీసుకున్నవే ఉంటున్నాయి. మరోపక్క వీరు వినియోగిస్తున్న బ్యాంకు ఖాతాలలు, వాలెట్స్ బోగస్ పేర్లు, చిరునామాలతో ఉంటున్నాయని సైబర్ క్రైమ్ అధికారులు చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఢిల్లీతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతకు కమీషన్ల ఎర వేసి వారి బ్యాంకు ఖాతాలను వాడుకుంటున్నారు. మనీమ్యూల్స్‌గా పిలిచే వీరి నుంచి సైబర్ నేరగాళ్లు నేరుగా డబ్బే తీసుకుంటున్నారు. దీంతో పాత్రధారుల్ని తప్ప సూత్రధారుల్ని పట్టుకోవడం కష్టసాధ్యంగా మారుతోంది. ఈ తరహా సైబర్ నేరాల్లో మోసపోవడం ఎంత తేలికో... కేసుల్ని కొలిక్కి తీసుకురావడం, రికవరీలు చేయడం అంత కష్టమని అధికారులు వివరిస్తున్నారు.
ఇప్పటికి 11 యాప్స్ గుర్తించాం
ఎవరికి వారు అప్రమత్తంగా ఉంటేనే ఈ తరహా సైబర్ నేరగాళ్లకు చెక్ చెప్పవచ్చు. ఆధార్ లింకేజ్ లేదా అప్‌గ్రేడ్ కోసం ఓ బ్యాంకు ఫోన్లు చేయదని గుర్తుంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనే ఎదుటి వ్యక్తులకు ఓటీపీలు చెప్పకూడదు. అపరిచులు సూచించే ఎలాంటి యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం, లింకులు క్లిక్ చేయడం కూడదు. ఇప్పటి వరకు ఈ తరహాకు చెందిన యాప్స్ 11 గుర్తించాం. ప్రతి వీటిని అసవసరంగా ఎవరూ డౌన్‌లోడ్ చేసుకోవదు. ఇప్పటికే ఫోన్లలో ఉన్నాయా? అనే అంశాన్నీ ఓసారి పరిశీలించుకోవాలి. యాడ్సన్, క్విక్ వ్యూవర్, ఎనీ డెస్క్, టీమ్ వ్యూవర్, యూనిఫైడ్ రిమోట్, ఎయిర్ మిర్రర్, వీఎన్‌సీ వ్యూవర్, రిమోట్ సపోర్ట్, పీసీ రిమోట్, ఎయిర్ డ్రైడ్, రిమోట్ వ్యూ... ఈ తరహ యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. – కేవీఎం ప్రసాద్, హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ
Comments
Please login to add a commentAdd a comment