ఓటీపీ’ ఫ్రాడ్‌ కేసులో ముగ్గురి అరెస్టు | Three Members Arrest in OTP Fraud Case hyderabad | Sakshi
Sakshi News home page

ఓటీపీ’ ఫ్రాడ్‌ కేసులో ముగ్గురి అరెస్టు

Published Tue, Nov 20 2018 10:54 AM | Last Updated on Wed, Dec 19 2018 11:08 AM

Three Members Arrest in OTP Fraud Case hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: బ్యాంకు అధికారులమంటూ ఫోన్లు చేసి... కార్డులకు సంబంధించిన వివరాలతో పాటు వన్‌టైమ్‌ పాస్‌వర్డ్స్‌ (ఓటీపీ) సైతం సంగ్రహించి... అందినకాడికి దండుకునే అంతరాష్ట్ర ముఠాకు చెందిన ముగ్గురు నిందితుల్ని సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారని డీసీపీ అవినాష్‌ మహంతి సోమవారం పేర్కొన్నారు. ఆయా బ్యాంకుల్లో కింది స్థాయి, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులతో పాటు అనేక మార్గాల ద్వారా డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల డేటా సేకరిస్తున్న ఈ మోసగాళ్లు వాటి ఆధారంగా అసలు అంకానికి తెరలేపుతున్నారు. బోగస్‌ పేర్లు, చిరునామాలతో సిమ్‌కార్డ్స్‌ తీసుకుని వీటినే వినియోగించి కార్డుల డేటాలోని ఫోన్‌ నెంబర్లకు కాల్‌ చేస్తుంటారు. ఇటీవల కాలంలో అందరి ఫోన్లలోనూ ‘ట్రూకాలర్‌’ తరహా యాప్స్‌ ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బోగస్‌ సిమ్‌కార్డుల్ని వినియోగిస్తున్న జమ్‌తార యువత ముందుగానే ఆ నెంబర్లను సదరు యాప్‌లో ‘బ్యాంక్‌ హెడ్‌–ఆఫీస్‌’ పేరుతో రిజిస్టర్‌ చేయించేస్తున్నారు.

ఫలితంగా ఈ నెంబర్‌ నుంచి వచ్చిన కాల్‌ను రిసీవ్‌ చేసుకున్న వ్యక్తులకు అవి బ్యాంకుల నుంచి వస్తున్న భావన కలుగి తేలిగ్గా బుట్టలో పడతారు. క్రెడిట్, డెబిట్‌ కార్డులు కలిగిన వారికి ఫోన్లు చేసే సైబర్‌ క్రిమినల్స్‌ ముందుగా ఫోన్‌ రిసీవ్‌ చేసుకున్న వ్యక్తి పేరు, ఓ బ్యాంకు కార్డు వినియోగిస్తున్నారో చెప్పి,... బ్యాంకు ఉద్యోగులుగా పరిచయం చేసుకుంటారు. డెబిట్‌ కార్డును ఆధార్‌తో లింకు చేయాలనో, క్రెడిట్‌ కార్డు వివరాలు అప్‌డేట్‌ చెయ్యాలనో చెప్తుంటారు. ఆపై కార్డు వివరాలను సీవీవీ కోడ్‌ సహా తెలుసుకుని... కొద్దిసేపట్లో మీకో వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ వస్తుందని, అది కూడా చెప్తేనే లింకేజ్, అప్‌గ్రేడేషన్‌ పూర్తవుతుందని నమ్మిస్తారు. ఇలా అన్ని వివరాలు తెలుసుకున్న తరవాత వారి ఖాతాలోని నగదును తమ ఖాతాల్లోకి మార్చుకోవడం ద్వారా టోకరా వేస్తున్నారు. ఈ మోసగాళ్ళ చేతిలో సిటీకి చెందిన ఇద్దరు రూ.1.75 లక్షలు పోగొట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీసీఎస్‌ ఆధీనంలోని సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ డి.ప్రశాంత్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. సాంకేతిక ఆధారాలను బట్టి నిందితులు పశ్చిమ బెంగాల్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడకు వెళ్ళిన ఓ ప్రత్యేక బృందం ‘కాల్‌ కేటుగాళ్‌లై‘న ఎండీ సలామత్‌ ఇస్లాం సర్దార్, సమీర్‌ హజ్రా, శంకర్‌ హల్దార్‌లను అరెస్టు చేసింది. అక్కడి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్‌ వారెంట్‌పై సిటీకి తీసుకువచ్చి సోమవారం జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement