దక్షిణాదివారికి ఆశ ఎక్కువ.. | Cyber Criminals Targets South States | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ ‘సౌత్‌’

Published Mon, Nov 18 2019 7:20 AM | Last Updated on Mon, Nov 18 2019 7:20 AM

Cyber Criminals Targets South States - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ‘దక్షిణాది వారికి ఆశ ఎక్కువ సార్‌..! వీళ్లను మోసం చేయడం చాలా తేలిక. ఒకవేళ కేసులు నమోదైనా మమ్మల్ని పట్టుకోవడం కోసం ఉత్తరాది వరకు వచ్చే పోలీసులు తక్కువ. అందుకే ఇక్కడి వారినే ఎక్కువగా టార్గెట్‌ చేస్తుంటాం’సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన ఓఎల్‌ఎక్స్‌ నేరగాడు విచారణలో వెల్లడించిన విషయం ఇదీ.
‘రజోర్‌పే’ సంస్థ అధ్యయనం ప్రకారం డిజిటల్‌ కరెన్సీ వాడకం, ఆన్‌లైన్‌ లావాదేవీల్లో బెంగళూరు మొదటి స్థానంలో, హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, ముంబై పుణే నిలిచాయి.
సైబర్‌ క్రైమ్‌ పోలీసుల అభిప్రాయం ప్రకారం సైబర్‌ నేరాల బారిన పడుతున్న వారిలో బెంగళూరు తర్వాత హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. ఇటీవల విశాఖపట్నం, విజయవాల్లోనూ ఈ తరహా కేసులు వెలుగులోకి వస్తున్నాయి.  
కంటికి కనిపించకుండా అందినకాడికి దోచుకునే సైబర్‌ నేరగాళ్లు ప్రధానంగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులనే టార్గెట్‌గా చేసుకుంటున్నారు. ఉత్తరాదిలో మకాం వేసి దక్షిణాదిని టార్గెట్‌గా చేస్తున్న ఈ ముఠా లు నమ్మి న వారిని నిలువునా ముంచేస్తున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా వీరి వల్లో పడి మోసపోతున్నట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పేర్కొంటున్నారు. వివిధ సర్వీసు ప్రొవైడర్ల ద్వారా తక్కువ ధరకు ఇంటర్‌నెట్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత సైబర్‌ నేరాల బారినపడుతున్న వారి సంఖ్య మరీ పెరిగిందని వివరిస్తున్నారు. 

ప్రధానంగా ఓఎల్‌ఎక్స్, ఓటీపీ నేరాలే..
సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రిజిస్టర్‌ చేసే సైబర్‌ నేరాల్లో 18 రకాలైనవి ఉన్నాయి. అయితే హైదరాబాద్‌కు సంబం«ధించి నమోదు అవుతున్న వాటిలో ఓఎల్‌ఎక్స్, ఓటీపీ క్రైమే అధికంగా ఉంటోందని పోలీసులు పేర్కొంటున్నారు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్, అల్వార్, హర్యానాలోని మేవత్, ఉత్తరప్రదేశ్‌లోని మురాదాబాద్, ఫిరోజ్‌పూర్‌ జిక్రా ఒకే రీజియన్‌లో పక్కపక్కనే ఉంటాయి. ఈ ప్రాంతాలకు చెందిన ముఠాలు ఆర్మీ ఉద్యోగుల మాదిరిగా నటిస్తూ ఈ కామర్స్‌ సైట్స్‌లో కార్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులను తక్కువ ధరకు అమ్ముతామంటూ పోస్టులు పెట్టి, అడ్వాన్స్‌గా కొంత మొత్తం డిపాజిట్‌ చేయించుకుని మోసం చేస్తున్నారు. ఆ తర్వాత స్థానంలో ఓటీపీ క్రైమ్‌ ఉంటోంది. బ్యాంకు అధికారులుగా చెప్పుకుని ఫోన్లు చేస్తున్న నేరగాళ్లు నో యువర్‌ కస్టమర్‌ (కేవైసీ) అప్‌డేట్‌ చేయాలని, ఆధార్‌ లింకేజ్‌ పేరుతో మాట్లాడుతున్నారు. వినియోగదారుల నుంచి వారి బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలతో పాటు వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ సైతం సంగ్రహించి అకౌంట్‌లోని డబ్బు దోచేస్తున్నారు. ఈ నేరాలకు పాల్పడేవారిలో జార్ఖండ్‌ రాష్ట్రంలోని జమ్‌తార వాసులే ఎక్కువగా ఉంటున్నారు. 

చదువుకున్న వారే....
ఈ తరహా సైబర్‌ నేరగాళ్ల వల్లో పడుతున్న వారిలో నిరక్షరాస్యులు/తక్కువగా విద్యనభ్యసించిన వారి కంటే చదువుకున్న వారు, విద్యాధికులే ఎక్కువగా ఉంటున్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. అంతగా చదువుకోని వారు ఈ కామర్స్‌ యాప్స్‌ జోలికి పోవట్లేదని, ఈ కారణంగానే ఆ సంబంధిత నేరగాళ్లు వీరిని టార్గెట్‌ చేయలేకపోతున్నారని పేర్కొంటున్నారు. తక్కువ చదువుకున్న వాళ్ళు ఏటీఎం కార్డులను వినియోగిస్తుంటారు. అయితే కేవలం కార్డ్‌ స్వైప్‌ చేసి, పిన్‌ నెంబర్‌ ఎంటర్‌ చేసి లావాదేవీలు పూర్తి చేయడం వరకే వీరికి తెలుస్తోంది. ఈ కారణంగానే ఎవరైనా బ్యాంకు అధికారులం అంటూ ఫోన్లు చేస్తే వీరు స్పం దించట్లేదు. అవతలి వ్యక్తులు అడిగే బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు ఈ కేటగిరీకి చెందిన వారు చెప్ప లేకపోతున్నారు. ఈ కారణంగానే సైబర్‌ నేరగాళ్లు వారి జోలికి వెళ్లడం లేదని వివరిస్తున్నారు. విద్యాధికు లు, స్మార్ట్‌ఫోన్, యాప్స్‌ వినియోగిస్తున్న వారే ఎక్కువగా సైబర్‌ నేరగాళ్ల బారినపడి ఆర్థికంగా నష్టపోతున్న ట్లు తెలిపారు. ఓఎల్‌ఎక్స్‌ నేరాల బారిన పడిన వారిలో అన్ని వయసుల వారు ఉన్నట్లు గుర్తించామన్నారు.  

ఈ ఆరు నగరాల్లోనే ఎక్కువ
సైబర్‌ నేరాలబారిన పడుతున్న వారిలో దక్షిణాది వారే ఎక్కువగా ఉంటున్నారు. ఉత్తరాది వారికి ఎవరైనా బ్యాంకు మేనేజర్లమంటూ ఫోన్‌ చేసి ఓటీపీ వంటివి అడిగితే వారు తిట్టి ఫోన్‌ పెట్టేస్తుంటారు. దక్షిణాది వారి విషయంలో ఇలా జరగట్లేదు. ఓఎల్‌ఎక్స్‌ ఫ్రాడ్స్‌లోనూ వీరు ఎలాంటి తనిఖీలు లేకుండా నగదు అడ్వాన్స్‌గా డిపాజిట్‌ చేస్తున్నారు. సైబర్‌ నేరాల బాధితుల్లో దేశంలోనే బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లో బాధితులు ఎక్కువగా ఉంటున్నారు. జిల్లాలోనూ కేసులు నమోదవుతున్నా వారి సంఖ్య అతి తక్కువగా ఉంటోంది. ఆర్థికాంశాలతో ముడిపడి ఉన్న సైబర్‌ నేరాల్లో మోసం పోవడం ఎంత తేలికో కోల్పోయిన డబ్బును తిరిగి పొందడం అంత కష్టం. ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచితులతో లావాదేవీలు వద్దు. పరిచయం లేని వారు చెప్పిన మాటలు నమ్మి ఒక్క రూపాయి కూడా కోల్పోవద్దు.      –  సైబర్‌ క్రైమ్‌ పోలీసులు  

స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులే ఎక్కువ...
వివిధ రకాలైన నేరాల్లో సైబర్‌ నేరగాళ్లకు టార్గెట్‌గా మారుతున్న వారిలో స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులే ఎక్కువగా ఉంటున్నారని అధికారులు చెబుతున్నారు. ఓఎల్‌ఎక్స్‌ ఫ్రాడ్, వీసా మోసం సహా ఏదైనా ఫోన్‌ నుంచే ప్రారంభమవుతోందంటున్నారు. ఒకప్పుడు ఇంటర్‌నెట్‌ వాడటానికి కంప్యూటర్‌ తప్పనిసరి. అయితే స్మార్ట్‌ఫోన్‌ వినియోగంలోకి వచ్చాక ‘అరచేతి’ నుంచే యాక్సిస్‌ చేస్తున్నారు. మరోపక్క సెల్‌ఫోన్‌ సర్వీసు ప్రొవైడర్ల మధ్య పోటీ పెరగటంతో ఒకరిని మించి ఒకరు తక్కువ ధరకు మొబైల్‌ డేటాను అందిస్తుండటంతో అవసరం ఉన్నా, లేకపోయినా నెట్‌ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య పెరిగింది. ఇలా అనవసరంగా కొన్ని యాప్స్‌ను వినియోగిస్తూ మోసగాళ్ల బారినపడుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు. తమ వద్దకు వస్తున్న ఫిర్యాదుదారుల్లో 95 శాతం ఫోన్‌ నుంచి ఇంటర్‌నెట్‌ను యాక్సస్‌ చేస్తూ మోసపోయిన వారే ఉంటున్నారని స్పష్టం చేస్తున్నారు. ఓఎల్‌ఎక్స్‌ ఫ్రాడ్స్‌ విషయమే తీసుకుంటే కంప్యూటర్‌ ద్వారా ఆ సంస్థ సైట్‌ను చేరుకుని మోసపోయిన వారు నూటికి ఇద్దరు ముగ్గురు కూడా ఉండట్లేదని తెలిపారు. స్మార్ట్‌ ఫోన్‌లో యాప్‌ వాడుతూ బుట్టలో పడిన వారే ఎక్కువని సైబర్‌ క్రైమ్‌ అధికారులు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement