Cyber Criminals Frauds Name Of Orders On Meesho And OLX - Sakshi
Sakshi News home page

Be Alert: అయ్యో! ఆర్డర్‌ మీది కాదా? క్యాన్సిల్‌ చేస్తా.. ఓటీపీ చెప్పండి చాలు..

Published Tue, Feb 28 2023 2:05 AM | Last Updated on Tue, Feb 28 2023 9:56 AM

Cyber Criminals Frauds Name Of Orders On Meesho And OLX - Sakshi

ఇంటి లోపల మీరేదో పనిలో ఉంటారు.. ఈలోగా డెలివరీ బాయ్‌ వచ్చి తలుపు తడతాడు. ఆర్డర్‌ వచ్చిందంటాడు. మీరేమీ ఆర్డర్‌ ఇవ్వలేదే అనుకుంటూ అదే సమాధానం చెబుతారు. ‘లేదు.. లేదు మీ అడ్రస్‌తోనే బుక్‌ అయింది’ అని నమ్మబలుకుతారు. ఒకవేళ బుక్‌ చేయకుంటే.. ఆర్డర్‌ క్యాన్సిల్‌ చేసుకోవడానికి మీ ఫోన్‌ నంబర్‌కు ఓటీపీ వచ్చింది చెప్పండి చాలు అంటారు. వారిని నమ్మి మీరు ఓటీపీ చెప్పారో.. ఇక అంతే..

సాక్షి, హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా మోసానికి తెరతీస్తున్నారు. జనంలో అవగాహన పెరిగిన అంశాల్లో కాకుండా కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఇప్పటివరకు ఓఎల్‌ఎక్స్‌లో వస్తువుల అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన మోసాలు ఉంటుండగా తాజాగా మీషో, క్వికర్‌ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో వస్త్రాలు, ఇతర గృహోప కరణాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువుల కొనుగోళ్లకు సంబంధించి మోసాలకు తెరతీస్తున్నారు. ఇటీవల ఈ తరహా మోసాలు పెరిగినట్లు సైబర్‌ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

ఇదీ మోసం తీరు..
ఆన్‌లైన్‌లో మనం ఆర్డర్‌ ఇవ్వకుండానే మీ ఇంటికి డెలివరీ బాయ్స్‌ వచ్చి మీకో ఆర్డర్‌ వచ్చిందంటారు. తీరా మనం ఆ ఆర్డర్‌ ఇవ్వలేదని చెబితే పొరపాటున మీ అడ్రస్‌తో ఈ ఆర్డర్‌ బుక్‌ అయినట్లుందని నమ్మబలుకుతారు. ఆర్డర్‌ క్యాన్సిల్‌ చేసుకోకపోతే ఆ డబ్బులు మా జీతంలోంచి కట్‌ అవుతాయని, మా కమీషన్‌ పోతుందని జాలి నటిస్తారు. మీ ఫోన్‌ నంబర్‌కు ఓటీపీ వచ్చింది దయచేసి అది చెప్పండి చాలు అని నమ్మబలుకుతారు. వారిని నమ్మి మనం ఓటీపీ చెప్పిన వెంటనే అప్పటికే మన వివరాలు సేకరించి ఉంటున్న సైబర్‌ నేరగాళ్లు మన ఫోన్‌ను తమ అధీనంలోకి తీసుకుని మన బ్యాంకు ఖాతాలు కొల్లగొడతారు. 

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
మనం ఆర్డర్‌ ఇవ్వకుండానే వస్తు్తవులు రావని గుర్తుంచుకోవాలి. మనం ఇవ్వని ఆర్డర్‌ను మనం క్యాన్సిల్‌ చేయాల్సిన పనిలేదు. ఆర్డర్‌ క్యాన్సిలేషన్‌ పేరిట ఎవరైనా ఓటీపీ అడిగితే చెప్పవద్దు. అది సైబర్‌ మోసం అని గుర్తించాలి. ఒకటికి రెండుసార్లు సరిచూసుకోకుండా నగదు చెల్లింపులు చేయకండి. మనం ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చేముందు ఆ కంపెనీ ప్రొఫైల్, రేటింగ్‌ తప్పక గమనించాలి. సైబర్‌ మోసం జరుగుతున్నట్లు అనుమానం ఉంటే వెంటనే దగ్గరలోని సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. లేదా 1930 నంబర్‌కు కాల్‌ చేసి వివరాలు ఇవ్వాలి. 

ఏ వివరాలు ఇవ్వొద్దు.. 
ఆన్‌లైన్‌లో వచ్చిన ఆర్డర్‌ను క్యాన్సిల్‌ చేసేందుకు ఓటీపీ చెప్పండి అని ఎవరైనా అడిగితే  వివరాలు చెప్పవద్దు. మీరు ఆర్డర్‌ ఇవ్వకుండా వస్తువులు మీ పేరిట రావని గుర్తించాలి. ఓటీపీ, ఇతర వివరాలు, బ్యాంక్‌ ఖాతాల గురించి అడిగితే అది కచ్చితంగా మోసమని గ్రహించాలి. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసే సమయంలోనూ ఆ వెబ్‌సైట్‌ నమ్మకమైనదేనా? లేదా? అని తెలుసుకోవాలి. ఆన్‌లైన్‌లో వస్తువుల కొనుగోలు, అమ్మకాల్లోనూ మోసం జరిగే ప్రమాదం ఉందన్న విషయాన్ని మరవొద్దు.
–శ్రీనివాస్,సైబర్‌ క్రైం ఇన్‌స్పెక్టర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement