olx
-
బెడ్ అమ్మబోయి రూ.68 లక్షలు పోగొట్టుకున్న టెకీ.. ఎలా అంటే?
బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రముఖ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ OLXలో తాను ఉపయోగించిన బెడ్‌ను విక్రయించడానికి ప్రయత్నించి ఏకంగా రూ. 68 లక్షల నష్టాన్ని చవిచూశాడు. హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో నివాసం ఉంటూ నగరంలోని ఓ ప్రైవేట్ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఈ మోసానికి బలైపోయాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం, బెంగళూరుకు చెందిన 36 సంవత్సరాల ఇంజినీర్ రూ. 15000లకు బెడ్ విక్రయించడానికి ఓఎల్ఎక్స్ యాప్‌లో ఫోటోలను అప్లోడ్ చేసాడు. ఇది చూసి కొనుగోలు చేయాలనుకున్న ఓ వ్యక్తి (మోసగాడు), బెడ్ అమ్మాలనుకున్న ఇంజినీర్‌కు ఫోన్ చేసాడు. ఇంజినీర్ వెల్లడించిన ధరకే కొనుగోలు చేస్తానని చెప్పిన మోసగాడు UPI లావాదేవీకి సంబంధించిన సాంకేతిక సమస్యలున్నట్లు, పరిష్కరించుకోవడంలో భాగంగా తనకు రూ. 5000 పంపాలని వెంటనే తిరిగి పంపిస్తానని చెప్పాడు. ఆ మోసగాని మాటలు విన్న టెకీ రూ. 5వేలు పంపించాడు. మోసగాడు మొదట్లో రూ. 10వేలు పంపించాడు. ఇలాగే మళ్ళీ రూ. 5వేలు, రూ. 10వేలు, రూ. 15వేలు డిమాండ్ చేస్తూ మొత్తానికి భారీగానే సబ్బు గుంజేసాడు. ఇదీ చదవండి: ఆర్డర్ చేస్తే క్యాన్సిల్ అయింది.. కట్ చేస్తే.. ఆరు సార్లు డెలివరీ డబ్బు పంపించే క్రమంలో మోసగాడు టెకీకి రూ. 30000 షేర్ చేసాడు. మోసగాడు టెక్కీని లింక్‌ను ఉపయోగించి డబ్బును తిరిగి ఇవ్వమని, OTPని షేర్ చేయమని కోరాడు. ఇంజనీర్ OTP ట్రాప్‌లో పడిపోగానే, అతను ఏకంగా 68 లక్షల రూపాయల కోల్పోయాడు. రూ. 68 లక్షలు పోగొట్టుకున్న టెకీ పోలీసులకు పిర్యాదు చేసాడు. ప్రస్తుతం ఈ సంఘటన మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి సైబర్ లేదా ఆన్లైన్ మోసాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఈ తరహా మోసాల వల్ల పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్న సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. -
Hyderabad: ‘డబ్బులు ఇవ్వకపోతే ఫొటోలు వైరల్ చేస్తా’.. యువతి బెదిరింపులు.
సాక్షి, హైదరాబాద్: అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే ఫొటోలు వైరల్ చేస్తానంటూ ఓ యువకుడిని ఒక యువతి వేధింపులకు గురి చేస్తున్న సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన కిరణ్‌కుమార్ కృష్ణానగర్‌లో ఉంటున్నాడు. ఏడాది క్రితం అతను రూం షేరింగ్ కోసం ఓఎల్ఎక్స్లో ప్రకటన ఇచ్చాడు. ఓ యువతి స్పందించి తాను షేర్ చేసుకుంటానని చెబుతూ కూకట్‌పల్లిలో రూం తీసుకోవాలని కోరింది. దీంతో ఇద్దరూ కలిసి గదిలో ఉంటున్నారు. అయితే తాను వేశ్యనని ఆమె చెప్పడంతో, తన ప్రవర్తన నచ్చక కిరణ్ ఆమెను బయటికి వెళ్లాలని కోరాడు. ఆమె నిరాకరించడంతో పాటు తాము సన్నిహితంగా ఉన్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తానంటూ బెదిరించింది. అంతేగాక తనపై లైంగిక దాడిచేశాడని సైబరాబాద్ షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. వారు ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చారు. తర్వాత అతడి నుంచి ఆమెకు రూ.4.70 లక్షలు పరిహారంగా చెల్లించాడు. అనంతరం సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్ చేయడంతో కిరణ్‌కుమార్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వాటిని తొలగించారు. ఈ నెల 13న రాత్రి ఆమె కిరణ్‌ను సారథి స్టూడియో వద్దకు రప్పించి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి అతడిపై దాడి చేసింది. గురువారం అతను మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఓఎల్ఎక్స్లో ఉద్యోగాల కోత.. పలు దేశాల్లో మూసివేత
నెదర్లాండ్‌కు చెందిన ప్రోసస్ కంపెనీ క్లాసిఫైడ్స్ వ్యాపార విభాగమైన ఓఎల్ఎక్స్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 800 ఉద్యోగాలను తొలగించనున్నట్లు ప్రకటించింది. తమ గ్రూప్‌నకు చెందిన ఓఎల్ఎక్స్ ఆటోస్ కార్యకలాపాలను కొన్ని దేశాల్లో మూసివేస్తున్న నేపథ్యంలో లేఆఫ్స్‌ను ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఉద్యోగాల తొలగింపు విషయాన్ని ఓఎల్ఎక్స్ గ్రూప్ టెక్ క్రంచ్ వార్తా సంస్థకు ధ్రువీకరించింది. ఆమ్స్టర్డామ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంగా కంపెనీ ఇటీవలే ఉద్యోగాల కోత గురించి బాధిత ఉద్యోగులకు తెలియజేయడం ప్రారంభించింది. ‘ఈ సంవత్సరం ప్రారంభంలో ఓఎల్ఎక్స్ ఆటోస్ వ్యాపారం నుంచి నిష్క్రమించడానికి వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నాం. అప్పటి నుంచే సంభావ్య కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల కోసం అన్వేషిస్తున్నాం’ అని కంపెనీ టెక్‌క్రంచ్ వార్తా సంస్థకు ఈమెయిల్ ద్వారా పంపిన ప్రకటనలో తెలిపింది. అర్జెంటీనా, మెక్సికో, కొలంబియాలో కంపెనీ తన కార్యకలాపాలను మూసివేసింది. ఓఎల్ఎక్స్ ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికలో ప్రోసస్ సంస్థ తన క్లాసిఫైడ్స్ వ్యాపారం ఓఎల్ఎక్స్ ప్రపంచవ్యాప్తంగా 11,375 మంది ఉద్యోగులను కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: No Work From Home: ఇన్ఫోసిస్ మొదలుపెట్టేసింది.. ఉద్యోగులు ఇక ఇల్లు వదలకతప్పదు! -
ఓఎల్ఎక్స్లో భారీగా ఉద్యోగ కోతలు: కారణం ఏంటంటే?
సాక్షి,ముంబై:ప్రపంచ ఆర్థిక సంక్షోభం, ఆర్థిక మాంద్యం ఆందోళనల మధ్య వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఖర్చులనుతగ్గించుకునే పనిలో దిగ్గజ సంస్థలు కూడా వేలాది మందిని నిర్దాక్షిణ్యంగా ఇంటికి పంపిస్తున్నారు. ప్రతీ రోజు ఏదో ఒక కంపెనీ ఉద్యోగాల కోతను ప్రకటిస్తోంది. తాజాగా వస్తువుల కొనుగోలు, అమ్మకాల సంస్థ, నాస్పర్స్ యాజమాన్యంలోని ఆన్లైన్ గ్రూప్ ప్రోసస్ క్లాసిఫైడ్స్ యూనిట్ ఓఎల్ఎక్స్ గ్రూప్ 15 శాతం సిబ్బందిని ఇంటికి పంపిస్తోంది. తాజా నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1,500 మందిని తొలగించనుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. మారుతున్న స్థూల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఖర్చులను నియంత్రించేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. భవిష్యత్తు ఆశయాల రీత్యా కంపెనీ అంతటా వర్క్‌ఫోర్స్‌ను తగ్గిస్తునట్టు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికల్లో భాగంగా, ఓఎల్ఎక్స్ గ్రూప్ తన ఇండోనేషియా కార్యకలాపాలను తగ్గించు కోవాలని చూస్తోందట. ఇప్పటికే ఆటో వ్యాపారాన్ని అమ్మకానికి ఉంచిందని డీల్స్ట్రీట్ ఆసియా గత వారం ప్రచురించిన ఒక నివేదికలో తెలిపింది.కాగా ప్రపంచవ్యాప్తంగా, ఓఎల్ఎక్స్ 10,000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. -
రూ. 4.4 లక్షల కోట్లకు ప్రీ–ఓన్డ్ కార్ల మార్కెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత కొన్నాళ్లుగా కొత్త కార్ల మార్కెట్‌ను మించి ప్రీ–ఓన్డ్ (సెకండ్ హ్యాండ్) కార్ల మార్కెట్ వృద్ధి చెందుతోంది. రాబోయే ఐదేళ్ల వ్యవధిలో (2022–27) ఇది వార్షికంగా 16 శాతం మేర పెరిగి రూ. 4.4 లక్షల కోట్ల స్థాయికి చేరుతుందని అంచనా. ఇదే వ్యవధిలో కొత్త కార్ల మార్కెట్ వృద్ధి వార్షికంగా 10 శాతంగానే ఉండనుంది. రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్‌లో ఓఎల్ఎక్స్ రూపొందించిన 6వ విడత ఓఎల్ఎక్స్ ఆటోస్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కోవిడ్ ప్రభావంతో 2021 ఆర్థిక సంవత్సరంలో లాక్డౌన్ల కారణంగా సరఫరా తగ్గి ప్రీ–ఓన్డ్ కార్ల మార్కెట్ కాస్త మందగించినా .. 2022 ఆర్థిక సంవత్సరంలో మళ్లీ కోవిడ్–పూర్వ స్థాయికి చేరింది. కొనుగోలుదారుల సెంటిమెంట్ మెరుగపడుతుండటం, కార్యాలయాలు తెరుచుకోవడంతో ప్రయాణాలు పెరుగుతుండటం తదితర అంశాల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం ప్రీ–ఓన్డ్ వాహనాల మార్కెట్ మరింత పుంజుకోగలదని ఓఎల్ఎక్స్ ఇండియా సీఈవో అమిత్ కుమార్ తెలిపారు. మొత్తం మీద వచ్చే అయిదేళ్లలో ప్రీ–ఓన్డ్ కార్ల విక్రయాలు విలువపరంగా 2.5 రెట్లు, పరిమాణంపరంగా రెండు రెట్లు పెరగనున్నట్లు పేర్కొన్నారు. ప్రీ–ఓన్డ్ మార్కెట్లో చిన్న కార్ల ధరలు సగటున రూ. 2–4 లక్షలు, సెడాన్లు రూ. 5–6 లక్షలు, యూవీలు రూ. 7–9 లక్షల శ్రేణిలో ఉంటున్నాయి. యూవీలకు ప్రాధాన్యం.. నివేదిక ప్రకారం ప్రీ–ఓన్డ్ కార్ల అమ్మకాలు 2022 ఆర్థిక సంవత్సరంలో 41 లక్షలుగా ఉండగా 2027 నాటికి రెట్టింపై 82 లక్షలకు చేరనున్నాయి. అదే వ్యవధిలో కొత్త కార్ల విక్రయాలు 9–11 శాతం వృద్ధితో 48 – 50 లక్షల స్థాయికి చేరవచ్చని అంచనాలు ఉన్నాయి. మిగతా రకాలతో పోలిస్తే యుటిలిటీ వాహనాలకు (యూవీ) డిమాండ్ పెరుగుతోంది. ప్రీ–ఓన్డ్ కార్ల విభాగం తీసుకుంటే 2017–2022 మధ్య కాలంలో వీటి మార్కెట్ వాటా 17 శాతం నుండి 22 శాతానికి పెరిగింది. రాబోయే అయిదేళ్లలో దాదాపు మూడు రెట్ల వృద్ధితో 32 శాతానికి చేరవచ్చని అంచనా. ఓఎల్ఎక్స్ ప్లాట్‌ఫాం డేటా ప్రకారం హ్యుందాయ్ క్రెటా, మారుతీ బ్రెజా, మారుతీ ఎర్టిగా, మహీంద్రా ఎక్స్‌యూవీ 500లకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. అటు కొత్త కార్ల విభాగంలోను యూవీల హవా కొనసాగుతోంది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఇవి 49 శాతం మార్కెట్ వాటాతో చిన్న కార్లు (45 శాతం), సెడాన్లను (3 శాతం) కూడా అధిగమించాయి. చిన్న కార్లు, సెడాన్ల తగ్గుదల.. ప్రీ–ఓన్డ్ విభాగంలోని మొత్తం కార్లలో 58 శాతం వాటాతో చిన్న కార్లదే ఆధిపత్యం ఉన్నప్పటికీ రాబోయే అయిదేళ్లలో ఇది స్వల్పంగా 2 శాతం తగ్గి 56 శాతానికి చేరవచ్చని అంచనా. ఈ విభాగంలో హ్యుందాయ్ ఎలీట్ ఐ20, రెనో క్విడ్, మారుతీ సుజుకీ డిజైర్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మొదలైన వాటికి ఎక్కువగా ఆదరణ ఉంటోంది. మరోవైపు, సెడాన్ కార్ల విభాగం మార్కెట్ వాటా గణనీయంగా తగ్గనుంది. ఇది 12 శాతం నుండి 7 శాతానికి పడిపోవచ్చని అంచనా. కొత్త కార్ల మార్కెట్లో కూడా వీటి అమ్మకాలు తగ్గుతుండటం, కొత్తగా వచ్చే మోడల్స్ తక్కువగా ఉంటుండటం, కస్టమర్లు యూవీలవైపు మొగ్గు చూపుతుండటం మొదలైన అంశాలు ఇందుకు కారణం కానున్నాయి. యూవీల్లోనూ కొత్త మోడల్స్ వచ్చే కొద్దీ పాతవాటిని చాలా వేగంగా మార్చేస్తున్నారు. దీంతో నిన్న, మొన్న ప్రవేశపెట్టినవి కూడా ప్రీ–ఓన్డ్ సెగ్మెంట్లోకి వచ్చేస్తున్నాయి. మిగతా కార్లకు కూడా ఇదే ధోరణి విస్తరిస్తోంది. దీంతో 2027 నాటికి ప్రీ–ఓన్డ్ మార్కెట్లో సగటు వయస్సు 0–7 ఏళ్ల స్థాయిలో ఉండే వాహనాల వాటా 58 శాతం పైగా ఉంటుందని, ఇప్పుడున్న స్థాయికి 2.2 రెట్లు అధికంగా ఉంటుందని నివేదిక పేర్కొంది. నివేదికలో మరిన్ని విశేషాలు.. ► ఎక్కువగా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ప్రీ–ఓన్డ్ కార్లకు డిమాండ్ ఉంటోంది. ► మొత్తం కస్టమర్లలో తొలిసారి కొనుగోలు చేసే వారి వాటా 40–45 శాతంగా ఉంటోంది. ► మహిళా కొనుగోలుదారుల వాటా మెట్రోలు/ప్రథమ శ్రేణి నగరాల్లో 10 శాతంగాను, ద్వితీయ..తృతీయ శ్రేణి నగరాల్లో 5 శాతం లోపు ఉంటోంది. ► ట్రాఫిక్ కారణంగా మెట్రోల్లో ఎక్కువగా ఆటోమేటిక్ వెర్షన్లకు డిమాండ్ ఉంటోంది. -
సైబర్ క్రిమినల్స్ కేరాఫ్ రాజస్తాన్
రాజస్తాన్ రాష్ట్రం సైబర్ నేరగాళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఆర్థికాంశాలతో ముడిపడిన ఈ నేరాలు చేస్తూ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్రీయుల్లో ఈ రాష్ట్రానికి చెందిన వారే అత్యధికంగా ఉన్నారు. గత ఏడాది సిటీ సైబర్ కాప్స్ అరెస్టు చేసిన బయటి రాష్ట్రాల వారిలో రాజస్తాన్ వాసులే 20 శాతం వరకు ఉన్నారు. ఈ కాలంలో నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తం 344 మంది నిందితుల్ని అరెస్టు చేశారు. వీరిలో తెలంగాణకు చెందిన వారు 86 మంది ఉండగా.. మిగిలిన 258 మందిలో రాజస్తాన్ వాసుల సంఖ్య అత్యధికంగా 50 ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుల్ని అరెస్టు చేయడానికి మొత్తం 15 రాష్ట్రాల్లో ఆపరేషన్లు చేపట్టారు. సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాలను అధికారులు ప్రధానంగా రెండు రకాలుగా విభజిస్తారు. వివిధ రూపాల్లో బాధితుల నుంచి నగదును కాజేసే ఆర్థిక సంబంధమైనవి ఒకటైతే.. ఫేస్బుక్, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాలను వినియోగించి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేవి మరోరకం. వీటిలో బాధితులకు ఆర్థిక నష్టం లేనప్పటికీ అశ్లీలం, అభ్యంతరకర అంశాలు ముడిపడి ఉంటాయి. సైబర్ నేరాలకు సంబంధించి అరెస్టు అవుతున్న స్థానికుల్లో (తెలంగాణ వాసులు) దాదాపు 99 శాతం ఈ కోవకు చెందిన నేరాలు చేసిన వారై ఉంటున్నారు. వ్యక్తిగత కక్ష, ప్రతీకారం, అసూయల నేపథ్యంలో ఎదుటి వారి ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కంప్యూటర్, సెల్ఫోన్లను వినియోగించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇలా సైబర్ క్రైమ్ పోలీసులకు పట్టుబడుతున్న వారిలో ఎక్కువ మంది విద్యాధికులై ఉంటున్నారు. అడ్డంగా దోచేసే ఆర్థిక నేరగాళ్లు సైబర్ నేరాల్లో రెండో రకమైన ఆర్థిక సంబ«ంధ నేరాలు చేస్తున్న వారిలో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఉంటున్నారు. గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ 20 వరకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన బయటి రాష్ట్రాల వారిలో రాజస్తాన్ వాసులే ఎక్కువగా ఉన్నారు. వీళ్లు ఓఎల్ఎక్స్, ఫేస్బుక్ ద్వారా వస్తువులు విక్రయిస్తామని, ఖరీదు చేస్తామని ఎర వేసి బురిడీ కొట్టిస్తుంటారు. ఇటీవల కాలంలో నకిలీ ఫేస్బుక్ ఖాతాలు తెరిచి, ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపిస్తూ... ఆపై అందినకాడికి డబ్బు డిపాజిట్ చేయించుకుంటున్నారు. న్యూడ్ కాల్స్ చేయించి బ్లాక్ మెయిల్ చేయడమూ వీరి మోసాల్లో ఒక పంథా. ఇక ఇన్సూరెన్సులు, లాటరీలు, తక్కువ వడ్డీకి రుణాలు, వీసాల పేరు చెప్పి అందినకాడికి డబ్బు కాజేసే వారిలో ఢిల్లీకి చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. న్యూఢిల్లీ, నోయిడా, గుర్గావ్‌లతో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఈ సైబర్ నేరగాళ్ళు ప్రత్యేకంగా కాల్‌సెంటర్లు నిర్వహిస్తున్నారు. టెలీకాలర్లను ఏర్పాటు చేసుకుని దేశ వ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్నారు. నైజీరియన్లూ పెద్ద సంఖ్యలో... పెద్ద మొత్తాలతో ముడిపడి ఉన్న సైబర్ నేరాల్లో సూత్రధారులుగా ఉంటున్న వారిలో నైజీరియన్లు పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. వీరితో పాటు సోయాలియా వంటి ఆఫ్రికన్ దేశాలకు చెందిన వారూ నిందితులుగా మారుతున్నారు. బిజినెస్, స్టడీ తదితర వీసాలపై భారత్‌కు వచ్చి నగరాల్లో నివసిస్తున్న ఈ నల్లజాతీయులు తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వీరికి స్థానికులు, ఇతర రాష్ట్రాలకు నుంచి వచ్చి ఆయా నగరాల్లో నివసిస్తున్న వారూ మనీమ్యూల్స్‌గా మారి సహకరిస్తున్నారు. అనేక కేసుల్లో మనీమ్యూల్స్‌గా ఉన్న వారు చిక్కుతున్నా.. సూత్రధారులు మాత్రం పరారీలో ఉంటున్నారు. ఓటీపీలతో జార్ఖండ్ నేరగాళ్ల టోపీ బ్యాంకు అధికారులమంటూ ఫోన్లు చేసి...డెబిట్/క్రెడిట్ కార్డులకు చెందిన వివరాలతో పాటు వన్ టైమ్ పాస్వర్డ్స్ (ఓటీపీ) సైతం సంగ్రహించి...అందినకాడికి దండుకునే నేరగాళ్లలో 95 శాతం మంది జార్ఖండ్‌లోని జమ్‌తార ప్రాంతానికి చెందిన వారే. ఆ జిల్లాలో ఉన్న ఏడు గ్రామాల్లోని యువతకు సైబర్ నేరాలే ప్రధాన ఆదాయవనరుగా మారాయి. కొన్నేళ్ల క్రితం వరకు దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్లి, అక్కడి కాల్ సెంటర్లలో పనిచేసి వచ్చిన జమ్‌తార యువత ఇప్పుడు ‘కాల్ సెంటర్లను’ఏర్పాటు చేసుకుని నేరాలకు పాల్పడుతోంది. డెబిట్ కార్డును ఆధార్‌తో లింకు చేయాలనో, క్రెడిట్ కార్డు వివరాలు అప్డేట్ చెయ్యాలనో చెప్తుంటారు. ఆపై ఓటీపీ సహా అన్ని వివరాలు తెలుసుకున్న తరవాత వారి ఖాతాలోని నగదును కొట్టేస్తున్నారు. -
ఆన్లైన్ మోసానికి గురయ్యారా? వెంటనే ఈ నెంబర్‌కు కాల్ చేయండి
పాత వస్తువులను అమ్మకానికి పెట్టాలన్నా... చవగ్గా కొనాలన్నా ఇప్పుడు ఆన్లైన్ పద్ధతినే చాలా మంది ఎంచుకుంటున్నారు. ఇది సులువైన ప్రక్రియ కావడం కూడా ఇందుకు కారణం. ఇటీవల ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్ ఓఎల్ఎక్స్లో తమ పాత మనీ కౌంటింగ్ మిషన్‌ను రూ.5000కు అమ్మకానికి పెట్టింది శ్రీజ(పేరు మార్చడమైనది). ఇమేజ్ అప్లోడ్ చేసిన గంట లోపు ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తనను తాను పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తాను, తన అడ్రస్‌కు కొరియర్ చేయమని సూచించాడు. అందుకు సరే అంది శ్రీజ. అతను తనకు ఆర్మీ అకౌంట్ ఉందని, ముందుగా డబ్బు ట్రాన్స్ఫర్ చేయలేనని, శ్రీజ నే రూ.100 లు ట్రాన్స్ఫర్ చేయమన్నాడు. సరే అనుకున్న శ్రీజ అతను చెప్పిన అకౌంట్‌కు ఆన్లైన్ పే యాప్స్ ద్వారా రూ.100 ట్రాన్స్ఫర్ చేసింది. అతను తిరిగి రూ.200 ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ తర్వాత తన ఖాతా నుంచి డబ్బు సెండ్ అవడం లేదని, ఇతరుల నుంచి డబ్బు తన ఖాతాకు రావడం లేదని మరోసారి శ్రీజ నే కొంత డబ్బును ట్రాన్స్ఫర్ చేయమన్నాడు. అలా ఫోన్ మాట్లాడుతూనే అతను చెప్పిన సూచనలతో తనకు తెలియకుండానే డబ్బు ట్రాన్స్ఫర్ చేసింది శ్రీజ. ఆ తర్వాత ఫోన్ కట్ అయ్యింది. ట్రాన్సాక్షన్స్ మెసేజ్‌లు చూసుకున్నాక శ్రీజకు దిమ్మతిరిగిపోయింది. తన అకౌంట్ జీరో బ్యాలెన్స్ చూపిస్తోంది. తిరిగి ఆ వ్యక్తికి ఫోన్ చేస్తే, స్విచ్డాఫ్ వస్తోంది. చివరకు తను మోసపోయానని అర్ధమైంది. ఆన్లైన్ మోసం.. హెల్ప్‌లైన్ కరోనా కారణంగా ఆన్లైన్ షాపింగ్‌లు కూడా ఇటీవల కాలంలో బాగా పెరిగాయి. అలాగే, ఆన్లైన్ మోసాలు కూడా పెరిగాయి. సైబర్ నేరగాళ్లు ఏదో ఒక మార్గంలో వినియోగదారులు/అమ్మకందారుల ఆశను ఎరగా చేసుకొని స్మూత్‌గా డబ్బు దోపిడీకి పాల్పడుతున్నారు. ఆన్లైన్ చీటింగ్ కేసుల్లో మోసపోయిన వ్యక్తులకు సాయం అందించడానికి 155260 హెల్ప్‌లైన్ అందుబాటులో ఉంది. ఈ నెంబర్‌కు ఫోన్ చేసి, ఫిర్యాదు చేస్తే బాధితులు సత్వర న్యాయం పొందే అవకాశం ఉంటుంది. ► ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేసే ఈ హెల్ప్‌లైన్ ఆన్లైన్, ఆఫ్‌లైన్... రెండు విధాలా సేవలు అందిస్తుంది. ► సూచించిన పోర్టల్‌లో .. మోసం లావాదేవీ వివరాలు (ఖాతా నంబర్, వాలెట్, యుపిఐ, లావాదేవీ జరిపిన ఐడీ, తేదీ, డెబటి/క్రెడిట్ కార్డ్ నంబర్లు.. మొదలైనవి), వ్యక్తిగత ప్రాథమిక సమాచారాన్ని నమోదు చేయాలి. ► బాధితుల బ్యాంక్ లేదా మోసం చేసి డబ్బు జమ అయిన బ్యాంక్/వాలెట్.. వంటివి నోట్ చేయాలి. ► మోసానికి సంబంధించిన పూర్తి వివరాలను పోర్టల్‌లో 24 గంటల్లోగా ఉంచాలి. ఆ వెంటనే బాధితుడు నమోదు చేసిన ఫోన్ నెంబర్‌కి మెసేజ్ వస్తుంది. ► పోర్టల్‌లో సంబంధిత బ్యాంక్, అంతర్గత సిస్టమ్‌ల వివరాలను తనిఖీ చేస్తుంది. ► బాధితుడి డబ్బు ఏ ఖాతాకు బదిలీ అయ్యిందో చూసి, ఆ డబ్బును హోల్డ్‌లో ఉంచుతుంది. అంటే, మోసగాడు ఆ డబ్బును పొందలేడు. మోసగాళ్ల చేతికి డబ్బు చేరకుండా తిరిగి పొందేంతవరకు ఈ ప్రక్రియ పునరావృతం అవుతూనే ఉంటుంది. ► సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్స్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా సూచించిన అనేక బ్యాంకుల ఖాతాల నుంచి డబ్బు విత్‌డ్రా చేసినట్లయితే, తదుపరి ప్రక్రియ కోసం సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. భద్రతా సూచనలు... ► ఫోన్ సంభాషణల్లో ఉన్నప్పుడు ఎలాంటి బ్యాంకింగ్ లావాదేవీలు చేయకూడదు. ► క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయడం లేదా ఓటీపీ, యుపీఐఎన్, బ్యాంక్ కార్డ్ సీవీవీ నంబర్లు షేర్ చేయడం అంటే మీ ఖాతా నుండి డబ్బును మీరే వదులుకుంటున్నారని అర్ధం. ► కస్టమర్ కేర్ నంబర్ల కోసం గూగుల్ ఇంజిన్లలో ఎప్పుడూ శోధించవచ్చు. సరైన కస్టమర్ కేర్ నంబర్ కోసం సంబంధిత యాప్ లేదా అప్లికేషన్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి, తెలుసుకోవాలి. ► అన్ని ఇ–మెయిల్, సోషల్ మీడియా ఖాతాల కోసం రెండు రకాల ఫోన్ నంబర్లు వాడటం శ్రేయస్కరం. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ఓఎల్ఎక్స్లో.. రూ. 50 వేలకే పల్సర్ బైక్ ఇప్పిస్తానని చెప్పి..
సాక్షి, జిన్నారం(మహబూబ్‌నగర్): సెకండ్ హ్యాండ్ బైక్‌ను కొనుగోలు చేసే విషయంలో రూ.50వేలు నష్టపోయానని మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని బొల్లారం మున్సిపల్ పరిధిలో ఆదివారం జరిగింది. బొల్లారం సీఐ ప్రశాంత్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వనపర్తి జిల్లా విపన్నగాండ్ల గ్రామానికి చెందిన మాండ్ల సురేశ్(26) భార్య సౌందర్యలతో కలిసి బొల్లారం మున్సిపల్ పరిధిలోని బీరప్పబస్తీలో నివాసం ఉంటున్నారు. కూలి పని చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. మాండ్ల సురేశ్ గత కొంత కాలంగా ఓఎల్ఎక్స్లో విధులు నిర్వహిస్తున్న అశోక్‌కుమార్‌తో పరిచయం పెంచుకున్నాడు. రూ. 50వేలకే సెకండ్ హ్యాండ్ పల్సర్ బైక్‌ను ఇప్పిస్తానని అశోక్‌కుమార్ చెప్పాడు. రెండు నెలల నుంచి దశల వారీగా సురేశ్ రూ. 50వేలను అశోక్‌కుమార్‌కు అప్పజెప్పాడు. అనంతరం పది రోజుల నుంచి అశోక్‌కుమార్ ఫోన్ లేపటం లేదు. ఫోన్ స్విచ్ఆఫ్ రావటంతో తాను నష్టపోయానని భావించిన సురేష్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య సౌందర్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని సీఐ ప్రశాంత్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్ చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
బీఅలర్ట్: స్కాన్ పేరుతో స్కామ్!
శ్రీకాకుళం: నట్టింటికి నెట్ వచ్చినప్పటి నుంచి వలలో వేయడం, పడడం తేలికైపోయింది. వస్తువులు అ మ్మాలన్నా కొనాలన్నా చాలా మంది ఓఎల్ఎక్స్/క్వికర్ వంటి ఆన్లైన్ వెబ్సైట్లను ఆశ్రయిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు దీన్ని కూడా ఒక అవకాశంగా మలచుకొని ప్రజలను మోసగిస్తున్నారు. ఎలా మోసం చేస్తారు..? ఓఎల్ఎక్స్, క్వికర్ వంటి వెబ్సైట్లలో వస్తువులను అ మ్మదలచి పోస్ట్‌లను పెడితే, సైబర్ నేరగాళ్లు ఆర్మీ/ నేవీ లేదా పారా మిలటరీకి చెందిన ఉద్యోగులమని నమ్మించి ఆ వస్తువులను కొనడానికి అంగీకరిస్తారు. డబ్బులు ఆన్లైన్లో బదిలీ చేస్తామని చెప్పి ఎప్పటి దో రశీదు కావాలనే స్క్రీన్ షాట్ తీసి పంపిస్తారు. డబ్బులు రాలేదని గ్రహిస్తే.. ఏదో టెక్నికల్ కారణం వల్ల పేమెంట్ ఆగి ఉంటుందని, ఈసారి క్యూఆర్ కోడ్‌ను పంపిస్తున్నామని స్కాన్ చేసి, పిన్ నంబర్ ఎంటర్ చేసి పేమెంట్ పొందాలని సూచిస్తారు. అలా చేస్తే మన అకౌంట్లో డబ్బులు పడడం బదు లు మన డబ్బులే పోతాయి. పోయాక కూడా అటువైపు వ్యక్తితో మాట్లాడితే ఇదే ప్రాసెస్‌ను రెండు మూ డు సార్లు చేయాలని చెప్పి అందిన కాడికి దోచేస్తారు. డబ్బు చేతికి అందిన వెంటనే కనెక్షన్ కట్ చేసేస్తాడు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలాంటి నేరాలు చేసే వారు అవతలి వ్యక్తిని నమ్మించేందుకు ఆర్మీ/నేవీ/పారా మిలటరీ ఫోర్స్‌కు చెంది న ఉద్యోగులుగా ఫేక్ ఐడెంటిటీ కార్డులు లేదా పత్రా లు సృష్టించి వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తారు. అలాంటి వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఓఎల్ఎక్స్, క్వికర్ వంటి వెబ్సైట్లలో పాత వస్తువులను కొనే ముందు లేదా అమ్మే ముందు అవతలి వ్యక్తి వివరాలు నిశితంగా పరిశీలించి సంప్రదింపులు జరపాలి. ఇలాంటి లావాదేవీల విషయంలో అడ్వాన్స్ పేమెంట్స్ చేయడం గానీ లేదా అంగీకరించడం గా నీ చేయకూడదు. అలాగే లింక్స్ క్లిక్ చేయడం, క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయడం అంటే మోసపోవడమే. పిన్ నంబర్‌ను డబ్బులు పంపడానికే తప్ప రిసీవ్ చేసుకోవడానికి వాడం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అమ్మే వ్యక్తి/కొనే వ్యక్తి అనవసరమైన కంగా రు లేదా తొందర పెడుతుంటే మోసమని గ్రహించాలి. -
ఓఎల్ఎక్స్ మోసం.. దొంగ దొరికేశాడుగా!
సాక్షి, కుత్బుల్లాపూర్: ఓఎల్ఎక్స్ వేదికగా మోసానికి పాల్పడిన ఓ వ్యక్తిని పేట్ బషీరాబాద్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. సుచిత్ర సమీపంలోని కృష్ణమూర్తినగర్‌కు చెందిన ఇవాన్ రాజు ఫ్లూటర్ ఇనిస్టిట్యూట్ ఉద్యోగి. కాగా ఏప్రిల్ 20న ఓఎల్ఎక్స్ యాప్‌లో ఓ వ్యక్తి ప్లే స్టేషన్–5 అనే వస్తువును విక్రయానికి పెట్టగా అది చూసిన ఇవాన్‌రాజు తన ఫోన్ నంబర్‌ను షేర్ చేశాడు. వెంటనే అతడికి రంజిత్‌రెడ్డి (ఫోన్ నం. 790837947)అనే వ్యక్తి కాల్ చేశాడు. గూగుల్ పే ద్వారా అకౌంట్ నం. 6281673654కు రూ.15 వే లు పంపితే ‘ప్లే స్టేషన్–5’ను పంపుతానని చెప్పా డు. అంతేకాకుండా తన ఆధార్ కార్డు ఫొటోను సైతం షేర్ చేశాడు. దీంతో అతడిపై నమ్మకం కలిగి ఇవాన్‌రాజు రూ.15 వేలు పంపాడు. ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ ఖర్చుల నిమిత్తం మరో రూ.6,500 పంపాలని కోరగా.. ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేశాడు. అనంతరం డెలివరీ బాయ్ నంబర్ అంటూ 830 9520268 పంపాడు. అయితే, సదరు వస్తువును ఎంతకీ డెలివరీ చేయకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు గత నెల 25న పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు న మోదు చేశారు. ఫోన్ నంబర్, ఆధార్ కార్డుల ఆధా రంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మోసానికి పా ల్పడిన వ్యక్తి బాగ్అంబర్పేట్ రామకృష్ణనగర్‌కు చెందిన రంజిత్‌గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆదేశానుసారం రంజిత్‌ను సోమవారం రిమాండ్‌కు తరలించారు. -
వంట మనిషి పేరిట యువకునికి టోకరా..
సాక్షి, జీడిమెట్ల: వంట మనిషి కోసం ఓఎల్ఎక్స్లో యాడ్ ఇచ్చిన ఓ వ్యక్తి రూ.11,500లు మోసపోయిన ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ బాలరాజు కథనం ప్రకారం... అపురూపకాలనీకి చెందిన లంక గణేష్ చంద్ర(20) ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. గణేష్ తన స్నేహితుడు అనిల్‌తో కలిసి టిఫిన్ సెంటర్ పెట్టాలని అనుకున్నాడు. వంట మనిషి కావాలంటూ ఓఎల్ఎక్స్లో యాడ్ పెట్టాడు. ఇది చూసిన ఓ వ్యక్తి గణేష్‌కు ఫోన్ చేసి తాను విజయవాడ ఎస్ఎన్ సర్వీసెస్ నుంచి మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడు. రెండు వారాల్లో వంట మనిషిని పంపిస్తానని, తాను చెప్పే బ్యాంక్ అకౌంట్లో రూ.11, 500 జమ చేయాలని అన్నాడు. దీనికి ఒప్పుకున్న గణేష్ అతను చెప్పి అకౌంట్‌కు డబ్బు పంపించాడు. వంట మనిషిని పంపకపోవడంతో మళ్లీ అతడికి ఫోన్ చేయగా రెండు రోజుల్లో పంపిస్తానని చెప్పి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. ఒకసారి మోసపోయిన గణేష్ మరోసారి వంట మనిషి కావాలని ఓఎల్ఎక్స్లో యాడ్ పోస్ట్ చేశాడు. ఈసారి అదే గొంతుతో మరో నంబర్ నుంచి కాల్ వచ్చింది. గుర్తు పట్టిన గణేష్ సదరు వ్యక్తిని నిలదీయగా ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సోఫా కొంటాను రూపాయి పంపమన్నాడు, నిండా ముంచేశాడు
సాక్షి, చందానగర్: ఓఎల్ఎక్స్లో సోఫా అమ్మకం కోసం పెట్టిన వ్యక్తిని మోసగించి రూ.25 వేలు కాజేసిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. ఎస్ఐ అహ్మద్ పాషా కథనం ప్రకారం.. చందానగర్ అపర్ణ లేక్ బ్రిజ్ అపార్ట్మెంట్లో నివాసముండే జోసెఫ్ అంగర్ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. అతను ఓఎల్ఎక్స్లో తన సోఫా విక్రయానికి పెట్టగా, ఫోన్ నం. 9090045860 నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. రూ. 15 వేలకు సోఫా కొనుగోలు చేస్తానని, తనకు ఒక రూపాయి క్యూఆర్ కోడ్ ద్వారా పంపించాలని ఓ గుర్తు తెలియని వ్యక్తి కోరారు. జోసెఫ్‌కు క్యూ ఆర్ కోడ్ పంపించాడు. ఆ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసిన జోసెఫ్ ఒక రూపాయి పంపగా, తిరిగి రూ. 2 వచ్చాయి. అలా ఒకటి, రెండు, ఐదు, పది రూపాయల వరకు పంపగా అవి రెట్టింపు అయ్యి జోసెఫ్‌కు వచ్చాయి. ఇది నిజమని నమ్మిన జోసెఫ్ పేటీఎం అకౌంట్ నుంచి రూ.5 వేలు గుర్తు తెలియని వ్యక్తికి పంపగా, సాంకేతిక కారణాలు చెప్పి జోసెఫ్ నుంచి ఆ కేటుగాడు దఫా దఫాలుగా మొత్తం రూ. 25 వేలు రాబట్టాడు. తనకు డబ్బులు తిరిగి రాకపోగా గుర్తు తెలియని వ్యక్తికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సైబర్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేవైసీ అప్డేట్ పేరిట టోకరా చందానగర్: కేవైసీ అప్డేట్ పేరుతో రూ.39,999 కాజేసిన ఘటన చందానగర్ ఠాణా పరిధిలో సోమవారం జరిగింది. ఎస్ఐ అహ్మద్ పాషా తెలిపిన ప్రకారం.. డోయన్స్ టౌన్షిప్ కాలనీలో నివాసముండే చల్లా శ్రీనివాస్‌రెడ్డి ఎల్ఐసీ ఏజెంట్. కస్టమర్ కేర్ నుంచి ఫోన్ చేస్తున్నానని ఓ గుర్తు తెలియని వ్యక్తి అతడికి కాల్ చేశాడు. మీరు కేవైసీ అప్డేట్ చేసుకోవాలని చెప్పి లింక్ పంపించాడు. ఆ లింక్‌ను ఓపెన్ చేయగా క్లిక్ సపోర్ట్ అనే యాప్ డౌన్లోడ్ అయ్యింది. మరో లింక్ పంపుతానని గూగుల్ క్రోమ్ ద్వారా దానిని ఓపెన్ చేసి, రీచార్జ్ కోసం ఏటీఎం కార్డు వివరాలు నమోదు చేయాలని చెప్పాడు. అతడు చెప్పిన విధంగా శ్రీనివాస్‌రెడ్డి చేయగా, అందులో టాప్ హెడ్లైన్ ద్వారా రీఛార్జ్ రూ.32 చేయాలని ఉంది. ఏటీఎం కార్డు వివరాలు నమోదు చేసిన మరుక్షణమే శ్రీనివాస్‌రెడ్డి అకౌంట్లో ఉన్న మొత్తం రూ.39,999లు డెబిట్ అయినట్లు మెసెజ్ వచ్చింది. తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు చందానగర్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సైబర్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మేమేం పాపం చేశాం.. మాకెందుకీ కడుపుకోత -
ఓఎల్ఎక్స్: 8 సార్లు బకరాను చేశారు..
సాక్షి, సిటీబ్యూరో: తన ఇంట్లో ఉన్న పాత సోఫాను ఓఎల్ఎక్స్ ద్వారా రూ.6,500 అమ్మాలని భావించిన మారేడ్‌పల్లి వాసి సైబర్ నేరగాడి చేతికి చిక్కి రూ.1.96 లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితుడు బుధవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మారేడ్‌పల్లి ప్రాంతానికి చెందిన సుశీల్ తన ఇంట్లో ఉన్న పాత సోఫాను ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టారు. దీన్ని చూసిన సైబర్ నేరగాడు ఆ ప్రకటనలో ఉన్న ఫోన్ నెంబర్ ద్వారా సుశీల్‌ను సంప్రదించారు. ఆ సోఫా తమకు నచ్చిందని, రూ.6,500 గూగుల్ పే క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లిస్తానని చెప్పాడు. దీనికి సుశీల్ అంగీకరించడంతో ఓ క్యూఆర్ కోడ్ పంపాడు. దీన్ని సుశీల్ స్కాన్ చేయగా... రూ.6,500 తన ఖాతాలోకి రావాల్సింది పోయి... ఆ మొత్తం కట్ అయింది. దీంతో ఆయన సైబర్ నేరగాడికి ఫోన్ ద్వారా సంప్రదించారు. ఏదో పొరపాటు జరిగిందంటూ చెప్పిన అతడు ఈసారి మొత్తం రూ.13 వేలకు క్యూఆర్ కోడ్ పంపుతున్నట్లు చెప్పాడు. అలా వచ్చిన దాన్ని స్కాన్ చేయగా... రూ.13 వేలు కట్ అయ్యాయి. ఇలా మొత్తం ఎనిమిది సార్లు కోడ్స్ పంపి స్కాన్ చేయించిన సైబర్ నేరగాడు బాధితుడి ఖాతా నుంచి రూ.1.96 లక్షలు కాజేశాడు. మరోసారి కోడ్ పంపిస్తానంటూ చెప్పడంతో అనుమానం వచ్చిన బాధితుడు సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: రూ.1.04 కోట్ల ఆభరణాల పట్టివేత -
రూ. 23,100కే రైల్వే జాబ్!
సాక్షి, హైదరాబాద్: ఓఎల్ఎక్స్లో రైల్వే ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇచ్చి, సంప్రదించిన వారితో షైన్.కామ్‌లో రిజిస్టర్ చేయించి, వివిధ చార్జీల పేరుతో రూ. 23,100 వరకు వసూలు చేసి, మోసం చేసే ముఠా సూత్రధారిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఓ బాధితుడి ద్వారా నిందితుడిని కోల్‌కతాలో పట్టుకున్న అధికారులు పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువచ్చారు. జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన అనంతరం కోర్టు అనుమతితో బుధవారం సైబర్ కాప్స్ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ముఠా చేతిలో దేశ వ్యాప్తంగా దాదాపు 3 వేల మంది మోసపోయారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి సంఖ్యే 20 మంది వరకు ఉందని అధికారులు చెబుతున్నారు. వీరిలో ముగ్గురి ఫిర్యాదులతో కేసులు నమోదు కాగా... మరో 12 మందిని గుర్తించామని, మిగిలిన ఐదుగురి కోసం ఆరా తీస్తున్నట్లు తెలిపారు. ⇔ కోల్‌కతా, హుగ్లీలోని చందన్నగర్కు చెందిన హర్ష బర్దన్ మిశ్రా బీసీఏ పూర్తి చేశాడు. ఆపై కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు చేసిన ఇతగాడు ప్రస్తుతం అక్కడి నరూ రోయ్‌పర ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ ఐటీ టెక్నాలజీ గ్రూప్ అండ్ ఏఎస్ ఇన్ఫోసాల్వ్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. ⇔ పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన బినిత పాల్, రిచ, అనితలను ఉద్యోగులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఐదుగురూ కలిసి ఆన్లైన్ ద్వారా దేశ వ్యాప్తంగా అనేక మందిని ఉద్యోగాల పేరుతో ఎర వేసి మోసం చేస్తున్నారు. ⇔ ఓఎల్ఎక్స్లో రైల్వేతో పాటు డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇచ్చే వీరు అందులో తమ ఫోన్ నంబర్లను పొందుపరుస్తున్నారు. వీటిని చూసి ఎవరైనా కాల్ చేస్తే.. వారి వివరాలను షైన్.కామ్ వెబ్సైట్లో నమోదు చేయాలని సూచిస్తున్నారు. ⇔ ఆ తర్వాత రెండు రోజుల్లో నిందితులు బాధితులకు ‘హెచ్ఆర్ రిచ’, ‘హెచ్ఆర్ జాస్మిన్’ పేర్లతో బల్క్ మెసేజ్‌లో పంపుతున్నారు. ఉద్యోగార్థుల్లో అత్యధికులు రైల్వే ఉద్యోగాలే కోరుతుండటంతో ఆ డిపార్ట్మెంట్లో సైట్ సూపరింటెండెంట్ పోస్టులకు అర్హులయ్యారంటూ చెబున్నారు. మరికొందరితో ప్యాంటరీకార్స్లో పోస్టుల పేరు చెప్తున్నారు. ⇔ నెలకు రూ.13,500 నుంచి రూ.15,500 వరకు ప్రారంభ వేతనం ఉంటుందని, ఉద్యోగస్తుడితో పాటు అతడి కుటుంబానికీ రైల్వేలో ఉచిత ప్రయాణం సహా ఇతర సౌకర్యాలు ఉంటాయంటూ నమ్మబలుకుతున్నారు. ఇలా తమ వల్లోపడిన వారి నుంచి రిజిస్ట్రేషన్ చార్జీల పేరుతో ప్రాథమికంగా రూ.1000 వసూలు చేస్తున్నారు. ⇔ ఆపై ప్రాసెసింగ్, యూనిఫాం చార్జీల పేర్లు చెప్పి రూ. 23,100 వరకు వసూలు చేస్తున్నారు. నగదు చెల్లించిన వారు ఎవరైనా ఫోన్లు చేస్తే త్వరలోనే రైల్వే హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్, నియామక ఉత్తర్వులు అందుతాయంటూ దాట వేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత ఎవరైనా పదేపదే కాల్స్ చేసి ఉద్యోగం విషయం ప్రశ్నిస్తే కొత్త కథ అల్లుతున్నారు. ⇔ అయితే 95 శాతం మంది రూ. 23,100 కోల్పోయిన తర్వాత వీరికి దూరంగా ఉంటున్నారు. మిగిలిన వారు మాత్రం అదనపు మొత్తం చెల్లించడానికి సిద్ధమంటుంటే... వారి నుంచి మరో రూ.6,900 వరకు వసూలు చేసి వారి నంబర్లను బ్లాక్ చేస్తున్నారు. ⇔ ఈ గ్యాంగ్ చేతిలో మోసపోయిన వాళ్లల్లో అత్యధికులు పోలీసుల వరకు వచ్చి ఫిర్యాదు చేయట్లేదు. నగరానికి చెందిన ముగ్గురు మాత్రం రూ.23 వేల నుంచి రూ.30 వేల వరకు చెల్లించి మోసపోయారు. వీరంతా సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. ⇔ వీటిని సాంకేతికంగా దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ నవీన్ నేతృత్వంలోని బృందం ప్రధాన నిందితుడు హర్ష కోల్‌కతా సమీపంలోని డమ్‌డమ్‌లో ఉన్నట్లు గుర్తించింది. అక్కడికి వెళ్లే సరికి తన మకాం మార్చేశాడని తేలింది. అయితే అతడు ఓ వ్యక్తితో పదేపదే ఫోన్లో మాట్లాడుతున్నట్లు గుర్తించిన స్పెషల్ టీమ్ అతడిని పట్టుకుంది. విచారణ నేపథ్యంలో తాను కూడా హర్షకు రూ.30 వేలు చెల్లించి మోసపోయిన కోల్‌కతా వాసినంటూ చెప్పాడు. ⇔ అతగాడికి నరూ రోయ్‌పర ప్రాంతంలో ఓ కార్యాలయం ఉందని చెప్పి పోలీసులను తీసుకెళ్లి చూపించాడు. దీంతో హర్షను అరెస్టు చేసిన అధికారులు అక్కడి కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువచ్చారు. పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నారు. -
‘జర జాగ్రత్త’లో యాంకర్ వర్షిణి
సాక్షి, సిటీబ్యూరో: రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఓవైపు ఫిర్యాదులు అందగానే కేసులను ఛేదించి నిందితులను పట్టుకుంటున్న పోలీసులు...అసలు మోసం జరగకుండా చూడాలన్న ఉద్దేశంతో ‘డిజిటల్ ప్లాట్‌ఫామ్’ను వేదికగా ఎంచుకున్నారు. ఇందులో భాగంగానే సెకండ్ హ్యాండ్ వస్తువులకు వేదికైన ఓఎల్ఎక్స్లో జరుగుతున్న మోసాలపై ఏకంగా లఘుచిత్రాన్ని నిర్మించారు. ‘బివేర్ ఆఫ్ క్యూఆర్ కోడ్ స్కాన్ అండ్ ఓఎల్ఎక్స్ ఫ్రాడ్’ పేరుతో ప్రముఖ వ్యాఖ్యాత వర్షిణి, కాలేజీ విద్యార్థిని సింధు సంగం కలిసి నటించిన ఈ షార్ట్‌ఫిల్మ్‌ను గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సజ్జనార్ విడుదల చేశారు. ఈ లఘుచిత్ర లింక్‌ను సైబరాబాద్ పోలీసుల సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విట్టర్లలో కూడా పోస్టు చేశారు. ఇవీ గమనించండి... ► సెకండ్ హ్యాండ్ వస్తువుల పేరుతో క్రయవిక్రయాలు జరిపే ఆన్లైన్ పోర్టల్స్‌ను సైబర్ నేరగాళ్లు అక్రమ సంపాదనకు అడ్డాగా మార్చుకుంటున్నారు. ప్రభుత్వోద్యోగులమని, ఆర్మీ అధికారులమంటూ ప్రచారం చేసుకుంటూ తక్కువ ధరకే విలువైన కార్లు, కెమెరాలు అమ్ముతామని నమ్మిస్తారు. ► కొంతమంది ఫిర్యాదులు చేస్తున్నా..చాలామంది ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. ► సైబర్ నేరగాళ్లు ఇచ్చే ప్రకటనల్లో వస్తువుకు సరైన ధర ఉండదు. వస్తువు డెలివరీ కాకముందే నగదు ఇవ్వొద్దు. నగదు వెనక్కి ఇస్తామంటే అస్సలు నమ్మొద్దు. ► గుర్తు తెలియని వ్యక్తులు, ఓఎల్ఎక్స్ ప్రకటనలకు సంబంధించి క్యూఆర్ కోడ్లు పంపిస్తే వాటిని క్లిక్ చేయొద్దు. క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు చెల్లించమంటే అది మోసమని గ్రహించాలి. వాటిని ప్రత్యక్షంగా చూసిన తర్వాతే కొనుగోలు చేయాలి. ► అడ్వాన్స్ డబ్బును వాహనం రిజిస్ట్రేషన్ అవ్వగానే ఇస్తామంటే అసలు నమ్మొద్దు. ప్రత్యక్షంగా కలవండి. పత్రాలన్నింటిని స్వయంగా పరిశీలించండి. ► ఏదేని ఫిర్యాదు కోసం డయల్ 100, 9490617444 వాట్సాప్ నంబర్‌ను సంప్రదించాలని సీపీ సజ్జనార్ అన్నారు. -
ప్రధాని మోదీ ఆఫీస్‌ను అమ్మబోయారు!
వారణాసి : ప్రధాని నరేంద్ర మోదీ ప్రజావ్యవహారాల కార్యాలయాన్ని కొందరు ఆన్లైన్లో అమ్మకానికి పెట్టారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వారిని అరెస్టు చేశారు. వివరాలు.. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోని గురుధామ్ కాలనీలో ఉన్న ప్రధానమంత్రి కార్యాలయాన్ని రూ.7.5 కోట్లకు కొందరు ఆకతాయిలు ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టారు. ఈ యాడ్ ప్రకారం లక్ష్మీకాంత్ ఓజా అనే వ్యక్తి ప్రధాని కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టాడు. ఇందులో నాలుగు బెడ్ రూమ్‌లు, నాలుగు బాత్రూమ్లు మొత్తంగా 6,500 చదరపు అడుగులు ఉన్నట్టు పేర్కొన్నారు. రెండు అంతస్థులు, రెండు కార్ల పార్కింగ్‌కు సంబంధించిన స్పేస్ ఉండే ఈ భవనాన్ని మినీ పీఎంవోగా తెలిపారు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో ముందుగా అవాక్కయ్యారు వెంటనే ఆ యాడ్‌ను తొలగించారు. బెలుపూర పోలీస్ స్టేషన్ పరిధిలో ఇందుకు సంబంధించిన కేసు నమోదు చేశారు. కొన్ని అసాంఘిక శక్తులు ఈ రకమైన చర్యలు పాల్పడ్డాయని వారణాసి సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ పాఠక్ తెలిపారు. లక్ష్మీకాంత్ ఓజా సహా నలుగురికి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. -
సెల్ఫోన్లు కొట్టేసి.. ఓఎల్ఎక్స్లో పెట్టేసి..
సాక్షి, హైదరాబాద్: రహదారుల సమీపంలోని మొబైల్ షాపుల్లో సెల్ఫోన్లు చోరీ చేస్తారు. వీటిని ఓఎల్ఎక్స్లో విక్రయిస్తారు. వచ్చిన సొమ్ముతో జల్సా చేస్తారు. ఇదీ అయిదుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠా పని. వీరిని ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. మియాపూర్ ఠాణా పరిధిలోని రిలయన్స్ డిజిటల్ షాపులో గత నెల 14న తెల్లవారుజామున 119 సెల్ఫోన్లు తస్కరించి ముంబైకి తీసుకెళ్లిన ఈ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 113 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ కృష్ణ ప్రసాద్‌లతో కలిసి సీపీ సజ్జనార్ ఈ కేసు వివరాలు వెల్లడించారు. ప్రధానంగా వీటిపైనే దృష్టి.. ⇔ ముంబైకి చెందిన ప్రధాన నిందితుడు మహమ్మద్ తాబ్రేజ్ దావూద్ షేక్ నాగ్‌పూర్‌లో చోరీ కేసుల్లో 2016లో జైలుకు వెళ్లాడు. ఈ సమయంలో మరో నిందితుడు రాజు పాండురంగతో పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. ఫర్హాన్ ముంతాజ్ షేక్, రషీద్ మహమ్మద్ రఫీక్ షేక్, మహమ్మద్ షుఫియాన్ షేక్‌లతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ⇔ కర్ణాటకలోని బ్రహ్మపురంలో 80 సెల్ఫోన్లు, సూరత్‌లోని ఓ మొబైల్ షాప్‌లో 180 సెల్ఫోన్లు అపహరించారు. దీంతో మళ్లీ ఆయా రాష్ట్రాల్లోని నగరాల్లో నేరాలు చేస్తే దొరికిపోతామనే భయంతో హైదరాబాద్‌కు అద్దె వాహనం (ఇన్నోవా)లో వచ్చారు. ⇔ నంబర్ ప్లేట్‌ను ఏపీ09గా మార్చి గత నెల 13న నగరానికి చేరుకున్నారు. ప్రధాన రహదారి వెంట సెల్‌ఫోన్ షాప్‌లను పరిశీలించారు. 14వ తేదీ వేకువ జామున మియాపూర్‌లోని రిలయన్స్ డిజిటల్ షాప్ షెట్టర్లను గడ్డపార, ఇతర సామగ్రితో పగులగొట్టి తెరిచారు. 119 సెల్ఫోన్లు సంచిలో వేసుకొని కారులో వెళ్లారు. ⇔ పంజాగుట్ట ఓ షట్టర్ తాళాలు పగులగొట్టి తెరిచి ఖజానాలో ఉన్న రూ.4వేలు తీసుకున్నారు. అనంతరం పటాన్‌చెరులోని వైన్స్ దుకాణం షెట్టర్ పగులగొట్టి రూ.700 నగదుతో పాటు మద్యం సీసాలను దొంగిలించినట్లు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ముంబై పోలీసుల సహకారంతో... ⇔ సమాచారం తెలుసుకున్న మియాపూర్ పోలీసులు నిందితులు వాడిన వాహనం ఏయే ప్రాంతాల మీదుగా వెళ్లిందో సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. వెంటనే ఆ నంబర్ ప్లేట్ నకిలీదని గుర్తించి సమీప రాష్ట్రాల్లోని పోలీసులను అప్రమత్తం చేశారు. ⇔ షోలాపూర్ టోల్‌ప్లాజా నుంచి ముంబైకి వెళ్లినట్టుగా తెలిసింది. వెంటనే మాదాపూర్ ఎస్వోటీ, మియాపూర్ పోలీసులు బృందాలు ఏర్పడి 20 రోజులకుపైగా అక్కడే తిష్ట వేశారు. ముంబై పోలీసుల సహకారంతో అయిదుగురిని పట్టుకున్నారు. ⇔ ‘గతంలో చోరీ చేసిన సెల్ఫోన్లను ఓఎల్ఎక్స్లో తక్కువ ధరకు విక్రయిస్తామని, నగరంలో చోరీ చేసిన సెల్ఫోన్లను సైతం అలాగే విక్రయిద్దామనుకున్నాం’ అని నిందితులు విచారణలో వెల్లడించినట్లు, వీరిని ట్రాన్సిట్ వారెంట్‌పై మంగళవారం నగరానికి తీసుకొచ్చినట్లు సీపీ వివరించారు. -
ఇలా కూడా మోసం చేస్తారు జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: ఓఎల్ఎక్స్లో విక్రయానికి పెట్టిన వస్తువులు కొంటామని, మరికొన్నింటిని అమ్ముతామంటూ పోస్టింగ్స్ పెట్టి అందినకాడికి దండుకునే కేసుల్ని తరచు చూస్తునే ఉంటున్నాం. అయితే ఈ యాప్ కేంద్రంగా జరిగిన ఓ వెరైటీ సైబర్ క్రైమ్ నగరంలో వెలుగులోకి వచ్చింది. ఇందులో బాధితుడు, ‘బాధితుడి లాంటి వ్యక్తి’ మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. (అల్లుడితో సంబంధం.. వేధింపులు భరించలేక) అసలేం జరిగింది? నగరంలో పశ్చిమ మండల పరిధిలో ఉన్న ఎస్సార్‌నగర్ ప్రాంతానికి చెందిన పవన్ అనే యువకుడు తన వద్ద ఉన్న ఫోన్‌ను విక్రయంచాలని భావించాడు. దీనికోసం అతడు దాని ఫొటో, వివరాలతో పాటు తన ఫోన్ నెంబర్‌ను పొందుపరుస్తూ ఓఎల్ఎక్స్ యాప్‌లో ఒక యాడ్ పోస్టు చేశాడు. అందులో ఆ ఫోన్ రేటును రూ.27 వేలుగా పేర్కొన్నాడు. తిరుపతి సమీపంలోని ప్రాంతానికి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్న బాలాజీ అనే నిందితుడు ఈ యాడ్‌ని చూశాడు. అందులోని ఫోన్ ఫొటో, వివరాలు కాపీ చేసి మరో యాడ్‌గా పోస్ట్ చేశాడు. ఈ యాడ్‌ను గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన మోహన్ అనే వ్యక్తి చూశాడు. ఆ ఫోన్ ఖరీదు చేయాలని భావించిన అతగాడు ‘కాపీ–పోస్ట్’ యాడ్‌లో ఉన్న నెంబర్ ఆధారంగా బాలాజీని సంప్రదించాడు. బేరసారాల తర్వాత ఆ ఫోన్‌ను రూ.20 వేలకు ‘విక్రయించడానికి’ బాలాజీ అంగీకరించాడు. అయితే తాను ప్రస్తుతం వేరే ప్రాంతంలో ఉన్నానని, ఎస్సార్‌నగర్ వెళితే తన సోదరుడు ఫోన్ చూపిస్తాడంటూ చెప్పి పవన్ నెంబర్ ఇచ్చాడు. ఆ వెంటనే పవన్‌కు ఫోన్ చేసిన బాలాజీ... ఓఎల్ఎక్స్లో పోస్ట్ చేసిన ఫోన్ తనకు నచ్చిందని, అయితే తాను వేరే ఊరిలో ఉండటంతో తన స్నేహితుడు వచ్చి దాన్ని పరిశీలించి వెళతాడని చెప్పాడు. అతడికి ఫోన్ చూపించాలని, నచ్చితే వెంటనే తనకు ఫోన్ చేసి చెప్తాడని పవన్‌తో నమ్మబలికాడు. ఈ విషయం నమ్మిన పవన్ వచ్చిన వ్యక్తిని కలిసి ఫోన్ చూపించాలని నిర్ణయించుకున్నాడు. బాలాజీ చెప్పిన ప్రకారం పవన్‌ను అతడి సోదరుడిగా భావించిన మోహన్ ఎస్సార్‌గనర్ వచ్చి ఫోన్ చేశాడు. తనకు ఫోన్ చేసింది బాలాజీ ఫ్రెండ్‌గా భావించిన అతడు వెళ్ళి కలిసి ఫోన్ చూపించాడు. వీరిద్దరూ కలిసి ఉండగానే మోహన్‌కు కాల్ చేసిన బాలాజీ... ఫోన్ నచ్చిందా? అంటూ ప్రశ్నించాడు. అదే సమయంలో ఆ ఫోన్‌ను పవన్ నుంచి తీసుకుని పరిశీలిస్తున్న అతడు ఔనంటూ సమాధానం ఇచ్చాడు. ఫోన్లోనే బేరసారాలా తర్వాత రూ.20 వేలకు విక్రయించడానికి అంగీకరించాడు. ఆ వెంటనే తన పథకాన్ని అమలులో పెట్టిన బాలాజీ తొలుత రూ.12 వేలు తనకు ఫోన్‌పే చేయాలని, మిగిలిన మొత్తం పంపడానికి మరో ఖాతా చెప్తానన్నాడు. పవన్ ఎదురుగానే ఉన్న మోహన్ తన ఫోన్ నుంచి బాలాజీకి ఆ మొత్తం ట్రాన్స్ఫర్ చేసేశాడు. ఆ తర్వాత ఫోన్ తీసుకుని వెళ్తుండగా అడ్డుకున్న పవన్ డబ్బు చెల్లించకుండా ఎలా తీసుకువెళ్తున్నారని ప్రశ్నించాడు. దీంతో ఖంగుతిన్న మోహన్ ఇప్పుడే మీ అన్నయ్య బాలాజీకి బదిలీ చేశానని చెప్పగా... అతడు మీ స్నేహితుడు కదా? అంటూ పవన్ ప్రశ్నించాడు. ఇలా ఇద్దరూ చర్చించుకున్న నేపథ్యంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తామిద్దరం బాలాజీ చేతిలో మోసపోయామని భావించారు. బాలాజీకి ఫోన్ చేసిన మోహన్ దీనిపై ప్రశ్నించగా... పరిస్థితి బాగోలేక, డబ్బు అవసరం ఉండి అలా చేశానని, రెండు రోజుల్లో తిరిగి ట్రాన్స్ఫర్ చేస్తానంటూ నమ్మబలికాడు. ఇలా నాలుగు రోజుల పాటు వేచి చూసిన మోహన్ మంగళవారం పవన్‌ను తీసుకుని సిటీ సైబర్ క్రైమ్ ఠాణాకు వచ్చిన ఫిర్యాదు ఇచ్చాడు. దీని ఆధారంగా ఆరా తీస్తున్న అధికారులు బాలాజీగా చెప్పుకున్న వ్యక్తి బ్యాంకు ఖాతా తిరుపతిలో ఉన్నట్లు గుర్తించారు. అతడు అక్కడే ఉండి ఈ నేరం చేశాడా? లేక నగరంలో ఉండి డబ్బు కాజేశాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇది నిర్ధారించడానికి సాంతికేతిక ఆధారాలు సేకరిస్తున్నాడు. -
హైదరాబాద్ పోలీసుల సాహసం..
సాక్షి, హైదరాబాద్: అది రాజస్తాన్ సరిహద్దుల్లోని మేవాట్ ప్రాంతం.. భరత్పూర్ జిల్లాలో ఉన్న మూడు పక్కపక్క గ్రామాలు.. సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతం.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులతో పాటు అక్కడి అధికారులతో కూడిన బృందం.. ‘ఓఎల్ఎక్స్ కేటుగాళ్ల’కోసం గ్రామాల్లో వేట మొదలెట్టింది.. ప్రతిఘటించిన నేరగాళ్లు, వారి కుటుంబీకులు ఎదురుదాడి చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించి 18 మంది దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ తతంగమంతా ‘ఖాకీ’సినిమాను తలపించింది. వీరిని శుక్రవారం హైదరాబాద్ తీసుకొచ్చి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్లు సీసీఎస్ విభాగం డీసీపీ అవినాష్ మొహంతి వెల్లడించారు. ఈ నెల 9న కూడా మరో 8 మంది నేరగాళ్లను అరెస్టు చేశారు. అమ్ముతామంటూ.. కొంటామంటూ.. భరత్పూర్ జిల్లాకు చెందిన చాలా గ్రామాల్లో ఈ ఓఎల్ఎక్స్ కేటుగాళ్ల అడ్డాలు ఉన్నాయి. ఆర్మీ అధికారుల మాదిరిగా ఫొటోలకు పోజులిస్తూ.. ఓఎల్ఎక్స్ వంటి ఈ–యాడ్స్ వెబ్సైట్లలో వివిధ ప్రకటనలు ఇస్తుంటారు. సెకండ్ హ్యాండ్ వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు తక్కువ ధరకు విక్రయిస్తామంటూ పేర్కొంటారు. వాటిని చూసి సంప్రదించిన వారి నుంచి అడ్వాన్సుల రూపంలో వీలున్నంత దోచేస్తారు. మరోపక్క ఆయా వెబ్సైట్లలో సామాన్యులు పెట్టిన సెకండ్ హ్యాండ్ వస్తువుల అమ్మకం ప్రకటనలకు స్పందించి వాటిని విక్రయిస్తామని కూడా డబ్బు స్వాహా చేస్తారు. రంగంలోకి దిగిన సైబర్ పోలీసులు.. రెండేళ్లుగా భరత్పూర్ జిల్లాలోని గ్రామాలపై దాడి చేయడానికి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వేచి చూస్తున్నారు. ఇటీవల తమ వద్ద ఉన్న కేసుల రికార్డులు సిద్ధం చేసిన ఏసీపీ కేవీఎం ప్రసాద్.. ఆపరేషన్ కోసం ఇన్స్పెక్టర్ ఎస్.నవీన్, ఎస్సై రమేశ్‌ల నేతృత్వంలో 10 మంది పోలీసులు ఈ నెల మొదటి వారంలో అక్కడకు పంపించారు. తొలుత పాడ్లా ప్రాంతంలో దాడి చేసి 8 మంది దుండగులను అరెస్టు చేశారు. ఆ తర్వాత చుల్హేరా, కల్యాణ్‌పూర్, ఖరీక గ్రామాల్లో అసలు నేరగాళ్లు ఉన్నారనే విషయం తెలిసింది. దీంతో భరత్పూర్ ఎస్పీ అమరీందర్ సింగ్‌ను సంప్రదించిన ఇక్కడి అధికారులు.. ప్రత్యేక బలగాలను సమీకరించుకున్నారు. 100 మంది పోలీసులు 30 వాహనాల్లో సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు ఈ మూడు గ్రామాలను దిగ్బంధం చేశారు. తీవ్ర ప్రతిఘటన ఎదురైనా.. పోలీసులు వచ్చారనే విషయం తెలుసుకున్న నేరగాళ్లు, వారి కుటుంబీకులు చుట్టుపక్కల వారితో కలసి పోలీసులపై దాడికి దిగారు. కర్రలు, కారం పొడితో అధికారులపై దాడి చేశారు. మూడు పోలీసు వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు కొందరు పోలీసులను గాయపరిచారు. దీంతో భాష్పవాయు గోళాలు ప్రయోగించి 10 మంది నేరగాళ్లను గుర్తించి పట్టుకున్నారు. ఆ తర్వాత వారిని శుక్రవారం హైదరాబాద్ తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు. రెండు దశల్లో అరెస్టయింది వీరే.. ఆరిఫ్ ఖాన్, ధీను ఖాన్, ఇలియాస్ ఖాన్, పుష్పేంద్ర సింగ్, రాధేశ్యాం, మోహన్ సింగ్, హకీం ఖాన్, విజిబ్ ఖాన్, సాహిల్, షహీద్, ఉమర్ ఖాన్, సత్యవీర్ సింగ్, ఇర్ఫాన్, తరీఫ్, ఆరిఫ్ ఖాన్, మోహన్ సింగ్, అజారుద్దీన్, రాహుల్. పోలీసుల జోలికే రావడంతో.. హైదరాబాద్‌లో ఏటా నమోదవుతున్న సైబర్ నేరాల్లో ఈ ఓఎల్ఎక్స్ క్రైమ్దే ప్రథమ స్థానం. రోజుకు దాదాపు ఐదారుగురు బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ నేరగాళ్ల అడ్డా.. భరత్పూర్ జిల్లా అని రెండేళ్ల కిందటే పోలీసులు గుర్తించారు. రెండుసార్లు పోలీసు బృందాలు అక్కడికి వెళ్లి దాడులు చేశారు. అయితే స్థానిక పోలీసుల నుంచి సహకారం లేకపోవడంతో మన పోలీసులు తిరిగి రావాల్సి వచ్చింది. అయితే ఇటీవల ఈ ‘ఓఎల్ఎక్స్ కేటుగాళ్లు’పోలీసులను టార్గెట్‌గా చేసుకున్నారు. దేశవ్యాప్తంగా అనేక మంది అధికారుల పేర్లతో ఫేస్బుక్లో నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి, వారి స్నేహితులలో చాటింగ్ చేస్తూ డబ్బు గుంజారు. దీంతో అన్ని రాష్ట్రాల పోలీసుల నుంచి భరత్పూర్ అధికారులు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో అక్కడి అధికారుల వైఖరిలో మార్పు వచ్చింది. -
ఆ ఇళ్లల్లో సంచుల కొద్ది సిమ్ కార్డులు
సాక్షి, హైదరాబాద్: ఓఎల్ఎక్స్ అమ్మకాల పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్న భరత్పూర్ గ్యాంగ్‌ను సైబర్ క్రైం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఓఎల్ఎక్స్, ఫేస్బుక్ మార్కెటింగ్‌ల పేరుతో భారీ మోసానికి పాల్పడుతున్నట్టు గుర్తించారు. 9 మంది నిందితులను అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు.. వారి నివాసాల నుంచి సంచుల కొద్ది సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అవన్నీ దాపు 800 పైగా సిమ్ కార్డులు ఉంటాయని సీసీఎస్ పోలీసులు తెలిపారు. ఆన్లైన్ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గుడ్డిగా నమ్మి మోసపోవద్దని సూచించారు. (చదవండి: పాదరసం.. అంతా మోసం ) -
ఓఎల్ఎక్స్లో అమ్మకానికి మిగ్-23 విమానం
లక్నో: ఓఎల్ఎక్స్లో ఎవరైనా మొబైల్ ఫోన్లు, బైకులు, ఫర్నిచర్ అమ్మకానికి పెడతారు. కానీ ఓ ప్రబుద్ధుడు మాత్రం ఏకంగా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఉన్న యుద్ధ విమానం మిగ్-23నే అమ్మకానికి పెట్టాడు. అది కూడా 9.99 కోట్ల రూపాయలకు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ఈ విమానాన్ని అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి 2009 లో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) బహుమతిగా ఇచ్చింది. క్యాంపస్‌లో విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఐఏఎఫ్ దీన్ని యూనివర్సిటీకి ఇచ్చింది. (అమ్మకానికి పటేల్ విగ్రహం..!) ఇంతటి చరిత్ర కలిగిన ఈ మిగ్-23 యుద్ధ విమానాన్ని ప్రస్తుతం ఓఎల్ఎక్స్లో అమ్మకానికి ఉంచడంతో సంచలనం రేపుతోంది. ఎవరో కావాలనే యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బ తీయడానికి విమానం ఫోటోను ఓఎల్ఎక్స్లో పెట్టారని సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రొక్టార్ ప్రొఫెసర్ మహమ్మద్ వసీం అలీ మాట్లాడుతూ.. ‘మా యూనివర్సిటీకి చెందిన వారు ఎవరూ ఆ విమానాన్ని ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టలేదు. ఇది ఎవరో ఆకతాయిలు చేసిన పని’ అని తెలిపారు. ఈ విషయంపై తాము విచారణ చేపట్టామని, ఈ పని ఎవరు చేశారో తెలుసుకుని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వసీం అలీ వెల్లడించారు. అంతేకాక సదరు విమానం ఫొటోను వెబ్సైట్ నుంచి తీసేశామని తెలిపారు. -
నేరగాళ్ల అడ్డా..!
-
ట్రెడ్ మిల్ అమ్మబోతే..!
సాక్షి, సిటీబ్యూరో: ఓఎల్ఎక్స్ ద్వారా సెకండ్ హ్యాండ్ ట్రెడ్ మిల్ విక్రయించాలని ప్రయత్నించిన నగర వాసిని సైబర్ నేరగాళ్ళు నిండా ముంచారు. ఈయనకు క్యూఆర్ కోడ్స్ పంపిన క్రిమినల్స్ రూ.1.5 లక్షలు కాజేశారు. ఆదివారం బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మాసబ్‌ట్యాంక్ ప్రాంతానికి చెందిన ఓ న్యాయవాది తన ఇంట్లో ఉన్న పాత ట్రెడ్ మిల్‌ను విక్రయించాలని భావించారు. దీంతో దాని ఫొటో, తన ఫోన్ నెంబర్ ఇతర వివరాలను ఓఎల్ఎక్స్లో పొందుపరిచారు. దీనికి స్పందిస్తున్నట్లు ఇటీవల ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తాను ఆర్మీలో పని చేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు. ఎదుటి వ్యక్తి మాటలు నమ్మిన న్యాయవాది బేరాలు కూడా పూర్తి చేశారు. సదరు ట్రెడ్ మిల్‌ను రూ.10 వేలకు అమ్మడానికి రేటు ఖరారైంది. ఆపై అసలు కథ ప్రారంభించిన సైబర్ నేరగాడు తన ఫోన్‌కు గూగుల్ పే ద్వారా రూ.5 పంపాలని, ఆ వెంటనే రూ.10 వేలు మీ ఖాతాలోకి వస్తాయంటూ చెప్పాడు. న్యాయవాది అలానే చేయడంతో ఆయన ఖాతాలోకి డబ్బు వచ్చింది. ఇలా తమకు రూ.5 వేలు పంపిస్తే రూ.10 వేలు ఖాతాలోకి వస్తాయంటూ నమ్మించారు. పలు దఫాలుగా క్యూఆర్ కోడ్స్ పంపిన సైబర్ నేరగాళ్ళు న్యాయవాది ఖాతా నుంచి రూ.1.5 లక్షలు కాజేశారు. ఈయన సెల్‌ఫోన్ నెంబర్‌కు గూగుల్ పే ఖాతాకు మూడు బ్యాంకు ఖాతాలు అనుసంధానించి ఉన్నాయి. వాటిలో రెండు ఖాతాల నుంచి ఈ డబ్బు పోయింది. అయితే తాను సైబర్ నేరగాళ్ళు సూచించినట్లు చేయలేదని, అయినా డబ్బు పోయిందని బాధితుడు పోలీసుల ఎదుట వాపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. -
నకిలీ యాడ్స్‌పై ఓఎల్ఎస్, క్వికర్‌లకు హైకోర్టు షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ఒఎల్ఎక్స్, క్వికర్‌లు తమ వెబ్సైట్లలో రిలయన్స్ జియో పేరిట నకిలీ ఉద్యోగ ప్రకటనలు పొందుపరచడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రకటనలకు దూరంగా ఉండాలని ఒఎల్ఎక్స్, క్వికర్ ఇండియా ప్రైవేట్ లిమిడెట్‌లను ఆదేశించింది. జియో జాబ్స్, రిలయన్స్ ట్రెండ్స్ జాబ్స్ అనే వర్డ్స్‌ను ఉపయోగిస్తూ నకిలీ ప్రకటనలు ఇవ్వడంతో రిలయన్స్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ప్రతిష్ట, గుడ్‌విల్ దెబ్బతింటాయని ఆర్ఐఎల్ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది. ఈ కేసులో ఆర్ఐఎల్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు అనుకూలంగా ప్రాథమిక ఆధారాలు ఉన్నందున మధ్యంతర ఊరట కల్పిచని పక్షంలో వారికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని జస్టిస్ ముక్తా గుప్తా రెండు వేర్వేరు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జియో, రిలయన్స్ ట్రేడ్‌మార్క్‌లకు తాము సొంతదారులమని ఓఎల్ఎక్స్, క్వికర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లు తమ గుడ్‌విల్‌కు, ప్రతిష్టకు తీరని హాని కలిగించేలా వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ ఆర్ఐఎల్ దాఖలు చేసిన రెండు పిటిషన్లపై హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి : మరో మెగాడీల్‌కు జియో రెడీ -
అమ్మకానికి పటేల్ విగ్రహం..!
గాంధీనగర్ : భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మికంగా నిర్మించిన ఐక్యత విగ్రహం (సర్దార్ వల్లభాయ్ పటేల్) విగ్రహాన్ని ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టారు. విగ్రహం ధరని రూ.30వేల కోట్లుగా నిర్ధారించారు. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న తరుణంలో బాధితులకు వైద్య సదుపాయాలు, ఆస్పత్రుల నిర్మాణానికి ఈ నిధులను ఉపయోగించాలని భావించారు. అయితే పటేల్ విగ్రహాన్ని ఓఎల్ఎక్స్లో పెట్టింది ఓ నెటిజన్. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆదివారం ఓఎల్ ఎక్స్ లో ఓ పోస్టు పెట్టాడు. ‘ఎమర్జెన్సీ... స్టాచ్చూ ఆఫ్ యూనిటీ విగ్రహం అమ్మబడును. ఇది కావాలనుకున్న వారు రూ.30వేల కోట్లు చెల్లిస్తే సరిపోతుంది’ అని పోస్ట్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారడంతో.. ఫేక్ పోస్ట్‌గా గుర్తించి ఒఎల్ఎక్స్ సంస్థ ఆ పోస్ట్‌ను వెంటనే తొలగించింది. కాగా పటేల్ విగ్రహాన్ని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.3వేల కోట్లు ఖర్చు చేసిన విషయం తెలిసిందే. కాగా ఓఎల్ఎక్స్ లో దీని ఖరీదుని రూ.30వేల కోట్లుగా నిర్ధారించడంతో తొలుత చూసిన వారంతా షాక్‌కి గురయ్యారు. భారత్ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు అంకితమిస్తూ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని 2018 అక్టోబర్ 31న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. 182 మీటర్ల ఎత్తయిన ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహంగా గుర్తింపు పొందింది. గుజరాత్‌లోని నర్మదా నదీ తీరంలోని సాధు బెట్ దీవిలో దీన్ని నిర్మించారు. కాగా దీనిని ఆవిష్కరించిన దగ్గర నుంచి పర్యటకులు ద్వారా ఇప్పటి వరకు 82 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని నిర్వహకులు తెలుపుతున్నారు.