సాక్షి, సిటీబ్యూరో: తక్కువ ధరకు వస్తువులంటూ ఎర వేసి అందినకాడికి దండుకునే సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు తమ పంథా మారుస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం ఈ–కామర్స్ సైట్ ఓఎల్‌ఎక్స్ ఆధారంగానే దందా చేసే వీరు తాజాగా ఫేస్‌బుక్‌ను ఆశ్రయిస్తున్నారు. అందులో ఉన్న మార్కెట్ ప్లేస్‌లో బోగస్ ప్రకటనలు ఇచ్చి ఆశపడిన వారి జేబులు గుల్ల చేస్తున్నారు. ఇలాంటి మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు ఇటీవలి కాలంలో పెరిగాయని, ప్రజలు వీరిపట్ల అప్రమత్తంగా ఉండాలని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సెకండ్ హ్యాండ్‌తో పాటు కొన్ని రకాలైన ఫస్ట్‌హ్యాండ్ వస్తువులు అమ్మడానికి, కొనడానికి ఆన్‌లైన్‌పై ఆధారపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఖరీదు చేసే వారు సైతం వాటికి సంబంధించిన సమాచారం సేకరించేందుకు ఇంటర్‌నెట్‌పై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ–కామర్స్ సైట్స్‌తో పాటు యాప్స్ సైతం ప్రాచుర్యం పొందాయి.
వీటికి తోడు ఫేస్‌బుక్‌లోనూ ప్రత్యేకంగా పేజ్‌లు పుట్టుకు వచ్చాయి. వీటిని ఆధారంగా చేసుకున్న సైబర్ చీటర్లు రెచ్చిపోతున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను తక్కువ ధరకు విక్రయిస్తున్నామంటూ మార్కెట్ ప్లేస్‌లో ప్రకటనలు ఇస్తున్నారు. కొన్నిసార్లు తాము భద్రతా బలగాల్లో పని చేస్తున్నామని, హఠాత్తుగా బదిలీ అయిన నేపథ్యంలో ఆయా వస్తువులను తీసుకువెళ్లలేక విక్రయిస్తున్నట్లు పేర్కొంటున్నారు. దీంతో అనేక మందికి విక్రేతలపై నమ్మకం కలుగుతోంది. అలా బుట్టలో పడిన వారు ఆయా వస్తువుల్ని కొనేందుకు ఆసక్తి చూపి సంప్రదిస్తున్నారు. బేరసారాల అనంతరం అడ్వాన్స్ చెల్లించాలంటూ సైబర్ చీటర్లు షరతు పెడుతున్నారు. అప్పటికే పూర్తిగా వారి వల్లో పడిన బాధితులు వివిధ వాలెట్స్‌లోకి నగదు బదిలీ చేస్తున్నారు. డబ్బు తమకు చేరిన వెంటనే సైబర్ నేరగాళ్ల నుంచి స్పందన ఉండట్లేదు. వారి ఖాతాలు, ఫోన్లు కనుమరుగు కావడం, స్విచ్ఛాఫ్‌లో ఉండటం జరుగుతోంది.
ఇటీవల మార్కెట్ ప్లేస్ బాధితుల ఫిర్యాదులు ఎక్కువయ్యాయని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్నారు. ఈ తరహా మోసాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఓఎల్‌ఎక్స్ తదితర వెబ్‌సైట్ల కేంద్రంగా జరుగుతున్న మోసాలు గతంలో పెరగడంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఆయా ఈ–కామర్స్ సైట్లకు లేఖలు రాశారు. దీంతో ఇలాంటి ప్రకటనలపై ఆ సైట్ల నిర్వాహకులు నిఘా పెంచారు. ఈ కారణంగానే సైబర్ నేరగాళ్ళు ఫేస్‌బుక్‌లోని మార్కెట్ ప్లేస్‌కు తమ అడ్డా మార్చి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. తాము పొందుపరిచిన వస్తువులు ఖరీదు చేసేందుకు ఆసక్తి ఉన్న వారు మెసెంజర్ ద్వారా టచ్‌లోకి రావాలని సూచిస్తూ తమ పని పూర్తి చేసుకుంటున్నారు. ఈ తరహాకు చెందిన ఫిర్యాదులు ఇటీవల భారీగా పెరిగాయి. దీంతో మార్కెట్ ప్లేస్ కేంద్రంగా జరుగుతున్న మోసాల పైనా ప్రచారం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment