ఆకర్షించి దోచేస్తారు | OLX Cyber Crimes in Hyderabad | Sakshi
Sakshi News home page

ఆకర్షించి దోచేస్తారు

Published Fri, Jun 21 2019 9:33 AM | Last Updated on Wed, Jun 26 2019 1:21 PM

OLX Cyber Crimes in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: సెకండ్‌ హ్యాండ్‌ వస్తువుల వ్యాపారానికి కేంద్రమైన ఆన్‌లైన్‌ సైట్‌ ‘ఓఎల్‌ఎక్స్‌’ సైబర్‌ నేరగాళ్లకు అడ్డాగా మారింది. ఇందులోని ప్రకటనలకు ఆకర్షితులై ఒకరు రూ.30 వేలకు బేరమాడిన బైక్‌కి రూ.3.6 లక్షలు చెల్లిస్తే.. మరొకరి నుంచి రూ.22 వేలకు ఫైనల్‌ చేసుకున్న ద్విచక్ర వాహనానికి రూ.92 వేలు గుంజేశారు. ఓ ద్విచక్ర వాహనాల షోరూమ్‌లో పనిచేస్తున్న యువతి కొత్త వాహనం బుకింగ్‌కు సంబంధించినదిగా భావించి ఫోన్‌కాల్‌ అందుకుంటే.. అడ్వాన్స్‌ చెల్లిస్తున్నానంటూ చెప్పిన మోసగాడు ఆమె వ్యక్తిగత ఖాతా నుంచి రూ.87 వేలు కాజేశాడు. వాహనాలతో ముడిపడి ఉన్నఈ మూడు ఉదంతాలపై కేసులు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఓఎల్‌ఎక్స్‌ ద్వారా మోసం చేసిన నేరస్తులు ఉత్తరాదిలోని భరత్‌పూర్‌కు చెందిన వారై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

రూ.30 వేల బండికి రూ.3.60 లక్షలు..  
తిరుమలగిరి ఆర్టీసీ కాలనీకి చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి ఈ నెల 14న ఓఎల్‌ఎక్స్‌లో ద్విచక్ర వాహనం విక్రయానికి సంబంధించిన ప్రకటన చూశారు. జోరాసింగ్‌ అనే వ్యక్తి బైక్‌ను రూ.42,500 అమ్మడానికి సిద్ధమంటూ అందులో నమోదు చేశాడు. ఈ ఏడాది మోడల్‌ అవడంతో వాహనాన్ని ఖరీదు చేయాలని భావించిన ప్రైవేట్‌ ఉద్యోగి జోరాసింగ్‌ను సంప్రదించగా.. తాను హైదరాబాద్‌ కేంద్రంగా ఆర్మీలో పనిచేస్తున్నానని, త్వరలో విజయవాడకు బదిలీపై వెళ్తున్నానని చెబుతూ తన గుర్తింపుకార్డు పంపాడు. దీంతో పూర్తిగా నమ్మిన సదరు ప్రైవేట్‌ ఉద్యోగి బేరసారాల తర్వాత బైక్‌ను రూ.30 వేలకు కొనేందుకు సిద్ధమయ్యాడు. ఇక్కడి నుంచి మోసానికి తెరతీసి జోరాసంగ్‌గా చెప్పుకున్న వ్యక్తి ‘ఆర్మీ’ అనే పేరుతో నిర్వహిస్తున్న తన పేటీఎం ఖాతాకు అడ్వాన్స్‌గా రూ.10 వేలు పంపాలని కోరాడు. ఆ మొత్తం ముట్టిన వెంటనే కొరియర్‌లో వాహనాన్ని పంపిస్తానంటూ పేర్కొన్నాడు. ఈ మాటలు నమ్మిన ప్రైవేట్‌ ఉద్యోగి అలానే చేశారు. మరుసటి రోజే కొరియర్‌ బాయ్‌గా చెప్పుకున్న వ్యక్తి నుంచి ఇతడికి ఫోన్‌ వచ్చింది. వాహనం డెలివరీకి సిద్ధంగా ఉందని, బ్యాలెన్స్‌ రూ.20 వేలకు జోరా పేటీఎంకు బదిలీ చేస్తే వాహనం వచ్చి చేరుతుందని చెప్పడంతో బాధితుడు అలానే చేశాడు.

ఇది జరిగిన గంటకే మళ్లీ ఫోన్‌ చేసిన ‘కొరియర్‌ బాయ్‌’ సదరు వాహనానికి బీమా చెల్లించాల్సి ఉందని, తక్షణం రూ.11,500 పేటీఎం చేయాలని సూచించగా ఆ డబ్బు కూడా చెల్లించాడు. ఇలా మొత్తం రూ.41,500 ముట్టిన తర్వాత ‘ఓఎల్‌ఎక్స్‌ నేరగాళ్లు’ రిఫండ్‌ అంటూ గుంజడం మొదలెట్టారు. మరోసారి బాధితుడికి ఫోన్‌ చేసి వాహనానికి జీఎస్టీ నిమిత్తం రూ.13,200 చెల్లించాలని ఈ మొత్తం వాహనం డెలివరీ అయిన తర్వాత రిఫండ్‌ వస్తుందంటూ నమ్మించి బదిలీ చేయించుకున్నాడు. లావాదేవీలు ఆలస్యమైన నేపథ్యంలో ‘ఆర్మీ’ లేట్‌ ఫీజు విధించడంతో పాటు కొంత మొత్తం డిపాజిట్‌ చెల్లించాలని స్పష్టం చేసినట్లు పేర్కొన్న ‘కొరియర్‌ బాయ్‌’ రూ.51,500 డిపాజిట్‌ చేయించుకున్నాడు. ఈ చెల్లింపులు చేసిన మరుసటి రోజు ప్రైవేట్‌ ఉద్యోగి సదరు ‘కొరియర్‌ బాయ్‌’ని ఫోన్‌ ద్వారా సంప్రదించి వాహనం డెలివరీ ఇవ్వాలని కోరాడు. దీంతో మరికొన్ని ‘రిఫండబుల్‌ ఫీజులు’ వివరాలు చెప్పిన అతగాడు మరికొంత మొత్తం డిపాజిట్‌ చేయించుకున్నాడు. మొత్తమ్మీద రూ.30 వేలకు బేరమాడిన వాహనం కోసం ప్రైవేట్‌ ఉద్యోగి నుంచి రూ.3,60,200 గుంజేశారు. అంతటితో ఆగని సైబర్‌ నేరగాళ్లు మరో రూ.75 వేలు డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న బాధితుడి సోదరి సూచన మేరకు సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

రూ.22 వేల బైక్‌కు రూ.92 వేలు దోపిడీ
బజార్‌ఘాట్‌కు చెందిన ఓ యువకుడు రేడియం వ్యాపారం చేస్తుంటారు. ఈయన ఈ నెల 15న ఓఎల్‌ఎక్స్‌ మొబైల్‌ యాప్‌లో ఓ ప్రకటన చూశారు. సెకండ్‌ హ్యాండ్‌ హోండా యాక్టివా వాహనం రూ.24 వేలకు విక్రయిస్తామనేది దాని సారాంశం. దీనికి ఆకర్షితుడైన వ్యాపారి అందులో ఉన్న ఫోన్‌ నెంబర్‌కు కాల్‌ చేయగా ఆర్మీ ఉద్యోగి పీఎస్‌ఎన్‌ మూర్తిగా పరిచయం చేస్తున్న అవతలి వ్యక్తి తాను మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ కేంద్రంగా పనిచేస్తున్నట్లు చెప్పాడు. బేరసారాల తర్వాత వాహనాన్ని రూ.22 వేలకు ఇచ్చేందుకు మూర్తి అంగీకరించాడు. దీంతో తన గూగుల్‌ పే ఖాతా ఉన్న ఫోన్‌ నెంబర్‌ చెప్పిన మూర్తిగా చెప్పుకున్న వ్యక్తి అడ్వాన్స్‌గా కొంత మొత్తం చెల్లింమన్నాడు. ఆపై అనేక ఫీజులు, రిఫండ్‌ డిపాజిట్ల పేరుతో మొత్తం రూ.92,782 కాజేశాడు. మధ్యలో ఓ సందర్భంలో తాను ఆర్మీలో పనిచేస్తున్నట్లు ‘నిరూపించే’ గుర్తింపు కార్డునూ వాట్సాప్‌ ద్వారా బాధితుడికి పంపాడు. ఎంతకూ వాహనం డెలివరీ కాకపోవడం, మూర్తి నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. 

బైక్‌కు అడ్వాన్స్‌ చెల్లిస్తానని చెప్పి..
సికింద్రాబాద్‌లోని ప్యాట్నీ ప్రాంతానికి చెందిన ఓ యువతి సోమాజిగూడలోని ద్విచక్ర వాహనాల షోరూమ్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఈమెకు వెస్ట్‌ మారేడ్‌పల్లిలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఖాతా ఉంది. దీనికి సంబంధించి గూగుల్‌ పే ఖాతా కూడా ఆమెకు ఉంది. మంగళవారం వీరి షోరూమ్‌కు ఓ కాల్‌ వచ్చింది. తాను టీవీఎస్‌ కంపెనీకి చెందిన అపాచీ వాహనం కొనాలని భావిస్తున్నాని, దాన్ని బుక్‌ చేసుకుంటూ రూ.10 వేలు అడ్వాన్స్‌గా ఇస్తానంటూ అవతలి వ్యక్తి చెప్పాడు. దీంతో ఈ కాల్‌ అటెండ్‌ చేయాల్సిన బాధ్యతని నిర్వాహకులు ఈ యువతికి అప్పగించారు. అతడితో మాట్లాడిన ఈమెతో సదరు మోసగాడు అడ్వాన్స్‌ చెల్లించడానికి సిద్ధమయ్యాడు. దీనికోసం ఆమె గూగుల్‌ పే ఖాతా బార్‌ కోడ్‌ను స్క్రీన్‌ షాట్‌ తీసి తనకు వాట్సాప్‌కు పంపమని చెప్పాడు. ఆమె అలానే చేయడంతో అతగాడు తన ‘పని’ మొదలెట్టాడు. ఆమెకు మరోసారి కాల్‌ చేసిన మోసగాడు గూగుల్‌ పే యాప్‌లోకి వెళ్లి అందులో ఉన్న ‘ప్రొసీడ్‌ ఆప్షన్‌’ నొక్కాల్సిందిగా సూచించాడు. ఆమె అలానే చేయడంతో తొలుత రూ.11 వేలు తన ఖాతాలోకి వచ్చినట్లు కనిపించింది. ఆపై అతడు సూచించినట్లే మరో ఆరుసార్లు అదే ఆప్షన్‌ను ఆమె నొక్కారు. ఇది జరిగిన కొద్దిసేపటి తర్వాత తన బ్యాంకు ఖాతా వివరాలను సరిచూసుకున్న బాధితురాలు అందులో నుంచి రూ.87 వేలు మాయమైనట్లు గుర్తించారు. వాహనం బుక్‌ చేసుకుంటాను, ఆన్‌లైన్‌లో అడ్వాన్స్‌ చెల్లిస్తాను అంటూ ఫోన్‌ చేసిన వ్యక్తి దీనికి బాధ్యుడని గుర్తించారు. దీంతో బాధితురాలు సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదైంది. యూపీఐ లావాదేవీల ద్వారా మోసగాడు ఆమె ఖాతా నుంచి నగదు తస్కరించనట్లు పోలీసులు నిర్థారించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement