ఆర్మీ పేరుతో గాలం ! | OLX And Cyber Crimes Rises in Hyderabad | Sakshi
Sakshi News home page

ఆర్మీ పేరుతో గాలం !

Published Wed, Jul 24 2019 1:17 PM | Last Updated on Sat, Jul 27 2019 12:53 PM

OLX And Cyber Crimes Rises in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఇటీవల సెకండ్‌హ్యాండ్‌ ఆన్‌లైన్‌ మార్కెట్‌ బహిరంగ విపణికి పోటీగా ఆన్‌లైన్‌లోనూ జోరుగా జరుగుతోంది. దీనికి సంబంధించి ఓఎల్‌ఎక్స్, క్వికర్‌ సహా అనేక వెబ్‌సైట్లు పుట్టుకొచ్చాయి. ఇవి వినియోగదారులకు ఎంత సౌలభ్యాన్ని కల్పిస్తున్నాయో... సైబర్‌ నేరగాళ్లకూ అదే స్థాయిలో కలిసి వస్తున్నాయి. ప్రధానంగా ఓఎల్‌ఎక్స్‌ను అడ్డాగా చేసుకుని, ఆర్మీ ఉద్యోగులమంటూ తక్కువ ధరకు వస్తువుల పేరుతో మోసం చేస్తున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మంగళవారం హెచ్చరికలు జారీ చేశారు. ఈ తరహా మోసాలకు పాల్పడే సైబర్‌ నేరగాళ్లు ఆర్మీ ఉద్యోగుల పేరుతో అమాయకులకు గాలం వేస్తున్నారు. ఈ–కామర్స్‌ సైట్స్‌లో ఆకర్షనీయంగా ఉండే వాహనం ఫొటోను అతి తక్కువ ధరకు పోస్ట్‌ చేసే వీరు సంప్రదించేందుకు ఓ నెంబర్‌ ఇస్తున్నారు. సాధారణంగా ఆ నంబర్లు కూడా తప్పుడు పేర్లు, బోగస్‌ వివరాలతో పొందినవై ఉంటున్నాయి. దీనిని చూసి ఆకర్షితులై సంప్రదించిన వారితో తాము హైదరాబాద్‌ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ అవుతున్నామని... అనివార్య కారణాల  నేపథ్యంలోనే తమ వాహనం తీసుకెళ్లడం సాధ్యం కానందున అత్యవసరంగా అమ్మాల్సి వస్తోందంటూ చెబుతున్నారు. దీనికి సంబంధించి కొన్ని గుర్తింపుకార్డులు తదితరాలు  వాట్సాప్‌ ద్వారా బాధితులకు పంపిస్తున్నారు. ఒక్కోసారి వీరు కూడా ఓఎల్‌ఎక్స్‌లో ఉన్న ప్రకటనల ఆధారంగానే విక్రేతలను సంప్రదించి తాము ఆయా వాహనాలను ఖరీదు చేస్తామంటున్నారు. సరిచూసుకోవడానికి పత్రాలు పంపాలని కోరుతున్నారు. వీటి ఆధారంగా వీళ్ళే విక్రేతలుగా మారి మరొకరిని టార్గెట్‌ చేస్తున్నారు.

ఈ సైబర్‌ మాయగాళ్లు క్వికర్‌.కామ్‌లో ఉన్న వాహన విక్రయ ప్రకటనలను కాపీ చేస్తున్నారని, వాటిని ఓఎల్‌ఎక్స్‌లో పోస్ట్‌ చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. వీరు నగరవాసులకు టోకరా వేసేందుకు స్థానిక రిజిస్ట్రేషన్‌ నంబర్లతో కూడిన వాహనాల ఫొటోలను ప్రకటనల్లో పొందుపరుస్తున్నారు. వీటినీ వారు ఇంటర్‌నెట్‌ నుంచి సేకరించి, ఫొటోషాప్‌లో నంబర్లు మారుస్తున్నట్లు  పోలీసులు పేర్కొంటున్నారు. వాహనాలతో పాటు ఐ–ఫోన్లు, శామ్‌సంగ్, మోటోరోలాతో పాటు డెల్, హెచ్‌పీ కంపెనీల ల్యాప్‌టాప్‌లు కూడా అమ్ముతామంటూ అందినకాడికి దండుకుంటున్నారు. బేరసారాల తర్వాత అడ్వాన్స్‌గా కొంత తమ ఖాతాలు/వాలెట్స్‌లోకి బదిలీ చేస్తే వాహనం/వస్తువు పంపుతామంటూ షరతు విధిస్తున్నారు. అలా డబ్బు తమకు చేరిన తర్వాత తర్వాత ఫోన్‌ నంబర్లు స్విచ్ఛాఫ్‌ చేసేస్తున్నారు. ఈ ఖాతాలు/వాలెట్స్‌ సైతం వారి పేర్లు, వివరాలతో ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ నేరగాళ్లు ఆయా వస్తువులు/వాహనాన్ని ఓ కొరియర్‌ కార్యాలయం నుంచి పంపుతున్నామంటూ నకిలీ కొరియర్‌ సంస్థలో ఫొటోలు, రసీదును వాట్సాప్‌ ద్వారా కొనుగోలుదారులకు పంపి మొత్తం ఖరీదు వసూలు చేసి ముంచేస్తున్నారు. కొరియర్‌ సంస్థల నుంచి ఫోన్లు చేస్తున్నట్లు మాట్లాడి మొత్తం సొమ్ము తమకు చేరేలా చేసుకుంటున్నారు. ఈ సైబర్‌ నేరాలకు పాల్పడే వారు ప్రధానంగా రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ జిల్లా డీగా, టోడా గ్రామాల్లోని తండాలకు చెందిన వారిగా సైబరాబాద్‌ పోలీసులు గుర్తించారు.

ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. 
కేవలం ఓఎల్‌ఎక్స్‌ ప్రకటనల విషయంలోనే కాకుండా నేరుగా పరిచయం లేని వ్యక్తులతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నెరపకూడదు. ప్రత్యక్షంగా వస్తువులు, వ్యక్తులను చూసిన తర్వాతే చెల్లింపులు చేయాలి.
ఈ–కామర్స్‌ సైట్స్‌లో ప్రకటనలకు సంబంధించిన వస్తువులు/వాహనాల కొనుగోలు కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లకండి. అలా వెళితే కిడ్నాపర్ల బారినపడే ప్రమాదమూ ఉంటుందని మర్చిపోవద్దు. వస్తువు ధర మరీ  తక్కువగా ఉందంటే అనుమానించాల్సిందే.  
క్లాసిఫైడ్‌ సైట్లలో మనకు కనిపించే ఏ వస్తువును కొనుగోలు చేసినా సరే.. దాన్ని పొందేందుకు ముందుగానే డబ్బులు ఖాతాలో జమ చేయాలని ఎవరైనా అడిగితే అనుమానించండి.
సెకండ్‌ హ్యాండ్‌ వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు అవతలి వ్యక్తుల నుంచి వారి ధ్రువపత్రాల జిరాక్సులను తీసుకోవాలి. గుర్తింపు కార్డు, మొబైల్‌ నంబర్, చిరునామా తదితర వివరాలను సేకరించాలి.    
కార్లు తదితర వాహనాలను కొనుగోలు చేసే వారు సేల్‌ డీడ్‌ తో పాటు డిక్లరేషన్‌ తీసుకోవాలి. అప్పటి వరకు ఆ వాహనంపై ఉండే చలాన్లు లేదా ఏవైనా నేరాలు జరిగి ఉంటే.. ఆ వాహనం పాత ఓనర్‌దే బాధ్యత అని చెబుతూ ఆ ఓనర్‌ నుంచి డిక్లరేషన్‌ తీసుకోవడం మంచిది. వస్తువులను కొనేటప్పుడు వాటిని స్వయంగా వచ్చి చూపించాలని కోరాలి. అన్నీ కుదిరాకే వస్తువును కొనాలి.  

ఓఎల్‌ఎక్స్‌కు నోటీసులు జారీ చేశాం
ఇటీవల కాలంలో ఓఎల్‌ఎక్స్‌ కేంద్రంగా మోసపోయామంటూ ఫిర్యాదులు పెరిగాయి. సైబర్‌ నేరగాళ్ల వలలో పడి వస్తువు చూడకుండా, వారిని కలవకుండా డబ్బులు చెల్లించి మోసపోతున్నారు. ముఖ్యంగా ఆర్మీ ఉద్యోగులం అంటూ ఓఎల్‌ఎక్స్‌లో వస్తున్న ప్రకటనలకే ఎక్కువ మంది నిండా మునుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఓఎల్‌ఎక్స్‌ సంస్థకు నోటీసులు జారీ చేశాం. వారితో మాట్లాడి ఈ తరహా నేరాల కట్టడికి చర్యలుతీసుకుంటున్నాం.    – సీహెచ్‌వై శ్రీనివాస్‌కుమార్, సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement