
సాక్షి, సిటీబ్యూరో: రాజస్థాన్ రాష్ట్రం, మేవాట్ రీజియన్‌లోని భరత్‌పూర్ జిల్లా ‘ఓఎల్‌ఎక్స్ సైబర్ నేరగాళ్లకు’ అడ్డాగా మారింది. ఈ–కామర్స్ సైట్స్‌లో కార్లను తక్కువ ధరకు అమ్ముతామంటూ పోస్టులు పెట్టి, అడ్వాన్స్‌గా కొంత మొత్తం డిపాజిట్ చేయించుకుని మోసం చేసే ముఠాలకు కేంద్రమైంది. దీంతో వీరిని పట్టుకునేందుకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులతో పాటు దేశ వ్యాప్తంగా వివిధ నగరాలకు చెందిన వారు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే స్థానికులు, అక్కడి పోలీసుల నుంచి ఎలాంటి సహకారం ఉండకపోవడంతో ఫలితం దక్కట్లేదు. గత ఏడాది డిసెంబర్‌లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్ ఫెయిల్ కాగా... తాజాగా సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ అధికారుల యత్నం బెడిసికొట్టింది. దేశంలోని దాదాపు ప్రతి నగరం నుంచీ పోలీసులు అక్కడకు వెళ్తుంటారు. ఇలాంటి వారిలో 95 శాతం రిక్తహస్తాలతోనో, రక్తసిక్త గాయాలతోనో తిరిగి వస్తుంటారు.
ఆర్మీ ఉద్యోగుల పేరుతో పోస్టింగ్స్...
ఓఎల్‌ఎక్స్‌తో పాటు మరికొన్ని సైట్లలో, ఇటీవల కాలంలో ఫేస్‌బుక్‌లోని మార్కెట్ ప్లేస్‌లోనూ ఖాతాలు తెరిచి పోస్టింగ్స్ పెడుతున్న ఈ భరత్‌పూర్ కేటుగాళ్లు ఆర్మీ ఉద్యోగుల పేర్లు వాడుకుంటున్నారు. వివిధ మార్గాల్లో సేకరించిన వారి ఫొటోలతోనే పోస్టింగ్స్ చేస్తున్నారుట్లిందులో బుల్లెట్‌తో పాటు వివిధ రకాల కార్ల ఫొటోలను పొందుపరుస్తున్నారు. తమకు వేరే ప్రాంతానికి బదిలీ అయినందుకో, రిటైనైన నేపథ్యంలోనో ఆయా వాహనాలను అమ్మి వెళ్లిపోవడానికి నిర్ణయించుకున్నామంటూ ఆ పోస్ట్‌లో పొందుపరుస్తారు. కొన్నిసార్లు ఆర్మీ దుస్తుల్లో దిగిన ఫొటోలనూ పోస్ట్ చేసి మరింత నమ్మకం పుట్టిస్తారు. ద్విచక్ర వాహనానికి గరిష్టంగా రూ.50 వేలు, కార్లకు రూ.2 లక్షల వరకు ధరలు పేర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఆయా వాహనాల యజమానులు విదేశాలకు వెళ్తున్న నేపథ్యంలో వెహికల్ ఎయిర్‌పోర్ట్ పార్కింగ్‌లో ఉందంటూ చెబుతున్నారు. ఎవరైనా ఆసక్తి చూపించి వారిని సంప్రదిస్తే వాహనాలను చూపించాలన్నా, డెలివరీ ఇవ్వాలన్నా అడ్వాన్స్‌గా కొంత మొత్తం చెల్లించాలని కోరుతున్నారు. తమ బ్యాంకు ఖాతా లతో పాటు వివిధ వ్యాలెట్స్‌లోకి ఆ నగదు బదిలీ చేయించుకుని ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేస్తున్నారు.
రాజకీయ కారణాలతోనే అడ్డుపుల్లలు...
భరత్‌పూర్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన ఓఎల్‌ఎక్స్ నేరగాళ్లు ఈ తరహాలో రెచ్చిపోవడానికి, పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులను ముప్పతిప్పలు పెట్టడానికి రాజకీయ కారణాలు సైతం ఉన్నాయి. నాలుగు నెలల క్రితమే అక్కడ ప్రభుత్వం మారి కొత్త సర్కారు కొలువు తీరింది. ఇలా సర్కారు మారినప్పుడల్లా ఆ ప్రాంతంలో సమీకరణలు మారిపోతున్నాయి. స్థానిక పోలీసులు ఈ నేరగాళ్ల విషయంలో తామేమీ చేయలేమని చేతులు ఎత్తేస్తూ ఎమ్మెల్యేలను కలవాల్సిందిగా సూచిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసులు వెళ్లి ఆయా ఎమ్మెల్యేలు, రాజకీయ నేతలను సంప్రదించి వాంటెడ్ జాబితాలను అందిస్తున్నారు. అయితే ఈ లోపే స్థానిక పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న సైబర్ నేరగాళ్లు రాజస్థాన్ సరిహద్దులు దాటి హర్యానాలోకి వెళ్లిపోతుంటారు. అప్పటి వరకు ఆగే అక్కడి రాజకీయ నాయకులు ఆ తర్వాతే పట్టుకోవడానికి సహకరిస్తామంటూ చెప్పి డ్రామా నడిపిస్తున్నారు. కొందరు ప్రజా ప్రతినిధులైతే ఓట్‌బ్యాంక్ రాజకీయాల నేపథ్యంలో తమ ప్రాంతం నుంచి ఎవరినీ తీసుకువెళ్లడానికి వీలులేదని, మోసపోమే వారు ఉన్నారు కనుకే తమ వారు మోసాలు చేస్తున్నారని చెప్పి బయటి ప్రాంత పోలీసులను తిప్పిపంపుతున్నారు. దీంతో అనేక కేసుల్లో ప్రధాన సూత్రధారులకు తమ బ్యాంకు ఖాతాలు ఇచ్చి సహకరిస్తున్న దళారులను మాత్రమే పట్టుకోగలుగుతున్నారు.
60 మంది సూత్రధారులతో జాబితా...
ఇలాంటి నేరాలు మెట్రో నగరాల్లో నివసిస్తున్న నైజీరియన్ల నేతృత్వంలోనూ జరుగుతున్నాయి. అయితే అత్యధిక వ్యవహారాలు భరత్‌పూర్‌కు చెందిన వారి ద్వారానే జరుగుతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. అక్కడి యువత వ్యవస్థీకృతంగా ఈ దందాలు చేస్తున్నట్లు తేల్చారు. మూడు కమిషనరేట్లలోనూ ఏటా వందల సంఖ్యలో ఈ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై అధ్యయనం చేసిన అధికారులు దాదాపు 60 మంది సూత్రధారులతో కూడిన జాబితాను సిద్ధం చేశారు. ప్రధానంగా దక్షిణాది పైనే కన్నేస్తున్న ఈ కేటుగాళ్లపై దేశ వ్యాప్తంగా వేల సంఖ్యలో కేసులు ఉన్నాయి. అయితే ఎవరైనా భరత్‌పూర్ వెళ్లి వారికి పట్టుకోవాలని భావిస్తే మాత్రం తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురవుతోంది. గ్రామాలు మూకుమ్మడిగా పోలీసులపై దాడులకు పాల్పడుతున్నాయి. స్థానిక పోలీసుల సహకారం తీసుకుంటే వారిపైనా ఆగ్రహావేశాలు తప్పవు. అక్కడి కమన్ అనే ప్రాంతంలోని పోలీస్ స్టేషన్‌కు ఏడాదిలో 14 మంది ఇన్‌స్పెక్టర్లు మారారంటూ పరిస్థితిని అంచనా వేయవచ్చు. దీంతో భరత్‌పూర్‌తో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన పోలీసులతో సంప్రదింపులు జరిపిన ఇక్కడి సైబర్ క్రైమ్ కాప్స్ ఈ నేరగాళ్ల వ్యవహారశైలి, కార్యకలాపాలపై కీలక సమాచారం సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment