వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ చల్లా శ్రీధర్
చిక్కడపల్లి: షార్ట్ ఫిలింలు తీస్తున్నామని పరిచయం చేసుకుని ఓఎల్‌ఎక్స్‌లో కెమెరాలు అద్దెకు తీసుకొని వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు వ్యక్తులను బుధవారం చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.5.45లక్షల విలువైన 10 కెమెరాల స్వాధీనం చేసుకున్నారు. చిక్కడపల్లి ఏసీపీ కార్యాలయంలో సీఐ శివశంకర్‌రావు, డీఐ ప్రభాకర్‌తో కలిసి ఏసీపీ చల్లా శ్రీధర్ వివరాలు వెల్లడించారు. గోల్కొండ ప్రాంతానికి చెందిన సైమన్ అనే వ్యక్తి తన కెమెరాలను అద్దెకు ఇస్తానని ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటన ఇచ్చాడు. దీనిని చూసిన గచ్చిబౌలి రాజీవ్‌నగర్‌కు చెందిన టాక్సీ డ్రైవర్ సారిన్ హర్షవర్ధన్, బాలానగర్‌కు చెందిన ఆనంద్‌కుమార్ అనే వ్యక్తులు గత సెప్టెంబర్ 15న సైమన్‌ను సంప్రదించారు. రూ.700 చొప్పున కిరాయి మాట్లాడుకుని 10 కెమెరాలను తీసుకున్నారు.
గుర్తింపుగా ఆధార్ కార్డు స్కాన్ చేసి ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులకు అక్టోబర్ 9 వరకు గడువు పొడిగిస్తున్నట్లు సైమన్‌కు మేసేజ్ చేశారు. అనంతరం కెమెరాలను ఇతరులకు విక్రయించారు. అయితే గడువు ముగిసినా కెమెరాలు తిరిగి ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన సైమన్ వారికి ఫోన్ చేయగా స్విచ్ఛాప్ చేసినట్లు వచ్చింది. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్, కమిషనర్లరెట్ల పరిధిలోని చిక్కడపల్లి, బహుదూర్‌పూర, బోయినపల్లి, చాంద్రాయణగుట్ట, వనస్థలిపురం, అల్వాల్, సనత్‌నగర్, గోల్కొండ, ఎస్సార్‌నగర్ పీఎస్‌ల పరిధిలో కేసులు ఉన్నట్లు తెలిపారు. వారి నుంచి కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment