నిందితులు మెహతాబ్, అఖిబ్
సాక్షి, సిటీబ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన మెహతబ్‌కు రాజకీయాలపై ఆసక్తి ఉంది. ఇప్పటికే రెండుసార్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. మరోసారి ఎలక్షన్ బరిలోకి దిగడానికి అవసరమైన డబ్బు కోసం తన స్నేహితుడు అఖిబ్‌తో కలిసి ‘ఓఎల్‌ఎక్స్ ఫ్రాడ్’కు తెరలేపాడు. వీరిరువురు హైదరాబాద్‌కు చెందిన విద్యార్థిని ఢిల్లీకి రప్పించి రూ.4.65 లక్షలు కాజేశారు.దీనిపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీలోని కమ్ల మార్కెట్ పోలీసులు కొద్ది రోజుల క్రితం నిందితులను అరెస్టు చేశారు. వీరు ఇదే తరహాలో పలువురిని మోసం చేసినట్లు ఆధారాలు లభించాయని ఢిల్లీ సెంట్రల్ డీసీపీ మన్‌దీప్ సింగ్ రంద్వా పేర్కొన్నారు.
కారు కోసం ఈ–కామర్స్ సైట్‌లో...
హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి సుల్తాన్ సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు ఖరీదు చేసేందుకు గాను గత ఆగస్టు నెలలో ఓఎల్‌ఎక్స్‌లో సెర్చ్ చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇతడి దృష్టి రూ.6 లక్షలకు విక్రయిస్తామంటూ పోస్ట్ చేసిన టయోట ఫార్చునర్ కారు ప్రకటనపై పడింది. సుల్తాన్ ఆ ప్రకటనలో ఉన్న వాట్సాప్ నెంబర్ ద్వారా మెహతాబ్‌ను సంప్రదించాడు. బేరసారాల తర్వాత కారును రూ.4.65 లక్షలకు విక్రయించేందుకు ఒప్పందం కుదిరింది. నగదు చెల్లించి కారు తీసుకువెళ్ళడానికి ఢిల్లీకి రావాల్సిందిగా మెహతాబ్ చెప్పడంతో సెప్టెంబర్ 3న సుల్తాన్ తన సోదరుడితో కలిసి ఢిల్లీ వెళ్లాడు. అజ్మేరీ గేట్ వద్ద సుల్తాన్‌ను కలిసిన మెహతాబ్, అఖిబ్ అతడి నుంచి రూ.2.15 లక్షల నగదు తీసుకున్నారు. మరో రూ.2.5 లక్షలను మెహతాబ్ సోదరుడు అథర్ అలీ ఖాతాలోకి బదిలీ చేయించుకున్నారు. కారుకు సంబందించిన ఎన్‌ఓసీ అందాల్సి ఉందని, మర్నాడు (సెప్టెంబర్ 4న) అది వచ్చాక కారు అప్పగిస్తామని చెప్పారు.
తెల్లవారుజామునే పరారీ...
దీనికి సుల్తాన్ అంగీకరించడంతో వారిని మెహతాబ్ ద్వయం ఢిల్లీలోని పహర్‌గంజ్ ప్రాంతంలోని లాడ్జికి తీసుకువెళ్ళారు. పక్కపక్క గదులు తీసుకున్న వీరు ఆ రాత్రి అక్కడే బస చేశారు. సెప్టెంబర్ 4 ఉదయం సుల్తాన్, అతడి సోదరుడు నిద్ర లేచేసరికి మెహతాబ్, అఖిబ్‌లు లాడ్జి ఖాళీ చేసి ఉడాయించారు. దీనిపై బాధితుడు అక్కడి కమ్ల మార్కెట్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. రంగంలోకి దిగిన పోలీసులు అజ్మేరీ గేట్‌తో పాటు వారు బస చేసిన హోటల్ తదితర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫీడ్ ఆధారంగా అనుమానితుల్ని గుర్తించారు. సుల్తాన్ రూ.2.5 లక్షలు బదిలీ చేసిన అథర్ అలీ బ్యాంకు ఖాతా ఆధారంగా నిందితులు మీరట్‌కు చెందిన వారిగా . అక్కడికి వెళ్ళిన ప్రత్యేక బృందం స్థానికుల సహకారంతో నిందితులను అదుపులోకి తీసుకుని ఢిల్లీ తరలించింది. మెహతాబ్ ఈ–కామర్స్ సైట్‌లో పోస్ట్ చేసిన కారు అతడి బంధువుదిగా తేలడంతో దానిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో అథర్ అలీ ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల ఖర్చు కోసమే...
మీరట్‌కు చెందిన మెహతాబ్, అఖిబ్ వ్యవసాయం చేసేవారు. మెహతాబ్‌కు రాజకీయాలపై ఆసక్తి పెరగడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని భావించాడు. ఇందులో భాగంగా రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. మెహతాబ్‌తో పాటు అతడికి నగదు సాయం చేసిన అఖిబ్ సైతం ఆర్థికంగా బాగా నష్టపోయాడు. ఇప్పుడు మళ్ళీ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండటంతో మరోసారి పోటీ చేసి గెలవాలని మెహతాబ్ నిర్ణయించాడు. అయితే అందుకు అవసరమైన డబ్బు కోసం ఇద్దరూ కలిసి ‘ఓఎల్‌ఎక్స్ ఫ్రాడ్’కు శ్రీకారం చుట్టారు. అదే సమయంలో మెహతాబ్ మేనమామ తన టయోట ఫార్చునార్ కారు అమ్ముతానని చెప్పడంతో దానినే వాడుకున్నారు. ఆ కా>రు ఫొటో, వివరాలను ఓఎల్‌ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ తక్కువ రేటు పొందుపరిచారు. దీనికి సుల్తాన్ తో పాటు అనేక మంది ఆకర్షితులై ఢిల్లీ చేరి మోసపోయారు. అలాంటి వారిలో హైదరాబాద్‌కు చెందిన వారు ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment