
వినోద్
సాక్షి, సిటీబ్యూరో: తేలికపాటి వాహనాలను విక్రయిస్తానంటూ ఈ–కామర్స్ సైట్ ఓఎల్‌ఎక్స్‌లో తప్పుడు ప్రకటనలు ఇస్తూ మోసాలకు పాల్పడుతున్న రాజమహేంద్రవరం వాసిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతగాడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక మందిని మోసం చేసినట్లు డీసీపీ అవినాష్ మహంతి మంగళవారం వెల్లడించారు. ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన ఎం.వినోద్ కొన్నాళ్ల క్రితం ఓఎల్‌ఎక్స్‌లో ఓ నకిలీ ప్రకటన పెట్టాడు. వివిధ రకాల తేలికపాటి వాహనాలకు తక్కువ రేటుకు అమ్ముతానంటూ అందులో పొందుపరిచాడు. ఆసక్తి చూపి ఎవరైనా సంప్రదిస్తే బేరసారాల తర్వాత ఓ రేటు ఖరారు చేసేవాడు. ఆపై అడ్వాన్స్‌గా కొంత మొత్తం తన బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయించుకుని మోసం చేసేవాడు.
నగరంలోని ఫిల్మ్‌నగర్ ప్రాంతానికి చెందిన జ్యోతి ప్రకాష్ ఇటీవల సెకండ్ హ్యాండ్ ఫోర్ వీలర్ ఖరీదు చేయాలని భావించారు. దీనికోసం ఆయన ఓఎల్‌ఎక్స్‌ను ఆశ్రయించారు. అందులో 2014 మోడల్‌కు చెందిన మారుతి స్విఫ్ట్ కారును రూ.3.6 లక్షలకు విక్రయిస్తానంటూ ఉన్న ప్రకటన ప్రకాష్‌ను ఆకర్షించింది. అందులో పేర్కొన్న ఫోన్ నంబర్‌ను సంప్రదించగా.. సూరిబాబు పేరుతో వినోద్ మాట్లాడాడు. బేరసారాల తర్వాత రూ.3 లక్షలకు కారు అమ్మేందుకు అంగీకరించాడు. అడ్వాన్స్‌గా రూ.60 వేలు చెల్లించాలని, కారు డెలివరీ అయిన తర్వాత మిగిలిన మొత్తం ఇవ్వాలని చెప్పాడు. దీనికి అంగీరించిన ప్రకాష్ ఆ మొత్తాన్ని వినోద్ చెప్పిన బ్యాంకు ఖాతాలో రెండు దఫాల్లో డిపాజిట్ చేశారు. ఈ ఖాతాలు సీహెచ్ శ్రావణి పేరుతో ఉన్నాయి.
అడ్వాన్స్ డబ్బు చెల్లించిన తర్వాత వాహనం డెలివరీ విషయానికి సంబంధించి ప్రకాష్ అనేకసార్లు సూరిబాబుగా చెప్పుకొన్న వినోద్‌తో సంప్రదించే ప్రయత్నం చేశారు. వినోద్ అతడి కాల్స్‌ను నిర్లక్ష్యం చేయడంతో పాటు తన ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు.. ఈ నెల 2న సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ టీమ్ ఇన్‌స్పెక్టర్ జి.శంకర్‌రాజు నేతృత్వంలో ఎస్సైలు రమేష్, మధుసూదన్ దర్యాప్తు చేశారు. బ్యాంకు ఖాతా వివరాలతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి రాజమహేంద్రవరానికి చెందిన వినోద్ నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. విచారణ నేపథ్యంలో వినోద్‌పై తెలుగు రాష్ట్రాల్లోని ధవళేశ్వరం, ఏలూరు, పడమటిలంక, ఆలేరు ఠాణాల్లోనూ ఇదే తరహా మోసాలకు సంబంధించి కేసులు ఉన్నట్లు గుర్తించారు. తరచు సిమ్‌కార్డులు, బ్యాంకు ఖాతాలు మార్చే అలవాటున్న ఇతగాడు ఇంకా అనేక మందికి మోసం చేసినట్లు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment