చేతులెత్తేశారు..! | Political Influence in OLX Crime Bharatpur | Sakshi
Sakshi News home page

చేతులెత్తేశారు..!

Published Tue, Dec 25 2018 9:10 AM | Last Updated on Tue, Dec 25 2018 9:10 AM

Political Influence in OLX Crime Bharatpur - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: మేవాట్‌ రీజియన్‌లోని భరత్‌పూర్‌ జిల్లా ‘ఓఎల్‌ఎక్స్‌ సైబర్‌ నేరగాళ్లకు’ అడ్డాగా మారింది. వీరు ఈ–కామర్స్‌ సైట్స్‌లో కార్లను తక్కువ ధరకు అమ్ముతామంటూ పోస్టులు పెట్టి, అడ్వాన్స్‌గా కొంత మొత్తం డిపాజిట్‌ చేయించుకుని మోసాలకు పాల్పడుతున్నారు.  వీరిని పట్టుకునేందుకు ఇటీవల సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు చెందిన బృందం అక్కడికి వెళ్లింది. రాజస్థాన్‌లో ఎన్నికల హడావుడి ఉండటంతో కాస్త వేచి ఉండాలని, సహకరిస్తామని అక్కడి పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ నెల 11న వెలువడిన ఎన్నికల ఫలితాలతో సీన్‌ మారిపోయింది. ప్రభుత్వం మారి కొత్త సర్కారు కొలువు తీరడంతో ఈక్వేషన్స్‌ మారిపోయాయి. ఆ పరిస్థితుల్లో తాము సహకరించలేమంటూ పోలీసులు చేతులు ఎత్తేయడంతో పాటు ‘రివర్స్‌ గేర్‌’ వేశారు. స్థానిక ఎమ్మెల్యే సైతం సైబర్‌ నేరగాళ్లు ఉన్నట్లు అనుమానిస్తున్న ప్రాంతంపై దాడికి అంగీకరించకపోవడంతో స్పెషల్‌టీమ్‌ ఖాళీగా తిరిగి వస్తోంది. 

ఆర్మీ ఉద్యోగుల పేరుతో...
ఓఎల్‌ఎక్స్‌తో పాటు మరికొన్ని సైట్స్‌లోనూ ఖాతాలు తెరిచి పోస్టింగ్స్‌ పెడుతున్న ఈ భరత్‌పూర్‌ కేటుగాళ్లు ఆర్మీ ఉద్యోగుల పేర్లు వాడుకుంటున్నారు. వివిధ మార్గాల్లో సేకరించిన వారి ఫొటోలతోనే పోస్టింగ్స్‌ చేస్తున్నారు. వాటిలో బుల్లెట్‌తో పాటు వివిధ రకాలైన కార్ల ఫొటోలను పొందుపరుస్తూ తమకు వేరే ప్రాంతానికి బదిలీ అయినందున, లేదా రిటైర్‌ అయిన నేపథ్యంలోనే ఆయా వాహనాలను అమ్మి వెళ్లిపోవడానికి నిర్ణయించుకున్నామంటూ అందులో పేర్కొంటున్నారు. కొన్నిసార్లు ఆర్మీ దుస్తుల్లో దిగిన ఫొటోలనూ పోస్ట్‌ చేసి మరింత నమ్మకం పుట్టిస్తారు. ద్విచక్ర వాహనానికి గరిష్టంగా రూ.50 వేలు, కార్లకు రూ.2 లక్షల వరకు ధరలు చూపుతున్నారు. ప్రజలు తేలిగ్గా నమ్ముతారనే ఉద్దేశంతోనే ఆర్మీ పేరు వినియోగిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. సదరు నంబర్లలో సంప్రదిస్తే వాహనాలను చూపించాలన్నా, డెలివరీ ఇవ్వాలన్నా అడ్వాన్స్‌గా కొంత మొత్తం చెల్లించాలని కోరుతున్నారు. తమ బ్యాంకు ఖాతాలతో పాటు వివిధ వ్యాలెట్స్‌లోకి ఆ నగదు బదిలీ చేయించుకుని ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేస్తున్నారు. 

30 మంది సూత్రధారులతో జాబితా...
ఇలాంటి నేరాలు మెట్రో నగరాల్లో నివసిస్తున్న నైజీరియన్ల నేతృత్వంలోనూ జరుగుతున్నాయి. అయితే అత్యధిక వ్యవహారాలు భరత్‌పూర్‌కు చెందిన వారి ద్వారానే జరుగుతున్నట్లు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. అక్కడి యువత వ్యవస్థీకృతంగా ఈ దందాలు చేస్తున్నట్లు గుర్తించి, దాదాపు 30 మంది సూత్రధారులతో కూడిన జాబితాను సైతం సిద్ధం చేశారు. వీరిపై ఆరు నెలల్లో రాజధానిలోని మూడు కమిషనరేట్లలో పరిదిలో దాదాపు 500 కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా దక్షిణాది పైనే కన్నేస్తున్న ఈ కేటుగాళ్లపై దేశ వ్యాప్తంగా వేల కేసులు ఉంటాయని భావిస్తున్నారు. అయితే ఎవరైనా భరత్‌పూర్‌ వెళ్లి వారిని పట్టుకోవాలని భావిస్తే తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురవుతోంది. గ్రామస్తులు మూకుమ్మడిగా  పోలీసులపై దాడులకు దిగుతున్నారు. దీంతో భరత్‌పూర్‌తో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన పోలీసులతో సంప్రదింపులు జరిపిన సిటీ సైబర్‌ క్రైమ్‌ కాప్స్‌ ఈ నేరగాళ్ల వ్యవహారశైలి, కార్యకలాపాలపై కీలక సమాచారం సేకరించారు. దీంతో ఆ ప్రాంతంలో వ్యూహాత్మకంగా వరుసదాడులు చేసి, నేరగాళ్లను పట్టుకోవడానికి రంగం సిద్ధం చేశారు. 

ఫలితాలతో మారిపోయిన సీన్‌...
క్షేత్రస్థాయిలో నేరగాళ్లను పట్టుకోవడంతో అనుభవం ఉన్న సైబర్, సీసీఎస్‌ అధికారులను ఎంపిక చేసి 20 మందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఎలాంటి పరిస్థితులపైనా ఎదుర్కునేందుకు వీరికి ఆయుధాలు సైతం అందించారు. ఈ స్పెషల్‌ టీమ్‌ ఎన్నికల వేడి నడుస్తుండగానే అక్కడికి వెళ్లింది. స్థానిక పోలీసులను కలిసి తమ వద్ద ఉన్న సమాచారం చెప్పి సహకరించాల్సిందిగా కోరగా, వారు కొన్నాళ్లు వేచి ఉండాలని సూచించారు. ఈ లోపే రాజస్థాన్‌లో ప్రభుత్వం మారి కొత్త సర్కారు కొలువు దీరింది. అయితే కొత్తగా ప్రభుత్వం ఏర్పడటంతో ఈకేషన్స్‌ మారాయని, తామేమీ చేయలేమని వారు చేతులు ఎత్తేస్తూ ఓ ఎమ్మెల్యేను కలవాల్సిందిగా సూచించారు. స్పెషల్‌ టీమ్‌ ఆ ఎమ్మెల్యేను సంప్రదించి వాంటెడ్‌ జాబితాను అందించింది.  ఈ లోగా స్థానిక పోలీసుల ద్వారా సమాచారం తెలుసుకున్న  నేరగాళ్లు రాజస్థాన్‌ సరిహద్దులు దాటి హర్యానాలోకి వెళ్లిపోయారు. సదరు వ్యక్తులు ఎవరూ అక్కడ అందుబాటులో లేరని, ఈ పరిస్థితుల్లో గ్రామాల్లోకి వెళ్లి దాడులు చేయడానికి తాము ఒప్పుకోమని ఆయన స్పష్టం చేశారు. దీంతో ప్రధాన సూత్రధారులకు తమ బ్యాంకు ఖాతాలు ఇచ్చి  సహకరిస్తున్న ఇద్దరు పాత్రధారులను పట్టుకుని తిరుగు ప్రయాణమైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement