డెత్‌సర్టిఫికెట్, నిందితుడు పొట్లూరి శ్రీ బాల వంశీకృష్ణ
బంజారాహిల్స్: బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు పత్రాలు సృష్టించి ఓఎల్‌ఎక్స్‌లో కారును అమ్మకానికి పెట్టి మోసగించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎన్బీటీ నగర్‌కు చెందిన నుకుం శ్రీలత అనే మహిళ ఓఎల్‌ఎక్స్‌లో హుందాయ్ ఐ–20(టీఎస్ 08 ఎఫ్‌టి 6402) కారు అమ్మకానికి ఉన్నట్లు తెలుసుకుని అందులో ఉన్న ఫోన్ నంబర్ ఆధారంగా జూలై 20న కేపీహెచ్‌బీకి చెందిన పొట్లూరి శ్రీబాల వంశీకృష్ణను సంప్రదించింది.
తన అన్న సురేష్‌జాదవ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని అతడికి చెందిన కారును విక్రయిస్తున్నట్లు అతను పత్రాలు చూపడంతో అతడి మాటలు నమ్మిన శ్రీలత రూ. 4.75 లక్షలకు కారును కొనుగోలు చేసింది. అయితే సదరు కారుపై బేగంపేట ఎస్.బ్యాంకులో లోన్ ఉన్నట్లు తెలుసుకొని అక్కడికి వెళ్లి విచారిచగా సదరు సురేష్ జాదవ్ బతికే ఉన్నట్లు బ్యాంకు అధికారి తెలిపాడు. దీంతో సురేష్ జాదవ్‌కు ఫోన్ చేయగా కారును బాల వంశీకృష్ణ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చినట్లు తెలిపాడు. బతికున్న వ్యక్తిని చనిపోయినట్లుగా చిత్రీకరించి ఓఎల్‌ఎక్స్‌లో అద్దెకు తీసుకున్న కారును విక్రయానికి పెట్టి తమను మోసం చేశాడంటూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment