ఆన్‌లైన్‌లో వాహనాలను కొనుగోలు చేయాలనుకుంటున్నారా... అయితే, జర జాగ్రత్త! ఘరానా మోసగాళ్ల వలలో చిక్కు కుని జేబులు గుల్ల చేసుకునే ప్రమాదం పొంచి ఉంది. ఆన్‌లైన్‌లో ఎర వేస్తారు. అందినకాడికి దండు కుంటారు. ఆ తర్వాత వారి పత్తా ఉండదు. వారి ఫోన్లు మూగనోముపడతాయి. వారేమో ముఖం చాటేస్తారు. వారే భరత్‌పూర్ కేటుగాళ్లు. రాజ స్తాన్‌లోని భరత్ పూర్ జిల్లాలోని చాలా గ్రామాల యువకులు ఈ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంకు అధికారుల పేరిట ఫోన్లు చేసి, వినియోగదారుల వ్యక్తిగత సమా చారం, ఓటీపీ సేకరించి ఖాతాలోని సొమ్మును కాజేసే మోసగాళ్లకు జమ్‌తార అడ్డా అయితే... ఓఎల్‌ఎక్స్‌తోపాటు ఇతర ఈ–కామర్స్ సైట్లలో తక్కువ ధరకు వాహనాలు అమ్ముతామంటూ పోస్టింగ్‌లు పెట్టి, అడ్వాన్స్‌గా కొంత మొత్తం డిపాజిట్ చేయించుకుని కాజేస్తున్న కేటుగాళ్లకు భరత్‌ఫూర్ కేరాఫ్ అడ్రస్. వీరి భరతం పట్టేందుకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ వ్యూహాన్ని రచించారు.
– సాక్షి, హైదరాబాద్
ఎర ఎలా?
- ఓఎల్‌ఎక్స్‌తోపాటు మరికొన్ని వెబ్‌సైట్లలో ఖాతాలు తెరుస్తారు..
- ఈ ఖాతాలకు ఆర్మీ ఉద్యోగుల పేర్లను వాడుకుంటారు.
- వివిధ మార్గాల్లో సేకరించిన ఆర్మీ ఉద్యోగుల ఫొటోలతో పోస్టింగ్‌లు పెడతారు.
- కొన్నిసార్లు ఆర్మీ అధికారుల వేషాలతో పోస్ట్ చేస్తుంటారు.
- బుల్లెట్‌తోపాటు వివిధ రకాల కార్లను వాటిల్లో పొందుపరుస్తారు.
- బదిలీ అయిందని, పదవీ విరమణ అయిన నేపథ్యంలో వాహనాలను అమ్మి వెళ్లిపోతున్నామంటూ నమ్మబలుకుతారు.
- ద్విచక్ర వాహనానికి గరిష్టంగా రూ.50 వేలు, కార్లకు రూ.2 లక్షల వరకు రేట్లు పెడతారు.
- ప్రజలు తేలిగ్గా నమ్ముతారనే ఉద్దేశంతోనే ఆర్మీ పేరు వినియోగిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
- విదేశాలకు వెళ్తున్న నేపథ్యంలో వెహికల్ ఎయిర్‌పోర్ట్ పార్కింగ్‌లో ఉందని నమ్మిస్తారు.
- ఎవరైనా ఆసక్తితో వారిచ్చిన నంబర్లలో సంప్రదిస్తే వాహనాలను చూపించాలన్నా, డెలివరీ ఇవ్వాలన్నా అడ్వాన్స్‌గా కొంతమొత్తం చెల్లించాలంటారు.
- తమ బ్యాంకు ఖాతాలతోపాటు వివిధ వ్యాలెట్లలోకి నగదు బదిలీ చేయించుకుని ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తారు.
ఆరు నెలల్లో 500 కేసులు...
మెట్రో నగరాల్లో నివసిస్తున్న నైజీరియన్ల నేతృత్వంలోనూ సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అత్యధికంగా భరత్‌పూర్‌కు చెంది నవారి ద్వారానే జరుగుతున్నట్లు సిటీ సైబర్‌క్రైమ్ పోలీసులు గుర్తించారు. కనీసం ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేయని ఈ కేటుగాళ్లు నేరాలలో పీహెచ్‌డీ చేసినట్లుగా రాటుదేలారు. వీరి నేరాలకు స్థానికుల మద్దతు కూడా ఉంటోందని భావి స్తున్నారు. ఈ భరత్‌పూర్ ముఠాలపై ఆరునెలల్లో రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధుల్లో దాదాపు 500 కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా దక్షిణాదిపైనే కన్నేస్తున్న వీరిపై దేశవ్యాప్తంగా వేల కేసులు ఉంటాయని భావిస్తున్నారు. ఎవరైనా భరత్‌పూర్ వెళ్లి వారిని పట్టుకోవాలని ప్రయత్నిస్తే విచక్షణారహితంగా పోలీసులపై ఎదురుదాడులకు పాల్పడుతున్నారు.
సైబర్ పోలీసుల భారీ వ్యూహం..
భరత్‌పూర్ మోసగాళ్లను పట్టుకునేందుకు వివిధ ప్రాంతాల పోలీసులతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేరగాళ్ల వ్యవహారశైలి, కార్యకలాపాలపై కీలక సమాచారం సేకరించారు. దీంతో ఆ ప్రాంతంలో వ్యూహాత్మకంగా వరుసదాడులు చేసి, నేరగాళ్లను పట్టుకోవడానికి రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా 20 మంది సైబర్, సీసీఎస్ అధికారులతో ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికిగాను వీరికి ఆయుధాలు సైతం అందించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇప్పటికే సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ హెడ్–క్వార్టర్ల నుంచి తుపాకులు తీసుకువచ్చారు. ఈ బృందం మరో రెండు రోజుల్లో భరత్‌పూర్‌కు వెళ్లనుంది. అక్కడి అనుమానిత ప్రాంతాల్లో దాడులు చేసి ఈ ముఠాను పట్టుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ ముఠాకు చెందిన కీలక వ్యక్తుల వివరాలను సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment