సాక్షి, సిటీబ్యూరో: రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఓవైపు ఫిర్యాదులు అందగానే కేసులను ఛేదించి నిందితులను పట్టుకుంటున్న పోలీసులు...అసలు మోసం జరగకుండా చూడాలన్న ఉద్దేశంతో ‘డిజిటల్ ప్లాట్‌ఫామ్’ను వేదికగా ఎంచుకున్నారు. ఇందులో భాగంగానే సెకండ్ హ్యాండ్ వస్తువులకు వేదికైన ఓఎల్‌ఎక్స్‌లో జరుగుతున్న మోసాలపై ఏకంగా లఘుచిత్రాన్ని నిర్మించారు. ‘బివేర్ ఆఫ్ క్యూఆర్ కోడ్ స్కాన్ అండ్ ఓఎల్‌ఎక్స్ ఫ్రాడ్’ పేరుతో ప్రముఖ వ్యాఖ్యాత వర్షిణి, కాలేజీ విద్యార్థిని సింధు
సంగం కలిసి నటించిన ఈ షార్ట్‌ఫిల్మ్‌ను గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సజ్జనార్ విడుదల చేశారు. ఈ లఘుచిత్ర లింక్‌ను సైబరాబాద్ పోలీసుల సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో కూడా పోస్టు చేశారు.
ఇవీ గమనించండి...
► సెకండ్ హ్యాండ్ వస్తువుల పేరుతో క్రయవిక్రయాలు జరిపే ఆన్‌లైన్ పోర్టల్స్‌ను సైబర్
నేరగాళ్లు అక్రమ సంపాదనకు అడ్డాగా మార్చుకుంటున్నారు. ప్రభుత్వోద్యోగులమని, ఆర్మీ అధికారులమంటూ ప్రచారం చేసుకుంటూ తక్కువ ధరకే విలువైన కార్లు, కెమెరాలు అమ్ముతామని నమ్మిస్తారు.
► కొంతమంది ఫిర్యాదులు చేస్తున్నా..చాలామంది ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు.
► సైబర్ నేరగాళ్లు ఇచ్చే ప్రకటనల్లో వస్తువుకు సరైన ధర ఉండదు. వస్తువు డెలివరీ కాకముందే నగదు ఇవ్వొద్దు. నగదు వెనక్కి ఇస్తామంటే అస్సలు నమ్మొద్దు.
► గుర్తు తెలియని వ్యక్తులు, ఓఎల్‌ఎక్స్ ప్రకటనలకు సంబంధించి క్యూఆర్ కోడ్‌లు పంపిస్తే వాటిని క్లిక్ చేయొద్దు. క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు చెల్లించమంటే అది మోసమని గ్రహించాలి. వాటిని ప్రత్యక్షంగా చూసిన తర్వాతే కొనుగోలు చేయాలి.
► అడ్వాన్స్ డబ్బును వాహనం రిజిస్ట్రేషన్ అవ్వగానే ఇస్తామంటే అసలు నమ్మొద్దు. ప్రత్యక్షంగా కలవండి. పత్రాలన్నింటిని స్వయంగా పరిశీలించండి.
► ఏదేని ఫిర్యాదు కోసం డయల్ 100, 9490617444 వాట్సాప్ నంబర్‌ను సంప్రదించాలని సీపీ సజ్జనార్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment