సాక్షి, హైదరాబాద్ : దసరా సెలవులు వచ్చేశాయి. క్రమంగా నగరవాసులు సొంతూర్లకు పయనమవుతున్నారు. ఇదే చోరులకు సరైన సమయం. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాలలో చోరీలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతేడాది దసరా పండుగ నేపథ్యంలో గ్రేటర్‌లో అధికంగా ఇళ్లలో చోరీ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈసారి పోలీసులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే శివారు ప్రాంతాల్లో రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పోలీసులు నైట్ పెట్రోలింగ్ పెంచారు. గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, వ్యక్తిగత గృహాలపై నిరంతరం నిఘా పెట్టారు. జైలు నుంచి విడుదలైన పాత నేరస్తులు, నేపాలీ పని మనుషుల కదలికలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.
పండగ సమయాల్లో అధికంగా చోరీలు..
మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలు, స్థానికంగా ఇతర జిల్లాల్లో ఉండే చోరులు పండుగ సమయాలను అనువుగా భావిస్తుంటారు. రైళ్లు, బస్సుల్లో నగరానికి చేరుకొని, శివారు ప్రాంతాల్లో తలదాచుకుంటారు. రాత్రి సమయంలో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతుంటారు. దీంతో సాధారణ రోజులతో పోలిస్తే పండగ వేళ చోరీలు అధికంగా నమోదవుతున్నాయి. ఎక్కువగా శివారు ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్ల పరిధిలో దొంగతనాలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఆయా స్టేషన్ల పరిధిలో సైకిల్, నైట్ పెట్రోలింగ్‌లతో గల్లీగల్లీలో నిఘా పెట్టాలని, నిరంతరం సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.
సైబరాబాద్ పోలీసుల సూచనలివీ..
u బంగారు, వెండి ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోండి లేదంటే మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోండి.
u సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సర్‌ను ఏర్పాటు చేసుకోవడం మంచిది. అలాగే ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ తాళం ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరం.
u మీ వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్కు చేయండి. నమ్మకమైన వాచ్‌మెన్‌లను మాత్రమే సెక్యూరిటీ గార్డుగా నియమించుకోవాలి.
u మీరు ఇంట్లో లేనప్పుడు ఇంటి ముందు చెత్త చెదారం, న్యూస్ పేపర్, పాల ప్యాకెట్లు వంటివి జమ కానివ్వకుండా చూడాలి. వాటిని గమనించి ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకొని దొంగలు చోరీలకు పాల్పడుతుంటారు.
u ఇంటి లోపల మరియు బయట కొన్ని లైట్లు వేసివుంటే మంచిది.
u సోషల్ మీడియాలో మీరు బయటికి వెళ్లే విషయాన్ని ఇతరులకు షేర్ చేయడం మంచిది కాదు.
Comments
Please login to add a commentAdd a comment