హైదరాబాద్‌ పోలీసుల సాహసం.. | Hyderabad Cyber Crime Police Adventure In Rajasthan | Sakshi
Sakshi News home page

‘భరతం’ పట్టారు!

Published Sat, Oct 17 2020 3:35 AM | Last Updated on Sat, Oct 17 2020 9:04 AM

Hyderabad Cyber Crime Police Adventure In Rajasthan - Sakshi

శుక్రవారం సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేసిన నిందితులు

సాక్షి, హైదరాబాద్‌: అది రాజస్తాన్‌ సరిహద్దుల్లోని మేవాట్‌ ప్రాంతం.. భరత్‌పూర్‌ జిల్లాలో ఉన్న మూడు పక్కపక్క గ్రామాలు.. సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతం.. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులతో పాటు అక్కడి అధికారులతో కూడిన బృందం.. ‘ఓఎల్‌ఎక్స్‌ కేటుగాళ్ల’కోసం గ్రామాల్లో వేట మొదలెట్టింది.. ప్రతిఘటించిన నేరగాళ్లు, వారి కుటుంబీకులు ఎదురుదాడి చేశారు. టియర్‌ గ్యాస్‌ ప్రయోగించి 18 మంది దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ తతంగమంతా ‘ఖాకీ’సినిమాను తలపించింది. వీరిని శుక్రవారం హైదరాబాద్‌ తీసుకొచ్చి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపినట్లు సీసీఎస్‌ విభాగం డీసీపీ అవినాష్‌ మొహంతి వెల్లడించారు. ఈ నెల 9న కూడా మరో 8 మంది నేరగాళ్లను అరెస్టు చేశారు. 

అమ్ముతామంటూ.. కొంటామంటూ.. 
భరత్‌పూర్‌ జిల్లాకు చెందిన చాలా గ్రామాల్లో ఈ ఓఎల్‌ఎక్స్‌ కేటుగాళ్ల అడ్డాలు ఉన్నాయి. ఆర్మీ అధికారుల మాదిరిగా ఫొటోలకు పోజులిస్తూ.. ఓఎల్‌ఎక్స్‌ వంటి ఈ–యాడ్స్‌ వెబ్‌సైట్లలో వివిధ ప్రకటనలు ఇస్తుంటారు. సెకండ్‌ హ్యాండ్‌ వాహనాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు తక్కువ ధరకు విక్రయిస్తామంటూ పేర్కొంటారు. వాటిని చూసి సంప్రదించిన వారి నుంచి అడ్వాన్సుల రూపంలో వీలున్నంత దోచేస్తారు. మరోపక్క ఆయా వెబ్‌సైట్లలో సామాన్యులు పెట్టిన సెకండ్‌ హ్యాండ్‌ వస్తువుల అమ్మకం ప్రకటనలకు స్పందించి వాటిని విక్రయిస్తామని కూడా డబ్బు స్వాహా చేస్తారు. 

రంగంలోకి దిగిన సైబర్‌ పోలీసులు.. 
రెండేళ్లుగా భరత్‌పూర్‌ జిల్లాలోని గ్రామాలపై దాడి చేయడానికి హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు వేచి చూస్తున్నారు. ఇటీవల తమ వద్ద ఉన్న కేసుల రికార్డులు సిద్ధం చేసిన ఏసీపీ కేవీఎం ప్రసాద్‌.. ఆపరేషన్‌ కోసం ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.నవీన్, ఎస్సై రమేశ్‌ల నేతృత్వంలో 10 మంది పోలీసులు ఈ నెల మొదటి వారంలో అక్కడకు పంపించారు. తొలుత పాడ్లా ప్రాంతంలో దాడి చేసి 8 మంది దుండగులను అరెస్టు చేశారు. ఆ తర్వాత చుల్హేరా, కల్యాణ్‌పూర్, ఖరీక గ్రామాల్లో అసలు నేరగాళ్లు ఉన్నారనే విషయం తెలిసింది. దీంతో భరత్‌పూర్‌ ఎస్పీ అమరీందర్‌ సింగ్‌ను సంప్రదించిన ఇక్కడి అధికారులు.. ప్రత్యేక బలగాలను సమీకరించుకున్నారు.  100 మంది పోలీసులు 30 వాహనాల్లో సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు ఈ మూడు గ్రామాలను దిగ్బంధం చేశారు. 

తీవ్ర ప్రతిఘటన ఎదురైనా.. 
పోలీసులు వచ్చారనే విషయం తెలుసుకున్న నేరగాళ్లు, వారి కుటుంబీకులు చుట్టుపక్కల వారితో కలసి పోలీసులపై దాడికి దిగారు. కర్రలు, కారం పొడితో అధికారులపై దాడి చేశారు. మూడు పోలీసు వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు కొందరు పోలీసులను గాయపరిచారు. దీంతో భాష్పవాయు గోళాలు ప్రయోగించి 10 మంది నేరగాళ్లను గుర్తించి పట్టుకున్నారు. ఆ తర్వాత వారిని శుక్రవారం హైదరాబాద్‌ తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు. 

రెండు దశల్లో అరెస్టయింది వీరే.. 
ఆరిఫ్‌ ఖాన్, ధీను ఖాన్, ఇలియాస్‌ ఖాన్, పుష్పేంద్ర సింగ్, రాధేశ్యాం, మోహన్‌ సింగ్, హకీం ఖాన్, విజిబ్‌ ఖాన్, సాహిల్, షహీద్, ఉమర్‌ ఖాన్, సత్యవీర్‌ సింగ్, ఇర్ఫాన్, తరీఫ్, ఆరిఫ్‌ ఖాన్, మోహన్‌ సింగ్, అజారుద్దీన్, రాహుల్‌. 

పోలీసుల జోలికే రావడంతో.. 
హైదరాబాద్‌లో ఏటా నమోదవుతున్న సైబర్‌ నేరాల్లో ఈ ఓఎల్‌ఎక్స్‌ క్రైమ్‌దే ప్రథమ స్థానం. రోజుకు దాదాపు ఐదారుగురు బాధితులు సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ నేరగాళ్ల అడ్డా.. భరత్‌పూర్‌ జిల్లా అని రెండేళ్ల కిందటే పోలీసులు గుర్తించారు. రెండుసార్లు పోలీసు బృందాలు అక్కడికి వెళ్లి దాడులు చేశారు. అయితే స్థానిక పోలీసుల నుంచి సహకారం లేకపోవడంతో మన పోలీసులు తిరిగి రావాల్సి వచ్చింది. అయితే ఇటీవల ఈ ‘ఓఎల్‌ఎక్స్‌ కేటుగాళ్లు’పోలీసులను టార్గెట్‌గా చేసుకున్నారు. దేశవ్యాప్తంగా అనేక మంది అధికారుల పేర్లతో ఫేస్‌బుక్‌లో నకిలీ ప్రొఫైల్స్‌ సృష్టించి, వారి స్నేహితులలో చాటింగ్‌ చేస్తూ డబ్బు గుంజారు. దీంతో అన్ని రాష్ట్రాల పోలీసుల నుంచి భరత్‌పూర్‌ అధికారులు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో అక్కడి అధికారుల వైఖరిలో మార్పు వచ్చింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement