సాక్షి,హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు ఆన్‌లైన్ ద్వారా ఆకర్షితుడై, విదేశంలో ఉన్న హ్యాండ్లర్ ఆదేశాల మేరకు అమెరికా, ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాలపై ఉగ్రదాడులకు సిద్ధమైన ఓ స్లీపర్ సెల్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. సీసీఎస్ పోలీసుల కథనం ప్రకారం..సైదాబాద్ ప్రాంతానికి చెందిన మహ్మద్ బిన్ సులేమాన్ (19) తండ్రి చాలాకాలం యూఏఈలో ఉద్యోగం చేశారు.
అక్కడే పుట్టిన సులేమాన్ కుటుంబంతో పాటు నగరానికి తిరిగి వచ్చి పహాడీషరీఫ్ ప్రాంతంలో స్థిరపడ్డారు. ఇతడు స్థానికంగా ఉన్న ఓ కళాశాలలో ఇంటర్మీడియెట్ వరకు చదివాడు. 2020లో ఇంటర్ చదువుతున్నప్పుడే ఆన్‌లైన్ క్లాసుల కోసం తల్లిదండ్రులిచ్చిన ఫోన్ ద్వారా సోషల్ మీడియా ఖాతాలకు అలవాటుపడి చదువును నిర్లక్ష్యం చేశాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోని వచ్చిన వీడియోల ద్వారా ఉగ్రవాదం వైపు ఆకర్షితుడయ్యాడు.
ఆన్‌లైన్‌లో ప్రసంగాలు విని..
ఆన్‌లైన్‌లో పరిచయమైన ఉజ్బెకిస్థాన్‌లో ఉన్న ఐసిస్ హ్యాండ్లర్ ఆదేశాల ప్రకారం తన ఫోన్‌లో ఇన్‌స్ట్రా గామ్, టెలిగ్రామ్ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆ యాప్స్‌లోని గ్రూపుల్లో ఉన్న ఉగ్రవాద సంబంధిత వీడియోల ద్వారా ప్రసంగాలు, చర్చల్లో సైతం పాల్గొన్నాడు. హ్యాండ్లర్ సూచనల మేరకు ఉగ్రదా డులు చేయడానికి సిద్ధమై, అందుకు సంబంధించిన ఆదేశాలు వచ్చే వరకు స్లీపర్ సెల్ మాదిరిగా నగరంలోనే ఉంటున్నాడు. హ్యాండ్లర్ పంపిన లింకు వీడియోల ద్వారా బాంబుల తయారీ, ఉగ్రవాద దాడులు చేయడం వంటి అంశాల్లో శిక్షణ పొందాడు. దీంతోపాటుగా నగరానికి చెందిన మరికొందరు యువకులను కూడా ఉగ్రవాదం వైపు మళ్లించడానికి ప్రయత్నాలు చేశాడు.
నిఘాపెట్టిన కేంద్ర వర్గాలు..
ఇతడి వ్యవహారాన్ని గుర్తించిన కేంద్ర నిఘా వర్గాలు కొన్నాళ్లుగా సాంకేతిక నిఘా ఉంచాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఏ ప్రాంతంలోనైనా, అమెరికా, ఇజ్రాయెల్ రా యబార కార్యాలయాలపై దాడులు చేస్తానంటూ ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రాం గ్రూపుల్లో పోస్టులు పెట్టా డు. దీనిపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చాయి.
ఇంటర్‌నెట్ ఐపీ అడ్రస్ ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు పహాడీషరీఫ్ లోని సులేమాన్ ఇంటిని కనిపెట్టి అతడిని అరెస్టు చేశారు. అతడిపై ఐటీ యాక్ట్‌తో పాటు ఐపీసీలో ని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జ్యూడీషి యల్ రిమాండ్‌కు తరలించారు. సమగ్ర దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)కు బదిలీ చేయనున్నట్లు సీసీఎస్ అధికారి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment