ఇన్‌సెట్లో నిందితులు గుణశేఖర్, జాన్ అరుల్ ప్రకాశ్
సాక్షి, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో అమెజాన్‌కు ఆర్డర్ ఇచ్చిన వస్తువులు చేతికందినా ఖాళీ బాక్స్‌లు, తెల్లపేపర్ వచ్చిందంటూ కస్టమర్ సర్వీస్ సెంటర్‌కు ఈ–మెయిల్ ఫిర్యాదు చేసి కొత్త ప్రొడక్ట్ తీసుకోవడమేగాక వీటిని ఓలెక్స్‌లో తక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వచ్చిన వస్తువు ధ్వంసమైందంటూ డబ్బులు రీఫండ్ చేయించుకుంటున్నారు. ఇలా అమెజాన్‌కు దాదాపు రూ.12 లక్షలకుపైగా నష్టం కలిగించిన ఇద్దరు వ్యక్తులను సోమవారం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ జానకి షర్మిల కథనం ప్రకారం...సికింద్రాబాద్ సైనిక్‌పురికి చెందిన సిమ్‌సన్ గుణశేఖర్, జాన్ అరుల్ ప్రకాశ్ చిన్ననాటి స్నేహితులు. 2014 లో గుణశేఖర్ అమెజాన్ కంపెనీలో కస్టమర్ సపోర్ట్ అసోసియేట్‌గా చేరాడు. వస్తువులు రాలేదు, ధ్వంసమయ్యాయి, వస్తువుల స్థానంలో రాళ్లు, సబ్బులు వచ్చాయంటూ పంపిన మెయిల్స్‌ను చూసి డబ్బు తిరిగి చెల్లించడం, వస్తువులు తిరిగి పంపించడం చేసేవాడు. మోసపూరితంగా సులభంగా డబ్బులు సంపాదించుకునేందుకు ఇదొక మంచి మార్గమని భావించిన గుణశేఖర్ అదే కంపెనీలో పనిచేస్తున్న జాన్ అరుల్ ప్రకాశ్‌కు పథకాన్ని వివరించాడు. దీంతో 2016 అక్టోబర్‌లో జాన్ అరుల్ జాన్ క్రిస్‌గా అమెజాన్.ఇన్‌లో నకిలీ యూజర్ ఐడీ సృష్టించి యాపిల్ ఐఫోన్ 5ఎస్‌కు ఆర్డర్ ఇచ్చాడు. ఆ ప్రొడక్ట్ చేతికి అందిన తర్వాత పథకం ప్రకారం ‘ప్రొడక్ట్ మా చేతికి అందలేదు. దీంతో డబ్బులు తిరిగి చెల్లించాలం’టూ రిజిస్టర్ మెయిల్ ఐడీ ద్వారా ఫిర్యాదు చేయడంతో అతడిచ్చిన బ్యాంక్ ఖాతాకు తిరిగి డబ్బులు చెల్లించారు.
2017 మేలో మరో కస్టమర్ అకౌంట్‌తో జాన్ అరుల్ లెనోవా ల్యాప్‌టాప్ ఆర్డర్ ఇచ్చాడు. ఆ వస్తువు రాలేదంటూ తిరిగి పంపించాలంటూ మళ్లీ మెయిల్ పెట్టడంతో రెండోసారి కూడా ల్యాప్‌టాప్ చేతికి వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 7న గుణేశేఖర్ తన సోదరుడి పేరుతో యూజర్ ఐడీ క్రియేట్ చేసి శాంసంగ్ గెలాక్సీ జే7 ప్రైమ్ ఆర్డర్ ఇచ్చాడు. అయితే ఆ సెల్‌ఫోన్ చేతికందినా, దానిస్థానంలో తెల్ల పేపర్ వచ్చిదంటూ మళ్లీ సెల్‌ఫోన్ పంపాలంటూ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసి అందుకున్నాడు. ఇలా గుణశేఖర్ ఐదు అర్డర్లు ఇచ్చి మూడు రీప్లేస్‌మెంట్, ఒక రీఫండ్ అమౌంట్, జాన్ అరుల్ పది ఆర్డర్‌లు ఇచ్చి ఎనిమిది రీప్లేస్‌మెంట్‌లు, ఒక రీఫండ్ అమౌంట్ పొందారు. ఈ ప్రొడక్ట్‌లను ఓలెక్స్ వెబ్‌సైట్‌లో 20 నుంచి 30 శాతం తక్కువ ధరకు విక్రయిస్తున్నట్టుగా ట్రాన్సాక్షన్ రిస్క్ మేనేజ్‌మెంట్ టీమ్ దర్యాప్తులో తేలింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment