డిఫెన్స్ ఉద్యోగులమంటూ ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తున్న నకిలీ ఆధార్, ఐడీ, పాన్‌కార్డులు
అల్లిపురం(విశాఖ దక్షిణం): ∙నగరంలో ఓ నేవల్ అధికారి ఓఎల్‌ఎక్స్ యాప్‌లో ఖరీదైన కారు తక్కువ ధరకే వస్తుందని కొనుగోలుకు సిద్ధపడ్డాడు. అమ్మకందారుతో చాటింగ్‌లో ధర నిర్ణయించుకుని లక్ష రూపాయలు డిపాజిట్ చేశాడు. అంతే అమ్మకందారు చాటింగ్ నుంచి పరార్. దీంతో లబోదిబో మంటూ ఆ అధికారి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. ఆన్‌లైన్‌లో అమ్మకందారు చూపించిన డిఫెన్స్ ఐడీ కార్డు, ఆధార్ కార్డును పరిశీలిస్తే అవి నకిలీవని తేలింది. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో పడిపోయాడు.
ఇండియన్ నేవీలో పనిచేస్తున్న ప్రదీప్ సింగ్ ధర్మాల్ సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనం కోసం ఓఎల్‌ఎక్స్‌లో సెర్చ్ చేశాడు. హోండా యాక్టివా 5జీ ఫర్ సేల్ అని పోస్ట్ చూశాడు. వెంటనే పోస్ట్ పెట్టిన వ్యక్తిని సంప్రదించగా తన పేరు అజయ్ యాదవ్ అని, ఇండియన్ ఆర్మీ కాకినాడలో పని చేస్తున్నానని చెప్పడంతో రూ.28 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రదీప్ సింగ్ మాత్రం వాహనం చూసి డబ్బులు ఇస్తానని చెప్పడంతో.. నేను ఆర్మీ పర్సన్‌ను నన్ను నమ్మమని చెప్పడంతో అంగీకరించారు. ఆ తరువాత రకరకాల రిఫండబుల్ చార్జెస్ పేరుతో రూ.50,625 డిపాజిట్ చేయించుకున్నాడు. అనుమానం వచ్చిన ప్రదీప్‌సింగ్.. అజయ్ యాదవ్ ఇచ్చిన వివరాలు పరిశీలించగా.. మోసపోయానని గ్రహించి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.
ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రెండు నెలల్లో 7 కేసులు నమోదయ్యాయి. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నా విద్యావంతులు సైతం మోసం పోతుండడం విస్మయానికి గురిచేస్తోంది. ఓఎల్‌ఎక్స్ ఆన్‌లైన్ సైట్ ద్వారా మొబైల్ ఫోన్స్, కార్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయాల పేరిట ఎక్కువ మోసాలు విశాఖపట్నం సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో నమోదవుతున్నాయి. రెండేళ్లుగా ఓఎల్‌ఎక్స్ ద్వారా మోసపోయిన కేసులు సుమారు 25 కేసులు ఉన్నాయి. వాటి ద్వారా దాదాపు రూ.29లక్షల వరకూ యాప్ వినియోగదారులు నష్టపోయారని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. దీనిపై నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఓఎల్‌ఎక్స్ లీగల్ మేనేజర్ జుహీసింగ్‌ను విశాఖపట్నం పిలిపించి సూచనలు చేశారు. పోలీసుల సూచనల మేరకు ఓఎల్‌ఎక్స్ యాజమాన్యం యాప్‌లో మార్పులు చేశారు. ఓఎల్‌ఎక్స్‌లో పెట్టే ప్రతియాడ్‌లోను పోస్ట్ చేసే వారి ఐడీ ప్రూఫ్ ధ్రువీకరణ, లొకేషన్ ధ్రువీకరణ, డివైస్ ధ్రువీకరణ పోస్టు చేసేలా మార్పులు చేశారు. ఇప్పటికైనా ఓఎల్‌ఎక్స్, క్విక్కర్, ఫేస్‌బుక్‌లలో వచ్చే యాడ్‌లను చూసి తక్కువలో మొబైల్ ఫోన్స్, కార్లు, ఇతరత్రా వస్తువులు కొనుగోలు చేసే సమయంలో సరైన ధ్రువీకరణ లేకుండా ముందస్తుగా ఎవ్వరికీ డబ్బులు పంపరాదని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ధ్రువపత్రాలు చూసుకుని వస్తువులు కొనండి
సరైన ధ్రువీకరణ లేకుండా వెబ్‌సైట్‌లో విలువైన వస్తువులు కొనుగోలు చేయకండి. యాప్‌లో వచ్చే యాడ్స్‌కు సంబంధించి అమ్మకందారులు పెడుతున్న ధ్రువ పత్రాలను సరిచూసుకోండి. ఆన్‌లైన్‌లో వస్తువులను చూసి మోసపోకండి. రిమోట్ ఏరియాల నుంచి వచ్చే యాడ్‌ల పట్ల ఆకర్షితులవ్వకండి. జాగ్రత్తగా ఆలోచించి, సమీపంలో అడ్రస్‌లను ఎంచుకుని వస్తువులను కొనుగోలు చేస్తే మంచిది. తొందరపడి డబ్బు డిపాజిట్ చేయకండి. తస్మాత్ జాగ్రత్త. – వి.గోపీనాథ్, సైబర్ క్రైం సీఐ్చ
Comments
Please login to add a commentAdd a comment