
ఫేస్‌బుక్ అంటే.. ఏదైనా మనకు నంచిన పోస్టును, వీడియోలను పెట్టడం లేదా షేర్ చేయడం, దానికి ఎన్ని లైక్స్ వస్తున్నాయో, ఎన్ని షేర్లు వస్తున్నాయో చూసుకుని మురిసిపోవడం. ఇలాంటి వాటికే కాకుండా ఫేస్‌బుక్ కూడా తన నెట్‌వర్క్ పరిధిని మరింత విస్తరిస్తోంది. తాజాగా ఫేస్‌బుక్ మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా ఓలెక్స్ తరహాలో వినియోగించిన వస్తువులను కొనడానికి, అమ్మడానికి అవకాశం కల్పిస్తోంది. 'మార్కెట్‌ప్లేస్' పేరుతో ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్‌పై ఈ ఫీచర్ ట్రయల్‌ను ముంబైలో చేపట్టింది. ఒకవేళ అక్కడ ఇది సక్సెస్ అయితే వెంటనే దేశవ్యాప్తంగా దీన్ని లాంచ్ చేయబోతుంది. ఆన్‌లైన్ క్లాసిఫైడ్స్ ఓలెక్స్, క్వికర్ తరహాలో ఫేస్‌బుక్ కూడా ఈ సేవలను అందిస్తోంది. ఇప్పటికే ఈ ఫీచర్ 25 దేశాల్లో అందుబాటులో ఉంది.
ఇటీవలే జర్మనీ, ఫ్రాన్స్, యూకే వంటి 17 దేశాల్లో దీన్ని ప్రారంభించారు. ఫేస్‌బుక్‌కు భారీ మొత్తంలో యూజర్ డేటాబేస్ ఉంది. ఈ క్రమంలో ఫేస్‌బుక్ తన పేజీలో మార్కెట్ ప్లేస్ అనే ఫీచర్ తీసుకొస్తోంది. ఈ ఫీచర్‌తో యూజర్లను మరింత మందిని ఆకట్టుకోనుంది. అందులోకి వెళ్లి అమ్మాలనుకుంటున్న లేదా కొనాలనుకుంటున్న వస్తువుల ఫొటోలు పెట్టి వివరాలు రాయాలి. అది చూసి నచ్చినవారు అక్కడే ఛాటింగ్ లేదా కాల్ ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తారు. గృహోపరికరాలు, ఎలక్ట్రానిక్స్, అప్పారెల్స్ వంటి అన్ని కేటగిరీ వస్తువులను దీనిలో కొనుగోలు చేసుకోవడానికి, అమ్మడానికి అవకాశం కల్పించనుంది. అయితే పేమెంట్‌కు, డెలివరీకి మాత్రం ఫేస్‌బుక్ బాధ్యత కాదు. ఇందులో అభ్యంతరకమైన వస్తువులను అమ్మకానికి పెట్టడానికి వీలులేకుండా మెషీన్ లెర్నింగ్ సాంకేతికతను వాడుతున్నారు.