టార్గెట్‌.. ఓఎల్‌ఎక్స్‌ యూజర్స్‌ | Cyber Criminals Target OLX App Users Hyderabad | Sakshi
Sakshi News home page

టార్గెట్‌.. ఓఎల్‌ఎక్స్‌ యూజర్స్‌

Published Sat, Mar 21 2020 10:30 AM | Last Updated on Sat, Mar 21 2020 10:30 AM

Cyber Criminals Target OLX App Users Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఈ–యాడ్స్‌ యాప్‌ ఓఎల్‌ఎక్స్‌ బారిన పడుతున్న వారి సంఖ్య ఏమాత్రం తగ్గట్లేదు. తాజాగా శుక్రవారం ఇందులో ఆర్మీ అధికారులుగా సైబర్‌ నేరగాళ్ళు పోస్ట్‌ చేసిన వాహనాల ఫొటోలకు స్పందించి. వాటిని ఖరీదు చేద్దామని భావించి సంప్రదించి రూ.3 లక్షల వరకు నష్టపోయారు. వీళ్ళు శుక్రవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. వేర్వేరు కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 

చాదర్‌ఘాట్‌ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఖరీదు చేయాలని భావించాడు. ఓఎల్‌ఎక్స్‌లో ఆర్మీ అధికారి మాదిరిగా దాన్ని పోస్టు చేసిన వ్యక్తి రూ.65 వేలు ధర నిర్ణయించాడు. అతడిని సంప్రదించిన బాధితుడు తాను ఖరీదు చేసుకుంటానని చెప్పాడు. అంగీకరించిన నేరగాడు ముందుగా గూగుల్‌ పే ద్వారా రూ.5100 పంపాలని సూచించాడు. ఆ తర్వాత రూ.20,100 పంపిస్తే వాహనం నేరుగా ఇంటికే డెలివరీ ఇస్తామని చెప్పాడు. దీన్ని రూ.2,100గా భావించిన బాధితుడు ఆ మొత్తం బదిలీ చేశాడు. అయితే తాను కోరింది రూ.20,100 అని చెప్పడంతో మిగిలిన రూ.18 వేలు పంపాడు. ఇలా వేర్వేరుగా పంపిస్తే సిస్టం అంగీకరించదని, మరోసారి ఒకే మొత్తంగా పంపాలని, ఇప్పుడు చెల్లించింది తిరిగి ఇచ్చేస్తానంటూ సైబర్‌ నేరగాడు చెప్పడంతో బాధితుడు అలానే చేశాడు. అప్పటికీ వాహనాన్ని పంపని అతగాడు మరో రూ.15 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశాడు. అనుమానించిన బాధితుడు చెల్లించడం ఆపేయగా.. ఇప్పటి వరకు మీరు చెల్లించింది ఆర్మీ ఖాతాలోకి వెళ్ళిపోయిందని, తక్షణం రూ.15 వేలు కట్టకపోతే వాహనంతో పాటు అప్పటి వరకు కట్టిన మొత్తమూ క్యాన్సిల్‌ అవుతాయని బెదిరించాడు. దీంతో బాధితుడు శుక్రవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశాడు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

ఓఎల్‌ఎక్స్‌లో ఆర్మీ అధికారి మాదిరిగా పోస్టు పెట్టిన ఓ యాక్టివాను ఖరీదు చేయాలని నగరానికి చెందిన యువకుడు భావించాడు. వెంటనే అందులో ఉన్న నెంబర్‌కు సంప్రదించాడు. ఇతడితో సంప్రదింపులు కొనసాగించిన సైబర్‌ నేరగాడు రూ.24 వేలకు ఆ వాహనం అమ్మడానికి అంగీకరించాడు. ఆపై అనేక పేర్లు చెప్తూ డబ్బు దండుకుంటూ పోయాడు. వాహనం ఖరీదును మించి రూ.65 వేల వరకు గూగుల్‌ పే ద్వారా బాధితుడు చెల్లించేశాడు. ప్రతి సందర్భంలోనూ సైబర్‌ నేరగాడు వాహనం విలువ మినహా మిగిలిన మొత్తం రీఫండ్‌ వస్తుందంటూ చెబుతుండటంతో బాధితుడు నమ్మి మోసపోయాడు. ఎట్టకేలకు తనకు జరగిన నష్టం తెలుసుకుని సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

నగరానికి చెందిన మరో వ్యక్తి ఓఎల్‌ఎక్స్‌ నుంచి కారు ఖరీదు చేయడానికి ప్రయత్నించాడు. ఇతడి నుంచి సైబర్‌ నేరగాళ్ళు రూ.1.95 లక్షలు కాజేయడంతో పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement