పోయిన కారు ఓఎల్ఎక్స్లో దొరికింది
నోయిడా: పోయిన కారు కోసం వెతికి వెతికి ఎంతకీ లభించక పోవడంతో ..సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చెద్దామని ఈ కామర్స్ వెబ్ సైటైన ఓఎల్ఎక్స్లో ప్రయత్నించిన వ్యక్తికి తన కారే అమ్మకానికి పెట్టడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ప్రాపర్టీ డీలర్ కుల్వంత్ సింగ్ గత ఏడాది అగస్టులో సెక్టర్ 1 లో ఉన్న తన ఇంటి ముందు పార్క్ చేసిన కారు చోరీకి గురైంది. పోలీసు స్టేషన్లో కేసు కూడా నమోదు చేశాడు.
కారు ఎంతకీ దొరకకపోవడంతో సెకండ్ హ్యాండ్ కార్ల కోసం ఓఎల్ఎక్స్లో సెర్చ్ చేశాడు. సరిగ్గా అదే సమయంలో రిజిస్ట్రేషన్ నంబర్ డీఎల్ 4సీఆర్ 0757 ఉన్న తన కారును చూశాడు. వెంటనే యాడ్ ఇచ్చిన వ్యక్తితో కారు గురించి మాట్లాడాలని కోరాడు. అతని దగ్గరకు వెళ్లేమందు పోలీసులను కూడా తన వెంట తీసుకువెళ్లాడు. కారు యాడ్ ఇచ్చిన వ్యక్తిని లోనీలో నివసించే అహ్మద్గా పోలీసులు గుర్తించారు. తాను నివసించే ప్రాంతంలోనే ఉండే మరో వ్యక్తి జుల్ఫికర్ ఆ కారును తనకు అమ్మినట్టు అహ్మద్ తెలిపాడు. ప్రధాన నిందితుడు జుల్ఫికర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.