ఐఫోన్లు కొంటా..
రాంగోపాల్‌పేట్: ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటన ఇచ్చిన వారినే టార్గెట్ చేసి ఐ ఫోన్లు కొంటానని మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని రాంగోపాల్‌పేట్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఆదిలాబాద్ జిల్లా భైంసాకు చెందిన ఉదయ్‌కిరణ్‌రెడ్డి (29) జగద్గిరిగుట్టలో నివసించే వాడు. ఏ పనీ చేయకుండా ఆవారాగా తిరుగుతూ ఖర్చులకు భార్యను డబ్బు అడిగి వేధిస్తుండటంతో ఐదు నెలల క్రితం ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి చైతన్యపురిలోని ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు.
జల్సాలకు అలవాటు పడ్డ నిందితుడు ఓఎల్‌ఎక్స్‌లో ఐ ఫోన్లు అమ్ముతామని ప్రకటనలు ఇచ్చిన వారిని మోసం చేయాలని పథకం పన్నారు. అందులో ఇచ్చిన మొబైల్‌కు ఫోన్ చేసి ఐ ఫోన్ కొంటానని సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్‌లోని కిమ్స్ ఆస్పత్రి వద్దకు రావాలని చెబుతాడు. ఫోన్ తనసోదరికి కావాలని ఆమె కిమ్స్ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తుందని నమ్మిస్తాడు. అమ్మే వ్యక్తి చెప్పిన ధర చెల్లిస్తానని ఒకమారు ఆస్పత్రిలో ఉన్న సోదరికి చూపించి వస్తానని చెబుతాడు.
ఆస్పత్రి లోపలికి వెళ్లి అటునుంచి అటే వెళ్లిపోతాడు. ఇలా ఐదుగురి నుంచి ఐ6ఎస్ రెండు, ఐ6 ఫోన్లు 3 కొట్టేశాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టి మంగళవారం వలపన్ని పట్టుకున్నారు. ఒక్కో వ్యక్తిని మోసం చేసేందుకు కొత్త సిమ్‌కార్డు కొనుగోలు చేసి దాంతో మోసాలు చేసేవాడు. నిందితుడి నుంచి రూ.2.30లక్షల విలువ చేసే ఐదు ఐ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ నేతృత్వంలో ఎస్‌ఐ సురేష్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు.