భారతీయ కుటుంబాలు మునుపెన్నడూ లేని విధంగా అప్పుల్లో కూరుకుపోతున్నాయి. పండుగ వేళ విపరీతమైన షాపింగ్, అప్పులు సులభంగా లభ్యమవుతున్న నేపథ్యంలో పర్సనల్ ఫైనాన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్ నేహా నగర్ అప్పులపై ఆధారపడే ధోరణి పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు. భారతదేశంలో 70 శాతం ఐఫోన్లు (iPhones) రుణాల ద్వారా, 80 శాతం కార్లు ఈఎంఐల ద్వారా కొంటున్ననవేనని పేర్కొన్నారు.
వినియోగదారు రుణంలో ఈ పెరుగుదల భారతదేశ ఆర్థిక ప్రవర్తనలో లోతైన మార్పును ప్రతిబింబిస్తుంది. ఆదాయాల కంటే ఆకాంక్షలు వేగంగా పెరుగుతుండటంతో చాలా మంది ఆస్తులను నిర్మించడానికి బదులుగా జీవనశైలికి నిధులు సమకూర్చుకోవడానికి రుణాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇలాంటి అప్పులు చేటు చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
"ధనవంతులు ఆస్తులను నిర్మించుకోడానికి పరపతిగా రుణాలను ఉపయోగిస్తుంటే పేద, మధ్యతరగతివారు మాత్రం విలాసాలను కొనుక్కోవడానికి వాటిని ఉపయోగిస్తారు" అని ఫైనాన్స్ రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తన ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తకంలో ప్రముఖంగా చెప్పారు. ఆ వ్యత్యాసమే చాలా మంది మధ్య ఆదాయ వర్గాలు రాబడిని ఇచ్చే పెట్టుబడులకు బదులుగా గాడ్జెట్లు, వాహనాల వంటి క్షీణించే ఆస్తుల కోసం ఈఎంఐ (EMI) చక్రాలలో ఎలా చిక్కుకుపోతున్నారో వివరిస్తుంది.


