నెల్లూరు : ఏదైనా అమ్ముకోవచ్చు' ఇది ఓఎల్ఎక్స్ అనే ఉచిత ఆన్‌లైన్ ప్రకటనల వెబ్‌సైట్ ప్రచార నినాదం. అదే ఓ వ్యక్తి కొంప ముంచింది. ఓఎల్ఎక్స్ వెబ్సైట్లో కారు అమ్మకానికి పెట్టిన అతగాడికి చేదు అనుభవం ఎదురైంది. నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన అశోక్ కుమార్... వెబ్సైట్లో తన కారును అమ్మకానికి పెట్టాడు.
ఆ ప్రకటన చూసిన ఇద్దరు వ్యక్తులు కారు కొనేందుకు ముందుకు వచ్చారు. టెస్ట్ డ్రైవింగ్ చేద్దామంటూ ఆ ఇద్దరు...కారుతో బయల్దేరారు. కొంతదూరం వెళ్లిన తర్వాత కారులో ఉన్న అశోక్ కుమార్ను వారిద్దరూ బలవంతంగా బయటకు తోసేసి...వాహనంతో పరారయ్యారు. బాధితుడు లబోదిబోమంటూ పోలీసుల్ని ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కాగా ఇందుకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.