సాక్షి, హైదరాబాద్: రహదారుల సమీపంలోని మొబైల్ షాపుల్లో సెల్‌ఫోన్లు చోరీ చేస్తారు. వీటిని ఓఎల్‌ఎక్స్‌లో విక్రయిస్తారు. వచ్చిన సొమ్ముతో జల్సా చేస్తారు. ఇదీ అయిదుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠా పని. వీరిని ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. మియాపూర్ ఠాణా పరిధిలోని రిలయన్స్ డిజిటల్ షాపులో గత నెల 14న తెల్లవారుజామున 119 సెల్‌ఫోన్లు తస్కరించి ముంబైకి తీసుకెళ్లిన ఈ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 113 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ కృష్ణ ప్రసాద్‌లతో కలిసి సీపీ సజ్జనార్ ఈ కేసు వివరాలు వెల్లడించారు.
ప్రధానంగా వీటిపైనే దృష్టి..
⇔ ముంబైకి చెందిన ప్రధాన నిందితుడు మహమ్మద్ తాబ్రేజ్ దావూద్ షేక్ నాగ్‌పూర్‌లో చోరీ కేసుల్లో 2016లో జైలుకు వెళ్లాడు. ఈ సమయంలో మరో నిందితుడు రాజు పాండురంగతో పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. ఫర్హాన్ ముంతాజ్ షేక్, రషీద్ మహమ్మద్ రఫీక్ షేక్, మహమ్మద్ షుఫియాన్ షేక్‌లతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు.
⇔ కర్ణాటకలోని బ్రహ్మపురంలో 80 సెల్‌ఫోన్లు, సూరత్‌లోని ఓ మొబైల్ షాప్‌లో 180 సెల్‌ఫోన్లు అపహరించారు. దీంతో మళ్లీ ఆయా రాష్ట్రాల్లోని నగరాల్లో నేరాలు చేస్తే దొరికిపోతామనే భయంతో హైదరాబాద్‌కు అద్దె వాహనం (ఇన్నోవా)లో వచ్చారు.
⇔ నంబర్ ప్లేట్‌ను ఏపీ09గా మార్చి గత నెల 13న నగరానికి చేరుకున్నారు. ప్రధాన రహదారి వెంట సెల్‌ఫోన్ షాప్‌లను పరిశీలించారు. 14వ తేదీ వేకువ జామున మియాపూర్‌లోని రిలయన్స్ డిజిటల్ షాప్ షెట్టర్లను గడ్డపార, ఇతర సామగ్రితో పగులగొట్టి తెరిచారు. 119 సెల్‌ఫోన్లు సంచిలో వేసుకొని కారులో వెళ్లారు.
⇔ పంజాగుట్ట ఓ షట్టర్ తాళాలు పగులగొట్టి తెరిచి ఖజానాలో ఉన్న రూ.4వేలు తీసుకున్నారు. అనంతరం పటాన్‌చెరులోని వైన్స్ దుకాణం షెట్టర్ పగులగొట్టి రూ.700 నగదుతో పాటు మద్యం సీసాలను దొంగిలించినట్లు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.
ముంబై పోలీసుల సహకారంతో...
⇔ సమాచారం తెలుసుకున్న మియాపూర్ పోలీసులు నిందితులు వాడిన వాహనం ఏయే ప్రాంతాల మీదుగా వెళ్లిందో సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. వెంటనే ఆ నంబర్ ప్లేట్ నకిలీదని గుర్తించి సమీప రాష్ట్రాల్లోని పోలీసులను అప్రమత్తం చేశారు.
⇔ షోలాపూర్ టోల్‌ప్లాజా నుంచి ముంబైకి వెళ్లినట్టుగా తెలిసింది. వెంటనే మాదాపూర్ ఎస్‌వోటీ, మియాపూర్ పోలీసులు బృందాలు ఏర్పడి 20 రోజులకుపైగా అక్కడే తిష్ట వేశారు. ముంబై పోలీసుల సహకారంతో అయిదుగురిని పట్టుకున్నారు.
⇔ ‘గతంలో చోరీ చేసిన సెల్‌ఫోన్లను ఓఎల్‌ఎక్స్‌లో తక్కువ ధరకు విక్రయిస్తామని, నగరంలో చోరీ చేసిన సెల్‌ఫోన్లను సైతం అలాగే విక్రయిద్దామనుకున్నాం’ అని నిందితులు విచారణలో వెల్లడించినట్లు, వీరిని ట్రాన్సిట్ వారెంట్‌పై మంగళవారం నగరానికి తీసుకొచ్చినట్లు సీపీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment