సాక్షి,హైదరాబాద్: ఢిల్లీలోని చాందిని చౌక్ మార్కెట్ ప్రాంతంలో స్థిరపడిన బీహార్ గ్యాంగ్ దుకాణాలను టార్గెట్‌గా చేసుకుంది. నగరంతో పాటు కేరళలోనూ మూడు షాపుల షట్టర్లు పగుల కొట్టి (లిఫ్టింగ్) చోరీలు చేసింది. ఈ ముఠాకు చెందిన ఐదుగురిని ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. దీనిపై కేరళ అధికారులకు సమాచారం ఇచ్చినా... వారి నుంచి స్పందన లేదు.
బీహార్‌కు చెందిన షేక్ మసిరుద్దీన్ చాందినీ చౌక్‌లో ఎలక్టాన్రిక్ వస్తువులు విక్రయిస్తుంటాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో షెట్టర్ లిఫ్టింగ్స్ మొదలెట్టాడు. కొందరితో కలిసి గ్యాంగ్ ఏర్పాటు చేసుకుని 2019లో మహంకాళి, మాదాపూర్, రాయదుర్గం ఠాణాల పరిధిలో నేరాలు చేశాడు. ఈ కేసుల్లో బెయిల్‌పై బయటకు వచ్చిన అతగాడు కొన్నాళ్లు స్వస్థలంలో ఉండి మళ్లీ ఢిల్లీ చేరాడు. ఈసారి వరుస నేరాలు చేయడానికి చాందినీ చౌక్‌లోనే చిరు వ్యాపారులుగా ఉన్న బీహారీలు మహ్మద్ ఎజాద్, పర్వేజ్ ఆలం, మహ్మద్ జావేద్, మహ్మద్ అక్తర్ హుస్సేన్, ఆసిఫ్ ఆలంలతో కొత్త ముఠా ఏర్పాటు చేసుకున్నాడు.
వీరంతా ఆగస్టు 24న రైలులో సిటీకి వచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో తలదాచుకున్నారు. మరుసటి రోజు మార్కెట్ ప్రాంతంలో కట్టర్, ఇనుప రాడ్డు, స్క్రూడైవర్ ఖరీదు చేశారు. వీటిని పట్టుకుని అదే రోజు అర్థరాత్రి రోడ్డుపై సంచరిస్తూ పలు దుకాణాల వద్ద రెక్కీ చేశారు. అక్కడి హోల్‌సేల్ కిరాణా దుకాణం డైమండ్ హౌస్ చోరీ చేయడానికి అనువుగా ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన వాళ్లు చుట్టుపక్కల గమనిస్తుండగా... మసీరుద్దీన్ షట్టర్ పగులకొట్టి లోపలకు వెళ్లాడు. క్యాష్ కౌంటర్‌లోని డబ్బు తస్కరించి మళ్లీ రైల్వే స్టేషన్ వద్దకు చేరారు. అక్కడ నుంచి 26వ తేదీ తెల్లవారుజామున కాచిగూడ రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. రైలులో కేరళలోని కసరగోడ్ చేరుకున్నారు. ఆ ప్రాంతంలో మరో రెండు దుకాణాల్లో దా దాపు రూ.50 లక్షల సొత్తు చోరీ చేసి రైలులో నేరుగా ఢిల్లీ వెళ్లిపోయారు. మార్కెట్ కేసు దర్యాప్తు కోసం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఐదుగురిని పట్టుకున్నారు.
వీరి విచారణలో నగరంలో నేరంతో పాటు కేరళలో చేసినవీ బయటపడ్డాయి. వాటికి సంబంధించి రూ.50 వేలు రికవరీ కూడా చేశారు. దీనిపై ఆ రాష్ట్ర పోలీసులకు సమాచారం ఇచ్చి పీటీ వారెంట్‌పై తీసుకువెళ్లమని కోరారు. అయితే ఇప్పటి వరకు కేరళ పోలీసుల నుంచి స్పందన లేదు.ఢిల్లీ గ్యాంగ్ కసరగోడ్‌లో చేసిన నేరాలపై అక్కడి పోలీసులు కేసులు నమోదు చేయలేదని తెలుస్తోంది. తాజాగా నమోదు చేయాలంటే సాంకేతిక ఇబ్బందులు వస్తాయి. ఈ నేపథ్యంలోనే ఆ అధికారులు ఈ ఢిల్లీ గ్యాంగ్ విషయాన్ని పట్టించుకోవట్లేదని అనుమానిస్తున్నట్లు నగర పోలీసులు చెప్తున్నారు.
చదవండి: Falaknuma Dancer: డ్యాన్సర్ మృతి కేసు: వివాహేతర సంబంధమే కారణం.. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో
Comments
Please login to add a commentAdd a comment