
తాడేపల్లిరూరల్: పట్టణ పరిధిలో నివాసం ఉండే ఓ యువకుడు ఓఎల్‌ఎక్స్ యాప్‌ను నమ్ముకొని నిండా మునిగి లబోదిబోమంటూ ఆదివారం తాడేపల్లి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి కథనం మేరకు... మహానాడులో నివాసం ఉండే నాగం వెంకటేశ్వరరావు అనే యువకుడు ఓఎల్‌ఎక్స్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ద్విచక్రవాహనం అమ్మకానికి రావడంతో దాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డాడు. ఓఎల్‌ఎక్స్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫొటోతో పాటు అమ్మకందారుని ఫోన్ నెంబర్ 8168232398 కలిగి ఉంది. ఆ వ్యక్తికి ఫోన్ చేయగా తాను ఆర్మీలో విశాఖపట్నంలో పనిచేస్తానని చెప్పాడు. ఇక్కడ నుంచి జమ్మూకాశ్మీర్‌కు బదిలీ అయిందని, అందుకే రూ.2 లక్షల వాహనాన్ని రూ.75 వేలకే అమ్ముతున్నానని నమ్మబలికాడు.
మొదట గూగుల్‌పే ద్వారా రూ.5 వేలు నగదు చెల్లించి, విశాఖ వచ్చి వాహనాన్ని చూసుకోవచ్చని చెప్పాడు. నగదు చెల్లించిన తర్వాత ద్విచక్రవాహనం విలువ రూ.89 వేలు ఇస్తే ఇస్తానంటూ చెప్పడంతో, వెంకటేశ్వరరావు నమ్మి మిగతా నగదును కూడా నాలుగు సార్లు గూగుల్‌పేలో చెల్లించాడు. ద్విచక్ర వాహనాన్ని ట్రాన్స్‌పోర్ట్‌లో పంపిస్తానని చెప్పి వారం అవుతున్నా పంపించలేదని, ఆర్మీ అతను ఓఎల్‌ఎక్స్‌లో ఇచ్చిన ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేస్తే ఎటువంటి స్పందన లేదని వాపోయాడు. జరిగిన ఘటనపై తాడేపల్లి ఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేసి, సైబర్‌క్రైమ్ విభాగానికి కేసు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment