Guntur Crime News
-
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి
సాక్షి, గుంటూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వట్టిచెరుకూరు వద్ద ట్రాక్టర్ బోల్తా పడిన దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రత్తిపాడు మండలం కొండేపాడు నుంచి పొన్నూరు మండలం జూపూడి ఫంక్షన్ కి ట్రాక్టర్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 30 మంది ఉన్నట్లు సమాచారం. మృతులు..మిక్కిలి నాగమ్మ, మామిడి.జాన్సీరాణి, కట్టా.నిర్మల, గరికపూడి.మేరిమ్మ, గరికపూడి.రత్నకుమారి, గరికపూడి.సుహొసినిగా గుర్తించారు. చదవండి:ఇల్లు కొనుక్కున్నా.. పట్టా వెనక్కి తీసుకోండి -
ఉద్యోగం పేరుతో రూ.కోటీ ఇరవై లక్షలు.. 40 మందికి టోకరా
పెదకాకాని: ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసగించిన ఘటన తాజాగా వెలుగు చూసింది. ఉద్యోగాల పేరుతో రూ.కోటీ ఇరవై లక్షలు మోసపోయారు. బాధితుల కథనం.. గుంటూరు జిల్లా పెదకాకాని పరిధిలోని కంతేరు అడ్డరోడ్డులో ఉన్న ఐజేఎం అపార్ట్‌మెంట్స్‌లో విజయవాడ ట్రెజరీ డిపార్ట్మెంట్లో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న దావులూరి మాల్యాద్రి నివాసం ఉంటున్నాడు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డీఎస్సీ నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చింది. కాంట్రాక్ట్ పద్ధతిలో వికలాంగ పిల్లలకు విద్యాబోధన చేస్తున్న మాత జయప్రకాష్‌రెడ్డికి దావులూరి మాల్యాద్రి పరిచయం అయ్యాడు. డీఎస్సీలో మిగిలిపోయిన పోస్టులకు సంబంధించి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. తనకు మధ్యవర్తిగా లాజర్ అనే వ్యక్తిని పరిచయం చేశాడు.. జయప్రకాష్‌రెడ్డి కాకినాడ జిల్లా, కాజులూరు మండలం, దుగ్గుదూరు గ్రామం కావడంతో ఆయన పరిచయం ఉన్న మరో ఏడుగురితో కలసి మొత్తం ఎనిమిది మంది లాజర్‌ను కలిశారు. ఒక్కొక్క పోస్టుకు రూ.3 లక్షల అవుతుందని ముందుగా అడ్వాన్స్ లక్ష చొప్పున చెల్లించాలని లాజర్ చెప్పడంతో 8 లక్షలు చెల్లించారు. ఎక్కువ మందిని చూసుకోవడం ద్వారా ఖర్చులు తగ్గుతాయని చెప్పడంతో శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రైవేటు టీచర్లుగా పనిచేస్తున్న మరో 32 మందిని పరిచయం చేశారు. 40 మంది నుంచి ఫోన్ పే, గూగుల్ పే, బ్యాంక్ అకౌంట్ ద్వారా చెల్లించారు. వారి వద్ద నుంచి దావులూరి మాల్యాద్రి, లాజరు అతడి భార్య అరుణ వసూలు చేశారు. ఏ ఒక్కరికీ ఉద్యోగం రాకపోగా అదిగో ఇదిగో వస్తుంది అంటూ కాలయాపన చేస్తున్నారు. గట్టిగా నిలదీయడంతో అందరికీ ఉద్యోగాలు వచ్చే వరకూ షూరిటీగా నోట్లు, 100 స్టాంప్ పేపరుపైనా దావులూరి మాల్యాద్రి సంతకం చేసి ఇవ్వడం జరిగింది. అనంతరం కొంతకాలానికి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో మీకు ఉద్యోగాలు ఇప్పించం, చేతనైంది చేసుకోండి అంటూ దుర్భాషలాడాడు. అలానే ఉద్యోగానికి నగదు చెల్లించిన వారిలో ఒకరైన ఎం.రాజేష్ బావ బి. వెంకటేశ్వరరావు(కానిస్టేబుల్) నిన్ను నమ్మి డబ్బులు చెల్లించాం, నీ చెక్ ఇవ్వాలని మాత జయప్రకాష్‌రెడ్డి ఇంటిపైకి వచ్చి భార్య పిల్లల్ని బెదిరిస్తున్నాడు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబితే ఆశపడి 40 మంది అభ్యర్థులు ఒక్కొక్కరూ రూ.3 లక్షల చొప్పున చెల్లించి మోసపోయామని, మాకు మా కుటుంబసభ్యులకు ప్రాణరక్షణ కల్పించాలని, మోసపోయిన నగదు ఇప్పించాలని బాధితులు పెదకాకాని పోలీసుస్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. -
చెరసాలలోకి మృగాలు.. ఏపీ అధికారిణిపై హైకోర్టు ప్రశంసలు
ఇంకా పూర్తిగా ఊహ కూడా తెలియని వయస్సు.. సరదాగా తోటి స్నేహితులతో హాయిగా ఆడుకుంటూ కాలం గడపాల్సిన చిన్నారిని 12 ఏళ్ల ప్రాయంలోనే మాయమాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి దించారు ఆ కిరాతకులు.. అంగట్లో వస్తువులా ఒకరి తర్వాత ఒకరు ఆ బాలిక విక్రయానికి తెగబడ్డారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ తిప్పుతూ వ్యభిచారం చేయించారు. ఈ వేధింపులు తాళలేక నరరూప రాక్షసుల నుంచి తప్పించుకున్న ఆ చిన్నారి ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించింది. కేసును సీరియస్‌గా తీసుకున్న అప్పటి డీఎస్పీ, ప్రస్తుత అదనపు ఎస్పీ(అడ్మిన్) కె.సుప్రజ ఈ చిన్నారికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదనే ఉద్దేశంతో అపర కాళికలా మారారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు: కేసులో ఎంత పెద్దవారు ఉన్నా పోలీసులు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. పది నెలల కాలంలో 79 మందిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఒక్కొక్కరికి 90 రోజుల నుంచి 120 రోజులపాటు రిమాండ్ విధించేలా చర్యలు చేపట్టారు. దీనిపై సుమారు 500 పేజీల ఛార్జ్ షీట్‌ను తయారు చేసి కోర్టుకు సమర్పించారు. నిందితులందరికీ శిక్ష పడటం ఖాయమని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల పనితీరును హైకోర్టు సైతం ప్రశంసించింది. ఆదిశక్తిలా ఉరికిన ఏఎస్పీ సుప్రజ వ్యభిచారం చేయిస్తున్న నిర్వాహకుల నుంచి తప్పించుకున్న బాలిక మేడికొండూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ చిన్నారి తనను తీసుకువెళ్లిన ప్రాంతాలన్నీ చెప్పినా అప్పటి స్టేషన్ అధికారులు స్పందించలేదు. దీంతో ఈ కేసును అప్పటి వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ, ప్రస్తుత గుంటూరు జిల్లా ఏఎస్పీ కె.సుప్రజకు ఉన్నతాధికారులు విచారణ బాధ్యతలు అప్పగించారు. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన ఆమె చిన్నారితో ప్రత్యేకంగా మాట్లాడారు. కేసు మూలాల్లోకి వెళ్లారు. ఆదిశక్తి అవతారంలా ముందుకురికారు. ఐదు బృందాలను ఏర్పాటు చేసి, బాలిక చెప్పిన ప్రాంతాలన్నింటిలోనూ నిఘా ఏర్పాటు చేసి వ్యభిచార గృహాల నిర్వాహకులు, విటులను పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. డీఎస్పీ నుంచి ఏఎస్పీగా పదోన్నతి పొందిన తర్వాత కూడా ఈ కేసును పూర్తిస్థాయిలో సుప్రజ చేతే విచారణ చేయించాలని హైకోర్టు ఆదేశించటంతోపాటు, కేసు ఛేదనలో ప్రతిభ చాటిన ఆమెను న్యాయస్థానం అభినందించింది. ఒక కేసు.. 80 మంది దోషులు గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీసుస్టేషన్ పరిధిలో గత ఏడాది 12 ఏళ్ల బాలికను అపహరించి, వ్యభిచార కూపంలోకి దించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బాలిక తల్లికి కోవిడ్ వచ్చి ఆస్పత్రిలో ఉన్న తరుణంలో తండ్రితో స్వర్ణ అనే మహిళ పరిచయం చేసుకుని బాలికను తనతో పంపిస్తే ఆమె బాగోగులు చూసుకుంటానని మాయమాటలు చెప్పింది. ఆ తర్వాత ఆమె మరొకరికి బాలికను విక్రయించింది. ఇలా బాలికను ఒకరి తర్వాత మరొకరు విక్రయిస్తూ చేతులు మార్చారు. వ్యభిచార కూపంలోకి దింపారు. తెలంగాణ, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, వైజాగ్, కాకినాడ, నెల్లూరు, తణుకు, రాజమండ్రి ప్రాంతాల్లో సుమారు 47 మంది వ్యభిచార గృహాల నిర్వాహకుల చేతుల్లో ఆ పసిమొగ్గ వాడిపోయింది. ఆఖరికి రాజస్థాన్–పాకిస్థాన్ బోర్డర్లో ఉన్న ఒక వ్యక్తి వద్ద నుంచి తప్పించుకున్న పాప ఎలాగో మేడికొండూరు చేరి పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో 80 మంది నిందితులుగా తేలారు. ఇప్పటికే 79 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఒకరు మాత్రం లండన్‌లో ఉండటంతో పోలీసులు లుక్ అవుట్ నోటీస్ (ఎల్ఓసీ) జారీ చేశారు. అతను ఎప్పుడు ఇండియాకి వచ్చినా అరెస్టు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. న్యాయంతో కొంత ఉపశమనం సమాజంలో కొందరు మానవమృగాల్లా వ్యవహరిస్తున్నారు. చిన్నారులపై అకృత్యాలకు తెగబడుతున్నారు. ఇది ఎంతో బాధాకరం. వికృత చేష్టలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నాం. కిరాతకులకు శిక్షలు వేయించినప్పుడు బాధిత చిన్నారులకు కొంతైనా న్యాయం చేయగలిగామన్న సంతోషం కలుగుతుంది. మేడికొండూరు కేసులోనూ సుమారు 10 నెలలు కష్టపడి చార్జిïÙటు దాఖలు చేశాం. ఆ బాలిక జీవితాన్ని నాశనం చేసిన ప్రతి ఒక్కరికీ కఠిన శిక్ష పడేలా చూస్తాం. – కె.సుప్రజ అడిషనల్ ఎస్పీ, గుంటూరు జిల్లా పసిపాపలకు న్యాయం చేసి.. సుప్రజ ఈస్ట్ డీఎస్పీగా పనిచేసిన సమయంలో కొత్తపేటలో ఐదేళ్ళ చిన్నారిపై లైంగిక దాడి చేసిన నిందితులు నేపాల్‌లో ఉంటే వారిని రప్పించి అరెస్టు చేయడంతోపాటు ప్రధాన నిందితునికి యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చేశారు. లాలాపేటలో రెండేళ్ల చిన్నారిపై 80 ఏళ్ల వ్యక్తి లైంగికదాడికి పాల్పడినప్పుడు కూడా విచారణ చేపట్టి అతనికి యావజ్జీవ శిక్ష పడేలా చేశారు. -
చిన్నారి ఉసురు తీసింది.. కుక్కలు, కోతులా? హత్యా?
సాక్షి, తాడేపల్లి (మంగళగిరి): తాడేపల్లి మండల పరిధిలోని మెల్లెంపూడి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు అదృశ్యమైన బాలుడు తమ ఇంటికి 200 మీటర్ల దూరంలో పంట పొలాల్లో ఉన్న కందకంలో మృతి చెందినట్లు స్థానికులు సోమవారం సాయంత్రం 5.30 గంటలకు గుర్తించారు. ఈ ఘటనపై మృతుడి తల్లిదండ్రులు, బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సేకరించిన వివరాల ప్రకారం... మెల్లెంపూడి ఎస్టీ కాలనీలో నివాసం ఉండే కుర్ర భగవానియా నాయక్, అమల దంపతుల రెండో కుమారుడు భార్గవ తేజ (6). ఆదివారం సాయంత్రం నుంచి తమ కుమారుడు కనిపించడం లేదంటూ తండ్రి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అనంతరం సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో బాలుడి ఇంటి పక్కనే నివాసం ఉండే నాగేశ్వరరావు అనే వ్యక్తి బహిర్భూమికి వెళ్లగా కందకంలో బాలుడి మృతదేహం కనిపించింది. దీంతో సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి కందకంలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు. బహుశా కుక్కలు కానీ, కోతులు కానీ వెంటపడటంతో కందకంలో పడి ఉంటాడని, అక్కడ బాలుడిని అవి గాయపరిచి ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై అనుమానాలు ఈ ఘటనపై కుటుంబసభ్యులు, బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరో కావాలనే బాలుడిని దారుణంగా కొట్టి చంపి ఉంటారని పేర్కొంటున్నారు. ఇంటికి 200 మీటర్ల దూరంలో కుక్కలు గాని, కోతులు గాని దాడి చేస్తే తెలియకుండా ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ అవే దాడిచేసి ఉంటే కుడి కాలు విరిగి, ఎముక బయటకు వచ్చేంత పరిస్థితి ఉంటుందా? చెయ్యి ఎందుకు విరుగుతుంది? కందకంలో పడినంత మాత్రాన అంత పెద్ద దెబ్బలు తగులుతాయా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు నార్త్‌జోన్ డీఎస్పీ దుర్గాప్రసాద్, తాడేపల్లి రూరల్ సీఐ అంకమ్మరావు, ఎస్సై వినోద్‌కుమార్ ఘటనాస్థలిని పరిశీలించి వివరాలు సేకరించారు. గుంటూరు నుంచి డాగ్ స్క్వాడ్‌ను, వేలిముద్రల నిపుణులను పిలిపించి దర్యాప్తు చేయనున్నట్టు డీఎస్పీ తెలిపారు. రెండు ఘటనల మధ్య ఏదైనా సంబంధం ఉందా? మండల పరిధిలోని వడ్డేశ్వరంలో ఈ ఏడాది ఫిబ్రవరి 11న అదృశ్యమైన బండి అఖిల్ (8), మెల్లెంపూడిలో మృతిచెందిన భార్గవతేజ కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రెండు కుటుంబాల్లో నెల రోజుల వ్యవధిలో ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారు. అందులో ఒకరు మృతిచెందగా, మరొకరి ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. వడ్డేశ్వరం బాలుడి తల్లి, మెల్లెంపూడి బాలుడి తండ్రి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు యూనివర్సిటీలో కలిసి పనిచేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో ఈ రెండు ఘటనలూ ఒకే విధంగా ఉండటంతో ఈ కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. చదవండి: సెల్‌ఫోన్ వాడొద్దన్నందుకు.. మనస్తాపంతో! పీహెచ్డీ చేసి.. కళ్లు కాంపౌండ్‌లో ‘మత్తు’ -
దారుణం: తల్లిని కడతేర్చిన కసాయి కూతురు
సాక్షి, పట్నంబజారు (గుంటూరు): కన్నతల్లిని కుమార్తె హత్య చేసిన ఘటన గుంటూరు నగరంలో చోటు చేసుకుంది. నగరంపాలెం పోలీసుల కథనం మేరకు... ఏటీ అగ్రహారం జీరో లైనులో నివసించే పూతాబత్తిని భూలక్ష్మి (58)కి కుమారుడు నాగరాజు, కుమార్తె దాసరి అలియాస్ భవనం రమాదేవి ఉన్నారు. ఆరేళ్ల కుమారుడు రాహుల్‌రెడ్డితో కలిసి రమాదేవి తల్లి వద్దే ఉంటోంది. వ్యసనాలకు బానిసగా మారిన రమాదేవి కుమారుడిని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో 25వ తేదీ రాత్రి రమాదేవి బయటకు వెళ్లడంతో కుమారుడు రాహుల్ ఆహారం తీసుకోకుండా ఏడుస్తుండటంతో తల్లి భూలక్ష్మి కుమార్తెకు ఫోన్ చేసి ఇంటి రావాలని చెప్పింది. ఇంటికి వచ్చిన తరువాత తల్లీకుమార్తెల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో రమాదేవి తల్లి భూలక్ష్మి గొంతు నులుముతుండగా నాగరాజు గమనించి, అడ్డుకుని, విడిపించాడు. అనంతరం తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. చికిత్స పొందుతూ భూలక్ష్మి మృతిచెందింది. నాగరాజు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: తరగతి గదిలో టీచర్‌పై హత్యాయత్నం భార్య కాపురానికి రావడంలేదని.. అత్తను చంపేశాడు -
‘మమ్మల్ని క్షమించండి. విడిపోయి బతకలేం’
సాక్షి, సత్తెనపల్లి: ప్రేమకు పెద్దలు అంగీకరించలేదని మనస్థాపానికి గురైన ప్రేమికులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సత్తెనపల్లి పట్టణంలోని స్వామి వివేకానంద నగర్లో సోమవారం వెలుగు చూసింది. పట్టణంలోని 14వ వార్డుకు చెందిన బోండాట ప్రదీప్తి (17) ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. పట్టణంలోని 23వ వార్డుకు చెందిన దేవళ్ల కిరణ్‌కుమార్ అలియాస్ సాయి కిరణ్‌కుమార్ (21) తాపీ పనులు చేస్తుంటాడు. గతంలో ఇద్దరి ఇళ్లూ దగ్గరగా ఉండటంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నారు. ఐదు నెలల క్రితం పెద్దలకు తెలియడంతో ఇరు కుటుంబాల పెద్దలు మందలించారు. మూడు నెలల క్రితం పట్టణ పోలీసు స్టేషన్లో యువతి తల్లి అరుణ ఫిర్యాదు చేసింది. దీంతో కిరణ్ కుమార్‌ను రాజమండ్రికి పంపారు. ఇద్దరూ దూరంగా ఉంటున్నప్పటికీ ఆదివారం రాత్రి 2.30 గంటల సమయంలో ప్రదీప్తి ఇంటి నుంచి బయటకు రాగా, కిరణ్‌కుమార్ రాజమండ్రి నుంచి వచ్చాడు. ఇదరూ కలిసి వివాహం చేసుకుని స్వామి వివేకానంద నగర్‌లోని చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ‘అమ్మ, నాన్న, అత్త, మామయ్య మమ్మల్ని క్షమించండి. మేము విడిపోయి బతకలేము.. అందుకే చచ్చి పోతున్నాం.. మా చావుకు ఎవరూ బాధ్యులు కాదు... అందుకే పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా చచ్చిపోతున్నాం.. మమ్మల్ని క్షమించండి’... అంటూ డి.సాయికిరణ్కుమార్, డి.ప్రదీప్తి పేర్లతో సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంఘటనా స్థలాన్ని సత్తెనపల్లి రూరల్ సీఐ నరసింహారావు, ముప్పాళ్ల ఎస్సై నజీర్ బేగ్‌లు సందర్శించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహేతర సంబంధం: మహిళ మృతి
సాక్షి, కాకుమాను: వివాహతేర సంబంధం నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా మహిళ మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్ఐ ఎస్.సుందర్ రాజన్ తెలిపిన వివరాల మేరకు... జిల్లాలోని యడ్లపాడు గ్రామానికి చెందిన ఉప్పరెట్ల సునీత (28) అనే మహిళకు కొంత కాలం క్రితం కానీషా అనే వ్యక్తితో వివాహమైంది. యడ్లపాడుకే చెందిన వేణుగోపాల్ అనే వ్యక్తితో సునీతకు వివాహేతర బంధం ఏర్పడింది. ఈ విషయం కుటుంబసభ్యులకు తెలిసింది. దీంతో వారి బంధం కొనసాగించేందుకు వీలు లేకపోవటంతో ఇద్దరు చనిపోవాలని నిర్ణయించుకున్నారు. కాకుమాను శివారులోకి వెళ్లి ఇద్దరూ పురుగుల మందు తాగారు. ఈ విషయాన్ని వేణుగోపాల్ ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు తెలిపాడు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకునే సమయానికి సునీత మృతి చెందగా వేణుగోపాల్ అపస్మారకస్థితిలోకి వెళ్లినట్లు తెలిపారు. సునీతకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. సునీత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు మార్చురీకి తరలించారు. వేణుగోపాల్‌ను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. కేసు దర్యాప్తు చస్తున్నారు. తాడేపల్లిరూరల్: తాడేపల్లి మండల పరిధిలోని ఉండవల్లి గ్రామంలో మరదలిపై బావ దాడి చేయడంతో, మరదలు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. జరిగిన ఈ ఘటనపై తాడేపల్లి ఎస్సై శ్రీనివాసరావు ఆదివారం కేసు నమోదు చేశారు. ఎస్సై శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం... ఆదిశేషు అనే వ్యక్తి పెన్షన్ డబ్బులు విషయంలో పెద్దకొడుకు శివశంకర్ తనకు కావాలని అడుగుతుండగా, తండ్రి మాత్రం చిన్న కొడుక్కు ఇస్తానని చెప్పాడు. దీంతో కోపం పెంచుకున్న శివశంకర్ ఇదంతా మరదలే చేస్తుందని భావించి జొన్నా గీతాసురేఖపై అసభ్యంగా మాట్లాడుతూ దాడికి పాల్పడ్డాడు. మనస్తాపం చెందిన గీతా సురేఖ ఇంట్లో ఉన్న గ్లైసిల్ మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. అది గమనించిన మామ బాధితురాలిని ఆసుపత్రికి తరలించాడు. జరిగిన ఈ ఘటనపై గీతాసురేఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. -
దారుణం: ప్రియుడిని చంపి శవాన్ని ఇంట్లోనే..
సాక్షి, గుంటూరు: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడిని హతమార్చి ఇంట్లోనే పూడ్చిపెట్టిన ఉదంతం చెరుకుపల్లిలో వెలుగు చూసింది. వివరాలు.. గుంటూరుకు చెందిన చిరంజీవి అనే వ్యక్తి కొంతకాలంగా భార్యకు దూరంగా ఉంటూ శిరీష అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో భార్యకు విడాకులు ఇచ్చి రూ. 15 లక్షలు భరణం ఇచ్చేందుకు చిరంజీవి తన మెడికల్ షాపును విక్రయించాడు. ఆ డబ్బు మీద ఆశతో శిరీష చిరంజీవిని చంపాలని నిర్ణయించుకుంది. అయితే శిరీషకు మరోకరితో కూడా వివాహేతర సంబంధం ఉంది. దీంతో అతడితో కలిసి చిరంజీవిని చంపేందుకు శిరీష పథకం రచించింది. అనుకున్నట్టుగానే ప్రియుడితో కలిసి చిరంజీవిని హతమార్చి అనంతరం మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టింది. మృతుడు తండ్రి సుబ్బారావు ఫిర్యాదుతో విషయం వెలుగులో వచ్చింది. చిరంజీవి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శిరీషతో పాటు ఆమె ప్రియుడు భానుప్రకాష్‌ను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
భర్తను ఇంట్లో పూడ్చి.. ప్రియునితో సహజీవనం
చెరుకుపల్లి(రేపల్లె): మండల కేంద్రమైన చెరుకుపల్లిలో వ్యక్తి అదృశ్యమైన కేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. మూడు నెలలుగా తన కుమారుడు బల్లేపల్లి చిరంజీవి కనిపించటం లేదని మండల కేంద్రమైన చెరుకుపల్లికి చెందిన బల్లేపల్లి సుబ్బారావు వారం రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. విచారణలో చిరంజీవి భార్య కొల్లూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో కలిసి అక్కడ సహజీవనం చేస్తున్నట్టు తెలిసింది. పోలీసులు ఆమెను విచారించగా నిర్ఘాంత పోయే విషయాలు వెలుగుచూసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. మూడు నెలల క్రితం ప్రియునితో కలిసి భర్తను హత్య చేసి చెరుకుపల్లిలో అద్దెకు ఉంటున్న ఇంట్లోనే పూడ్చి వేశారని తెలుస్తోంది. అనంతరం ఆ ఇంటికి తాళం వేసి కొల్లూరు గ్రామానికి వెళ్లి ప్రియునితో సహజీవనం చేస్తున్నట్టు తెలిసింది. చిరంజీవిని హతమార్చటంలో సహకరించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిరంజీవికి రెండో భార్య చిరంజీవి మొదటి భార్యతో వివాదం రావటంతో కోర్టులో కేసు నడుస్తోంది. ఈ సమయంలోనే ఇంటూరుకు చెందిన యువతిని ఆరేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు జన్మించాడు. చిరంజీవికి కొల్లూరులో మెడికల్ షాపు ఉండేది. ఆ సమయంలో కొల్లూరుకు చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. చిరంజీవికి స్నేహితుడిగా ఉన్న వ్యక్తితో అతని భార్య వివాహేతర సంబంధం ఏర్పరుచుకుందని తెలుస్తోంది. ఈ క్రమంలో చిరంజీవి ఇటీవల స్థలం అమ్మగా రూ.20 లక్షలు వచ్చాయని, వాటిని ఇంట్లో భద్రపరచగా, అదే రోజు ప్రియునితో కలిసి చిరంజీవిని హత్య చేసి ఆ సొమ్ముతో కొల్లూరు వెళ్లిపోయి ప్రియునితో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. కేసులో పరోక్షంగా, ప్రత్యక్షంగా సహకరించిన వారిని పోలీసులు విచారిస్తున్నారు. భయాందోళన చెందుతున్న గ్రామస్తులు చిరంజీవిని పాతిపెట్టారని భావిస్తున్న ఇంటి వద్ద పోలీసులు పహారా కాస్తుండటంతో స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గ్రామంలో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోవటంపై స్థానికులు కలవరపడుతున్నారు. త్వరలో వివరాలు వెల్లడిస్తాం దీనిపై రేపల్లె రూరల్ సీఐ బి. శ్రీనివాసరావును వివరణ కోరగా వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసును మరింత వేగవంతం చేసి దర్యాప్తు చేపడుతున్నామని, నిజానిజాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. -
లాడ్జి అండర్‌గ్రౌండ్‌లో పేకాట శిబిరంపై దాడి
గుంటూరు ఈస్ట్ : అండర్‌గ్రౌండ్‌లో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరాన్ని అరండల్‌పేట పోలీసులు ఛేదించారు. అమరావతి మెయిన్‌రోడ్డులోని ఓ లాడ్జిలో రెండో అంతస్థులోని బాత్రూము పక్కన గోడకు రధ్రం పెట్టి సెల్లార్లోకి మెట్లు ఏర్పాటు చేసుకుని బయటి వ్యక్తులు ఎవరు లోపలికి వచ్చినా కనిపెట్టలేని విధంగా జూద గృహం నిర్వహిస్తుండడాన్ని పోలీసులు చాకచక్యంగా గుర్తించారు. పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ రవీంద్ర తెలిపిన వివరాల ప్రకారం..అమరావతి రోడ్డు మెయిన్‌రోడ్డులోని డీలక్స్ లాడ్జిలో అండర్‌గ్రౌండ్‌లో రహస్యంగా పేకాట నిర్వహిస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో కస్టమర్లు ఎవరూ లేకపోయినా పలువురు లాడ్జిలోకి వెళ్లి రావడం చుట్టుపక్కల వారికి అనుమానం కలిగించింది. స్థానికులు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి సీరియస్‌గా తీసుకుని పలువురు సీఐలను బృందగా ఏర్పాటు చేసి బుధవారం దాడి చేయించారు. లోపలకు వెళ్లిన పోలీసులకు పేకాట ఎక్కడ ఆడుతుంది తెలియలేదు. ఉన్నతాధికారులకు పేకాట నిర్వహణ సమాచారం పక్కాగా ఉండడంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు లాడ్జిలోని వ్యక్తులను తమదైన శైలిలో విచారించారు. దీంతో సిబ్బంది అండర్‌గ్రౌండ్‌కు ఏర్పాటు చేసిన రహస్య ద్వారం చూపించారు. రెండో ఫ్లోర్లో బాత్రూము పక్కన చిన్న సందు పెట్టి అండర్‌గ్రౌండ్‌లో కింద హాలు ఏర్పాటు చేశారు. అండర్‌గ్రౌండ్‌లో 16 మంది పేకాట ఆడుతుండగా పోలీసులు దాడి చేశారు. కొందరు పారిపోయే ప్రయత్నం చేశారు. ముఖ్య నిర్వాహకుడు ముదనం పేరయ్య ముందుగానే పరారయ్యాడు. మిగిలిన 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వీరిలో లాడ్జి యజమాని ఉండటం గమనార్హం. వారి వద్ద నుంచి పోలీసులు రూ.1.32 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. -
యువతిని వేధిస్తున్న అధ్యాపకుడి అరెస్టు
గుంటూరు ఈస్ట్: యువతిని వేధిస్తున్న ఘటనలో ఓ అధ్యాపకుడిని అరండల్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. వివాహితుడైన ఆ అధ్యాపకుడు ప్రేమ పేరుతో గతంలో యువతిని మోసం చేసి, అరెస్టయ్యాడు. బెయిల్‌పై వచ్చి తిరిగి వేధిస్తుండడంతో పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. అరండల్‌పేట ఎస్ఐ ఎస్.రవీంద్ర కథనం మేరకు.. స్తంభాలగరువు ఎల్ఐసీ కాలనీ ఒకటో లైనుకు చెందిన చిలికా శ్రీనివాసరావు బ్రాడీపేటలో ఇంగ్లిష్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తుండేవాడు. అతడికి గతంలోనే వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. అయితే ఓ బీఈడీ కళాశాలలో చదువుతున్న ఓ యువతి శ్రీనివాసరావు వద్ద ఇంగ్లిష్ కోచింగ్ తీసుకునేది. ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను శ్రీనివాసరావు ప్రేమపేరుతో నమ్మించి నిశ్చితార్థం చేసుకుని రూ.2 లక్షలు తీసుకున్నాడు. అనంతరం తాను వివాహితుడినని చెప్పి పెళ్లికి నిరాకరించాడు. యువతిని శారీరకంగా, మానసికంగా వేధించాడు. యువతి ఫిర్యాదుతో పోలీసులు శ్రీనివాసరావును అరెస్టు చేసి రిమాండుకు పంపారు. ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చిన శ్రీనివాసరావు తిరిగి యువతిని వేధించడం మొదలు పెట్టాడు. యువతి పుట్టిన రోజునాడు కేకులు కోసి ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టడం, పెళ్లి చేసుకోవాలని వత్తిడి తెస్తున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం యువతి ఇంటికి వెళ్లి ఆమెను, ఆమె తల్లిని దుర్భాషలాడాడు. యువతికి వివాహం కాకుండా చేస్తానని బెదిరించాడు. యువతి ఫిర్యాదుతో శ్రీనివాసరావును పోలీసులు సోమవారం మరోసారి అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. -
‘ఐయామ్ 420’‘ప్రేమ’ వల వేసి..
గుంటూరు ఈస్ట్: ఇంజనీరింగ్ విద్యార్థిని నగ్న చిత్రాలను ‘ఐయామ్ 420’ పేరుతో ఇన్‌స్ట్ర్రాగామ్‌లో అప్లోడ్ చేసి.. ఆమెను బ్లాక్మెయిల్ చేసిన ఘటనలో మరో ఏడుగురు నిందితులను గుంటూరు అర్బన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితులైన వరుణ్, కౌశిక్‌లను జూన్ 27వ తేదీ అరెస్ట్ చేసిన విషయం విదితమే. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో పక్కా ఆధారాలు సేకరించి మిగిలిన నిందితుల్ని గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి సోమవారం వెల్లడించారు. (విద్యార్థిని నగ్న చిత్రాల కేసు: ఏడుగురు అరెస్ట్) ‘ప్రేమ’ వల వేసి.. ♦ ఓ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన వరుణ్ అనే విద్యార్థి ప్రేమ పేరుతో వలవేసి తన సహ విద్యార్థినిని వంచించాడు. ఆమె నగ్న వీడియో చిత్రీకరించి.. ఆమెను బ్లాక్మెయిల్ చేయడంతోపాటు తోటి విద్యార్థులకు ఫార్వార్డ్ చేశాడు. ♦ రెండో నిందితుడైన కౌశిక్ ద్వారా ఆ విద్యార్థిని నగ్న చిత్రాలు భాస్కర్, అతని ద్వారా ధనుంజయరెడ్డి, అతని నుంచి మణికంఠ, తులసీకృష్ణ, వారి నుంచి కేశవ్, క్రాంతి కిరణ్, రోహిత్ అనే విద్యార్థులకు చేరాయి. ♦ వీరిలో మణికంఠ, ధనుంజయరెడ్డి వాటిని ఆ యువతికి పంపి.. ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించారు. మిగిలిన ఐదుగురికి ఇదే విషయం చెప్పడంతో వాళ్లు కూడా ఆమెను లొంగదీసుకునే ప్రయత్నం చేశారు. ♦ వారిలో మణికంఠ అనే విద్యార్థి‘ఐయామ్ 420’ అనే పేరిట ఫేక్ అకౌంట్ తెరిచి ఇన్‌స్ట్రాగామ్ ద్వారా ఆ యువతికి చెందిన నగ్న చిత్రాలను ఆమెకే పంపి చాటింగ్ చేశాడు. ♦ ఆమెను బ్లాక్మెయిల్ చేసి రూ.50 వేల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాధితురాలు అతడి బ్యాంక్ అకౌంట్ వివరాలు పంపాల్సిందిగా కోరగా.. నిందితులు దొరికిపోతామన్న భయంతో అకౌంట్ నంబర్ పంపకుండా మిన్నకుండిపోయారు. ♦ ఆ యువత ధైర్యం చేసి తనను బ్లాక్మెయిల్ చేస్తున్న విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పక్కా సాంకేతిక ఆధారాలతో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి ల్యాప్‌టాప్, 14 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ♦ ఫేక్ అకౌంట్‌ను ఛేదించడం, సాంకేతిక ఆధారాలను సేకరించడంలో అర్బన్ టెక్నికల్ అనాలసిస్ టీమ్ ఇన్చార్జి విశ్వనాథరెడ్డి, సాంకేతిక సిబ్బంది విశేష కృషి చేశారని ఎస్పీ చెప్పారు. ♦ నిందితులపై రౌడీషీట్లు తెరుస్తామని ఎస్పీ తెలిపారు. ♦ దీనివల్ల వారిపై పోలీసుల నిరంతర నిఘా ఉంటుందని చెప్పారు. కేసును ఛేదించేందుకు కృషి చేసిన దిశ డీఎస్పీ ఎ.లక్ష్మీనారాయణ, ఎస్ఐలు కోటయ్య, బాజీ బాబులను ఎస్పీ అమ్మిరెడ్డి అభినందించారు. -
కస్టోడియనే సూత్రధారి
సాక్షి, గుంటూరు: ఈ నెల 9న గుంటూరు అమరావతి రోడ్డులోని నగరాలు సమీపంలో సెంట్రల్ బ్యాంకు ఏటీఎంలో నగదు నింపే వాహనంలో రూ.39 లక్షలు చోరీ కేసు మిస్టరీ వీడింది. ఏటీఎంలో నగదు నింపే కస్టోడియన్ నాగేంద్రబాబే చోరీకి ప్రధాన సూత్రధారిగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, రెండు బైక్‌లు, నాలుగు సెల్ఫోన్లు, రూ.39 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని అర్బన్ సమావేశ మందిరంలో ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రైటర్స్ సేఫ్ గార్డు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్రవీణ్, సొల్లా వెంకట నాగేంద్రబాబు కస్టోడియన్లుగా, భోజారావు గన్‌మెన్‌గా, ఉల్లం తిరుపతిరావు ఏటీఎంకు డబ్బు నింపే వాహనం డ్రైవర్‌గా పని చేస్తున్నారు. తిరుపతిరావు తాను ప్రయాణించిన దూరం కంటే ఎక్కువ దూరం ప్రయాణించినట్టు ట్రావెలింగ్ అలవెన్స్ పొందుతూ ఉండేవాడు. ఈ ట్రావెలింగ్ అలవెన్స్ అనుమతికి కస్టోడియన్ సంతకం పెట్టాల్సి ఉంటుంది. తప్పుడు ట్రావెలింగ్ అలవెన్స్‌పై నాగేంద్రబాబు సంతకం పెట్టడాన్ని ప్రవీణ్ వ్యతిరేకించాడు. దీంతో నాగేంద్రబాబు, తిరుపతిరావు, భోజారావు ప్రవీణ్‌తో గొడవపడ్డారు. ప్రవీణ్‌ను ఇబ్బంది పెట్టాలని... భేదాభిప్రాయాల నేపథ్యంలో ప్రవీణ్‌ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో అతను డ్యూటీలో ఉన్న సమయంలో వ్యాన్‌లో ఉన్న డబ్బు కాజేయాలని పథకం రచించారు. ఇందులో భాగంగా నాగేంద్ర తన స్వగ్రామమైన మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన రాజబోయిన వెంకట నాగశివ, కంపసాటి గంగాధర్‌లను భోజారావు, తిరుపతిరావులకు పరిచయం చేశాడు. పథకం ప్రకారం ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు నగదుతో ఉన్న వాహనం నగరాలులోని సెంట్రల్ బ్యాంకు వద్ద రోడ్డుపై నిలిపి డ్రైవర్ తిరుపతిరావు తనకు సొంత పని ఉందని ప్రవీణ్‌ను బ్యాంకులోకి తీసుకువెళ్లాడు. ఈ సమయంలో నాగ వెంకటసాయి, గంగాధర్ వ్యాన్‌లోని రూ.39 లక్షల నగదుతో ఉన్న బాక్స్‌ను చోరీ చేసి బైక్‌పై నవులూరుకు వెళ్లారు. 250 సీసీ కెమెరాలు పరిశీలించగా... చోరీ ఘటనపై రెండు ప్రత్యేక బృందాలను ఎస్పీ అప్పట్లో ఏర్పాటు చేశారు. ఈ బృందాలు అర్బన్ జిల్లాలోని 250 సీసీ కెమెరాలను పరిశీలించగా ప్రాథమికంగా నిందితులను గుర్తించిన అనంతరం, టెక్నికల్ ఆధారాలు సేకరించి నిర్ధారించారు. చోరీ జరిగిన అనంతరం నిందితులు వెళ్లిన ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా వారు వేసుకున్న దుస్తులు, వాడిన బైక్‌ను గుర్తించారు. ఈ ఆధారాల వల్ల నిందితులు ఎవరో గుర్తించడం కుదరకపోవడంతో, నిందితులు ఎక్కడి నుంచి వచ్చారనే దానిపై విచారణ సాగించారు. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాలు వెరిఫై చేయగా నవులూరు ప్రాంతంలో నిందితులు ప్రారంభమైనట్టు గుర్తించి, చోరీ అనంతరం కూడా వాళ్లు ఆ ప్రాంతానికి వెళ్లినట్టు సీసీ కెమెరాల్లో నిర్ధారణ అవడంతో ఆ కోణంలో కేసు దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా గుర్తించిన నిందితుల కాల్‌డేటా పరిశీలించగా వీళ్లు తిరుపతిరావు స్నేహితులని గుర్తించిన పోలీసులు తిరుపతిరావును అదుపులోకి తీసుకుని విచారించగా విషయాన్ని చోరీ వివరాలు వెల్లడించినట్టు సమాచారం. కేసును ఛేదించిన సిబ్బందికిఅభినందనలు కేసును త్వరగా ఛేదించి, 100 శాతం రికవరీ చేసిన నల్లపాడు పోలీసులను, సీసీఎస్, ఐటీ కోర్ సిబ్బందిని ఎస్పీ అమ్మిరెడ్డి అభినందించారు. సీఐ కె.వీరాస్వామి, ఎస్ఐలు విశ్వనాథ్, రవీంద్ర, అమరవర్థన్, ఇతర సిబ్బందికి క్యాష్ రివార్డు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ అడ్మిన్ గంగాధరం, సీసీఎస్ ఏఎస్పీ మనోహర్, డీఎస్పీలు కమలాకర్, ప్రకాశ్, బాలసుందరరావు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
వేల్పూరు(శావల్యాపురం): రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందిన ఘటన తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడెం జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి చెందిన పారా నరేంద్ర(30) స్వగ్రామంలో ఉన్న తన కూతురు జన్మదిన వేడుకల నిమిత్తం హైదరాబాద్ నుంచి బైక్‌పై వచ్చాడు. ఈ క్రమంలో కూతురు మొదట సంవత్సరం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి, తిరిగి మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు ద్విచక్రవాహనంపై బయలు దేరాడు. మార్గమధ్యంలో మిర్యాలగూడెం జాతీయరహదారిపై ప్రమాదశాత్తు బైక్ అదుపుతప్పి పడిపోవడంతో తలకు బలమైన గాయాలు అయ్యాయి. ఘటనా స్థలంలోనే నరేంద్ర మృత్యువాత పడ్డాడు. మృతుడి తల్లిదండ్రులు,బంధువులు, గ్రామస్తులు ప్రమాదం జరిగిన ఘటనా స్థలానికి చేరుకుని కన్నీటిపర్యంతమయ్యారు. మిర్యాలగూడెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అరగంటలో కిడ్నాప్ కేసు ఛేదన
తాడేపల్లిరూరల్(మంగళగిరి): యువకుడు కిడ్నాప్‌కు గురైన కేసును పోలీసులు అరగంటలో ఛేదించారు. వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా నిడమానూరు గ్రామానికి చెందిన తడపతినేని శేఖర్ అనే యువకుడు తన లారీలో ఇసుక అక్రమంగా తోలుతూ పట్టుబడ్డాడు. అధికారులు లారీని సీజ్ చేసి అపరాధ రుసుం విధించారు. ఆ మొత్తం చెల్లించేందుకు శేఖర్ నిడమానూరు గ్రామంలో ఒక కారును రెండు నెలల క్రితం అద్దెకు తీసుకుని దాన్ని తాడేపల్లిలోని రౌడీషీటర్ తొత్తుక శివకుమార్‌కు తాకట్టు పెట్టి రూ.లక్ష తీసుకున్నాడు. కారు యజమాని పలుమార్లు శేఖర్‌ను ప్రశ్నించగా తాడేపల్లిలోని ప్రాతూరు కరకట్ట వెంట ఉందని చెప్పడంతో రెండో తాళం తీసుకొని కారును తీసుకువెళ్లాడు. విజయవాడలో బంధీ... దీంతో రౌడీషీటర్ శివకుమార్ శేఖర్‌కు ఫోన్ చేసి విజయవాడకు పిలిపించి బంధించాడు. శివకుమార్‌తో పాటు అతని సోదరులైన రౌడీషీటర్లు తొత్తుక రాంబాబు, తొత్తుక సాయి, మరో రౌడీషీటర్ సతీష్ శేఖర్‌ను చిత్రహింసలు పెట్టారు. ఆ కారులో తెలంగాణ నుంచి రూ.2.50 లక్షల విలువైన మద్యాన్ని తీసుకొచ్చామని, ఖర్చులతో కలిపి మొత్తం రూ.5 లక్షలు కట్టాలంటూ బలవంతంగా పత్రాలపై సంతకం చేయించారు. అనంతరం శేఖర్ తండ్రి వెంకట్రావుకు ఫోన్ చేసి, నీ కొడుకు రూ.5 లక్షలు ఇవ్వాలి, తెచ్చి ఇవ్వకపోతే చంపేసి కృష్ణానదిలో పూడుస్తామంటూ బెదిరించారు. వెంకట్రావు డబ్బులు తీసుకుని తాడేపల్లి వచ్చి అనుమానంతో తాడేపల్లి సీఐ అంకమ్మరావును ఆశ్రయించాడు. సెల్ సిగ్నల్ ద్వారా సీఐ కిడ్నాపర్లు శేఖర్‌ను ఉంచిన స్థలాన్ని కనుగొని అందరినీ అదుపులోకి తీసుకున్నారు. అక్రమ మద్యం తరలింపు వెలుగులోకి... రౌడీషీటర్ శివకుమార్ అతని అనుచరులు తాకట్టు పెట్టుకున్న కారులో తెలంగాణ నుంచి మద్యం తరలిస్తూ తమ జేబులు నింపుకొన్నారు. చివరకు కిడ్నాప్ డ్రామాతో వీరి అక్రమ మద్యం వ్యాపారం బయటపడింది. పోలీసులు మద్యాన్ని స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నిప్పంటుకుని ఇద్దరు చిన్నారుల మృతి
బొల్లాపల్లి (వినుకొండ): ప్రమాదవశాత్తూ మంటలంటుకుని ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులు మరణించిన విషాద ఘటన గుంటూరు జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. బొల్లాపల్లి మండలం చక్రాయపాలెం గ్రామానికి చెందిన మూఢావతు బాలునాయక్‌కు ఉదయ్‌కుమార్ నాయక్, సాంబశివరావు నాయక్, రామారావు నాయక్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరు వివాహాలు చేసుకుని పక్కపక్క ఇళ్లల్లోనే నివసిస్తున్నారు. ప్రమాదం జరిగిందిలా.. ⇔ బుధవారం సాయంత్రం సాంబశివరావు నాయక్ 30 లీటర్ల పెట్రోలు క్యాను నుంచి ఐదు లీటర్లను మరో క్యానులోకి వంచుతుండగా సమీపంలో కట్టెల పొయ్యి నుంచి నిప్పులు రేగి పెట్రోలుకు అంటుకున్నాయి. ⇔ అక్కడే ఆడుకుంటున్న ఉదయ్‌కుమార్ కుమార్తె కృపాబాయి(3)కి మంటలు అంటుకునిఅక్కడికక్కడే మృతి చెందింది. ⇔ సాంబశివరావు నాయక్ కుమారుడు సియోన్ నాయక్ (ఏడాది)కు కూడా మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడ్డాడు. ⇔ సియోన్ నాయక్‌ను పిడుగురాళ్ల ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి ఆస్పత్రిలో మృతిచెందాడు. గాయపడ్డ మరో ఇద్దరుప్రమాదం జరిగినప్పుడు సమీపంలోనే ఉన్న సాంబశివరావు నాయక్ భార్య లక్ష్మీబాయి, రామారావు నాయక్ భార్య మల్లేశ్వరి బాయి స్వల్పంగా గాయపడ్డారు. కళ్ల ముందే మంటలంటుకుని తమ బిడ్డలు కాలిపోతున్నా కాపాడుకోలేకపోయామని ఉదయ్ కుమార్, ఆయన భార్య ఇస్త్రీ బాయి బోరున విలపించారు. వినుకొండ రూరల్ సీఐ ఎం.వి.సుబ్బారావు, బండ్లమోటు ఎస్ఐ జి.అనిల్‌కుమార్ ఘటనాస్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. -
గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదాలు
-
క్షణికావేశం.. విషాదంతం
రెంటచింతల(మాచర్ల): క్షణికావేశంలో భార్యాభర్తలు తీసుకున్న నిర్ణయంతో ఆ కుటుంబం ఛిన్నాభిన్నమైపోయింది. మున్నంగి నర్సింహారెడ్డి, దుర్గాభవాని దంపతులు మండల కేంద్రమైన రెంటచింతల గంధంవారి బజారు సమీపంలో నివసిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో బుధవారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు వారిని రెంటచింతల ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. భార్య దుర్గాభవాని (38) చికిత్స పొందుతూ మృతి చెందింది. భర్త నర్సింహారెడ్డి పరిస్థితి విషమించడంతో వెంటనే నర్సరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నర్సింహా రెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె అంజలికి వివాహమైంది. చిన్న కుమార్తె స్రవంతి స్థానిక వైఆర్ఎస్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. మృతురాలు దుర్గాభవాని తల్లి బిక్కిరెడ్డి విజయ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చల్లా సురేష్ తెలిపారు. -
వివాహ వేళ.. విషాద గీతిక
వివాహ మహోత్సవాన గుండెల్లో మూటకట్టుకుని వచ్చిన ఆనంద క్షణాలు రెప్పపాటులో ఆర్తనాదాలుగా మారాయి.. పెళ్లింట ఆకట్టుకున్న వివిధ వర్ణాల కట్టూబొట్టులు నెత్తుటి చెమ్మలో తడిచి ఎర్రటి రంగు పులుముకున్నాయి. బంధుమిత్రుల మధ్య సాగిన యోగక్షేమాల ముచ్చట్లు మూడు గంటలు కూడా గడవకముందే విషాదాంతమయ్యాయి. ట్రాక్టర్ వేగంతో పోటీ పడుతూ కలవరపెట్టిన కుదుపులు.. ఐదు కుటుంబాలను అంతులేని ఆవేదనతో కుదిపేశాయి. గురువారం చుండూరు మండలం చినపరిమి– కూచిపూడి మధ్య పెళ్లి ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఐదు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. వీరిలో మేమూ వస్తామంటూ మారాం చేసి మరీ ట్రాక్టర్ ఎక్కిన ఇద్దరు చిన్నారుల జీవితాలు అర్ధంతరంగా చితిపైకి చేరాయి. కళ్లెదుటే మాంసం ముద్దలుగా మారిన బిడ్డను చూసి.. తల్లిదండ్రుల కన్నపేగులు తీరని శోకంతో కమిలిపోయాయి. ఉదయాన్నే రయ్యిమంటూ సంబరంగా పొలిమేర గట్టు దాటిన పెళ్లి ట్రాక్టర్.. మధ్యాహ్నం వేళకు తన ముంగిటే చావు కేక పెట్టడంతో చినపరిమి గుండెలు వేదనతో ముక్కలయ్యాయి. తెనాలిరూరల్: వివాహ వేడుకకు వెళ్లిన వారి ఇంట విషాదం చోటుచేసుకుంది. చుండూరు మండలం చినపరిమి అంబేడ్కర్ నగర్‌కు చెందిన యువతికి తెనాలి పట్టణ చినరావూరుకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. తెనాలిలో గురువారం వివాహం జరిగింది. వేడుకకు యువతి స్వగ్రామం నుంచి ట్రాక్టర్‌పై 50 మంది తెనాలి వచ్చారు. మధ్యాహ్నం భోజనాలు ముగించుకుని అదే ట్రాక్టరులో స్వగ్రామానికి బయలుదేరారు. మరో రెండు నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంటారనగా.. చినపరిమి శివారులోని మలుపు వద్ద ఎదురుగా వస్తున్న మోటారు సైకిల్‌ను తప్పించే క్రమంలో ట్రాక్టరు ట్రక్కు రోడ్డు పక్కన కాల్వలోకి బోల్తా పడింది. దీంతో ఉన్నం పద్మ(35), గోరోజిన్నం అన్నమ్మ(40) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ గుత్తికొండ శ్యామ్ (13) మృతిచెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారిలో దగ్గుబాటి హర్షవర్దన్(9), కట్టుపల్లి నిఖిల్(7) వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన గోళ్ల నాగరాజమ్మ (34) గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలకు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె గురువారం రాత్రి మృతి చెందారు. గాయపడిన గుత్తికొండ శ్యామ్, టీ రమాదేవి, సౌజన్య, నాగలక్ష్మి, డీ వెంకటేశ్వర్లు, సంకీర్తన, ప్రకాశరావు, అద్భుత్, ఎస్తేర్‌రాణి, సుబ్బారావులను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరిలో శ్యామ్‌ను మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తీసుకెళ్లారు. మిన్నంటిన హాహాకారాలు.. ఘటనా స్థలం బాధితుల హాహాకారాలతో మిన్నంటింది. మృతి చెందిన పద్మ, అన్నమ్మ మృతదేహాలను తెనాలి వైద్యశాలకు తరలించారు. అడుతూ పాడుతూ ఉన్న తమ ముద్దుల చిన్నారులు విగత జీవులుగా మారడంతో తల్లిదండ్రులు వేదనకు అంతులేకుండా ఉంది. వైద్యశాల వద్ద మృతుల కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. మృత్యు కౌగిలిలో అమ్మమ్మ, మనవడు.. చినపరిమికి చెందిన అన్నమ్మ తన కుమార్తె ఏసుమరియమ్మను నగరం మండలం కల్లిపాలేనికి చెందిన యువకుడికి ఇచ్చి వివాహం చేసింది. వీరికి కుమార్తె, నిఖిల్ సంతానం. నాలుగు రోజుల క్రితం నిఖిల్ తన అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. ఆమెతో కలసి వివాహానికి వెళ్లాడు. తోటి పిల్లలతో అక్కడ ఆడుకుంటూ సందడి చేశాడు. తిరుగు ప్రయాణంలో అమ్మమ్మ వెంటే ట్రాక్టరులో కూర్చున్నాడు. బిడ్డకు ఎండ తగలకుండా అన్నమ్మ చీర కొంగును కప్పి రక్షణ కల్పిస్తూ వచ్చింది. అంతలోనే ప్రమాదం జరగడంతో అన్నమ్మ అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలపాలైన నిఖిల్ తెనాలి వైద్యశాలలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. తల్లడిల్లిన తల్లిదండ్రులు అంబేడ్కర్‌నగర్‌కు చెందిన దగ్గుబాటి మురళి, నాగలక్ష్మిలకు ఇద్దరు మగ పిల్లలు. వ్యవసాయ కూలీలైన వీరు పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. చిన్నవాడైన హర్షవర్దన్ నాలుగో తరగతి చదువుతున్నాడు. చలాకీగా ఉండే వాడు. ట్రాక్టరు ప్రమాదంలో చిన్నారి విగత జీవిగా మారడంతో తల్లిదండ్రుల వేదన అంతులేకుండాపోయింది. ఎమ్మెల్యే మేరుగ పరామర్శ.. ప్రమాదం గురించి తెలుసుకున్న వేమూరు ఎమ్మెల్యే డాక్టర్ మేరుగ నాగార్జున తెనాలి వైద్యశాలకు చేరుకున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. వేగంగా మలుపు తిప్పడంతోనే ప్రమాదం: సౌజన్య, క్షతగాత్రురాలు గ్రామంలో బస్టాప్‌కు సమీపంలో మలుపు వద్ద వేగంగా వెళ్లడంతోనే ప్రమాదం జరిగింది. ఎదురుగా మోటారుసైకిల్ వేగంగా వచ్చి ట్రాక్టర్‌కు తగిలింది. ఇంజిన్ మీద కూర్చున్న వారు దూకేశారు. ట్రక్కు బోల్తా కొట్టడంతో అందులో ఉన్న మాకు గాయాలయ్యాయి. పరిమితికి మించిప్రయాణం ప్రమాద సమయంలో ట్రాక్టరు ట్రాలీలో పరిమితికి మించి ప్రయాణిస్తుండటం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో యజమాని ట్రాక్టర్ శ్రీనివాసరావు ట్రాక్టర్ నడుపుతున్నాడు. ట్రాక్టర్లో సుమారు 40 మంది ఉండటంతో మలుపు తిరిగేటప్పుడు అదుపు తప్పి బొల్తా కొట్టిందని స్థానికులు అంటున్నారు. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే అక్కడికి తెనాలి డీఎస్పీ కే శ్రీలక్ష్మి సిబ్బందితో చేరుకున్నారు. చుండూరు సీఐ బీ నరసింహారావు, ఎస్ఐలు రాజేష్, జీ పాపారావు, ఇతర సిబ్బంది, స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. -
నాయనమ్మ హత్య
పట్నంబజారు(గుంటూరు): ఆస్తి కోసం నాయనమ్మను మనవడు హత్య చేసిన సంఘటన గుంటూరు నగరంలో చోటు చేసుకుంది. నగరంపాలెం పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక శ్రీనివాసరావుపేటలో ఆకుల యలమంద, అతని భార్య పద్మావతి, తల్లి సామ్రాజ్యం, నానమ్మ సుశీల (70) నివసిస్తున్నారు. ఆస్తి తన పేరున రాయాలని సుశీలను యలమంద గొడవ చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల ఆరో తేదీ రాత్రి 2.30 గంటల సమయంలో సుశీలను చీరతో ఉరి బిగిస్తుండగా ఆమె కేకలు వేసింది. ఇంటి పక్కన ఉండే నరసింహ కుటుంబ సభ్యులు వచ్చి చూడటంతో యలమంద పరారయ్యాడు. లోపలికి వెళ్లి చూడగా అప్పటికే సుశీల మృతి చెందింది. ఆస్తి రాయలేదనే కోపంతో వృద్ధురాలిని మనవడే హత్య చేసినట్లు నరసింహ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
రాయల్ ఎన్ఫీల్డ్ రూ.75 వేలకే..
తాడేపల్లిరూరల్: పట్టణ పరిధిలో నివాసం ఉండే ఓ యువకుడు ఓఎల్ఎక్స్ యాప్‌ను నమ్ముకొని నిండా మునిగి లబోదిబోమంటూ ఆదివారం తాడేపల్లి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి కథనం మేరకు... మహానాడులో నివాసం ఉండే నాగం వెంకటేశ్వరరావు అనే యువకుడు ఓఎల్ఎక్స్లో రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్రవాహనం అమ్మకానికి రావడంతో దాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డాడు. ఓఎల్ఎక్స్లో రాయల్ ఎన్ఫీల్డ్ ఫొటోతో పాటు అమ్మకందారుని ఫోన్ నెంబర్ 8168232398 కలిగి ఉంది. ఆ వ్యక్తికి ఫోన్ చేయగా తాను ఆర్మీలో విశాఖపట్నంలో పనిచేస్తానని చెప్పాడు. ఇక్కడ నుంచి జమ్మూకాశ్మీర్‌కు బదిలీ అయిందని, అందుకే రూ.2 లక్షల వాహనాన్ని రూ.75 వేలకే అమ్ముతున్నానని నమ్మబలికాడు. మొదట గూగుల్‌పే ద్వారా రూ.5 వేలు నగదు చెల్లించి, విశాఖ వచ్చి వాహనాన్ని చూసుకోవచ్చని చెప్పాడు. నగదు చెల్లించిన తర్వాత ద్విచక్రవాహనం విలువ రూ.89 వేలు ఇస్తే ఇస్తానంటూ చెప్పడంతో, వెంకటేశ్వరరావు నమ్మి మిగతా నగదును కూడా నాలుగు సార్లు గూగుల్‌పేలో చెల్లించాడు. ద్విచక్ర వాహనాన్ని ట్రాన్స్‌పోర్ట్‌లో పంపిస్తానని చెప్పి వారం అవుతున్నా పంపించలేదని, ఆర్మీ అతను ఓఎల్ఎక్స్లో ఇచ్చిన ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేస్తే ఎటువంటి స్పందన లేదని వాపోయాడు. జరిగిన ఘటనపై తాడేపల్లి ఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేసి, సైబర్‌క్రైమ్ విభాగానికి కేసు అప్పగించారు. -
కాటేసిన కాసుల వల
గుంటూరు:భర్తకు దూరమై ఒంటరిగా బతుకుతున్న ఆ మహిళ తన కొడుకును ఉన్నతంగా తీర్చిదిద్దాలని భావించింది. కానీ ఆ తల్లి ఆర్థిక పరిస్థితులు అందుకు సహకరించవని నిర్ధారించుకుంది. అప్పుల బాధలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సమయంలో ఓ వ్యభిచార గృహ నిర్వాహకురాలి ఉచ్చులో పడింది. తాను పుండైనప్పటికీ కుమారుడికి పండంటి జీవితాన్ని ఇవ్వాలని ఆకాంక్షించింది. కాసుల కోసం చీకటి గదిలో కన్నీటిని దిగమింగింది. కానీ ఆ చిల్లర డబ్బుల కోసం తానే చితిపైకి చేరుతుందని ఊహించలేకపోయింది. డబ్బులు అడిగిన నేరానికి నమ్మకంగా వ్యభిచారవృత్తిలోకి దించిన మహిళ, ఆమె భర్త, మరో వ్యక్తి కలిసి ఆమెను మట్టుబెట్టారు. కొడుకును ఉన్నతంగా చూసుకోకుండానే కాటికి పంపించారు. హతమార్చిందిలా ... విశ్వసనీయ సమాచారం ప్రకారం... పిడుగురాళ్లకు చెందిన ఓ వివాహిత మూడేళ్ల క్రితం భర్తతో ఏర్పడిన వివాదాలతో ఎనిమిదేళ్ల కుమారుడితో కలసి వేరుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. అయినా కుమారుడ్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలని భావించింది. ఏ పని చేసినా కుటుంబం గడవడానికే సరిపోవడం లేదు. ఈ క్రమంలో నరసరావుపేటలో వ్యభిచార గృహ ఓ నిర్వాహకురాలు పరిచయమైంది. ఆమె వద్దకు వెళ్లగా మూడు రోజులపాటు నరసరావుపేటలోనే ఉంచింది. ముందుగా ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వాలని సదరు మహిళ కోరింది. వ్యభిచార నిర్వాహకురాలు చెప్పినంత డబ్బులు చెల్లించకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. నిర్వహకురాలి భర్త కూడా వివాహితను దుర్భాషలాడారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వివాహిత హెచ్చరించింది. పోలీసుల వద్దకు వెళితే సమస్య వస్తుందని నిర్వాహకురాలు భయపడింది. దీంతో ఆమెను మట్టుబెట్టాలని పథకం రచించారు. ఈ ఏడాది జనవరి రెండో వారంలో డబ్బు ఇస్తామని నమ్మించి వివాహితను నరసరావుపేట పిలిపించారు. పార్టీ చేసుకుందామని నమ్మించి వ్యభిచార నిర్వాహకురాలు, ఆమె భర్త, ఓ విటుడు, వివాహితను గుత్తికొండ పరిసర ప్రాంతంలోని సాగర్ కాలువ వద్దకు తీసుకెళ్లారు. కాలువ గట్టున అందరూ మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న వివాహితను నిర్ధాక్షిణ్యంగా వ్యభిచార నిర్వాహకురాలు, ఆమె భర్త కాలువలోకి నెట్టేశారు. వివాహిత మృతి చెంది నీటిలో కొట్టుకుపోయిందని నిర్ధారించుకున్న అనంతరం అక్కడ నుంచి వెళ్లారు. గతంలోను ఇదే తరహాలో.. సుమారు పదేళ్ల కిరతం చిలకలూరిపేటలో వ్యభిచార వృత్తి నిర్వహించడానికి వచ్చిన ఓ యువతిని సదరు నిర్వాహకురాలు హత్య చేసినట్టు గుర్తించారు. చిలకలూరిపేట రూరల్ స్టేషన్లో ఈమెపై హత్య కేసు నమోదైనట్టు పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. వెలుగు చూసిందిలా... తమ కుమార్తె నరసరావుపేటకు వచ్చి ఆచూకీ లేకుండా పోయిందని జనవరి 21న మృతురాలి తల్లి, బంధువులు నరసరావుపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అప్పటికే నకరికల్లు వద్ద గుంటూరు బ్రాంచ్ కెనాల్లో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని అక్కడ పోలీసులు గుర్తించారు. దీంతో మిస్సింగ్ మిస్టరీ వీడింది. దీంతో మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చిన పోలీసులు కూపీ లాగారు. వ్యభిచార గృహ నిర్వాహకురాలు, ఆమె భర్తను అదుపులోకి తీసుకొని విచారించారు. వివాహితను తామే హతమార్చినట్లు వారు అంగీకరించారు. -
పండుగ రోజు విషాదం.. బావ, బావమరిది మృతి
పిడుగురాళ్ల రూరల్ (గురజాల): భోగి పండుగ రోజు సరదాగా ఈతకు వెళ్లిన బావ, బావ మరుదులు కాలువలో మునిగి మృతిచెందారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం వీరాపురం గ్రామానికి చెందిన వేణుగోపాల్ (22) చెన్నైలో బీటెక్ చదువుతున్నాడు. వేణుగోపాల్ మేనత్త కుమారుడు అనిల్ (18) పెదగార్లపాడులో 10వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం భోగి పండుగ నాడు బావ, బావమరిది ఇద్దరూ కలసి తంగెడ మేజర్ కాలువలో ఈతకు వెళ్లారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ గల్లంతయ్యారు. వారు ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో బంధువులు వచ్చి చూడగా బట్టలు, చెప్పులు కాలువ ఒడ్డున కనిపించాయి. దీంతో ప్రమాదం జరిగి ఉంటుందని ఆందోళనకు గురై.. గాలింపు చేపట్టగా, రెండు గంటల తర్వాత విగతజీవులుగా కనిపించారు. -
ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని ఆత్మహత్య
గుంటూరు ఈస్ట్: ప్రేమించిన వ్యక్తి తనను కాదని వేరే యువతితో వివాహానికి సిద్ధమవడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పాతగుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్హెచ్ఓ సురేష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. పాతగుంటూరు పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ కాలనీకి చెందిన యువతి ఎంబీఏ పూర్తి చేసింది. తూర్పు గోదావరి జిల్లా కె.సముద్రం మండలానికి చెందిన ఓ యువకుడు గుంటూరు నగరంలోని ఓ ఫార్మసీ కళాశాలలో నాలుగు సంవత్సరాల క్రితం బీఫార్మసీ చదువుతూ ప్రతి ఆదివారం యువతి ఇంటి సమీపంలోని చర్చికి వచ్చేవాడు. ఇద్దరి మధ్య నెలకొన్న స్నేహం ప్రేమగా మారింది. చదువు పూర్తి అయిన తరువాత యువకుడు దుబాయ్‌లో ఉద్యోగంలో చేరాడు. ఇద్దరు ఫోన్లో తరచూ మాట్లాడుకుంటూ తమ ప్రేమను కొనసాగించారు. యువకుడు ఇటీవల దుబాయ్ నుంచి సొంత ఊరికి వచ్చాడు. సమాచారం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులను తీసుకుని డిసెంబరు 26వ తేదీ యువకుడి ఇంటికి వెళ్లింది. యువకుడి తల్లిదండ్రులతో వివాహ విషయం ప్రస్తావించారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో యువకుడి తల్లిదండ్రులు వివాహం విషయం కొంతకాలం తరువాత చర్చిద్దామని చెప్పి పంపించారు. యువకుడు తన సెల్లో ప్రియురాలి నంబరు బ్లాక్ చేశాడు. అయితే ఆ యువకుడికి మరో యువతితో వివాహం నిశ్చయమైందని సమాచారం తెలుసుకున్న యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. శుక్రవారం కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో యువతి చీరతో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి సెల్ నంబరు ప్రియుడు బ్లాక్ చేయడంతో సూసైడ్ మెసేజ్ అతని ఫ్రెండ్ ఫోన్‌కు పంపింది. తన ప్రియుడు లేని జీవితాన్ని తాను ఊహించలేనని పేర్కొంది. మరో వ్యక్తిని భర్తగా అంగీకరించలేనని, ఆ కారణంగా తల్లిదండ్రులకు తాను భారమవుతానని భావించానని రాసింది. వచ్చే జన్మలోనైనా నీవు నాకు దక్కుతావా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తాను మృతి చెందిన అనంతరం మృతదేహాన్ని చూడడానికి కూడా నువ్వు రావులే అంటూ తన ఆవేదనను వెలిబుచ్చింది. పెళ్లి కానుకగా తాను కొన్న వాచీని స్వీకరించాలని అభ్యర్థిచింది. మెసేజ్ చేరిన కొంతసేపటికే తాను ప్రాణాలను విడుస్తున్నట్లు, తనను రక్షించేందుకు ప్రయత్నించినా ప్రయోజనం ఉండదని తెలిపింది. -
కాల్‌మనీ కేసులో ఇద్దరు పాత నేరస్తుల అరెస్టు
గుంటూరు ఈస్ట్: కాల్‌మనీ కేసులో గురుశిష్యులను అరెస్టు చేసిన పోలీసులు, ఇద్దరిపై రౌడీషీట్లు సైతం తెరిచారు. నిందితులపై గతంలో 9 కేసులు ఉన్నా టీడీపీ అండదండలతో రెచ్చిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘స్పందన’ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదలకు సంబంధించి పాత నేరస్తుల చరిత్రను పరిగణనలోకి తీసుకున్న అర్బన్ ఎస్పీ పి.హెచ్డి.రామకృష్ణ వారి ఆగడాలను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కాల్‌మనీ వ్యాపారులు ఇద్దరినీ లాలాపురం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. లాలాపేట పోలీస్టేషన్లో ఈస్ట్ డీఎస్పీ కె.సుప్రజ, ఎస్హెచ్ఓలు ఫిరోజ్, రాజశేఖరరెడ్డి, సురేష్ బాబు ఈ కేసు వివరాలను వెల్లడించారు. వారి కథనం మేరకు.. గుంటూరు విద్యానగర్ ఒకటో లైను ఎక్స్టెన్షన్కు చెందిన ఇమడాబత్తిని కల్యాణచక్రవర్తి అలియాస్ పప్పుల నాని లాలాపేట పరిధిలోని హజార్ వారి వీధిలో తొలుత పప్పుల వ్యాపారం చేశాడు. అనంతరం 25 ఏళ్లుగా మీటర్ వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. నెహ్రూనగర్ 4వ లైనుకు చెందిన మాజేటి శేఖర్ తొలి నుంచి పప్పుల నానికి అనుచరుడిగా ఉంటు న్నాడు. పప్పుల నాని మీటర్ వడ్డీ, వంద రోజుల వడ్డీ, రోజువారి వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. బాకీ చెల్లించని వారిని తన కార్యాలయానికి పిలిపించి బంధించి కొట్టి చెక్కులు, ప్రామిసరీ నోట్లపై అధిక మొత్తం రాయించి సంతకాలు చేయించుకుని పంపేవాడు. కొందరి వద్ద ఖాళీ నోట్లు, చెక్‌లపై సంతకాలు చేయించుకునేవాడు. కార్యాలయానికి రాని వారి ఇళ్లకు వెళ్లి దౌర్జన్యం చేసేవాడు. బాకీ వసూలు చేసే క్రమంలో వంటరిగా జీవించే మహిళలతో నాని, శేఖర్ అసభ్యంగా ప్రవర్తించారు. కొందరిని తీవ్రంగా వేధింపులకు గురిచేశారు. ఓ మహిళపై లైంగికదాడికి యత్నించడంతో కొత్తపేట స్టేషన్లో శేఖర్‌పై ఇటీవల కేసు నమోదైంది. పప్పుల నానికి ఉన్న పలుకుబడి కారణంగా అతని బారినపడిన మహిళలు పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. వడ్డీ కోసం గురుశిష్యులు పెట్టే వేధింపులను తట్టుకోలేక గతంలో కొంతమంది ధైర్యం చేసి ఆధారాలతో ఎస్పీలకు ఫిర్యాదు చేసిన సందర్భాల్లో పలు పోలీస్స్టేషన్లలో పప్పుల నానిపై ఆరు, శేఖర్‌పై మూడు కేసులు నమోదయ్యాయి. వీరు రిమాండ్‌కు వెళ్లినా వారి అనుచరులు యథావిధిగా కార్యకలాపాలను కొనసాగించేవారు. పప్పులనాని వద్ద గత మార్చి, ఏప్రిల్ నెలల్లో నెహ్రూనగర్ పదో లైనుకుచెందిన ఏలే దుర్గాప్రసాద్, అతని తండ్రి కొండయ్య మీటరు వడ్డీకి ఒకసారి రూ.50 వేలు, మరోసారి రూ.2 లక్షలు తీసుకున్నారు. రోజుకు రూ.5 వేల చొప్పున 50 రోజులు చెల్లించిన అనంతరం, చెల్లింపులు నమోదు చేసిన పుస్తకాన్ని తండ్రీకొడుకుల నుంచి నాని, శేఖర్ లాక్కున్నారు. వడ్డీకి వడ్డీ వేసి ఎక్కువ మొత్తం డిమాండు చేశారు. మొదట ఇచ్చిన ప్రామిసరీ నోట్లు పోయాయంటూ, డిసెంబర్ 28వ తేదీ తండ్రీకొడుకులను నాని, శేఖర్ తమ కార్యాలయంలోబంధించి ఆరు ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకుని వదిలిపెట్టారు. బాధితులు పోలీస్ స్పందన కార్యక్రమంలోలో ఫిర్యాదు చేయడంతో అర్బన్ ఎస్పీ పి.హెచ్.డి.రామకృష్ణ స్పందించారు. నిందితుల కార్యకలాపాలను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఇద్దరినీ అరెస్టుచేసి రూ.30,32,900 నగదు, 9 ఖాళీ ప్రామిసరీ నోట్లు, 10 ఖాళీ బ్యాంకు చెక్‌లు, రోజువారి, మీటర్ వడ్డీ లెక్కల పుస్తకాలు స్వాధీనం చేసుకునిరిమాండుకు తరలించారు. రౌడీ ఆగడాలకు అంతేలేదు పప్పుల నాని, శేఖర్ రాజకీయంగా, పోలీసుల వద్ద పలుకుబడి సంపాదించి హోల్‌సేల్ కిరాణా, ఇతర వ్యాపారులపై జులుం ప్రదర్శించే వారు. పప్పుల నాని తన దౌర్జన్య కార్యకాలాపాల కోసం వివిధ కాలనీలకు చెందిన వ్యక్తులు, యువకులను అనుచరులుగా పెట్టుకున్నాడు. ఆ అనుచరులు కిరాణా, ఫ్యాన్సీ, జ్యూస్ షాపులు, చికెన్ షాపులు, తోపుడు బండ్ల వ్యాపారుల వద్దకు వెళ్లి డబ్బులు ఇవ్వకుండానే తమకు కావాల్సినవి తీసుకెళ్లేవారు. గురుశిష్యులు ఇద్దరు గతంలో ఫోర్జరీ దస్తావేజులు పుట్టించి మోసగించేవారు. నిందితుల రోజువారీ వసూళ్లు రూ.80 వేలు. పోలీసులు వారి కార్యాలయంపై దాడి చేసినప్పుడు స్వాధీనం చేసుకున్న మొత్తం నగదుకు సంబంధించి వడ్డీకి తీసుకున్న వారి పేరుతో చీటీలు రాసి రబ్బరు బ్యాండులు వేసిన కట్టలులభించడం గమనార్హం.