
మురుగు కాల్వలో నుంచి తీసిన పసికందు మృతదేహం
సాక్షి, నరసరావుపేట: పల్నాడు రోడ్డు మురుగు కాల్వలో పసికందు మృతదేహం లభ్యమైన ఘటన మరువక ముందే ఆ ప్రాంతానికి సమీపంలో మరో పసికందు మృతదేహం మురుగు కాల్వలో కనిపించటం కలకలం రేపింది. పల్నాడు రోడ్డు పాత చెక్‌పోస్టు వీధిలోని ప్రధాన మురుగు కాల్వలో పసికందు మృతదేహం బుధవారం కొట్టుకొచ్చింది. గమనించిన స్థానికులు సమాచారాన్ని వన్‌టౌన్ పోలీసులకు అందించారు.
దీంతో ఎస్‌ఐ నాగేశ్వరరావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. సైడుకాల్వలో ఉన్న మృతదేహాన్ని వెలికి తీయించారు. నెలలు నిండని శిశువుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 20 రోజుల క్రితం పల్నాడు బస్టాండ్ ఎస్‌కేఆర్‌బీఆర్ కళాశాల ఎదుట ప్రధాన మురుగు కాల్వలో పసికందు మృతదేహాన్ని టూటౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. సమీపంలోని ప్రైవేటు వైద్యశాలల్లో అబార్షన్ చేసి శిశువును కాల్వలో పడవేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఘటన మరువక ముందే మురుగు కాల్వలో మరో పసికందు ప్రత్యక్షమవ్వటం స్థానికంగా చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment