మంత్రి పదవులెరుగని అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయ్
ఇప్పటివరకు గురజాల, మాచర్లకు దక్కని యోగం
1984లో నాదెండ్ల క్యాబినెట్‌లో సత్తెనపల్లి నుంచి నన్నపనేనికి అవకాశం.. నెల మాత్రమే పనిచేసిన రాజకుమారి
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు
గత రెండు ప్రభుత్వాల్లో చిలకలూరిపేటకు దక్కిన చాన్స్
సాక్షి, నరసరావుపేట: సార్వత్రిక ఎన్నికల ఘట్టం ముగియడంతో ప్రస్తుతం కొత్తగా కొలువుదీరే ప్రభుత్వంలో మంత్రి పదవులు ఎవరెవరికి దక్కుతాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. రాజకీయాల్లో మంత్రి పదవులకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. వాటి కోసం పోటీ పడే ఆశావహుల లిస్ట్ కూడా పెద్దదే. మంత్రి పదవుల కోసం వేయి కళ్లతో ఎదురు చూసే నాయకులతోపాటు నియోజకవర్గాలు ఉంటాయండోయ్.. నియోజకవర్గాలు ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అమాత్యయోగం లేని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పల్నాడు జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలలో ఇప్పటి వరకు గురజాల, మాచర్ల నియోజకవర్గాలకు మంత్రి పదవులు దక్కలేదు. ప్రస్తుతం కొత్త క్యాబినెట్ ఏర్పడనున్న నేపథ్యంలో ఈ దఫాలోనైనా ఆ నియోజకవర్గంలో నెగ్గిన ఎమ్మెల్యేలకు చోటు దక్కుతుందేమోనన్న చర్చ జరుగుతోంది.
👉గురజాల నియోజకవర్గం 1955లో ఏర్పడింది, అంతకుముందు ఈప్రాంతం బెల్లంకొండ నియోజకవర్గం పేరుతో ఉండేది. 1955లో కేఎల్‌పీ(కృకార్ లోక్‌పార్టీ) తరఫున గెలిచిన ఎంబీ చౌదరీ మొదలు ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం ప్రజాప్రతినిధి ఒక్కరూ మంత్రి పదవి పొందలేదు. ఈ నియోజకవర్గంలో కొత్త వెంకటేశ్వర్లు, జంగా కృష్ణమూర్తి రెండు సార్లు, యరపతినేని శ్రీనివాసరావు మూడుసార్లు గెలిచినా మంత్రి పదవి రాలేదు. తాజా ఎన్నికల్లో యరపతినేని నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈసారైనా మంత్రి పదవి వరిస్తుందేమోనన్న చర్చ గురజాలలో జరుగుతోంది. అయితే గురజాల వాసి డొక్కా మాణిక్య వరప్రసాదరావు మాత్రం తాడికొండ నియోజకవర్గం నుంచి విజయం సాధించి వైఎస్సార్ క్యాబినెట్‌లో మంత్రిగా కొనసాగారు.
👉పల్నాడు ప్రాంతంలోని మాచర్ల నియోజకవర్గం నుంచి కూడా ఇంత వరకు ఎవరూ మంత్రి పదవిని పొందలేకపోయారు. ఈ నియోజకవర్గానికో ప్రత్యేకత ఉంది. 1955 నుంచి 2009 ఎన్నికల వరకు ఏ నాయకుడూ రెండో సారి ఎమ్మెల్యేగా గెలుపొందలేదు. ఈ కారణం వల్లే మాచర్ల నుంచి మంత్రి లేరన్న వాదన ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి, అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అనర్హత వేటుకు గురై 2012 ఉప ఎన్నికల్లో రెండో సారి వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డు సృష్టించారు. 2014 ఎన్నికల్లోనూ విజయం సాధించి హ్యాట్రిక్ సాధించారు. 2019లో వరుసగా నాలుగోసారి విజయం సాధించడం, వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడంతో పిన్నెల్లికి, మాచర్లకు మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. అయితే సామాజిక సమీకరణాల నేప«థ్యంలో అది సాధ్యం కాలేదు. ప్రభుత్వ విప్‌గా పిన్నెల్లి వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో జూలకంటి బ్రహా్మరెడ్డి అధికార పార్టీ టీడీపీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన కూడా మంత్రి పదవి రేసులో ఉన్నట్టు సమాచారం. మరి అమాత్య పదవి వస్తుందేమో వేచి చూడాలి.
ఆ నియోజకవర్గాల నుంచి మంత్రులు
సత్తెనపల్లిది మాత్రం విచిత్రమైన పరిస్థితి. ఈ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి వరుసగా నాలుగు సార్లు గెలుపొందిన స్వాతంత్య్ర సమరయోధులు వావిలాల గోపాలకష్ణయ్యకూ మంత్రి పదవి దక్కలేదు. 1983లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన నన్నపనేని రాజకుమారి మాత్రం 1984లో నెలరోజులపాటు నాదెండ్ల భాస్కరరావు క్యాబినెట్‌లో మంత్రిగా కొనసాగారు. ఆ తరువాత ఏ ఒక్కరికి మంత్రి పదవి దక్కకపోవడం విశేషం. 2014 ఎన్నికల్లో మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు 924 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచినా టీడీపీ అధిష్టానం ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా స్పీకర్ పదవితో సరిపెట్టింది.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ క్యాబినెట్‌లో సత్తెనపల్లి నుంచి ప్రాతినథ్యం వహించిన అంబటి రాంబాబు జలవనరులశాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే చిలకలూరిపేట నియోజకవర్గంలో 2014 వరకు గెలిచిన ఏ అభ్యరి్థకీ మంత్రి పదవి దక్కలేదు. 2014లో నూతన రాష్ట్ర తొలి క్యాబినెట్‌లో మొట్టమొదటిసారిగా ప్రత్తిపాటి పుల్లారావును మంత్రి పదవి వరించింది. ఆ తర్వాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో విడదల రజిని మంత్రిగా చేశారు. వినుకొండ నుంచి 1967, 72 ఎన్నికల్లో గెలిచిన భవనం జయప్రద పీవీ నరసింహరావు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. పెదకూరపాడు నుంచి గెలిచిన కన్నా లక్ష్మీనారాయణ, నరసరావుపేట నుంచి కాసు బ్రహా్మనందరెడ్డి, కృష్ణారెడ్డి, కోడెల శివప్రసాద్ మంత్రులుగా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment