సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలుగుదేశం పార్టీకి తీరని శాపంలా పరిణమించిన అంతర్గత విభేదాలు ఒక వైపు..కీలక నేత వసూళ్ల పర్వం మరోవైపు పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ నేత..జిల్లాలో పలు నియోజకవర్గాల నాయకుల నుంచి చేపడుతున్న వసూళ్లు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. ‘మీకు టికెట్ ఇప్పిస్తాను, ముందు కొంత సొమ్ము తీసుకురండి’ అంటూ చెప్పిన మాటలు నమ్మి రూ.50 లక్షల నుంచి కోటి రూపా యల వరకూ ఇచ్చిన వారు కొందరు, మరి కొంత మంది దగ్గర ‘కోటి రూపాయలుంటే ఇవ్వు తర్వాత చూద్దాం’ అంటూ చేబదుళ్ల రూపంలో ఇచ్చిన వాళ్లు కొందరు..ఇలా పలువురు డబ్బులిచ్చి ఇప్పుడు టికెట్ వచ్చే అవకాశమూ లేక, డబ్బులూ వెనక్కు రాక ఆందోళనలో ఉండిపోయారు.
డబ్బు అడిగితే.. టూమెన్ కమిటీ
శింగనమలకు చెందిన ఓ మహిళా నేత ముఖ్యనేతకు అప్పు అనుకుని కోటి రూపాయలు ఇచ్చారు. కొద్దిరోజులకు తిరిగి డబ్బు అడగ్గానే సదరు నేత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ..
ఈ నియోజకవర్గంలో ద్విసభ్య కమిటీని వేశారు. దీంతో ఆ మహిళా నేత తన వర్గం నాయకుల దగ్గర తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. తాను అప్పుగా ఇచ్చానని, తిరిగి డబ్బు అడిగినందుకు తనను నియోజకవర్గంలో టికెట్‌కు దూరం చేశారని చెబుతున్నారు. టూమెన్ కమిటీ ఎవర్ని ఎంపిక చేస్తే వారినుంచి తిరిగి డబ్బు తీసుకునేందుకు రెడీ అవుతున్నారని శింగనమల టీడీపీ నాయకులు చెబుతున్నారు. టూమెన్ కమిటీలో ఉన్న ఒకరు రియల్ ఎస్టేట్‌లో చాలామందికి డబ్బు ఎగ్గొట్టినట్టు మహిళా నేత వర్గానికి
సంబంధించిన ద్వితీయ శ్రేణి నాయకులు చెబుతున్నారు.
పలు నియోజకవర్గాల్లో భారీగా దందా..
ఒక్క శింగనమల నియోజకవర్గమే కాదు..పార్టీ పదవిని అడ్డం పెట్టుకుని పలు నియోజకవర్గాల్లో వసూళ్లు చేసినట్టు తెలుగుదేశం నాయకులే వాపోతున్నారు. గుంతకల్లు, కళ్యాణదుర్గం, అనంతపురం వంటి నియోజకవర్గాల్లో కొంతమంది నుంచి రూ.30 లక్షల నుంచి రెండు కోట్ల రూపాయల వరకూ వసూళ్లు చేసినట్టు తెలిసింది. దీంతో పాటు పలువురికి ఎంపీ టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చి వసూళ్లు చేసినట్టు కూడా చర్చ జరుగుతోంది. అధిష్టానాన్ని ఒప్పించి మీకు ఎలాగైనా ఎంపీ టికెట్ ఇప్పిస్తానని సుమారు ఏడెనిమిది మందికి హామీ ఇచ్చారన్న చర్చ ఇప్పుడు టీడీపీ వర్గాల్లో ఊపందుకుంది.
మాకు టికెట్ ఇప్పించకపోతే అసలు విషయం బయటకు చెబుతామని కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. ఇప్పటికే పార్టీలో వర్గ రాజకీయాలు ప్రోత్సహిస్తూ భారీ నష్టం చేకూరుస్తున్న నేతకు చాలామంది వ్యతిరేక వర్గం తయారైంది. టికెట్లు ప్రకటించే సమయంలో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో నంటూ కేడర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment