సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఒకప్పుడు సీమ రాజకీయాల్లో పేరొందిన ఆ రాజకీయ నేతలు చంద్రబాబు పంచన చేరితే వంచనకుగురై చతికిలపడ్డారు. సైకిలెక్కి తప్పుచేశామని, బాబు నిండాముంచేశారని తెరవెనుక గగ్గోలు పెడుతున్నారు. కోట్ల.. భూమా.. గౌరు.. బుడ్డా కుటుంబాలకు చెందిన రాజకీయ నాయకులతోపాటు నంద్యాల వరదరాజులరెడ్డి, దేవగుడి ఆదినారాయణరెడ్డి ఒకప్పుడు కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీలో బలమైన నేతలు. బలమైన రాజకీయ నేపథ్యం వారి సొంతం.
చంద్రబాబు కల్లబొల్లి మాటలు నమ్మి టీడీపీలో చేరితే ‘సీమ’ రాజకీయాల్లో తెరమరుగయ్యే స్థితికి చేరారు. చంద్రబాబును నమ్మి వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన మరికొంతమంది కనీసం టికెట్ దక్కించుకోలేక మోసపోయారు. వీరిలో కొందరు తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరారు. చంద్రబాబు మోసం గ్రహించి ‘సీమ’లో టీడీపీ పని ఖతమైందని తెలుసుకున్న కొందరు.. ఆ పార్టీలో ఉండి ఓడిపోవడం కంటే మౌనంగా ఉండటం మంచిదనే నిర్ణయానికి వచ్చారు. ఈసారి తాము కోరిన టికెట్ ఇవ్వకపోతే పోటీనుంచి తప్పుకోవాలనే భావనలో మరికొందరు ఉన్నారు.
కోట్ల కోటకు బీటలు
కర్నూలు జిల్లాలో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, భూమా నాగిరెడ్డి, బుడ్డా వెంగళరెడ్డి కుటుంబాలు ‘సీమ’ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేవి. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి తనయుడు సూర్యప్రకాశ్‌రెడ్డి కేంద్రమంత్రిగా చేశారు. భూమా నాగిరెడ్డి జిల్లాలో బలమైన నేతగా ఉండేవారు. 2014లో సూర్యప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ తరఫున కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆపై చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా కోట్ల, ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన సతీమణి సుజాతమ్మ పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీలో చేరడమే కోట్ల కుటుంబం చేసిన తప్పిదమని, దీంతోనే గెలుపు దక్కడం లేదనే భావన ఆయన అనుచరవర్గంలో ఉంది. ఈ దఫా కూడా ఎంపీగా గెలవలేమని కోట్ల భావిస్తున్నారు. అందుకే ఎమ్మిగనూరు టికెట్ ఆశించగా.. డోన్ ఎంచుకోవాలని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. అక్కడ బరిలోకి దిగితే ఓటమి తప్పదని కోట్ల భయపడుతున్నారు.
భూమా కుటుంబం తంటాలు
వైఎస్సార్‌సీపీ నుంచి 2014లో నంద్యాల, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలుగా గెలిచిన భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియలు అనంతర పరిణామాల్లో టీడీపీలో చేరారు. ఆ తర్వాత నాగిరెడ్డి మృతి చెందారు. అఖిలప్రియ టీడీపీ తరఫున 2019లో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయింది. దీంతో పార్టీ మారి తప్పుచేశామనే చర్చ అఖిల కుటుంబంలో జరిగింది. ఆమె కుటుంబీకులు కూడా దూరమయ్యారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికి ఈ సారి మొండిచేయి చూపారు. అతని స్థానంలో ఫరూక్‌కు టికెట్ ఖాయమైంది. ఆళ్లగడ్డలో కూడా అఖిలకు కాకుండా పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ ఇస్తారని సమాచారం. ఇదే జరిగితే పోటీ నుంచి భూమా కుటుంబం పూర్తిగా వైదొలిగినట్లే..
నమ్మితే నిండాముంచారు
శ్రీశైలం, పాణ్యం, జమ్మలమడుగు ఎమ్మెల్యేలుగా గెలిచిన బుడ్డా రాజశేఖరరెడ్డి, గౌరు చరిత, దేవగుడి ఆదినారాయణరెడ్డిలు కూడా 2014 తర్వాత టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వీరికి ఘోర ఓటమి తప్పలేదు. వైఎస్సార్‌సీపీలో ఎమ్మెల్యేగా గెలిచిన బుడ్డా.. రాజకీయ భవిష్యత్ ఇచ్చిన పార్టీని కాదని చంద్రబాబును నమ్మడంతో 2019లో ఓటమి తప్పలేదు. ఇప్పుడు అసలు టికెట్ దక్కని పరిస్థితి నెలకొంది.
గౌరు వెంకటరెడ్డి కుటుంబానికి వైఎస్ చేసిన మేలు అందరికీ తెలిసిందే.. జగన్మోహన్రెడ్డిని కాదని టీడీపీలో చేరితే 2019లో ఓడిపోయారు. ఈ దఫా కూడా వీరు గెలిచే పరిస్థితి లేదు. మరోవైపు జమ్మలమడుగు ఎమ్మెల్యే కడప ఎంపీగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఐదుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2019లో అతనికి టికెట్ కూడా ఇవ్వలేదు.
అంతర్మథనంలో నేతలు
రాయలసీమలో అత్యంత బలంగా వైఎస్సార్‌సీపీ ఉంది. 52 అసెంబ్లీ స్థానాల్లో 49 చోట్ల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో బలహీనంగా ఉన్న టీడీపీలో కొనసాగినా రాజకీయ భవిష్యత్తు ఉండదనే భావనకు వచ్చారు. చంద్రబాబు మోసపూరిత వైఖరిపై ప్రజలతో పాటు సొంత పార్టీలోని నేతలకు కూడా స్పష్టత వచ్చింది. ప్రత్యామ్నాయం లేక టీడీపీలో కొనసాగుతున్నామని, ఏ ఆప్షన్ ఉన్నా వెంటనే సైకిల్ దిగి వెళ్లిపోతామని ఈ నేతలంతా తమ అనుచరులతో చెబుతున్నారు.
కల్లబొల్లి మాటలు నమ్మి వెళ్తే..
2014లో వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచి టీడీపీలో చేరిన వారిలో కర్నూలు, కోడుమూరు, కదిరి, బద్వేల్ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, మణిగాంధీ, అత్తర్ చాంద్‌బాషా, జయరాములు ఉన్నారు. వీరికి 2019 ఎన్నికల్లో చంద్రబాబు టికెట్ ఇవ్వలేదు. దీంతో మోహన్‌రెడ్డి, మణిగాంధీ తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరారు. చంద్రబాబును నమ్మినందుకు చాంద్‌బాషా, జయరాములు పూర్తిగా రాజకీయ భవిష్యత్ కోల్పోయారు.
కర్నూలు, నంద్యాల ఎంపీలు బుట్టా రేణుక, ఎస్పీవై రెడ్డి కూడా వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలో చేరారు. ఇద్దరికీ చంద్రబాబు టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో బుట్టా రేణుక 2019 ఎన్నికలకు ముందే తిరిగి సొంత పార్టీలో చేరారు. చంద్రబాబును నమ్మి మోసపోయానంటూ ఎస్పీవై రెడ్డి జనసేన తరఫున నంద్యాల ఎంపీగా, అల్లుడు సజ్జల శ్రీధర్‌రెడ్డి నంద్యాల ఎమ్మెల్యేగా, కుమార్తె సుజల శ్రీశైలం నుంచి, మరో కుమార్తె అరవిందరాణి బనగానపల్లి నుంచి పోటీ చేశారు. ఇలా వీరంతా చంద్రబాబును నమ్మి మోసపోయినవారే. చంద్రబాబును నమ్మి మోసపోయానని ఎస్పీవై రెడ్డి 2019లో బహిరంగ ప్రకటన కూడా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment