Singanamala Assembly Constituency
-
శ్రావణి వర్సెస్.. పల్లా చెంతకు శింగనమల పంచాయితీ
అనంతపురం, సాక్షి: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక.. టీడీపీలో వర్గ విబేధాలు నెమ్మదిగా బయటకొస్తున్నాయి. శింగనమల నియోజకవర్గంలో వర్గపోరు అయితే తారాస్థాయికి చేరింది. స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణి వర్సెస్ టూమెన్ కమిటీగా ఆధిపత్య పోరు నడుస్తోందక్కడ. నియోజకవర్గంలో రేషన్ షాపుల్ని చేజిక్కించుకోవాలని ఎమ్మెల్యే శ్రావణి వర్గం తీవ్రంగా యత్నిస్తోంది. అయితే.. దానికి టీడీపీ టూమెన్ కమిటీ అడ్డు తగిలింది. ఆ వ్యవహారం మొత్తం తమ చేతుల్లోకి తీసేసుకుంది. దీంతో అధికారం ఎమ్మెల్యే చేతుల్లో ఉందా?.. లేదంటే ఆ కమిటీ చేతుల్లో ఉందా? అని శ్రావణి వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. దళిత ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించే చోట కావాలనే కమిటీకి అధికారం కట్టబెట్టారా? అని అధిష్టానాన్ని నిలదీస్తున్నారు. అయితే.. శ్రావణిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన టైంలోనే కొందరు సీనియర్లు ఆమె ఎంపికను బహిరంగంగా వ్యతిరేకించారు. అందుకు సంబంధించిన ఓ వీడియో సైతం వైరల్ అయ్యిది. ఆ తర్వాత చంద్రబాబు ఆదేశాలతో వాళ్లంతా సైలెంట్ అయినప్పటికీ.. ఇప్పుడు ఈ రకంగా తమ రివెంజ్ తీర్చుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు.. టూమెన్ కమిటీ తనకు తలనొప్పిగా తయారైందని భావించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి.. విషయాన్ని టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో శింగనమల నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
సామాన్యులే మాన్యులు: మొన్న ఉపాధి కూలీ.. నేడు డ్రైవర్
కూలీలు జీవితాంతం కూలీలుగానే ఉండాలా.. యజమానులుగా ఎదగొద్దా? బోయీలు.. తరతరాలు పల్లకీపై మోస్తూనే ఉండాలా.. వాళ్లకు పల్లకీ ఎక్కే అవకాశం రాదా ? రానివ్వరా? లారీ డ్రైవర్ ఓనరు కాడా అన్నట్లుగా నిరుపేదలు. అసలు పూట గడవడమే కష్టం అని భావిస్తున్నవాళ్లకు చట్టసభల్లో పోటీ చేసే అవకాశం రావడం అంటే ? వామ్మో ఇది ఊహిస్తేనే ఆశ్చర్యం కలుగుతుంది.. అది నిజంగా జరిగితే? నిజంగా మనకళ్లముందే జరిగితే.. ఆ అద్భుతం చూడగలమా.. చూద్దాం.. ఎన్నికలు అంటేనే లక్షలు కోట్లు పంచాల్సిన పరిస్థితి. అలాంటిది ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రోజు కూలీలకు రావడమా? అంత గొప్ప మనసు ఉన్న మారాజెవరు.. వాళ్లకు టిక్కెట్లిచ్చి ప్రజల్లోకి పంపే మహా నాయకుడెవరు..? ఇంకెవరు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డే. గతంలో ఎంతోమంది సాధారణ కార్యకర్తలకు చట్టసభల్లో స్థానం కల్పించిన సీఎం జగన్ ఈసారి కూడా అదే ఒరవడి కొనసాగించారు. 2019 ఎన్నికల్లో అరకు ఎంపీగా గెలిచినా గొట్టేటి మాధవి.. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ వంటి ఎంతోమంది అత్యంత సాధారణమైన కార్యకర్తలు.. ఉండడానికి సరైన ఇల్లే లేని పరిస్థితి.. జీవనానికి ఏదో ఒక ఉద్యోగం చేసుకునే స్థితి.. కానీ వాళ్ళను గుర్తించి తన ప్రతినిధులుగా ప్రజల్లోకి పంపించి వాళ్లకు ఏకంగా ఢిల్లీ సభలో కూర్చోబెట్టారు. ఇదే ఒరవడి మొన్నటి స్థానికసంస్థల ఎన్నికల్లోనూ కొనసాగించి ఎంతోమంది పేదలు చివరకు వాలంటీర్లను సైతం సర్పంచులు, ఎంపీపీలుగా గెలిపించారు. ఇక ఇప్పుడు కూడా సింగనమల ఎమ్మెల్యేగా వీరాంజనేయులుకు అవకాశం ఇచ్చారు. అయన జీవనం కోసం టిప్పర్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు.. జగనన్న నిన్ను ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇస్తున్నారు అని చెప్పగానే... హహ.. భలే జోక్ అనుకున్న అయన నిజం అని తెలుసుకుని షాకయ్యారు. నేను పార్టీలో సాధారణ కార్యకర్తను. అలాంటి నన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయించడం అంటే నాలాంటి పేదలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడమే. శక్తివంచన లేకుండా పని చేసి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం ముందు నిలబడతాను అంటున్నారు అయన. ఇదే తరహాలో మడకశిర నుంచి ఈర లక్కప్ప అనే ఉపాధిహామీ కూలీని ఎమ్మెల్యేగా నిలబెట్టారు. అప్పుడెప్పుడో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వచ్చిన ఇందిరమ్మ ఇల్లు అనే చిన్న నివాసంలో ఉంటున్న లక్కప్ప కూడా తాను ఎమ్మెల్యే అభ్యర్థిని అంటే ముందు నమ్మలేదు.. ఇప్పుడు ఆయనే మెడలో కండువా వేసుకుని జగనన్న ప్రతినిధిని అంటూ ఊరూరా తిరుగుతున్నారు. జగనన్న తెచ్చిన సంక్షేమ అభివృద్ధి పథకాలే తమను గెలిపిస్తాయి అని వాళ్ళు నమ్ముతున్నారు. మాలాంటి వాళ్ళం సర్పంచులం కావడమే గగనము. అలాంటిది మమ్మల్ని ఎమ్మెల్యేలుగా చేస్తున్నారంటే పేదలు పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు అంటే జగనన్నకు ఎంత మక్కువ అని వాళ్ళే అబ్బురపడిపోతున్నారు. డబ్బుంటేనే టిక్కెట్.. లేదంటే వెళ్లండమ్మా చంద్రబాబు రాజకీయాల్లోకి రాకముందు సాధారణ కార్యకర్తలే రాజకీయాలు చేసేవాళ్ళు. కానీ ఆయనొచ్చాక ఓటుకు ఇంత అని రేటుపెట్టి మరీ కొనుగోలు చేయడం మొదలెట్టి.. ఎన్నికలను బాగా ఖరీదు వ్యవహారంలా చేసారు.. నీకు ఎమ్మెల్యే టిక్కెట్ కావాలా? ఎంత ఉంది? ఎన్ని కోట్లు ఖర్చు చేస్తావ్.. ఎన్నికోట్లు పార్టీకి ఇస్తావు అనే మాట తరచూ చంద్రబాబు నోట వస్తుంది. కోట్లున్నవాళ్లకే తప్ప ప్రజల్లో ఉన్నవాళ్లు ఎవరికీ టీడీపీ టికెట్లు దక్కడంలేదు.. దీంతో టీడీపీ నాయకులంతా కోటీశ్వరులే అని వేరే చెప్పక్కర్లేదు. ఎంపీ.. ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ.. రాజ్యసభ ఇలా ఏ పదవికి అయినా వందలకోట్లు పెట్టాల్సిన పరిస్థితి చంద్రబాబు తీసుకొచ్చారు. దానికితోడు ఎన్నికల్లో ఇన్నికోట్లు ఓటర్లకు పంచాలి. గెలిస్తే అంతకంతా రికవర్ చేస్తావులే..రకరకాలుగా దోచుకునేందుకు నేనే ఆద్యమార్గాలు చూపిస్తాను అని కూడా చంద్రబాబు హింట్ ఇస్తున్నారు.. నాడు హైటెక్ సిటీ భూముల దగ్గర్నుంచి అమరావతీ రాజధాని భూముల దోపిడీ వరకూ చంద్రబాబు పాత్ర ఉంది అంటే ఇదే కారణం. పార్టీ నాయకులను భూములమీదకు ఉసిగొల్పి వాటిని ఎలా కాజేయాలా అనేది కూడా ఆయనే సలహా ఇస్తుంటారు. ఇక ఇప్పుడు సీఎం వైయస్ జగన్ ఐతే రాజకీయాలకు కొత్త భాష్యం చెబుతూ పేదలు.. సాధారణ కార్యకర్తలు సైతం ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చని నిరూపించడమే కాకుండా తన విలువలను ...కొనసాగిస్తూ ఈసారి కూడా మామూలు కార్యకర్తలకు టిక్కెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. ///సిమ్మాదిరప్పన్న/// -
బండారు శ్రావణికి మొండిచేయేనా?
తెలుగుదేశం పార్టీలో దళిత నేతల పరిస్థితి దయనీయంగా మారింది. ఎమ్మెల్యే సీటు అడిగితే అవమానాలు ఎదురవుతున్నాయి. అనంతపురం జిల్లాలో ఓ దళిత మహిళా నేతను తెలుగుదేశం పార్టీ అవమానించటమే దీనికి నిదర్శనం.మొన్నటిదాకా నియోజకవర్గ బాధ్యతలన్నీ మీవేనని చెప్పి.. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి.. ఇప్పుడు ఆమె ఎవరో తెలీదన్నట్లుగా పార్టీ పెద్దలు వ్యవహరించటం పచ్చ పార్టీ లో దుమారం రేపుతోంది. అంతే కాదు పలువురు దళిత మాజీ మంత్రుల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా తయారైంది. రాజకీయ నేత పేరు బండారు శ్రావణి.. అనంతపురం జిల్లా శింగనమల ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం లో రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు ..ఓటమి తర్వాత కూడా శింగనమల టీడీపీ ఇంఛార్జి గా ఈ మహిళా దళితనేత బాధ్యతలు నిర్వహించారు. ఈమె నుంచి టీడీపీ పెద్దలు కోట్ల రూపాయలు లబ్ధి పొందినట్లు ఆ పార్టీ లోనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి బండారు శ్రావణి పోటీకి సిద్ధం అవుతున్నారు. ఈ తరుణంలో దళిత మహిళా నేతను అవమానించేలా టీడీపీ పెద్దలు ఈ మధ్యనే ఓ ప్రకటన విడుదల చేశారు. అసలు బండారు శ్రావణి శింగనమల టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి కాదని టీడీపీ జోనల్ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మీడియా సమావేశం లో పేర్కొన్నారు. ఇక్కడ పార్టీ వ్యవహారాలన్నీ టూమెన్ కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు చూసుకుంటారని స్పష్టం చేశారు. చంద్రబాబు చేయించిన ఈ ప్రకటనతో దళిత నేతలు రగిలిపోతున్నారు. ఎస్సీ రిజర్వ్ డ్ స్థానం లో పెత్తనం అంతా అగ్రవర్ణాలకు చెందిన నేతలకు ఎందుకు అప్పగించారో చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నియోజకవర్గ ఇంచార్జి పదవి.. టిక్కెట్ ఎవరికి ఇవ్వాలనే విషయంలో దళితులకు ప్రాధాన్యత ఇవ్వకుండా పెత్తందార్లకు ఇవ్వడం దారుణమని టీడీపీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. టీడీపీ అధిష్టానం తాజా ప్రకటన తో బండారు శ్రావణి ఆత్మరక్షణలో పడ్డారు. తన భవితవ్యం ఏమిటో చంద్రబాబు వద్దే తేల్చుకునేందుకు సిద్ధం అవుతున్నారు. తెలుగుదేశం పార్టీలో దళిత నేతలు పార్టీ అధినేత చంద్రబాబు తీరుపై రగిలిపోతున్నట్టు సమాచారం. పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నేతలకు సీట్లు అడిగితే సీటివ్వకపోగా, అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా.. అవమానాలకు గురిచేస్తున్నారని వారు మదనపడుతున్నారు. దళిత మాజీ మంత్రులతో కాళ్లు మొక్కించుకుని చంద్రబాబు దళితులను హీనాతి హీనంగా చూస్తున్నారని టీడీపీలోని దళిత నేతలంతా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మాజీ మంత్రి కొత్తపల్లి జవహార్ ఎన్నికల్లో తన సీటు కోసం చంద్రబాబు కాళ్లు పట్టుకుని వేడుకోవాల్సి వచ్చిన విషయం తెలిసిందే. చంద్రబాబుతో మాట్లాడటానికి ఎన్ని సార్లు అపాయింట్మెంట్ కోరినా జవహర్‌కి దక్కలేదు. చివరికి ఇటీవల విజయవాడ వచ్చిన చంద్రబాబుకి ఎయిర్‌పోర్ట్‌లో ఎదురు వెళ్లి కాళ్లకి మొక్కారు జవహర్ . చంద్రబాబు కేబినెట్లో పనిచేసిన మరో దళిత మంత్రి రావెల కిశోర్ బాబు కూడా ఇటీవల టిడిపిలో దళిత నేతలకు జరుగుతున్న అవమానాలపై ఆగ్రహించారు. చంద్రబాబు, ఆయన సామాజికవర్గం నేతలు కొందరు దళితుల మీద పెత్తనం చేస్తున్నారని చివరాఖరికి చంద్రబాబు కేవలం తన సామాజికవర్గ నేతలకే మద్దతిస్తారని మండిపడ్డ విషయం తెలిసిందే. కాళ్లు మొక్కినా తమకు సీట్లు రావడం లేదని ఆవేదన చెందారు. చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేసిన పీతల సుజాత పరిస్థితి కూడా అంతే. పీతల సుజాత చింతలపూడి సీటు ఆశిస్తున్నారు. గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈమెకు ఇప్పుడు చింతలపూడి సీటు రాకుండా ఇక్కడ కూడా టిడిపి పెత్తందారులే అడ్డుపడుతున్నారని ఆమె వర్గీయులు రగిలిపోతున్నారు. దళితులకు ఎందుకు రాజకీయాలని ఓపెన్‌గానే చెప్పిన చింతమనేని ప్రభాకర్ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి తన చెప్పు చేతుల్లో ఉండేవాళ్లే కావాలని పట్టుబడుతున్నట్టు సమాచారం. . పీతల సుజాత తన మాట విననందుకే టిక్కెట్ రాకుండా చింతమనేని అడ్డుకున్నాడట. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది టిడిపి దళితనేతల పరిస్థితి ఆ పార్టీలో దయనీయంగా మారింది. వాడుకోవడం వదిలించుకోవడం చంద్రబాబు నైజమనే విషయం తెలిసినా సరే ఆ పార్టీలో కొనసాగడం వల్లనే తమకు ఈనాడు ఈ దుస్థితి వచ్చిందని వారు ఆవేదన చెందుతున్నట్టు తెలుస్తోంది. -
వసూళ్లు ‘కాలువై’ పారాయి
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలుగుదేశం పార్టీకి తీరని శాపంలా పరిణమించిన అంతర్గత విభేదాలు ఒక వైపు..కీలక నేత వసూళ్ల పర్వం మరోవైపు పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ నేత..జిల్లాలో పలు నియోజకవర్గాల నాయకుల నుంచి చేపడుతున్న వసూళ్లు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. ‘మీకు టికెట్ ఇప్పిస్తాను, ముందు కొంత సొమ్ము తీసుకురండి’ అంటూ చెప్పిన మాటలు నమ్మి రూ.50 లక్షల నుంచి కోటి రూపా యల వరకూ ఇచ్చిన వారు కొందరు, మరి కొంత మంది దగ్గర ‘కోటి రూపాయలుంటే ఇవ్వు తర్వాత చూద్దాం’ అంటూ చేబదుళ్ల రూపంలో ఇచ్చిన వాళ్లు కొందరు..ఇలా పలువురు డబ్బులిచ్చి ఇప్పుడు టికెట్ వచ్చే అవకాశమూ లేక, డబ్బులూ వెనక్కు రాక ఆందోళనలో ఉండిపోయారు. డబ్బు అడిగితే.. టూమెన్ కమిటీ శింగనమలకు చెందిన ఓ మహిళా నేత ముఖ్యనేతకు అప్పు అనుకుని కోటి రూపాయలు ఇచ్చారు. కొద్దిరోజులకు తిరిగి డబ్బు అడగ్గానే సదరు నేత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ నియోజకవర్గంలో ద్విసభ్య కమిటీని వేశారు. దీంతో ఆ మహిళా నేత తన వర్గం నాయకుల దగ్గర తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. తాను అప్పుగా ఇచ్చానని, తిరిగి డబ్బు అడిగినందుకు తనను నియోజకవర్గంలో టికెట్‌కు దూరం చేశారని చెబుతున్నారు. టూమెన్ కమిటీ ఎవర్ని ఎంపిక చేస్తే వారినుంచి తిరిగి డబ్బు తీసుకునేందుకు రెడీ అవుతున్నారని శింగనమల టీడీపీ నాయకులు చెబుతున్నారు. టూమెన్ కమిటీలో ఉన్న ఒకరు రియల్ ఎస్టేట్‌లో చాలామందికి డబ్బు ఎగ్గొట్టినట్టు మహిళా నేత వర్గానికి సంబంధించిన ద్వితీయ శ్రేణి నాయకులు చెబుతున్నారు. పలు నియోజకవర్గాల్లో భారీగా దందా.. ఒక్క శింగనమల నియోజకవర్గమే కాదు..పార్టీ పదవిని అడ్డం పెట్టుకుని పలు నియోజకవర్గాల్లో వసూళ్లు చేసినట్టు తెలుగుదేశం నాయకులే వాపోతున్నారు. గుంతకల్లు, కళ్యాణదుర్గం, అనంతపురం వంటి నియోజకవర్గాల్లో కొంతమంది నుంచి రూ.30 లక్షల నుంచి రెండు కోట్ల రూపాయల వరకూ వసూళ్లు చేసినట్టు తెలిసింది. దీంతో పాటు పలువురికి ఎంపీ టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చి వసూళ్లు చేసినట్టు కూడా చర్చ జరుగుతోంది. అధిష్టానాన్ని ఒప్పించి మీకు ఎలాగైనా ఎంపీ టికెట్ ఇప్పిస్తానని సుమారు ఏడెనిమిది మందికి హామీ ఇచ్చారన్న చర్చ ఇప్పుడు టీడీపీ వర్గాల్లో ఊపందుకుంది. మాకు టికెట్ ఇప్పించకపోతే అసలు విషయం బయటకు చెబుతామని కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. ఇప్పటికే పార్టీలో వర్గ రాజకీయాలు ప్రోత్సహిస్తూ భారీ నష్టం చేకూరుస్తున్న నేతకు చాలామంది వ్యతిరేక వర్గం తయారైంది. టికెట్లు ప్రకటించే సమయంలో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో నంటూ కేడర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
వైఎస్సార్ సీపీ నాలుగో జాబితా.. సంపూర్ణ సామాజిక న్యాయం
సాక్షి, అమరావతి: సంపూర్ణ సామాజిక న్యాయం, ప్రజాదరణే గీటు రాయిగా 8 శాసనసభ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానానికి పార్టీ సమన్వయకర్తలను నియమిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగో జాబితాను ఖరారు చేశారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సమస్యలను ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ పరిష్కరిస్తూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను సమర్థంగా ముందుకు తీసుకెళ్లి ప్రజల మన్ననలు అందుకొన్న నేతలకు పెద్దపీట వేశారు. సామాజిక న్యాయంలో మరో రెండడుగులు ముందుకేశారు. గురువారం రాత్రి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ వివరాలను ప్రకటించారు. గత నెల 11న 11 శాసనసభ స్థానాలకు, ఈ నెల 2వతేదీన 24 శాసనసభ, 3 లోక్‌సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను నియమిస్తూ జాబితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే ఈ నెల 11న విడుదల చేసిన మూడో జాబితాలో 15 శాసనసభ, 6 లోక్‌సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను నియమించారు. మొత్తం నాలుగు జాబితాలతో కలిపి 58 శాసనసభ, 10 లోక్‌సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను ప్రకటించారు. 58 మంది సమన్వయకర్తల్లో ఎస్సీలు 21 మంది, ఎస్టీలు ముగ్గురు, బీసీలు 17 మంది, మైనార్టీలు నలుగురు, అగ్రవర్ణాలకు చెందిన వారు 13 మంది ఉన్నారు. పది లోక్‌సభ స్థానాల సమన్వయకర్తల్లో బీసీలు ఆరుగురు, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ఓసీ ఒకరు చొప్పున ఉన్నారు. సామాజిక సమీకరణాలు, స్థానిక అంశాలు.. వైనాట్ 175 లక్ష్యంతో దూసుకెళుతున్న వైఎస్సార్సీపీ వ్యూహాత్మకంగా మరో ముందడుగు వేసింది. సామాజిక సమీకరణలు, స్థానిక రాజకీయ అంశాల మేలు కలయికగా తాజాగా నాలుగో జాబితాను ప్రకటించింది. ప్రజలకు మరింత మేలు చేయడం, పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా సమన్వయకర్తలను నియమించింది. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా వరుసగా గెలుస్తూ 2019 నుంచి ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్‌శాఖ మంత్రిగా ఉన్న సీనియర్ నేత కె.నారాయణ స్వామిని చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. 2019లో చిత్తూరు ఎంపీగా గెలిచిన ఎన్.రెడ్డెప్పను జీడీ నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఖరారు చేసింది. ఇక అనంతపురం జిల్లా శింగనమల అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎం.వీరాంజనేయులు, నంద్యాల జిల్లా నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా డాక్టర్ సుధీర్ దారా, శ్రీసత్యసాయి జిల్లా మడకశిర సమన్వయకర్తగా ఈర లక్కప్పలకు తొలిసారి అవకాశం కల్పించింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నల్లగట్ల స్వామిదాస్‌ను నియమించారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న హోంమంత్రి తానేటి వనితను గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ప్రస్తుతం గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న తలారి వెంకట్రావును కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఖరారు చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా హనుమంతునిపాడు జెడ్పీటీసీ సభ్యుడు దద్దాల నారాయణ యాదవ్‌ను నియమించారు. చేసిన మంచే శ్రీరామరక్షగా.. ప్రజలకు నాలుగున్నరేళ్లుగా చేసిన మంచి పనులే మనకు తోడుంటాయనే ధైర్యంతో ముఖ్యమంత్రి జగన్ అడుగులు ముందుకు వేస్తూ పార్టీ శ్రేణులను ఎన్నికల సమరానికి సన్నద్ధం చేస్తున్నారు. ప్రజలకు దగ్గరగా ఉండేవారికే టికెట్ ఇస్తున్నారు. ఆ విషయం అనేకసార్లు ఆయన ఎంపీలు, ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. తన తండ్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గత 56 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలతో సుపరిపాలన అందిస్తున్నారు. డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) ద్వారా నేరుగా రూ.2.45 లక్షల కోట్లు, నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.67 లక్షల కోట్లు వెరసి మొత్తం రూ.4.12 లక్షల కోట్ల మేర ప్రజలకు ప్రయోజనం చేకూర్చారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశించినట్లుగా దళితులు, బలహీనవర్గాలు, పేద వర్గాలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేలా తోడ్పాటు అందిస్తున్నారు. శాసనమండలి చైర్మన్‌గా మోషేన్ రాజును, బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్‌ను స్పీకర్‌గా నియమించి సామాజిక సమీకరణకు పెద్ద పీట వేశారు. 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మంత్రుల్ని చేశారు. సంక్షేమ పథకాలను ఎలాంటి లంచాలు, సిఫారసులకు తావులేకుండా ప్రజలకు అందిస్తున్నారు. మహిళా సాధికారతను సాకారం చేశారు. వైఎస్సార్ మహిళల్ని లక్షాధికారుల్ని చేస్తే సీఎం జగన్ వారిని కోటీశ్వరులుగా చేస్తున్నారు. పేదల పిల్లలకు ఉన్నత వర్గాలతో సమానంగా ఇంగ్లిష్ మీడియం చదువులు అందిస్తున్నారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు ద్వారా బడుగు బలహీన వర్గాలు, దళితుల ఆత్మ గౌరవాన్ని పెంపొందించారు. ఈ క్రమంలో 175 స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా సమన్వయకర్తలను నియమిస్తున్నారు. నాలుగో జాబితా ఇదీ చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం (ఎస్సీ రిజర్వుడ్): కె.నారాయణస్వామి (ఉప ముఖ్యమంత్రి) 8 శాసనసభ నియోజక వర్గాలకు సమన్వయకర్తలు వీరే.. 1. జీడీ నెల్లూరు (ఎస్సీ రిజర్వ్డ్ ): ఎన్ . రెడ్డెప్ప 2.శింగనమల (ఎస్సీ రిజర్వ్డ్ ): ఎం. వీరాంజనేయులు 3. నందికొట్కూరు (ఎస్సీ రిజర్వ్డ్ ): డాక్టర్ సుధీర్ దారా 4. తిరువూరు (ఎస్సీ రిజర్వ్డ్ ): నల్లగట్ల స్వామిదాస్ 5. మడకశిర (ఎస్సీ రిజర్వ్డ్ ): ఈర లక్కప్ప 6. కొవ్వూరు (ఎస్సీ రిజర్వ్డ్ ): తలారి వెంకట్రావు 7. గోపాలపురం (ఎస్సీ రిజర్వ్డ్ ): తానేటి వనిత 8. కనిగిరి: దద్దాల నారాయణ యాదవ్