తెలుగుదేశం పార్టీలో దళిత నేతల పరిస్థితి దయనీయంగా మారింది. ఎమ్మెల్యే సీటు అడిగితే అవమానాలు ఎదురవుతున్నాయి. అనంతపురం జిల్లాలో ఓ దళిత మహిళా నేతను తెలుగుదేశం పార్టీ అవమానించటమే దీనికి నిదర్శనం.మొన్నటిదాకా నియోజకవర్గ బాధ్యతలన్నీ మీవేనని చెప్పి.. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి.. ఇప్పుడు ఆమె ఎవరో తెలీదన్నట్లుగా పార్టీ పెద్దలు వ్యవహరించటం పచ్చ పార్టీ లో దుమారం రేపుతోంది. అంతే కాదు పలువురు దళిత మాజీ మంత్రుల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా తయారైంది.
రాజకీయ నేత పేరు బండారు శ్రావణి.. అనంతపురం జిల్లా శింగనమల ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం లో రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు ..ఓటమి తర్వాత కూడా శింగనమల టీడీపీ ఇంఛార్జి గా ఈ మహిళా దళితనేత బాధ్యతలు నిర్వహించారు. ఈమె నుంచి టీడీపీ పెద్దలు కోట్ల రూపాయలు లబ్ధి పొందినట్లు ఆ పార్టీ లోనే చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి బండారు శ్రావణి పోటీకి సిద్ధం అవుతున్నారు. ఈ తరుణంలో దళిత మహిళా నేతను అవమానించేలా టీడీపీ పెద్దలు ఈ మధ్యనే ఓ ప్రకటన విడుదల చేశారు. అసలు బండారు శ్రావణి శింగనమల టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి కాదని టీడీపీ జోనల్ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మీడియా సమావేశం లో పేర్కొన్నారు. ఇక్కడ పార్టీ వ్యవహారాలన్నీ టూమెన్ కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు చూసుకుంటారని స్పష్టం చేశారు. చంద్రబాబు చేయించిన ఈ ప్రకటనతో దళిత నేతలు రగిలిపోతున్నారు. ఎస్సీ రిజర్వ్ డ్ స్థానం లో పెత్తనం అంతా అగ్రవర్ణాలకు చెందిన నేతలకు ఎందుకు అప్పగించారో చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
నియోజకవర్గ ఇంచార్జి పదవి.. టిక్కెట్ ఎవరికి ఇవ్వాలనే విషయంలో దళితులకు ప్రాధాన్యత ఇవ్వకుండా పెత్తందార్లకు ఇవ్వడం దారుణమని టీడీపీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. టీడీపీ అధిష్టానం తాజా ప్రకటన తో బండారు శ్రావణి ఆత్మరక్షణలో పడ్డారు. తన భవితవ్యం ఏమిటో చంద్రబాబు వద్దే తేల్చుకునేందుకు సిద్ధం అవుతున్నారు.
తెలుగుదేశం పార్టీలో దళిత నేతలు పార్టీ అధినేత చంద్రబాబు తీరుపై రగిలిపోతున్నట్టు సమాచారం. పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నేతలకు సీట్లు అడిగితే సీటివ్వకపోగా, అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా.. అవమానాలకు గురిచేస్తున్నారని వారు మదనపడుతున్నారు.
దళిత మాజీ మంత్రులతో కాళ్లు మొక్కించుకుని చంద్రబాబు దళితులను హీనాతి హీనంగా చూస్తున్నారని టీడీపీలోని దళిత నేతలంతా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మాజీ మంత్రి కొత్తపల్లి జవహార్ ఎన్నికల్లో తన సీటు కోసం చంద్రబాబు కాళ్లు పట్టుకుని వేడుకోవాల్సి వచ్చిన విషయం తెలిసిందే. చంద్రబాబుతో మాట్లాడటానికి ఎన్ని సార్లు అపాయింట్‌మెంట్ కోరినా జవహర్‌కి దక్కలేదు. చివరికి ఇటీవల విజయవాడ వచ్చిన చంద్రబాబుకి ఎయిర్‌పోర్ట్‌లో ఎదురు వెళ్లి కాళ్లకి మొక్కారు జవహర్ .
చంద్రబాబు కేబినెట్‌లో పనిచేసిన మరో దళిత మంత్రి రావెల కిశోర్ బాబు కూడా ఇటీవల టిడిపిలో దళిత నేతలకు జరుగుతున్న అవమానాలపై ఆగ్రహించారు. చంద్రబాబు, ఆయన సామాజికవర్గం నేతలు కొందరు దళితుల మీద పెత్తనం చేస్తున్నారని చివరాఖరికి చంద్రబాబు కేవలం తన సామాజికవర్గ నేతలకే మద్దతిస్తారని మండిపడ్డ విషయం తెలిసిందే. కాళ్లు మొక్కినా తమకు సీట్లు రావడం లేదని ఆవేదన చెందారు.
చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన పీతల సుజాత పరిస్థితి కూడా అంతే. పీతల సుజాత చింతలపూడి సీటు ఆశిస్తున్నారు. గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈమెకు ఇప్పుడు చింతలపూడి సీటు రాకుండా ఇక్కడ కూడా టిడిపి పెత్తందారులే అడ్డుపడుతున్నారని ఆమె వర్గీయులు రగిలిపోతున్నారు. దళితులకు ఎందుకు రాజకీయాలని ఓపెన్‌గానే చెప్పిన చింతమనేని ప్రభాకర్ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి తన చెప్పు చేతుల్లో ఉండేవాళ్లే కావాలని పట్టుబడుతున్నట్టు సమాచారం. . పీతల సుజాత తన మాట విననందుకే టిక్కెట్ రాకుండా చింతమనేని అడ్డుకున్నాడట.
ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది టిడిపి దళితనేతల పరిస్థితి ఆ పార్టీలో దయనీయంగా మారింది. వాడుకోవడం వదిలించుకోవడం చంద్రబాబు నైజమనే విషయం తెలిసినా సరే ఆ పార్టీలో కొనసాగడం వల్లనే తమకు ఈనాడు ఈ దుస్థితి వచ్చిందని వారు ఆవేదన చెందుతున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment