Dalit leaders
-
చంద్రబాబు పై దళిత నేతలు ఫైర్
-
అంబేద్కర్ విగ్రహంపై పచ్చమూక దాడిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
-
బండారు శ్రావణికి మొండిచేయేనా?
తెలుగుదేశం పార్టీలో దళిత నేతల పరిస్థితి దయనీయంగా మారింది. ఎమ్మెల్యే సీటు అడిగితే అవమానాలు ఎదురవుతున్నాయి. అనంతపురం జిల్లాలో ఓ దళిత మహిళా నేతను తెలుగుదేశం పార్టీ అవమానించటమే దీనికి నిదర్శనం.మొన్నటిదాకా నియోజకవర్గ బాధ్యతలన్నీ మీవేనని చెప్పి.. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి.. ఇప్పుడు ఆమె ఎవరో తెలీదన్నట్లుగా పార్టీ పెద్దలు వ్యవహరించటం పచ్చ పార్టీ లో దుమారం రేపుతోంది. అంతే కాదు పలువురు దళిత మాజీ మంత్రుల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా తయారైంది. రాజకీయ నేత పేరు బండారు శ్రావణి.. అనంతపురం జిల్లా శింగనమల ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం లో రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు ..ఓటమి తర్వాత కూడా శింగనమల టీడీపీ ఇంఛార్జి గా ఈ మహిళా దళితనేత బాధ్యతలు నిర్వహించారు. ఈమె నుంచి టీడీపీ పెద్దలు కోట్ల రూపాయలు లబ్ధి పొందినట్లు ఆ పార్టీ లోనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి బండారు శ్రావణి పోటీకి సిద్ధం అవుతున్నారు. ఈ తరుణంలో దళిత మహిళా నేతను అవమానించేలా టీడీపీ పెద్దలు ఈ మధ్యనే ఓ ప్రకటన విడుదల చేశారు. అసలు బండారు శ్రావణి శింగనమల టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి కాదని టీడీపీ జోనల్ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మీడియా సమావేశం లో పేర్కొన్నారు. ఇక్కడ పార్టీ వ్యవహారాలన్నీ టూమెన్ కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు చూసుకుంటారని స్పష్టం చేశారు. చంద్రబాబు చేయించిన ఈ ప్రకటనతో దళిత నేతలు రగిలిపోతున్నారు. ఎస్సీ రిజర్వ్ డ్ స్థానం లో పెత్తనం అంతా అగ్రవర్ణాలకు చెందిన నేతలకు ఎందుకు అప్పగించారో చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నియోజకవర్గ ఇంచార్జి పదవి.. టిక్కెట్ ఎవరికి ఇవ్వాలనే విషయంలో దళితులకు ప్రాధాన్యత ఇవ్వకుండా పెత్తందార్లకు ఇవ్వడం దారుణమని టీడీపీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. టీడీపీ అధిష్టానం తాజా ప్రకటన తో బండారు శ్రావణి ఆత్మరక్షణలో పడ్డారు. తన భవితవ్యం ఏమిటో చంద్రబాబు వద్దే తేల్చుకునేందుకు సిద్ధం అవుతున్నారు. తెలుగుదేశం పార్టీలో దళిత నేతలు పార్టీ అధినేత చంద్రబాబు తీరుపై రగిలిపోతున్నట్టు సమాచారం. పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నేతలకు సీట్లు అడిగితే సీటివ్వకపోగా, అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా.. అవమానాలకు గురిచేస్తున్నారని వారు మదనపడుతున్నారు. దళిత మాజీ మంత్రులతో కాళ్లు మొక్కించుకుని చంద్రబాబు దళితులను హీనాతి హీనంగా చూస్తున్నారని టీడీపీలోని దళిత నేతలంతా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మాజీ మంత్రి కొత్తపల్లి జవహార్ ఎన్నికల్లో తన సీటు కోసం చంద్రబాబు కాళ్లు పట్టుకుని వేడుకోవాల్సి వచ్చిన విషయం తెలిసిందే. చంద్రబాబుతో మాట్లాడటానికి ఎన్ని సార్లు అపాయింట్మెంట్ కోరినా జవహర్‌కి దక్కలేదు. చివరికి ఇటీవల విజయవాడ వచ్చిన చంద్రబాబుకి ఎయిర్‌పోర్ట్‌లో ఎదురు వెళ్లి కాళ్లకి మొక్కారు జవహర్ . చంద్రబాబు కేబినెట్లో పనిచేసిన మరో దళిత మంత్రి రావెల కిశోర్ బాబు కూడా ఇటీవల టిడిపిలో దళిత నేతలకు జరుగుతున్న అవమానాలపై ఆగ్రహించారు. చంద్రబాబు, ఆయన సామాజికవర్గం నేతలు కొందరు దళితుల మీద పెత్తనం చేస్తున్నారని చివరాఖరికి చంద్రబాబు కేవలం తన సామాజికవర్గ నేతలకే మద్దతిస్తారని మండిపడ్డ విషయం తెలిసిందే. కాళ్లు మొక్కినా తమకు సీట్లు రావడం లేదని ఆవేదన చెందారు. చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేసిన పీతల సుజాత పరిస్థితి కూడా అంతే. పీతల సుజాత చింతలపూడి సీటు ఆశిస్తున్నారు. గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈమెకు ఇప్పుడు చింతలపూడి సీటు రాకుండా ఇక్కడ కూడా టిడిపి పెత్తందారులే అడ్డుపడుతున్నారని ఆమె వర్గీయులు రగిలిపోతున్నారు. దళితులకు ఎందుకు రాజకీయాలని ఓపెన్‌గానే చెప్పిన చింతమనేని ప్రభాకర్ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి తన చెప్పు చేతుల్లో ఉండేవాళ్లే కావాలని పట్టుబడుతున్నట్టు సమాచారం. . పీతల సుజాత తన మాట విననందుకే టిక్కెట్ రాకుండా చింతమనేని అడ్డుకున్నాడట. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది టిడిపి దళితనేతల పరిస్థితి ఆ పార్టీలో దయనీయంగా మారింది. వాడుకోవడం వదిలించుకోవడం చంద్రబాబు నైజమనే విషయం తెలిసినా సరే ఆ పార్టీలో కొనసాగడం వల్లనే తమకు ఈనాడు ఈ దుస్థితి వచ్చిందని వారు ఆవేదన చెందుతున్నట్టు తెలుస్తోంది. -
మంగళగిరి టీడీపీ కార్యాలయం వద్ద ఆందోళన
గుంటూరు, సాక్షి: మంగళగిరిలోని తెలుగుదేశం ప్రధాన కార్యాలయం వద్ద మంగళవారం మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఆందోళనకు దిగారు. తాడికొండ అసెంబ్లీ సీట్లు మాదిగలకే కేటాయించాలంటూ నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ఒకవేళ తాడికొండ(గుంటూరు) సీటును మాదిగలకు ఇవ్వకపోతే తగిన బుద్ధి చెప్తామని మాదిగ నాయకులు టీడీపీ అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు. తాడికొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెనాలి శ్రావణ్ కుమార్‌ను టీడీపీ అధిష్టానం ఈ మధ్యే నిర్ణయించింది. అయితే అది ఏకపక్షంగా జరిగిన ప్రకటన అంటూ మాదిగ నేతలు రంగంలోకి దిగారు. ఆ సీటు తమ సామాజిక వర్గానికే ఇవ్వాలంటూ నిరసనకు దిగడం చంద్రబాబుకు ఊహించని షాక్ అనే చెప్పాలి. సీనియర్ నేత టీడీ జనార్ధన్ ప్రస్తుతం వాళ్లను బుజ్జగించే యత్నం చేస్తున్నారు. -
దళిత గళం గొంతు నొక్కి!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: యువగళం పేరిట పాదయాత్ర కొనసాగిస్తున్న నారా లోకేశ్ రిజర్వుడు నియోజక వర్గాలకు సంబంధించి టీడీపీ దళిత నేతల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలైనా, నియోజకవర్గాలైనా, దళిత నేతలైనా చంద్రబాబు, లోకేశ్‌కు ఎప్పుడూ చిన్నచూపేనని స్పష్టం చేస్తున్నారు. తాజాగా అమరావతి ప్రాంతంలో లోకేశ్ పర్యటన సందర్భంగా గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌కు జరిగిన దారుణ అవమానాన్ని గుర్తు చేస్తున్నారు. కనీస ప్రాధాన్యం లేకుండా.. యువగళం పాదయాత్ర ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. దాదాపు పన్నెండు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర జరిగింది. సత్యవేడులో హెలెన్, కొండేపిలో సిట్టింగ్ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామిని గెలిపించాలని కోరడం మినహా మిగిలిన నియోజవర్గాల్లో తమ నాయకులకు లోకేశ్ కనీస ప్రాధాన్యం కూడా ఇవ్వలేదని టీడీపీలో దళిత వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గంగాధర నెల్లూరు, సూళ్లూరుపేట, గూడూరు, సింగనమల, కోడుమూరు, నందికొట్కూరు, బద్వేలు, సంతనూతలపాడు తదితర నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగినప్పటికీ లోకేశ్ దళిత నాయకుల ఊసెత్తలేదు. కనీసం ఇన్చార్జీలని చెప్పేందుకూ నిరాకరించారు. పూతలపట్టు ఇన్చార్జిగా మురళీమోహన్ పేరును యువగళం పాదయాత్ర తరువాత చంద్రబాబు ప్రకటించడం గమనార్హం. తమ వారిని హీరోలుగా కీర్తిస్తూ.. యువగళం పాదయాత్ర ఇతర నియోజక వర్గాలలో సాగినప్పుడు లోకేశ్ తీరులో తేడా స్పష్టంగా కనిపిస్తోందని పార్టీ వర్గాలే విశ్లేషిస్తున్నాయి. అద్దంకిలో గొట్టిపాటి, వినుకొండలో ఆంజనేయులు, గురజాలలో యరపతినేనిని ఆ ప్రాంత హీరోలని ప్రశంసిస్తూ తమను విస్మరించడాన్ని ఏ కోణంలో చూడాలని టీడీపీలోని దళిత నాయకులు ప్రశ్నిస్తున్నారు. రిజర్వుడు స్థానాల్లో నాయకులను చులకనగా చూడటం, ఇతర వర్గాల విషయంలో మాత్రం లోకేశ్ వైఖరి కొట్టొచ్చినట్లు కనపడుతోందంటున్నారు. ఉన్నత వర్గాలదే పెత్తనం.. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని రిజర్వుడు స్థానాల్లోనూ ఆయన వర్గానిదే పెత్తనం. జీడీ నెల్లూరు నియోజకవర్గం వ్యవహారాలన్నీ చిట్టిబాబునాయుడు కనుసన్నల్లోనే జరగాల్సిందే. గూడూరులో పాశం సునీల్ కుమార్, సూళ్లూరుపేటలో నెలవల సుబ్రమణ్యం, సింగనమలలో బండారు శ్రావణి, సంతనూతలపాడులో విజయకుమార్, బద్వేలులో రాజశేఖర్ పేరుకు మాత్రమే నాయకులు. సింగనమలలో అగ్రవర్ణాలకు చెందిన వారితో కూడిన త్రిసభ్య కమిటీదే పెత్తనం. కోడుమూరులో ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి, నందికొట్కూరులో గౌరు వెంకటరెడ్డి, బద్వేలులో కె.విజయమ్మ చెప్పినట్లే నడుచుకోవాలి. అక్కడ దళిత నేతలది మౌనవ్రతమే. -
డీఎల్‌పై మండిపడ్డ మైదుకూరు దళిత ప్రజాప్రతినిధులు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యలపై మైదుకూరు దళిత ప్రజాప్రతినిధులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, దళితులను కించపరచడం సరికాదన్నారు. స్వార్థ రాజకీయాల కోసం దళితులను వాడుకోవద్దని హితవు పలికారు. ఏపీలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందిందన్నారు. పంటనష్టం జరిగితే కౌలు రైతులకు ఈ-క్రాప్ ద్వారా ఎకరాకు రూ.18 వేలు సాయం చేశారన్నారు. చదవండి: సింహపురి సమరం.. టీడీపీలో ఎన్నికల భయం -
దళితబంధు కార్యక్రమం కాదు.. ఉద్యమం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో సోమవారం ‘దళిత బంధు’ పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హుజురాబాద్ నియోజకవర్గ దళితులతో పాటు మంత్రి కొప్పుల ఈశ్వర్, హరీష్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘దళితబంధు కేవలం కార్యక్రమం కాదు.. ఉద్యమం. మంచి కార్యక్రమానికి ప్రతికూల శక్తులు ఉంటాయి. మనలో పరస్పర సహకారం పెరగాలి.. ద్వేషాలు పోవాలి’’ అని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘దళిత బంధు’ పథకానికి సంబంధించి ఈ నెల 26న ప్రగతిభవన్‌లో అవగాహన సదస్సు నిర్వహించాలని సీఎం కేసీఆర్ రెండు రోజుల క్రితం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దానికి హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి 400 మందికిపైగా మంది దళిత ప్రతినిధులు హాజరయినట్లు తెలిసింది. -
Huzurabad: కార్యకర్తకు సీఎం కేసీఆర్ ఫోన్
-
ఈటల చిన్నోడు.. తర్వాత చూసుకుందాం
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ఇల్లందకుంట(కరీంనగర్): ‘ఈటల రాజేందర్ చిన్నోడు.. అయ్యేది లేదు.. సచ్చేది లేదు..’’ అని టీఆర్ఎస్ హుజూరాబాద్ నేతతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌కు వచ్చినప్పుడు దానికి సంబంధించి అన్ని విషయాలు మాట్లాడుకుందామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘దళిత బంధు’ పథకానికి సంబంధించి ఈ నెల 26న ప్రగతిభవన్‌లో అవగాహన సదస్సు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దానికి హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి 427 మంది దళిత ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇందులో భాగంగా ఇల్లందకుంట మండలం తనుగుల గ్రామ ఎంపీటీసీ వాసాల నిరోష భర్త రామస్వామికి సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. దళితులను ప్రగతిభవన్ సమావేశానికి తీసుకెళ్లే ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. రామస్వామితో సీఎం కేసీఆర్ సంభాషణ ఇదీ.. సీఎం: హలో రామస్వామి గారు.. బాగున్నారా? రామస్వామి: బాగున్నాను.. సార్. సీఎం: రామస్వామిగారు దళితబంధు విజయం మీద తెలంగాణ దళిత జాతి భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇది బాధ్యతతో, ఓపికతో, çస్పష్టమైన అవగాహన దృక్పథంతో చేసే పని. రామస్వామి: అవును సార్.. సీఎం: నా రిక్వెస్ట్ ఏందంటే.. మీ జిల్లా కలెక్టర్ మీకు ఫోన్ చేస్తడు. మీరు ఆయన దగ్గర రేపు లంచ్ చేయాలె. 26 నాటి కార్యక్రమం గురించి అవగాహన చేసుకోవాలె. 26న ఉదయం అందరూ మీ మండల కేంద్రంలో జమ అయితరు. అక్కడ ప్రభుత్వం బ్రేక్‌ఫాస్ట్ ఏర్పాటు చేస్తది. బస్సు ఉంటది. అంతా బస్సులో ఎక్కి హుజూరాబాద్ టౌన్‌కు వెళ్తరు. అన్ని మండలాల బస్సులు అక్కడికి వస్తయి. అంతా మొత్తం 427 మంది.. 30, 40 మంది అధికారులు ఉంటరు. అక్కడి నుంచి నా దగ్గరకు వస్తరు. ఆ రోజంతా నేను మీతోనే ఉంటా. రామస్వామి: సంతోషం సార్.. సీఎం: ప్రగతిభవన్‌కు రాగానే టీ తాగి మీటింగ్ స్టార్ట్ చేసుకుంటం. రెండు గంటలు మీటింగ్.. తర్వాత లంచ్ చేసుకొని.. మళ్లీ 2 గంటలు కూర్చొని అపోహలు, అనుమానాలు, మంచీచెడ్డా మాట్లాడుకుందాం. హుజూరాబాద్ నియోజకవర్గం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పోవాల్సి ఉంటుంది. అన్నీ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తది. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నేను మీతోనే ఉంటాను. రామస్వామి: థ్యాంక్స్ సార్. మా జాతికి న్యాయం జరుగుతుందనే సంపూర్ణ భరోసా ఉంది. మీరు ఫిక్స్ అయితే అవుతుంది సార్. సీఎం: వందకు వంద శాతం చేద్దాం. ప్రాణం పోయినా వెనుకాడేదిలేదు. రెండేళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడి పోతమో ప్రపంచానికి చూపిద్దాం. రామస్వామి: ఓకే సార్.. నమస్కారం సార్. ఈటలది చిన్న విషయం! రామస్వామి: నేను 2001 నుంచీ పనిచేస్తున్నాను సర్. కానీ ఈటల రాజేందర్ నన్ను ఎప్పుడూ పట్టించుకోలే. అవసరం, సందర్భం వచ్చినప్పుడు ప్రతి విషయంలో పక్కనపెట్టిండు. అయినా నేను మీ (కేసీఆర్) నాయకత్వం మీద నమ్మకంతో పనిచేసుకుంటూ వచ్చిన. మొన్న 2018లో కూడా ఎంపీటీసీ టికెట్ ఇవ్వకపోతే.. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచినం సర్. తర్వాత ఈటల రాజేందర్ దగ్గరికి ఎప్పుడూ కూడా పోలేదు. నాకు వినోద్‌కుమార్ సార్, పరిపాటి రవీందర్‌రెడ్డి సార్ నాకు దేవుడిలా ఉన్నారు. సీఎం: ఒక రిక్వెస్టు ఏందంటే.. మీరు వచ్చేయండి ఇక్కడికి (ప్రగతి భవన్‌కు).. ఆ రోజు చెప్తాను. అన్ని విషయాలు మాట్లాడుకుందాం. వాడు చిన్నోడు.. రాజేందర్‌తో అయ్యేది లేదు.. సచ్చేది లేదు. విడిచిపెట్టండి. అది చిన్న విషయం.. చూసుకుందాం.. దళితబంధు మనకు పెద్ద విషయం. ప్రపంచానికే సందేశం ఇచ్చే మిషన్ ఇది. దీన్ని విజయవంతం చేసి చూపిద్దాం. -
రాజధానిపై బీజేపీది ఆరు నాలుకల ధోరణి
తాడికొండ: రాజధాని అంశంపై బీజేపీది ఆరు నాల్కల ధోరణి అని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. గతంలో బీజేపీ నేతలు ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్ మాటేమిటని ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న 76వ రోజు దీక్షలో పలువురు దళిత సంఘాల నాయకులు ప్రసంగించారు. రాజధాని అంశంపై గతంలో కన్నా లక్ష్మీనారాయణ ఒకటి మాట్లాడితే, ఇప్పుడు సోము వీర్రాజు ఇంకొకటి మాట్లాడుతున్నాడని, ఇదివరకే జీవీఎల్ నరసింహారావు ఒకటి మాట్లాడగా, కేంద్ర ప్రభుత్వం కోర్టుకు రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదేనని అఫిడవిట్ సమర్పించిందని గుర్తు చేశారు. రాజధానికి వచ్చిన సోము వీర్రాజు 76 రోజులుగా పోరాటం చేస్తున్న పేదల ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పట్టాలపై మాట్లాడకుండా రాజధాని రైతుల కోసం ప్రేమ ఒలకబోయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. కాగా, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాజధాని పేదలకు రావాల్సిన 50 వేల ఇళ్ల స్థలాలు, మూడు రాజధానుల కోసం చేస్తున్న దీక్షలు జయప్రదం కావాలని కోరుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శాంతిహోమం నిర్వహించారు. పలు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
రాజధాని రైతులకు ఏం న్యాయం చేశావు చంద్రబాబూ?
తాడికొండ: రాజధాని పేరిట రైతుల నుంచి 32 వేల ఎకరాలను సేకరించిన చంద్రబాబు.. ఆ రైతులకు ఏం న్యాయం చేశారో చెప్పాలని బహుజన పరిరక్షణ సమితి నాయకులు ప్రశ్నించారు. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 53వ రోజు రిలే దీక్షలు కొనసాగాయి. దీక్షలలో పాల్గొన్న పలువురు దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ.. మూడు రాజధానులతోనే అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ జరిగి అన్ని ప్రాంతాలు సమంగా ఎదుగుతాయన్నారు. అమరావతిలో చంద్రబాబు తాత్కాలికం పేరిట కోట్లాది రూపాయలను నిర్మాణ కంపెనీలకు దోచిపెట్టడంతో పాటు, కార్పొరేట్ కంపెనీలకు కారు చౌకగా భూములను దోచిపెట్టారని విమర్శించారు. అమరావతి ఉద్యమం పేరిట చంద్రబాబు వర్గానికి చెందిన 10 మంది రైతులు కూడా లేని శిబిరాల్లో వందల మంది పాల్గొంటున్నట్లు ఎల్లో మీడియాలో చూపిస్తూ ఈ ప్రాంత రైతులను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితికి చెందిన వివిధ సంఘాల నాయకులు చెట్టే రాజు, జేటీ రామారావు, మాధగాని గురునాధం, ఆకుమర్తి చిన్నా, నత్తా యోనరాజు తదితరులు పాల్గొన్నారు. -
3 రాజధానులకు మద్దతు: దళిత నాయకులు
సాక్షి, విజయవాడ: దళితులకు స్థానంలేని అమరావతి తమకు రాజధానిగా వద్దంటూ ఐక్య దళిత మహానాడు నాయకులు ధర్నాకు దిగారు. స్థానిక తుమ్మల పల్లి కళాక్షేత్రం వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా, ఐక్య దళిత మహనాడు జాతీయ అధ్యక్షులు కల్లూరి చెంగయ్య మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని రియల్ఎస్టేట్ రాజధానిగా మార్చేశారని మండిపడ్డారు. ఆయన సామాజికవర్గం భూములు కొన్నచోటే రాజధాని ప్రకటించి, రైతుల వద్ద నుంచి భూములు లాక్కొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి లో జరిగే ఉద్యమాలు చంద్రబాబు ప్యాకేజీ ఉద్యమాలు అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా తాము ఇందుకు వ్యతిరేకంగా పోరాడతామని స్పష్టం చేశారు. అదే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో మూడు రాజధానులను ప్రకటించారని, అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మూడు రాజధానుల నిర్ణయానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కల్లూరి చెంగయ్య ఈ సందర్బంగా స్పష్టం చేశారు. ‘‘చంద్రబాబు రెండుకళ్ల సిద్దాంతం వల్లనే రాష్ట్రం విడిపోయింది. పేదల సంక్షేమానికి అడ్డు పడే వ్యక్తి ఆయన. దళితులను కేవలం ఓటుబ్యాంకుగా భావించే వ్యక్తి. దళిత ద్రోహి. దళిత బిడ్డలు చదువుకునే 6 వేల ప్రభుత్వ పాఠశాలలు చంద్రబాబు మూసివేయించారు. పేదలకు రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టుల ద్వారా అడ్డుపడుతున్నారు’’ అని చంద్రబాబు తీరుపై విరుచుకుపడ్డారు. -
బాబు పెట్టుబడి ఉద్యమాన్ని తిప్పికొడతాం
సాక్షి, విజయవాడ: మాజీ సీఎం చంద్రబాబు తన సామాజిక వర్గాన్ని పెంచి పోషించేందుకే అమరావతిలో రాజధాని పెట్టాలనుకొన్నారని దళిత నేతలు వ్యాఖ్యానించారు. ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం అన్ని ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకొంటున్నారని ఆరోపించారు. కుట్రలు మానకపోతే ఐక్య దళిత వేదిక ఏర్పాటు చేసి బాబుకు బుద్ధి చెపుతామన్నారు. మూడు రాజధానులు, అన్ని ప్రాంతాల అభివృద్ధికి మద్దతు తెలిపేందుకు దళిత సంఘాలు ఏకమయ్యాయి. ఈ మేరకు మాదిగ దండోరా, మాల మహానాడు నేతలు విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం సమావేశమయ్యారు. అనంతరం దళిత నేతలు మీడియాతో మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం ఉందని అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలన్నదే బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయమన్నారు. అది పరిపాలన వికేంద్రీకరణతోనే సాధ్యమని పేర్కొన్నారు. ఇక టీడీపీ పాలనలో రాజధాని దళిత రైతులకు పూర్తిగా అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్న పెట్టుబడి ఉద్యమాన్ని తిప్పికొడతామని హెచ్చరించారు. -
పార్టీని నమ్ముకొని ఉంటే ఇదా బహుమానం?
సాక్షి, వైఎస్సార్ జిల్లా : నగరంలోని అండేద్కర్ కూడలి వద్ద టీడీపీ దళిత నేతలు బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలో సుబ్బయ్య భార్యతోపాటు దళిత నేతలంతా పాల్గొన్నారు. మంగళవారం రాత్రి కడప నగరంలో చంద్రబాబు నిర్వహించిన సమీక్ష సమావేశంలో దళిత నేత సుబ్బయ్య పై జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డికి చెందిన వర్గీయులు దాడి చేయడంపై మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో దళిత నేత సుబ్బయ్యపై దాడి చేసిన పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. దళితులను ఇలా అవమానకరంగా సంభాషించడం సరికాదన్నారు. 20 ఏళ్లుగా ఏళ్లుగా పార్టీని నమ్ముకుని సేవలు చేస్తుంటే ఇలాంటి బహుమానం ఇస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరిగినా చంద్రబాబు చూసి చూడనట్లు వ్యవహరించడం చూస్తుంటే దళితులపై బాబుకు ఉన్న మర్యాద ఏంటో అర్ధం అవుతుందన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చదవండి: అధినేత సమక్షంలోనే తెలుగు తమ్ముళ్ల తన్నులాట -
దళితులకు కలగా సీఎం కుర్చీ
సాక్షి, బెంగళూరు: కన్నడనాట దళితుల పరిస్థితి విచిత్రంగా ఉంది. రాష్ట్రంలో రాజకీయంగా చైతన్యంగా ఉన్న దళిత నాయకులు, తమతమ పార్టీల విజయాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో దళిత నేతలది కీలక పాత్ర అయినా వారు అందలానికి చేరుకోలేకపోయారు. ఇప్పటివరకు కర్ణాటక చరిత్రలో ఒక్క దళిత సీఎం లేరు. తొలినాళ్లలో వివక్షకు, అణచివేతకు గురైన దళితులు, రైతుల హక్కుల కోసం 1970, 1980 దశకాల్లో ఉద్యమాలు జరిగాయి. దీంతో ఆయా వర్గాల్లో రాజకీయ చైతన్యం వచ్చింది. రానురాను రాష్ట్రంలో దళిత నేతలు ఆవిర్భవించారు. వి.శ్రీనివాస ప్రసాద్, హెచ్‌సీ మహదేవప్ప, కేహెచ్ మునియప్ప, బి.సోమశేఖర్, గోవింద్ కారజోళ, రమేష్ జిగజిణగి వంటి దళిత నేతలు బాగా రాణించారు. వీరందరిలో ప్రస్తుతం లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే అగ్రగణ్యులుగా పేరుపొందారు. 26 శాతం జనాభా ఉన్నా... రాష్ట్ర జనాభాలో 26 శాతం ఉన్న దళితులను సంఘటితం చేయడంలో ఆయా నేతలు విఫలమయ్యారు. దీంతో ఏ దళిత నాయకుడూ సీఎం కాలేకపోయారు. దీంతో ఎన్నికల్లో, రాజకీయాల్లో ఆధిపత్య పోరు సాగింది. ఎవరికివారే బలమైన నాయకులుగా ఎదిగినా అంతర్గత కలహాల వల్ల సీఎం కాలేకపోయారు. దళిత సంఘర్ష సమితి వ్యవస్థాపకుడు బి.క్రిష్ణప్ప దళితుల హక్కుల కోసం పోరాడారు. దేవనూరు మహాదేవ్, సిద్ధలింగయ్య, చంద్రప్రసాద్ త్యాగి వంటి దళిత రచయితలు తమ సాహిత్యం ద్వారా దళితుల్లో చైతన్యం కలిగించారు. జనతా పరివార్ నుంచి బి.రాచయ్య అనే దళిత నేత మంత్రివర్గంలోని అన్ని పదవులనూ అలంకరించినప్పటికీ ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకోలేకపోయారు. పార్టీలో చీలిక వచ్చిన సమయంలో ఎస్ఆర్ బొమ్మై కారణంగా ముఖ్యమంత్రి పదవి త్రుటిలో చేజారింది. కాంగ్రెస్ మరో మాజీ నేత కేహెచ్ రంగనాథ్ కూడా అన్ని శాఖల మంత్రిగా పనిచేయడంతోపాటు, కేపీసీసీ అధ్యక్షుడిగానూ రెండుసార్లు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కాలేకపోయారు. పార్టీలో అంతర్గత రాజకీయాలు నడపలేక ఆయనకు సీఎం పదవి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. గత ఎన్నికల్లో అనూహ్యంగా చేజారింది ఎస్ఎం కృష్ణ మంత్రివర్గంలో దళిత నాయకుడు మల్లికార్జున ఖర్గేకు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చినట్లే వచ్చి చేజారింది. 2006లో ఖర్గే కేపీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ 2008 ఎన్నికల్లో పరాజయం పాలైంది. ఆ తర్వాత మరో దళిత నాయకుడు జి.పరమేశ్వర్‌ను కేపీసీసీ అధ్యక్షుణ్ని చేయగా 2013లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో పరమేశ్వర్ ఘోరంగా ఓడిపోవడంతో ఆయనకు సీఎం పదవి దక్కలేదు. ఇప్పటి సీఎం సిద్ధరామయ్యను ఆ పీఠం వరించింది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే మల్లికార్జునఖర్గేను సీఎం చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. -
హోరా హోరీ: వెనుకంజలో ఓబీసీ నేత
సాక్షి, అహ్మదాబాద్: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల సరళి తీవ్ర ఉత్కంఠను రాజేస్తోంది. రెండు రాష్ట్రాల్లో బీజేపీ దూసుకుపోతోంది. ముఖ్యంగా గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తన ఆధిక్యతను ప్రదిర్శిస్తోంది. ప్రారంభంలో హోరా హోరీగా సాగిన ఫలితాల సరళి క్రమంగా బీజేపీకి సానుకూలంగా మారింది. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో బీజేపీ తన ఆధిపత్యాన్నికొనసాగిస్తోంది. మొత్తం 182 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 92 స్థానాలు. కాగా బీజేపీ 60 స్థానాల్లో, కాంగ్రెస్ 36 స్థానాల్లో ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కొనసాగుతోంది. మరోవైపు దళిత, ఓబీసీ నేతలు వెనకంజలో ఉన్నట్టు తెలుస్తోంది. ముందు అందిన సమాచారం ప్రకారం దళిత నేత జిగ్నేష్ మేవాని, ఓబీసీ నేత అల్పేష్ ఠాకూర్ వెనుకంజలో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం మేవాని ఆధిక్యంలోకి వచ్చారు. అటు ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న హిమాచల్ ప్రదేశ్‌లో కూడా బీజేపీ దూసుకుపోతోంది. -
అమ్మడం, అమ్ముడుపోవడం ఆయన నైజం
కర్నూలు సీక్యాంప్: అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి అడ్డంగా అమ్ముడుపోయిన వ్యక్తి టీజీ వెంకటేశ్ అని, ఆయన జీవితమంతా అమ్మడం, కొనడం, అమ్ముడుపోవడంతోనే ముడిపడిందని జిల్లా దళిత, ప్రజా సంఘాల నేతలు మండిపడ్డారు. స్థానిక అంబేద్కర్ భవన్లో మంగళవారం ఐక్య దళిత సంఘాల ఆధ్వర్యంలో విదేశీ ఆర్యవైశ్య, ఆర్యబ్రాహ్మణుల క్విట్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆ సంఘాల నేత లు టీపీ శీలన్న, బాలసుందరం, వేల్పుల జ్యోతి, పట్నం రాజేశ్వరి, గోపి, శేషఫణి, లక్ష్మీనరసింహా, విజేయుడు మాట్లాడారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ది మధ్య ఆసియా దేశమని, ఇతర దేశానికి చెందిన ఆయనకు ఈ దేశ మూలవాసి కంచె ఐలయ్యపై నోటికొచ్చినట్టు మాట్లాడే అర్హత లేదన్నారు. దేశంలో స్థితిగతులు, జన జీవనంపై పుస్తకం రాసిన ప్రొఫెసర్ ఐలయ్యను చంపాలని, ఆయన పుస్తకాలు నిషేధించాలని టీజీ వెంకటేశ్ లాంటి వారు కారుకూతలు కూస్తున్నారని మండిపడ్డారు. ఐలయ్య దళిత, బహుజన సంపద అని, ఆయనను కాపాడుకోవడం ఈ దేశ మూలవాసుల బాధ్యత అన్నారు. విదేశీ ఆర్యవైశ్యులు, విదేశీ బ్రాహ్మణులు వెంటనే దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. -
దళిత నేతల అరెస్ట్
భీమవరం : అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు సందర్భంగా పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించడంలో, దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ విమర్శించారు. గరగపర్రు బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ శనివారం చలో గరగపర్రు కార్యక్రమం చేపడితే పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పరిహారం అందని 32 మందికి ఆర్థిక సహాయం అందించకపోతే ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామని రాజేష్ హెచ్చరించారు. గరగపర్రు గ్రామంలో సెక్షన్ 144 అమలులో ఉండగా ధిక్కరించిన నేరానికి మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్, తానేటి పుష్పరాజు, పల్లపు వేణు, దారం సురేష్, తోటే సుందరంతో సహా 25 మందిని అరెస్ట్ చేసినట్లు పాలకోడేరు ఎస్సై వి.వెంకటేశ్వరరావు చెప్పారు. -
గర్జించిన గరగపర్రు
పాలకోడేరు: పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామం ఆదివారం అట్టుడికింది. ఖాకీల నియంతృత్య పోకడలు, అడుగడుగునా నిఘాతో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. అర్ధరాత్రి దాటిన తర్వాత దళిత నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వేకువజాము నుంచే నిరసనలు హోరెత్తాయి. గ్రామంలోని పలు కూడళ్లలో పోలీసులు పహారా కాశారు. భీమవరం– తాడేపల్లిగూడెం రహదారిలో యండగండి వద్ద, ఇటు గొల్లలకోడేరు వద్ద పెద్దెత్తున పోలీసులు మోహరించి ఎవరినీ గ్రామంలోకి వెళ్లనివ్వకుండా కట్టుదిట్టం చేశారు. నాయకులను అరెస్ట్ చేశారనే సమాచారం అందుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘం, మాలమహానాడు, వివిధ ప్రజా సంఘాల నాయకుల్లో అడ్డదారుల్లో గ్రామానికి చేరుకున్నారు. దళితులను పరా మర్శించి, సభలు, సమావేశాలు నిర్వహించారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజును చూసి ఎమ్మెల్యే గోబ్యాక్ అంటూ పెద్దెత్తున నినాదాలు చేశారు. దళితులకు చేసిందేమిటని, ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని, నిందితులకు వత్తాసు పలుకుతున్నారని ఆయన్ను నిలదీశారు. న్యాయం చేస్తానని ఎమ్మెల్యే శివ బదులిచ్చినా మీరేమి న్యాయం చేయక్కర్లేదు, ఇప్పటివరకూ చేసింది చాలు గోబ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో ఆయన మిన్నకుండిపోయారు. జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు, అడిషనల్ ఎస్పీ రత్న, సబ్‌కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, తదితర అధికారులు అక్కడికి చేరుకున్నారు. విపక్షాల నిలదీత దళితులను బహిష్కరణకు గురిచేసిన ఇందుకూరి బలరామకృష్ణంరాజును ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ విపక్షాల నాయకులు అధి కారులు, పోలీసులను నిలదీశారు. జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు తదితర అధికారులు గ్రామంలో మౌలిక వసతులు, ఉపాధి కల్పిస్తాం అని చెప్పడం మినహా నిం దితుల అరెస్ట్ గురించి ప్రస్తావించకపోవడంతో విపక్షాల నాయకులు మరింత ఆగ్రహించారు. నిందితుడిని అరెస్ట్ చేయడానికి ఎంత సమయం పడుతుందని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త పాతపాటి సర్రాజు, రాష్ట్ర కార్యదర్శి శ్రీకాకుళం పార్టీ జిల్లా ఇన్చార్జ్ కొయ్యే మోషేన్‌రాజు ఎస్సీ, సెల్ జిల్లా చైర్మన్ మానుకొండ ప్రదీప్, జిల్లా యూత్ అధ్యక్షుడు మంతెన యోగీంద్రకుమార్ అడిషనల్ ఎస్పీ రత్నను ప్రశ్నించారు. ఉద్యమాన్ని మరింత పెంచుతున్నారే తప్ప తగ్గించేందుకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఉపాధి కల్పించి శాంతియుత వాతావరణం నెలకొల్పామని, ఇప్పటికే కేసు నమోదు చేశామని పరిస్థితులు చక్కబడిన తర్వాత అరెస్ట్‌లు చేస్తామని ఆమె సమాధానమిచ్చినా నాయకులు శాంతించలేదు. నిందితుడిని అరెస్ట్ చేస్తేనే పరిస్థితులు చక్కబడతాయని నాయకులు స్పష్టం చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రాము సూర్యారావు, మాజీ ఎమ్మెల్సీలు జెల్లి విల్సన్, పీజే చం ద్రశేఖర్, నెక్కంటి సుబ్బారావు, తాటిపాక మ« దు, సీపీఐ జిల్లా కార్యదర్శి డేగ ప్రభాకర్, సీపీఎం జిల్లా నాయకులు జేఎన్వీ గోపాలన్, రైతు సంఘం నాయకులు ధనికొండ శ్రీనివాస్, అ ల్లూరి అరుణ్ తదితరులు దళితులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా కల్పించారు. గొల్లలకోడేరులో ధర్నా గరగపర్రులో దళితులను పరామర్శించడానికి వచ్చిన మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు నల్లి రాజేష్, రాష్ట్ర కార్యదర్శి గంటా సుందర్‌కుమార్, జిల్లా సమన్వయకర్త, నన్నేటి పుష్పరాజు, డివిజన్ కార్యదర్శి ఇట్టా రమేష్, గుండె నగేష్, ఉండి నియోజకవర్గ కన్వీనర్, తంగెళ్ల యాకోబు, పాలకోడేరు మండల అధ్యక్షుడు ఈది భాస్కరావును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో గొల్లలకోడేరు వద్ద దళిత సంఘాల నాయకులు పెద్దెత్తున నిరసన తెలిపి కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. అర్ధరాత్రి అరెస్ట్‌లు శనివారం అర్ధరాత్రి సమయంలో గ్రామంలోని దళితవాడ చర్చిలో నిద్రిస్తున్న నాయకుల వద్దకు పెద్దెత్తున పోలీసులు మోహరించి అరెస్ట్ చేశారు. అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్, ఏపీ దళిత మహాసభ అధ్యక్షుడు చింతపల్లి గురుప్రసాద్ తదితరులను అదుపులోకి తీసుకుని ఇతర పోలీస్స్టేషన్లకు తరలించారు. హర్షకుమార్‌ను రాజానగరం పోలీస్‌స్టేషన్‌లో హాజరుపరిచి అనంతరం హౌస్ అరెస్ట్ చేశా రు. కొందరిని నరసాపురం, పెదవేగి స్టేషన్లకు తరలించారు. కేసును పక్కదారి పట్టించేందుకు టీడీపీ ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని పీవీ రావు మాలమహానాడు అధ్యక్షుడు గుమ్మాపు సూర్యవరప్రసాద్ విమర్శించారు. నిందితుడిని అరెస్ట్ చేయాలి: మేరుగ తెలుగుదేశం పార్టీ పాలనలో రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నా గార్జున విమర్శించారు. రెండు నెలలుగా గరగపర్రులో దళితులు బహిష్కరణకు గురై ఆకలితో అలమటిస్తున్నా ఎమ్మెల్యే శివకు పత్తా లేకుండాపోయిందని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో మధ్యయుగాల నాటి పరిస్థితులు తలెత్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుచేయడం అగ్రవర్ణాల దృష్టిలో నేరమైపోయిందా అని ప్రశ్నించారు. దళితులపై కక్ష సాధిస్తున్న ఇందుకూరి బలరామకృష్ణంరాజును తక్షణమే అరెస్ట్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బాధితులకు అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే సర్రాజు భరోసా ఇచ్చారు. -
అనంతపురంలో దళిత నాయకుల ధర్నా
- ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ అనంతపురం ఎస్టీ ప్రజా ప్రతినిధి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గంపన్నను అవమానపర్చే ధోరణిలో మాట్లాడిన ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పలువురు దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా పరిషత్హాలులో అంబేద్కర్ జయంతి సభ జరుగుతున్న సమయంలో పలువురు దళిత సంఘాల నాయకులు సభను అడ్డుకునేందుకు యత్నించారు. అయితే పోలీసులు కార్యాలయం ముందే అడ్డుకోవడంతో కాసేపు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్బంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీఆర్‌దాస్, నాయకులు సీపీ నారాయణస్వామిలు మాట్లాడుతూ... దళిత ప్రజాప్రతినిధులకే రక్షణ లేకుండా పోతోందని, ఇక సామాన్య దళితులకు ఏమి న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. దీంతో ఆందోళన కారుల వద్దకు ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, డిప్యూటీ మేయర్ గంపన్నలు వచ్చి సర్దిజెప్పారు. సమస్య పరిష్కారానికి ఇది వేదిక కాదని సూచించడంలో ఆందోళన విరమించారు. -
ఎంపీకి చేదు అనుభవం
అంబేద్కర్‌కు అవమానంపై దళితుల నిరసన వెలిచేరు(ఆత్రేయపురం) : అభివృద్ధి కార్యక్రమాలకు తొలిసారి కొత్తపేట నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. వెలిచేరులో అంబేద్కర్ విగ్రహం వేలు విరిచి 20 రోజులైనా ఎందుకు స్పందించ లేదంటూ దళితులు నిలదీయడంతో ఎంపీ ఖిన్నులయ్యారు. ఆత్రేయపురం మండలం వెలిచేరులో రూ.5 కోట్లతో చేపట్టనున్న ఆర్ అండ్ బీ రహదారి ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేసేందుకు ఆదివారం ఎంపీ పండుల రవీంద్రబాబు, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వచ్చారు. ఆ సందర్భంగా స్థానిక దళిత నాయకులు, యువకులు ఒక్కసారిగా ఎంపీపై విరుచుకుపడ్డారు. కొంతసేపటికి తేరుకున్న ఎంపీ రవీంద్రబాబు స్పందిస్తూ అంబేద్కర్ అంటే తనకు ఎంతో అభిమానం ఉందన్నారు. అంబేద్కర్ విగ్రహనికి గొడుగు, విగ్రహ అభివృద్ధి చేయిస్తామని హామీ ఇవ్వడంతో దళితులు శాంతించారు. సీఐని ప్రశ్నించిన ఎమ్మెల్యే అంబేద్కర్ విగ్రహ అవమాన సంఘటనపై పోలీసులు తీసుకున్న చర్యలు ఏమిటో తెలియచేయాలని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి రావుపాలెం ఇన్‌ఛార్జి సీఐ శ్రీనివాసబాబును ప్రశ్నించారు. ఈ ఘటనపై పోలీసులు సరైన రీతిలో స్పందించలేదని ఎమ్మెల్యే అగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామని సీఐ వివరణ ఇచ్చారు. పార్టీ జెండాలపై వివాదం తొలుత టీడీపీ, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఎంపీ, ఎమ్మెల్యేలకు మద్దతుగా పార్టీ జెండాలతో కార్యక్రమానికి హాజరుకావడంతో కొద్దిసేపు వివాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే జగ్గిరెడ్డికి అనుకూలంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు నినాదాలు చేయడంపై తొలుత అభ్యంతరం తెలిపిన టీడీపీ నాయకులే పార్టీ జెండాలతో మెర్లపాలెం నుంచి ఎంపీ పండుల రవీంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనందరావు జిందాబాద్ అని నినాదానాలతో రావడంతో ఇరుపార్టీ నేతల మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో పనులు ప్రారంభించకుండా వెళ్లిపోయేందుకు ఎంపీ ప్రయత్నించారు. అధికారులు, ఇన్చార్జి సీఐ శ్రీనివాసబాబు నచ్చచెప్పడంతో ఎంపీ రోడ్డు పనులు ప్రారంభిం చారు. అనంతరం అర్అండ్బీ అధికారుల అవగాహన సదస్సు జరిగింది. జెడ్పీటీ సీ సభ్యురాలు మద్దూరి సుబ్బలక్ష్మి బంగారం, ఎంపీపీ వాకలపూడి వెంకట కృష్ణారావు, మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ కనుమూరి శ్రీనివాసరాజు, మాజీ ఎంపీపీ పీఎస్ రాజు, వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల నేతలు గొల్లపల్లి డేవిడ్‌రాజు, మార్గన గంగాధరం, నేతలు చిలువూరి బాబిరాజు, కునాధరాజు రంగరాజు, వేణు, అప్పారి విజయ్, ఎం. వీరభద్రరావు, కర్రి నాగిరెడ్డి, తమ్మన శ్రీను, చల్లా ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.