సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: యువగళం పేరిట పాదయాత్ర కొనసాగిస్తున్న నారా లోకేశ్ రిజర్వుడు నియోజక వర్గాలకు సంబంధించి టీడీపీ దళిత నేతల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలైనా, నియోజకవర్గాలైనా, దళిత నేతలైనా చంద్రబాబు, లోకేశ్‌కు ఎప్పుడూ చిన్నచూపేనని స్పష్టం చేస్తున్నారు. తాజాగా అమరావతి ప్రాంతంలో లోకేశ్ పర్యటన సందర్భంగా గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌కు జరిగిన దారుణ అవమానాన్ని గుర్తు చేస్తున్నారు.
కనీస ప్రాధాన్యం లేకుండా..
యువగళం పాదయాత్ర ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. దాదాపు పన్నెండు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర జరిగింది. సత్యవేడులో హెలెన్, కొండేపిలో సిట్టింగ్ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామిని గెలిపించాలని కోరడం మినహా మిగిలిన నియోజవర్గాల్లో తమ నాయకులకు లోకేశ్ కనీస ప్రాధాన్యం కూడా ఇవ్వలేదని టీడీపీలో దళిత వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
గంగాధర నెల్లూరు, సూళ్లూరుపేట, గూడూరు, సింగనమల, కోడుమూరు, నందికొట్కూరు, బద్వేలు, సంతనూతలపాడు తదితర నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగినప్పటికీ లోకేశ్ దళిత నాయకుల ఊసెత్తలేదు. కనీసం ఇన్‌చార్జీలని చెప్పేందుకూ నిరాకరించారు. పూతలపట్టు ఇన్‌చార్జిగా మురళీమోహన్ పేరును యువగళం పాదయాత్ర తరువాత చంద్రబాబు ప్రకటించడం గమనార్హం.
తమ వారిని హీరోలుగా కీర్తిస్తూ..
యువగళం పాదయాత్ర ఇతర నియోజక వర్గాలలో సాగినప్పుడు లోకేశ్ తీరులో తేడా స్పష్టంగా కనిపిస్తోందని పార్టీ వర్గాలే విశ్లేషిస్తున్నాయి. అద్దంకిలో గొట్టిపాటి, వినుకొండలో ఆంజనేయులు, గురజాలలో యరపతినేనిని ఆ ప్రాంత హీరోలని ప్రశంసిస్తూ తమను విస్మరించడాన్ని ఏ కోణంలో చూడాలని టీడీపీలోని దళిత నాయకులు ప్రశ్నిస్తున్నారు. రిజర్వుడు స్థానాల్లో నాయకులను చులకనగా చూడటం, ఇతర వర్గాల విషయంలో మాత్రం లోకేశ్ వైఖరి కొట్టొచ్చినట్లు కనపడుతోందంటున్నారు.
ఉన్నత వర్గాలదే పెత్తనం..
చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని రిజర్వుడు స్థానాల్లోనూ ఆయన వర్గానిదే పెత్తనం. జీడీ నెల్లూరు నియోజకవర్గం వ్యవహారాలన్నీ చిట్టిబాబునాయుడు కనుసన్నల్లోనే జరగాల్సిందే. గూడూరులో పాశం సునీల్ కుమార్, సూళ్లూరుపేటలో నెలవల సుబ్రమణ్యం, సింగనమలలో బండారు శ్రావణి, సంతనూతలపాడులో విజయకుమార్, బద్వేలులో రాజశేఖర్ పేరుకు మాత్రమే నాయకులు. సింగనమలలో అగ్రవర్ణాలకు చెందిన వారితో కూడిన త్రిసభ్య కమిటీదే పెత్తనం. కోడుమూరులో ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి, నందికొట్కూరులో గౌరు వెంకటరెడ్డి, బద్వేలులో కె.విజయమ్మ చెప్పినట్లే నడుచుకోవాలి. అక్కడ దళిత నేతలది మౌనవ్రతమే.
Comments
Please login to add a commentAdd a comment