రిలే దీక్షలలో పాల్గొన్న బహుజన పరిరక్షణ, దళిత సంఘాల నాయకులు
తాడికొండ: రాజధాని అంశంపై బీజేపీది ఆరు నాల్కల ధోరణి అని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. గతంలో బీజేపీ నేతలు ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్ మాటేమిటని ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్‌లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న 76వ రోజు దీక్షలో పలువురు దళిత సంఘాల నాయకులు ప్రసంగించారు. రాజధాని అంశంపై గతంలో కన్నా లక్ష్మీనారాయణ ఒకటి మాట్లాడితే, ఇప్పుడు సోము వీర్రాజు ఇంకొకటి మాట్లాడుతున్నాడని, ఇదివరకే జీవీఎల్ నరసింహారావు ఒకటి మాట్లాడగా, కేంద్ర ప్రభుత్వం కోర్టుకు రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదేనని అఫిడవిట్ సమర్పించిందని గుర్తు చేశారు.
రాజధానికి వచ్చిన సోము వీర్రాజు 76 రోజులుగా పోరాటం చేస్తున్న పేదల ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పట్టాలపై మాట్లాడకుండా రాజధాని రైతుల కోసం ప్రేమ ఒలకబోయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. కాగా, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాజధాని పేదలకు రావాల్సిన 50 వేల ఇళ్ల స్థలాలు, మూడు రాజధానుల కోసం చేస్తున్న దీక్షలు జయప్రదం కావాలని కోరుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శాంతిహోమం నిర్వహించారు. పలు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment