సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నాయకులకు అభివృద్ధిపై శ్రద్ధ లేదు.. మతం గురించి మాట్లాడే సోము వీర్రాజు.. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధుల గురించి ఎందుకు మాట్లాడరు అంటూ రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రశ్నించారు. బీజేపీలో రెండు వర్గాలు ఒకటి ఆర్‌ఎస్‌ఎస్ బీజేపీ కాగా.. మరొకటి టీడీపీ బీజేపీ అంటూ ఆ పార్టీ నేతల తీరుపై మండిపడ్డారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘బీజేపీ ప్రముఖులు విశాఖలో సమావేశం కావడం సంతోషకరమైన విషయంగా భావించాం. రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. ప్రాజెక్టుల గురించి చర్చిస్తారని ఆశించాం. కానీ మూస ధోరణిలో మతం గురించి చర్చించారు. పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు రథయాత్ర చేస్తామన్నారు.. అది ఎందు కోసం చేస్తున్నారు. అంతర్వేది ఘటనపై ప్రజలు కోరిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించారు. కానీ ఎందుకు ఇప్పటి వరకు విచారణ ప్రారంభించ లేదు’ అన్నారు
‘ఏపీ బీజేపీలో రెండు వర్గాలు ఉన్నాయి.. ఒకరు ఒరిజినల్ ఆర్ఎస్‌ఎస్ నుంచి వచ్చిన బీజేపీ నాయకులు.. మరొకరు చంద్రబాబు నాయుడు పంపిన బీజేపీ నాయకులు. గతంలో కన్నా లక్ష్మీ నారాయణ చంద్రబాబు అజెండా చదివి పదవి కోల్పోయారు. ఇప్పుడు బీజేపీలో చేరిన టీడీపీ నాయకుల వలలలో మీరు పడొద్దు. రాముడు అందరి దేవుడు. ఆయనని రాజకీయ కోణంలో చూడటం సరికాదు. గతంలో అద్వానీ ప్రతి పక్షంలో రథయాత్ర చేస్తే అందరూ సహకరించారు. ఇప్పుడు మీ పార్టీ అధికారంలో ఉండగా రథయాత్ర ఎందుకోసం చేయాలి. మీరు పద్దేనిమిది నెలల్లో ఏపీ కోసం కేంద్రం నుంచి ఏం ప్రాజెక్టులు తీసుకువచ్చారో.. రథయాత్ర ప్రారంభించడానికి ముందు ఆలోచించండి. మేనిఫెస్టో అంశాలపై ఆత్మ విమర్శ చేసుకోండి’ అన్నారు. (చదవండి: మత చిచ్చు.. అదే పచ్చ స్కెచ్చు!)
‘సీఎం జగన్ పాలనలో దేవాలయాల విషయంపై రాజీ పడే పరిస్థితి లేదు. నిందితులపై చర్యలు కఠినంగా వుంటాయి. చంద్రబాబు హయాంలో దాడులపై మాట్లాడని బీజేపీ నేతలు ఇప్పుడు ఎందుకు అనవసర విమర్శలు చేస్తున్నారు. దేవాలయాల పునరుద్ధరణకు తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం మీరు గుర్తించరా. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఏపీ మాదిరిగా హిందూ ఆలయాల్లో పరిరక్షణ చర్యలు లేవన్న విషయం గమనించండి’ అని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment